ఇతర పార్టీల నాయకులూ అదే బాటలో నడవాలి
‘ఐడ్రీం’ సీనియర్ జర్నలిస్ట్ నెల్లుట్ల కవిత చేసిన ఇంటర్వ్యూలో టీఎస్పీఎస్సీ మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
నీళ్లు, నిధులు, నియామకాలు…ఈ మూడు అంశాలే ప్రధానంగా తెలంగాణ ఉద్యమం కొనసాగింది. కోరుకున్న తెలంగాణను సాధించుకున్నాం. నీళ్లు, నిధుల విషయంలో వివిధ అంశాలు కొంతవరకు సజావుగానే సాగినప్పటికీ… నియామకాల విషయానికి వచ్చే సరికి కొంత అసంతృప్తి నెలకొంది. జాబ్ క్యాలెండర్ లేకపోవడం, నోటిఫికేషన్లు వాయిదా పడటం, ప్రశ్నాపత్రాలు లీక్ కావడం వంటివి నిరుద్యోగుల్లో అభద్రతాభావాన్ని సృష్టించాయి. ఎన్నికల సమయం కావడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ నిరుద్యోగ బృందంతో సమావేశమై పలు అంశాలను చర్చించారు. వాళ్లలో ఉన్న అనుమానాలను తొలగించే ప్రయత్నం చేశారు. టీఎస్ పీఎస్సీ, జాబ్ క్యాలెండర్ లాంటి అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. ఈ విధంగా చర్చించడంపై, చర్చకు వచ్చిన అంశాలపై తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి.. తదనంతర కాలంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లోని ముఖ్యాంశాలు మీ కోసం….
ఇదొక సాహసోపేత అడుగు అని నేను భావిస్తున్నాను. నిజానికి ఈ పని నిరుద్యోగుల్లో ఈ గందరగోళం నెలకొనక ముందే చేయాల్సి ఉండింది. నిరుద్యోగులను రాజకీయపక్షాలన్నీ తమ వైపు తిప్పుకొని పెద్ద ఎత్తున డ్రామా క్రియేట్ చేయడానికంటే ముందే… నిరుద్యోగులు నిరాశా నిస్పృహలతో ఆత్మహత్యలకు పాల్పడడానికంటే ముందే… నిరుద్యోగుల్లో ఈ అసంతృప్తి జ్వాలలు మండకముండే ఈ పని చేయాల్సి ఉండింది. ఇప్పటికైనా కనీసం వాళ్లకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. అందుకు కేటీఆర్ ను నేను అభినందిస్తున్నాను.
ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదా?
తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వలేదనే ఒక నెగెటివ్ భావన డెవలప్ అయింది, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారం చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. కాబోయే సీఎంలని చెబుతున్నవారు, ప్రమాణ స్వీకారం చేసే తేదీ కూడా చెబుతున్న వారు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని అంటున్నారు. ఇలా అనడం అన్యాయం. మీరు ఏ తాలుకా కేంద్రానికి వెళ్లినా 50 మందో, 20 మందో దొరుకుతారు. ఇట్లాంటి వాళ్లకు సమాధానం ఇచ్చేందుకు కేటీఆర్ రెండు పనులు చేశారు. ఒకటి… కరెంట్ జాబ్ స్టేటస్ ఇన్ తెలంగాణ అని ఒక వెబ్ సైట్ రూపొందించారు. దాని ప్రకారం వాళ్లు చెబుతున్నది ఏమిటంటే…. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తరువాత, 2,32,000 ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మొదటి సారి ప్రభుత్వం ఏర్పడినపుడు… రెండో సారి ప్రభుత్వం ఏర్పడి నప్పుడు… ఇచ్చిన అనుమతులు వీటిలో ఉన్నాయి. వీటిలో 2,02,735 ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. వీటిలో ప్రాసెస్ కంప్లీట్ అయినవి… అంటే డెలివరీ అయి నవి… 1.65 లక్షల పైచిలుకు అని చెబుతున్నారు. ఇంకా ప్రాసెస్‌లో ఉన్నటువంటి ఉద్యోగాలు అంటే… ఇంకా కంప్లీట్ కాకుండా వాయిదా పడడమో… రిజల్ట్ రాకపోవడమో… వంటివి 42,652 ఉద్యోగాలు ఉన్నాయని వాళ్లు వాళ్ల వెబ్ సైట్ లో పెట్టారు. దీనిలో 40 వేలో… 50 వేలో పోలీసు ఉద్యోగాలు ఉన్నాయి. వివిధ రకాల ఉద్యోగాలున్నాయి. ఎలక్ట్రి సిటీ బోర్డ్, గురుకులాలు, మెడికల్ అండ్ హెల్త్, మెడికల్ కాలేజెస్, అగ్రికల్చర్ ఉద్యోగాలు ఇలాంటివి
ఉన్నాయి. ఇవి డెలివరీ అయినటువంటి ఉద్యోగాలు.
ఇది ఎవరి వైఫల్యం?
ప్రాసెస్‌లో ఉండి, ఆగిపోయినటువంటి ఉద్యోగాల విషయానికి వస్తే…. ముఖ్యంగా గ్రూప్ వన్ ఆగిపోయింది. వాయిదాలు పడడం వల్ల…. అంతకంటే ముందు పేపర్ లీకేజ్ వల్ల…. ఇది పూర్తిగా పబ్లిక్ సర్వీస్ వైఫల్యం వల్ల జరిగినటువంటి ఒక సమస్య. నిజానికి అది కమిషన్ సమస్య. దానికి ఎవరు బాధ్యత వహించాలి? పబ్లిక్ సర్వీస్ కమిషనే బాధ్యత వహిస్తుంది. ఈ ప్రాసెస్ ని చాలామంది విద్యార్థులు అర్థం చేసుకుంటారు. మొత్తం మీద అది ఒక ఫెయిల్యూర్. దాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. బహుశా కేసీఆర్ కేటీఆర్ కూడా ఆ వైఫల్యాన్ని ఒప్పుకొని ఉంటారు. ఒప్పుకునే సాహసం ఉండడం కూడా అవసరం. వైఫల్యం ఉంటే వైఫల్యం అని చెప్పాలి. ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యామని చెప్పాలి. ఎప్పుడైనా సరే దాన్ని ప్రజలు ఇష్టపడతారు. బహుశా… ఒక వైఫల్యం కింద మనం గమనించవచ్చు. గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలి… ఎందుకంటే మేము సరిగా ప్రిపేర్ కాలేదని పెద్ద ఎత్తున ఒక మూమెంట్ నడిపించినారు. ఈ మూమెంట్ నడిపించిన వాళ్లలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళున్నారు బిజెపి వాళ్లు ఉన్నారు బీఎస్పీ వాళ్ళు ఉన్నారు అన్ని ప్రతిపక్షాల వాళ్లు ఉన్నారు. అది విద్యార్థులకు ఇంకా టైం ఇవ్వడం కోసం పోస్ట్ ఫోన్ చేశారు. అది పోస్ట్ పోన్ చేసే నాటికి ఎలక్షన్ కమిషన్ ఎన్నికల తేదీని ప్రకటిస్తుందని పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుకోలేదు. అప్పటికి ఎన్నికల షెడ్యూల్ రాలేదు. చివరకు అది కూడా ఈ ఎలక్షన్ షెడ్యూల్ తో క్లాష్ అయింది. ఎన్నికల కమిషన్ దేన్నైనా రద్దు చేసి ఆరోజు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ రోజు ఏది ఉన్నా సరే… అది రద్దు కావాల్సిందే. సో ఎన్నికలు వచ్చినాయి కాబట్టి పరీక్షల నిర్వహణ ప్రాబ్లమ్ అవుతుందని భావించారు. పోలింగ్ బూతులు అన్నీ దాదాపుగా విద్యాకేంద్రాల్లోనే ఉంటాయి. ఓటు హక్కు ఉపయోగించు కోవడం ప్రాథమికం కాబట్టి ఆ రోజు వేరే పనులు పెట్టరు. కాబట్టి ఎలక్షన్ దృష్ట్యా మళ్లీ వాయిదా వేశారు. మిగితావి నోటిఫికేషన్లు రావాలి… ఇంక కొన్ని సెలక్షన్ స్టేజిలోహొఉన్నాయి. గ్రూప్ 4 లాంటివి పరీక్షలు అయిపోయినయి గానీ రిజల్టస్ రాలేదు. ఇదొక అంశం. లీకేజీలు, డిలేలు, వాయిదాలు… ఇది నిజంగా చాలా డీప్‌గా హర్ట్ చేస్తుంది. మరీ ముఖ్యంగా పరీక్ష రాసి వెయిట్ చేస్తున్న సమయంలో. ఆ ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. మరో ప్రాబ్లం ఏమంటే ప్రతి నోటిఫికేషన్ మీద ఒక వంద కోర్టు కేసులు వస్తుంటాయి. యుపిఎస్ విషయంలో గతంలో సుప్రీంకోర్టు కొన్ని తీర్పులిచ్చింది. ప్రతీ దాన్ని ఎంటర్ టెయిన్ చేయకూడదు. నిజంగానే అవసరమైన సందర్భాల్లోనే ఎంటర్ టెయిన్ చేయాలి. అంతే కానీ నాకు సమయం సరిపోవడం లేదు కాబట్టి వాయిదా వేయమనడం కొంచెం ఇబ్బందికరమే. అసంతృప్తికి, అసహనానికి ఇదొక ప్రధానమైన కారణం. రెండవది న్యారేటివ్. ఇంటికొక ఒక ఉద్యోగం అన్నారు అని ప్రచారం చేశారు. అయితే మేనిఫెస్టోలను చూస్తే… ఏ పార్టీ కూడా… ఇంటికొక ఉద్యోగం అనే మాట చెప్పలేదు. ఇంటికొక ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదు. నాలుగు కోట్ల మంది ఉన్నటువంటి రాష్ట్రంలో దగ్గర దగ్గర ఒక కోటి ఇళ్లు ఉన్నాయి లేదా 50 లక్షలైనా ఉన్నాయనుకోండి. 6లక్షలు కన్నా ఉద్యోగాలు ఉండవు తెలంగాణలో. భారత దేశంలోనే రెండు కోట్ల కంటే ఎక్కువ ఉద్యోగులు లేరు. ఇప్పుడిచ్చిన లెక్కలో కూడా గవర్నమెంట్లో మూడు లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులున్నారు. మరో 3 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు. మొత్తంమీద 6 లక్షలో… 7 లక్షలో ఉన్నారు. దీనిని కోటికి కాదు 30 లక్షలకు కూడా తీసుకుపోలేం.ఈ ఎన్నికల్లో కూడా కొంతమంది ఇంటికొక ఉద్యోగమిస్తామని అంటున్నారు కానీ వాళ్లు కూడా ఇవ్వలేరు.
జాబ్ క్యాలెండర్…..
ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంలో లేట్ చేయడం జరిగింది. దాన్ని అంగీకరించి తీరాల్సిందే. విద్యార్థులు అడుగుతున్న వాటిలో చాలా ప్రధానమైన అంశం జాబ్ క్యాలెండర్. యూపీఎస్సీ… లేదా మరో సంస్థ నిర్వహించే ఉద్యోగాలతో క్లాష్ రాకుండా…. ఒక పద్ధతి ప్రకారం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. ఈ సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలు… ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ రానుంది…. ఎప్పుడు కంప్లీట్ అవుతాయి… నాకున్న అనుభవంతో నేను చెప్పేది ఏమిటంటే… జాబ్ క్యాలెండర్ ఇచ్చినా కూడా దాని ప్రకారం ఉద్యోగాలు భర్తీ కావు. రకరకాల సమస్యలు వస్తాయి… కోర్టు కేసులు వస్తాయి. నేను కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి ఆశ్చర్యపోయింది అక్కడే. వాళ్లేమంటున్నారు… మేం రాగానే ఫలానా రోజు గ్రూప్1 వేస్తాం… ఫలానా రోజు మరొకటి వేస్తాం…అని అన్నారు. ఆ తేదీల మధ్య నెల రోజుల గ్యాప్ కూడా లేదు. ఉదాహరణకు వాళ్లు డిసెంబర్ లో అధికారం లోకి వస్తారనుకుందాం. జనవరి నుంచి నోటిఫికేషన్లు షురూ చేస్తారనుకుందాం. మార్చిలో ఒక పరీక్ష పెడుతామన్నారు. గతంలో నోటిఫికేషన్ తరువాత మూడు నెలలు సమయమిచ్చినా… టైం సరిపోలేదనే వాదన వచ్చింది. అదీగాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేస్తామంటున్నారు. సభ్యుల ఎంపికకు పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఆయా వ్యక్తులను గుర్తించాలి, ఎంపిక చేయాలి, గవర్నర్ అపాయింట్ చేయాలి. వాళ్లు బాధ్యతలు స్వీకరించాలి. సెటిల్ కావాలి. వాళ్లు నాయకులు ఇచ్చిన స్కీమ్ ప్రకారం పని చేయరు కదా… వీళ్లెవరూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో పాస్ అయి… రిక్రూట్ అయిన వారు కారు కదా…. ఐఏఎస్‌లు… ప్రొఫెసర్లు… లాంటి వాళ్లు ఉంటారు. రాగానే పరీక్ష పెట్టడానికి వీలు కాదు కదా. చాలా నిబంధనలుంటాయి. ఇవన్నీ జరగడానికి రెండు నెలలో… మూడు నెలలో పడుతుంది. ప్రిపరేషన్ పీరియడ్ అనేది ఉంటుంది.
ఆ అరుదైన లక్షణం కేటీఆర్‌లో ఉంది….
ఎన్నికల కోసం లక్ష హామీలిస్తాం. ఇవ్వాలి. ఇస్తారు. ఏదేమైనప్పటికీ ఇవాళ రాష్ట్రంలో కడుపుమండి కన్నీళ్లు పెట్టుకుంటున్న ఒకే ఒక వర్గం నిరుద్యోగులు. దీన్ని కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా వాడుకుంటోంది. నిరుద్యోగ బస్సు యాత్రలు పెడుతున్నారు. కోదండరాం సారథ్యంలో నిరుద్యోగులకు సంబంధించిన సమస్య లు పరిష్కరిస్తామనే హామీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మంచివే. అంతమాత్రనా ఇవతలి పక్షం మౌనంగా ఉండదు కదా. అందుకే బహుశా కేటీఆర్ కూడా ఈ అంశంపై రంగంలోకి దిగినట్లుగా ఉంది. చాలా సందర్భాల్లో ఒక సెక్షన్ పుట్టుకొస్తుంది. మా సమస్యలు మీకేం తెలుసని నిలదీస్తుంది. అది వాస్తవమే. అయితే… నాయకుడికి ఆ బాధలు వినేటటువంటి ధైర్యం కూడా ఉండాలి. ఈ రోజు కేటీఆర్ చేసింది అదే. బాధను వినడం మాత్రమే కాదు… కోపాన్ని రిసీవ్ చేసుకున్నారు కూడా. తప్పును యాక్సెప్ట్ చేయాలి. సాధారణంగా రాజకీయ నాయకులు తప్పును యాక్సెప్ట్ చేయరు. నేను అనేది ఏమిటంటే.. ఈ పని రెండు, మూడు నెలల కిందటనే చేయాల్సింది.
రాజ్యాంగ సంస్థ రోడ్డున పడే అవకాశం
టిఎస్ పిఎస్సీని ప్రక్షాళన చేసే అవకాశం అప్పట్లో ఉండింది. అప్పుడే ఎందుకు చేయలేదనే ప్రశ్న వస్తుంది. ఏవైనా సాంకేతిక ఇబ్బందులు వాళ్లకు ఉండి ఉండవచ్చు. ఎందుకంటే టీఎస్ పీఎస్సీ గవర్నర్ చేతుల్లో ఉంటుంది. అప్పటికే పంపిన ఫైళ్లను గవర్నర్ తన వద్దనే ఉంచుకుంటున్నారు. టీఎస్ పీఎస్సీకి పాత మెంబర్లు రిజైన్ చేస్తేనే కొత్త వారిని నియమించడం సాధ్యపడు తుంది. పాతవాళ్లు రిజైన్ చేసిన తరువాత కొత్తవాళ్లను గవర్నర్ ఆమోదించకపోతే ఏమవుతుంది? ఒక రాజ్యాంగ సంస్థ రోడ్డున పడుతుంది. బహుశా ఇవన్నీ ఆలోచించి ఉంటారేమో అని నేను అను కుంటున్నాను. అయినప్పటికీ… నిరుద్యోగుల కోపాన్ని, అసంతృప్తిని, వ్యతిరేకతను కూడా వినడం అనేది మొదటి మంచి పని. వాళ్లకు వాళ్ల పద్ధతిలోనే చెప్పడం బాగుంది. అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వస్తాయి. నాలుగో తారీఖు పదిన్నరకు అశోక్ నగర్ లో మీతో కూర్చొని మీతో డిస్కస్ చేసి అక్కడే జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తాను అని అన్నారు. కేటీఆర్ చెప్పింది కనీసం సగం మంది అయినా వింటారు కదా… నిరుద్యోగులకు ఒక హామీ లభించినట్లయింది. ప్రభుత్వం తమ బాధల్ని వింటోంది అనే సందేశం నిరుద్యోగుల్లోకి వెళ్లింది. అలా బాధలు విని… కన్నీళ్లను తుడిచి… వెన్ను తట్టి నిలబడాలి. అదీ నాయకత్వ లక్షణం. ప్రభుత్వాన్ని నిర్వహించిన వారి బాధ్యత. నాయకుడిగా, ఎన్నికల హామీ కోసం ఇచ్చినట్లుగా కాదు. తాను ఫీల్ అయినట్లుగా ప్రజలకు సందేశాన్ని అందించిన ట్లయింది. మనిషి విజయానికి మెట్టు ఏంటంటే, తన ఫెయిల్యూర్‌ను అంగీకరించడం. ఫెయిల్యూర్‌ను గుర్తించడానికి నిరాకరించిన వాడు ఎన్నటికి కూడా విజయం సాధించలేడు. ఇవాళ ఆ ఫెయిల్యూర్‌ను కూడా అంగీకరించి… మేం విఫలమయ్యాం… మీరు నష్టపోయారు… దుఃఖపడ్డారు… కష్టపడ్డారు… మీ కష్టనష్టాలు తీరేందుకు నేను బాసటగా ఉంటాను…. ఇలాంటి అనునయనమే గొప్ప హామీ. ఆ హామీని కేటీఆర్ ఇచ్చారు. అంతేకాదు… మరో విషయం కూడా చెప్పారు. ఓట్ల కోసం అబద్దాలు చెప్పను, ఓట్ల కోసం దబాయించను, ఓట్ల కోసం మేం మభ్యపెట్టం… అని కూడా అన్నారు. మూడో తారీఖు తరువాత నాలుగో తారీఖున నేను మళ్లీ వచ్చి కన్వీన్స్ చేస్తా… అని కేటీఆర్ అంటున్నారు. సరే… మీరు ఇప్పుడు బీఆర్ఎస్ కు ఓటేయకుంటే… రేపటి నాడు రేవంత్ రెడ్డి వచ్చి కన్వీన్స్ చేస్తాడు. ప్రజాస్వామ్యం గొప్పదనం అదే. ఏ పార్టీ గెలిచినా కూడా సమస్య పరిష్కారం అవుతుంది. అదీ సాధ్యం కాలేదనుకుంటే… ఈటెల రాజేందర్ వచ్చి కన్వీన్స్ చేస్తారు. ఎవరో ఒకరైతే ముఖ్యమంత్రి కావాలి కదా.
ఇవీ నాయకుల లక్షణాలు
మనుషులను గుర్తించడం, బాధలను గుర్తించడం, ఇబ్బందులను గుర్తించడం, కష్టాలను గుర్తించడం… ఇది రాజకీయ నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం. రెండో లక్షణం… పొరపాట్లను అంగీకరించడం, నిర్లక్ష్యం చేసిన విషయాలను అంగీకరించడం. తప్పులు చేసినప్పడు వాటిని అంగీకరిస్తూ సరిదిద్దుకుంటామని చెప్పడం. ఇక మూడో లక్షణం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం. మరీ ముఖ్యంగా ఇలాంటి సెన్సిటివ్ హామీలను. నిర్లక్ష్యం వల్ల కొన్ని పొరపాట్లు జరిగాయి. రేపటి నాడు మీరు అధికారంలోకి వచ్చిన తరువాత సంస్కరించవచ్చు.
ఆదర్శంగా కేరళ….
ఇంకో విషయం ఏమిటంటే… ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉన్న 120 మందితోనే లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయడం అనేది అసాధ్యం. రాబోయే ప్రభుత్వాలు, హామీ ఇస్తున్న నాయకులు ఈ విషయాన్ని గుర్తించాలి. ఈ విషయంలో కేరళను ఆదర్శంగా తీసుకోవాలి. అక్కడ సంవత్సరానికి 60 వేలు, 70 వేలు, లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తారు. అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 1800 మంది సిబ్బంది పని చేస్తున్నారు. యూపీఎస్సీ సంవత్సరానికి మూడు వేలు… నాలుగు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తుంటుంది. అక్కడ 2 వేల మంది పని చేస్తున్నారు. రిక్రూట్ మెంట్ అనేది ఎంతో సంక్లిష్టమైన పని. తెలంగాణలో 74 రకాల రోస్టర్లు ఉంటాయి. 33 జిల్లాలు, రకరకాల కోటాలు… ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మేం ఈ 120 మంది సిబ్బందితో ఆరేళ్ల కాలంలో 38 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. రేపటి నాడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా 300 మందిని టీఎస్ పీఎస్సీ కోసం రిక్రూట్ చేసుకోవాలి. భర్తీ పక్రియ అంత తేలికేం కాదు. ఉద్యోగాలు భర్తీ చేసేందుకు టైమ్ పడుతుంది. యువతకు ధైర్యం చెప్పండి. అవకతవకలు జరగనివ్వబోమని చెప్పండి. నిష్పాక్షికంగా చేస్తామని చెప్పండి.
వివిధ రకాల బోర్డులు ఏర్పాటు చేయాలి
జాబ్ క్యాలెండర్ యివ్వాలి. దాని అమలు ఒక పెద్ద ప్రాసెస్. కోర్టులకు వెళ్లడం లాంటి ఎన్నో అవరోధాలు ఉంటాయి. ఉదాహరణకు ఫిబ్రవరిలో గ్రూప్ 3 పెడుతామని అన్నారనుకోండి. అదొక ప్రాసెస్. మేం సమర్థవంతంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను నిర్వహిస్తాం… ఏటా ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం… అని చెప్పండి. అంతేకాదు, బోర్డుల సంఖ్య పెంచండి. ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లుగా స్టాఫ్ సెలెక్షన్ బోర్డ్ పూర్తి స్థాయిలో గురుకుల టీచర్స్ బోర్డ్ లాంటిదాన్ని ఏర్పాటు చేయాలి. వాటికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఏం సంబంధం? ఎలక్ట్రికల్ రిక్రూట్ మెంట్ ఉంది… దానికో బోర్డు ఉంది. మెడికల్ రిక్రూట్ మెంట్ ఉంది… దానికో బోర్డు ఉంది. ఇలాంటి బోర్డుల సంఖ్యను ఇంకా పెంచండి. తప్పేం లేదు. కొన్ని రాష్ట్రాల్లో మినిస్టీరియల్ ఎంప్లాయీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అని ఉంది. గవర్నర్ పై ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. యూనివర్సిటీలకు వేటికవేగా భర్తీ చేసుకునేలా చేయండి. అన్నిటికీ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను వాడుకోవాలని… ఇంకేదో చేయాలని చూస్తే ప్రయోజనం లేదు. నిరుద్యోగులను వనరులుగా చూడాలి తప్ప ఓటర్లుగా చూడొద్దు. వాళ్లకు నైపుణ్యాలు పెంచండి. కొత్త అవకాశాలు కలిగించండి. ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగాలున్నాయి. ఫాక్స్ కాన్ సంస్థ హైదరాబాద్ కు వస్తోంది. మొదటి విడతగా 25 వేలు లేదా 30 వేల ఉద్యోగాలు వస్తాయి. ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలేంటో తెలుసుకొని వాటిల్లో శిక్షణ ఇవ్వాలి. ఆ శిక్షణ ఇవ్వడాన్ని ప్రభుత్వమే టేకప్ చేయవచ్చు కదా. చైనాలో ఇదే విధంగా జరుగుతుంది. ప్రభుత్వమే చొరవ తీసుకుంటుంది. రాబోయే కంపెనీలను దృష్టిలో పెట్టుకొని అక్కడి ప్రభుత్వం ముందుగానే స్థానిక యువతకు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తుంది. ఇప్పుడు ఫాక్స్ కాన్ వాళ్లకి కావాల్సింది 25 వేల మంది కదా… ఓ యాభై వేల మందికి… లేదంటే 75 వేల మందికి శిక్షణ ఇవ్వండి. తమకు కావాల్సిన వాళ్లను కంపెనీ వాళ్లు ఎంచుకుంటారు. పోటీ ఉంటుంది. అందులో నెగ్గిన వారికి ఉద్యోగాలు వస్తాయి. మిగిలిన వాళ్లు అదే తరహా నైపుణ్యాలు అవసరమయ్యే ఇతర కంపెనీలకు వెళ్తారు.
కేటీఆర్ బాటను ఇతర నేతలూ అనుసరించాలి
నిరుద్యోగులకు సంబంధించి ఒక గట్టి హామీ ఇవ్వాలి. జరిగిన పొరపాట్లను అంగీకరించడం, భవిష్యత్ మీద విశ్వాసం కల్పించడం… ఇవీ ఇప్పుడు కావాల్సింది. ఒక్క కేటీఆర్ మాత్రమే కాదు… మిగిలిన వాళ్లు సైతం అవే హామీలను ఇవ్వాలి. వాగ్దానాలతోనే కాలాన్ని వెళ్లదీయలేం. నాలుగో తారీఖున నిరుద్యోగులను కలుస్తానని కేటీఆర్ అంటున్నారు… కాంగ్రెస్ గెలిచినా సరే… నిరుద్యోగులతో డిస్కస్ చేయండి. క్యాలెండర్ ఎలా ఉంటుందో చెప్పండి. పరీక్ష విధానం ఎట్లా ఉంటుందో చెప్పండి. ఆలోపు కమిషన్లు వేయండి. రిక్రూట్ మెంట్ ఏజెన్సీలను ఏర్పాటు చేయండి. నేను కోరుకునేది ