రత్నాల గాథ


రత్నం అనగా విలువైన రాయి. ఒక చక్కని మణి, ఆభరణం, లేదా ఉపరత్నం. ఇది ఆభరణాలలో పనికివచ్చే ఒక ఖనిజశకలం లేదా స్ఫటికం కావచ్చు. మన సాహిత్యంలో పంచరత్నాలు, నవరత్నాలు వంటివి కనిపిస్తాయి. ఇంకొక అభిప్రాయం ప్రకారం ఏదైనా విలువైనది, అమూల్యమైనది, నిధి మరియు ఉత్తమోత్తమ మైనది రత్నంగా వ్యవహరించబడింది. రత్నాల నిఘంటువు ప్రకారం రత్నం సింహళపదం నుంచి వచ్చింది. దీని అర్థం మణి అనగా ముక్కలు చేయబడి, కోయబడి సాన పట్టిన, మన్నికగల అందమైన ఆభరణాలకు తగిన రాయి.


Webster Dictionary ప్రకారం రత్నం ఒక్కోసారి ఉపరత్నం కూడా కావచ్చు. కాని, అది కోయబడి, సానపెట్టబడి ఆభరణాలకు పనికివచ్చే విధంగా ఉండాలి.


Monier Williams Dictionaryలో రత్నం ఒక బహుమతి. ఒక విలువైన సంపద లేదా ఆభరణం,ఇవి 9రకాలైన మణులుగా వివరించబడ్డది. మణి మరియు రత్నం పర్యాయపదాలు. రత్నం అనే పదం ప్రాచీన సాహిత్యంలో వివిధరకాలుగా వివరించబడ్డది. పండితులు వారికి తోచిన విధంగా ఆయా సందర్భాలలో ప్రస్తావించారు.


అమరకోశం నిర్వచనం ప్రకారం ‘రత్న స్వజాతి శ్రేష్టయోపిః’ అంటే పదార్థాలలో ప్రత్యేకమైనది (unique creation among matters).


ఇంకా అమరకోశంలో రత్నం గురించి ‘రమణీయతరే యాస్మిన్‍ రమంతే సర్వమానవాహః జాత్యుత్క•ష్ట రంగ యస్మత్‍ తస్మాత్‍ రత్నం ఇతి స్మ•తం’.. స•ష్టిలోని అన్నిజీవులను రమింపజేసేది, అన్నివిధాలుగా అన్ని పదార్థాలలో ఉత్తమమైనది అని అర్ధం. మనుషులలో ఉత్తములను కూడా రత్నాలుగా ఉత్ప్రేక్షిస్తారు. ఆయుర్వేదం ప్రకారం ‘రత్నం ఆస్మిన్‍ అతివా అతః రత్నం ఇతి ప్రోక్తం శబ్దశాస్త్ర విశారదైహిః’ అంటే జనులు దేనివలన ఆనందాన్ని పొందుతారో అది రత్నం. పూర్వం రత్నం అందాన్ని చూడటం ద్వారా ఆనందించేవారని తెలుస్తుంది.


బౌద్ధ వాఙ్మయంలో కూడా రత్నాల ప్రసక్తి ఉంది. బుద్దతంత్రకోశం అనే పరిశోధన పత్రికలో ‘రతిమానంత సుఖం తనోతితి రత్నం చతుర్థానాం బోధాభ్యాం’ అంటే ఏ పదార్థమైతే అత్యంత సంతోషాన్ని, నాలుగువిధాల విశ్రాంతులను (స్వాంతనలను) దేహానికి కలుగజేస్తుందో అది రత్నం అని ఉంది. జ్ఞానసిద్ధిలో ‘రత్నంతు దుర్లభదపి’ అనగా చాలా అరుదుగా లభించేది రత్నం. ‘గుహ్య సమాజ ప్రదీప’లో ‘రత్నం సంసార స్థాయి పర్మానప్రవ మహానుక్తం’ అని ఉంది.


రత్నం లక్షణాలు శాశ్వతత్వం, అంతిమానందం, కల్మషరహితంగా ఉండటం.
బౌద్ధ సాహిత్యంలో రత్నశబ్దం వ్యక్తిపరంగా గుణగణాలు, వారి స్థానాలు, శక్తులను వివరిస్తూ వాడబడింది. ఉదా: ఏనుగు రత్నం, గుర్రపు రత్నం మొదలైనవి.


వరాహమిహిరుడు తన బ•హత్సంహితలో ‘రత్నేన శుభేన శుభం భవతి, నృపానామనిష్టామశుభేణ యస్మదతః పరోక్షయదైబం రత్నాశ్రితం తేజైహిః’
అంటే రాజులు మంచి రత్నాన్ని ధరిస్తే శుభ ఫలితాలు, చెడు రత్నాల ధారణ చెడు ఫలితాలు కలిగిస్తాయని అర్థం. రత్నదీపిక అనే గ్రంథంలో వరాహ మిహిరుడు రత్నాలను భస్మాలుగా చికిత్స కోసం వాడవచ్చు అని తెలిపాడు. రత్నాలను గురించి పౌరాణికగాథలు, ఎన్నో ప్రచారాలు ఉన్నాయి. వాటిలో కొన్ని.


దధీచి ఎముకలను ఇంద్రుడు శస్త్రాలుగా మలిచేటపుడు కొన్ని ముక్కలు భూమిమీద రాలిపడి రత్నాలుగా మారటం వంటివి. వరాహమిహిరుడు ఈ గాథను సమర్థించాడని తెలుస్తున్నది.


ఇంకొక పౌరాణికగాథను అనుసరించి సాగరమథనంలో అనేక రత్నాలు ఉద్బవించ టమేగాక అమ•తాన్ని దానవులు ఎత్తుకొని పోతుండగా ఒలికిపోయిన కొన్ని అమ•తపు చుక్కలు నేలపైపడి రత్నాలుగా మారాయి.
గరుడపురాణం ప్రకారం ఇంద్రుడు మాయోపాయం చేత బలిని యజ్ఞపశువుగా మార్చి వధించగా ముక్కలైన ఆ దేహం చెల్లాచెదురుగా భూమిపైపడి రత్నాలుగా మారాయి. ఎముకలు రత్నాలుగా, దంతాలుగా ముత్యాలుగా, రక్తబిందువులు మాణిక్యాలుగా, పిత్తం మరకతాలుగా, కళ్ళు నీలాలుగా… ఇట్లా 84 రకాల రత్నాలు ఏర్పడ్డట్లు చెప్తారు.
పౌరాణికగాథలే కాకుండా మన సాహిత్యంలో రత్నాలు భూమి నుండి ఉద్బవిస్తాయని గుర్తించినట్లు తెలుస్తుంది. భూమికి రత్నగర్భ అనే పేరు కూడా ఉంది.


రత్నాల చరిత్ర: రత్నాల వాడకం పూజా విధానాలలో, అలంకరణలో, పనిముట్లు, ఆయుధాలుగా క్రీ.పూ.4500ల సం.రాల నుంచి క్రీ.పూ. 2000ల సం.రాల కాలంలో వాడినట్టు చారిత్రకంగా ఆధారాలున్నాయి. క్రీ.శ. 1 వ శతాబ్దం నాటికి రత్నాలను ఆభరణాలుగా చేసే వృత్తి వారు ‘మణికారులు’గా గుర్తింపు పొందారు.
రత్నాలు రకాలు: రత్నప్రదీపిక ప్రకారం వజ్రం, మాణిక్యం, ముత్యం, నీలం, మరకతాలు పంచరత్నాలుగా ప్రసిద్ధిపొందాయి.
వరాహమిహిరుడు తన రచనలలో రత్నాలలోని రకాలను ఇట్లా వివరించాడు.
వజ్రేంద్ర నీల మరకత కర్కేత్ర పద్మరాగ రుధిరాఖ్యాహః
వైఢూర్య పులక విమలక రాజ మణి స్ఫటిక శశికాంతః
సౌగంధిక గోమేధిక శంఖ మహానీల పుష్పరాగాఖ్యః
బ్రహ్మమణి జ్యోతిరస సస్యక ముక్త ప్రవాలానిః


రత్నప్రదీపకలో పేర్కొన్న మణులు:

వజ్రః (వజ్ర)ఇంద్రనీల( నీలం,) మరకత (పచ్చ) కర్కేటక (అగేట్‍) పద్మరాగ (మాణిక్యం) రుధిర (ఎరుపురంగు మాణిక్యం లేదా కార్నెలి యన్‍). వైఢూర్య (పిల్లికన్ను cat’s eye), పులక (పీచు వంటి రత్నం) విమలక (పైరైట్‍), రాజమణి (రూబి) స్ఫటిక (క్వార్టజ్ క్రిస్టల్‍) శశికాంత (చంద్రశిల) సౌగంధిక (ఎమిథిస్ట్ లేదా స్పినెల్‍) ముక్త (ముత్యం) ప్రవాళ (పగడం), గోమేధికం (గార్నెట్‍,) శంఖ (ఓపల్‍, లేదా శంఖాలు) మహానీల (నీలం) పుష్పరాగ (పద్మంరంగులో ఉండే రూబీ లేదా టోపాజ్‍ కావచ్చు) బ్రహ్మమణి (స్వర్గమణులలో వివరించబడిన చింతామణి కావచ్చు ఒక రకమైన ముత్యం. మోల్డవిట్‍ అని కూడ కొందరి అభిప్రాయం), జ్యోతిరస (ఇది తెలుపురంగు ఓపల్‍ కావచ్చు), సస్యక (ఎజురైట్‍ లేదా రాగిధాతువుకు సంబంధించిన ఖనిజం బోర్నైట్‍.)
పైన పేర్కొన్న రత్నాలు ఖనిజపరంగా కాకుండా వాటి లక్షణాల వల్ల వేర్వేరు పేర్లతో పిలువబడ్డాయి. ఇందులో కోరండమ్‍ కుటుంబానికి, ఎగేట్‍ కు, క్వార్టజ్ కు చెందిన ఖనిజజాతులు ఉండవచ్చు. ప్రస్తుతం ఉపరత్నాలుగా చలామణిలో
ఉన్నవికూడా ఇందులో ఉన్నాయి.


బృహత్సంహిత ప్రకారం తొమ్మిది గ్రహాలకు ఆపాదిం పబడిన తొమ్మిది రత్నాలు: మాణిక్యం, ముత్యం, పగడం, మరకతం, పుష్యరాగం, వజ్రం, నీలం, జిర్కాన్‍, క్యాట్స్ ఐ. (జిర్కాన్‍ స్థానంలో గోమేధికం ప్రస్తుతం చేరింది). పుష్య రాగం స్థానంలో కనక పుష్యరాగంగా చెప్పుకునే రత్నం కోరండం జాతికి చెందిన ఒక రకమైన సఫైర్‍, ప్రస్తుతం వాడుకలో ఉంది.


దేవతలు 300ల రకాల మణులు ధరించేవారని శాస్త్రాలలో ఉంది. భారతీయ రత్నశాస్త్రం ప్రకారం 84 రకాల రత్నాలున్నాయి. వీటిలో పంచరత్నాలు, నవరత్నాలు ఉన్నాయి. వీటిలో కొన్ని రత్నాలను ప్రస్తుతం రత్నాలుగా భావించడం లేదు. ఉదా:మాగ్నెట్‍ స్టోన్‍, సోప్‍ స్టోన్‍ వంటివి. మరికొన్ని కేవలం గ్రంథాలకు పరిమితమైనవి. ఉదా: స్వర్గమణులుగా భావించబడే బ్రహ్మమణి, రుద్రమణి, కౌస్తుభమణి, శ్యమంతకమణి, పరసమణిగా భావించబడే ఫిలోసాఫర్‍ స్టోన్‍ కూడా ఇదే రకం. పాతాళమణులు, నాగమణులు కూడా కల్పితాలే.


శాస్తప్రకారం రత్నం జెమ్‍ స్టోన్‍ అంటే ముక్కలు చేయటానికి/కోయటానికి, సానపట్టటానికి అనువుగా ఉండి ఆభరణాలలో పొదుగబడే పదార్థం. సాధారణంగా ఇది ఒక ఖనిజం అయివుంటుంది. కొన్ని జెమ్‍ స్టోన్స్ ఫాసిల్స్ లేక ఆర్గానిక్‍ మెటీరియల్‍ కావచ్చు. ఉదా: ముత్యం, పగడం, అంబర్‍ మొదలైనవి. ప్రస్తుతం వాడుకలో ఉన్నవి దాదాపు 300 రకాల రత్నాలున్నాయి. ఆనవాయితీగా వస్తున్న పద్దతి ప్రకారం వీటిని రత్నాలు, ఉపరత్నాలు అని రెండురకాలుగా చెప్తారు. ఇది వాణిజ్యపరమైన విభజన మాత్రమే. వజ్రం, మాణిక్యం, మరకతం వంటివి రత్నాలకు ఉదాహరణ. ముత్యం, పగడం, గోమేధికం వంటివి ఉపరత్నాలు.


రత్నాల లక్షణాలు:
కాఠిన్యం: దీర్ఘకాలం మన్నికగా ఉండటానికి పదార్థం కఠినంగా, దృఢంగా ఉండడం అవసరం. ఖనిజపరంగా కాఠిన్యాన్ని మోహోస్‍ స్కేల్‍ ప్రకారం కొలుస్తారు. ఇది 1 నుంచి 10 స్థాయిల వరకు ఉంటుంది. వజ్రం ఈ స్కేలులో 10వ స్థానంలో ఉంటుంది. క్వార్టజ్ 7వ స్థానంలో ఉంటుంది.
ఈ ప్రమాణం ప్రకారం రత్నాలన్ని 7 నుంచి 10 మధ్యలో కాఠిన్యాన్ని కలిగివుంటాయి. అంబర్‍, ముత్యం, పగడం వంటివి తక్కువ కాఠిన్యాన్ని కలిగి వుంటాయి.
మన్నికతోపాటు రమణీయత కలిగివుండటం రత్నాల ఇంకో ప్రత్యేకత. ఈ ఆకర్షించే లక్షణాలు పదార్థం రంగువల్ల, మెరిసే స్వభావం వల్ల ఇంకా కొన్ని ప్రత్యేక దృశ్య లక్షణాల వల్ల, ఖనిజాల కలయిక వంటి కారణాలవల్ల వస్తాయి. పై రెండు కాకుండా అరుదుగా లభించే పదార్థాలు మాత్రమే రత్నాలుగా చలామణి అవుతాయి. ఈ లక్షణాలు అన్ని కలిసి రత్నం విలువను నిర్ధారిస్తాయి.


రత్నాల పుట్టుక:
భూమి మీద ప్రస్తుతం 5960 రకాల ఖనిజాలు ఉన్నాయి. వాటిలో దాదాపు 200 ఖనిజాలు రత్నాలుగా చలామణి అవుతున్నాయి. ఖనిజాలన్ని భూమిలో లభించేవే. ఇవి అగ్నిశిలలు, రూపాంతరప్రాప్తి శిలలు, అవక్షేప శిలలలో లభిస్తాయి. ఆర్గానిక్‍ జెమ్‍ స్టోన్స్ అయిన ముత్యం, పగడం, దంతం, అంబర్‍ వంటివి జీవులద్వారా ఏర్పడుతాయి.


ఒబ్సిడియన్‍ నలుపు రంగులో ఉండే అగ్నిపర్వత శిల. అంటే ఖనిజ సమూహం. ఇది కూడా ఉపరత్నాలలో ఒకటి. ఓపల్‍ ఒక స్ఫటికం కాని అమార్ఫస్‍ గా ఉండే సిలికా. పింక్‍, గ్రీన్‍, వైట్‍, గ్రానైట్‍ (ఉనాకైట్‍) కూడా ఇతర నిరీంద్రియ రత్నం. ఇలా రత్నాల వివరణ చాల విస్తృతమైనది. దాని composition మరియు originతో సంబంధం లేకుండా అన్ని విలువైన రాళ్ళు ఈ జాబితాలో ఉన్నాయి.


రత్నాల పేర్లకు సంస్కృత మరియు దేశీ మూలాలు:
సాధారణంగా ఉపయోగించే చాలా రత్నాలు వాటి పేరును వాటి మూలం యొక్క రంగు లేదా దొరికే ప్రదేశం నుండీ పొందాయి.
Tourmaline (టూర్మాలిన్‍) ‘‘తురమల్లి’’ శ్రీలంక భాషలో ఒకే రాయిలో వివిధ రంగులను సూచిస్తుంది.
Corundum కురువిందం అనే సంస్కృత పదం నుండి ఈ పేరు వచ్చింది, అంటే రాపిడి కలిగించేది అని అర్థం.
Topaz పుష్పరాగము Topaz(తపుస్‍) పేరు వేడిలో ఉద్భవించిన రాయి అని అర్ధం.
beryl వెరులియ నుండి ఉద్భవించింది, ఇది వైడూర్యంగా మారింది. వెల్లూరు సేలం దగ్గర ఉన్న ఒక ప్రదేశము సూచిస్తుంది.


-చకిలం వేణుగోపాలరావు,
డిప్యూటి డైరెక్టర్‍ జనరల్‍ జిఎస్సై(రి)
ఎ: 9866449348

శ్రీరామోజు హరగోపాల్‍,
ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *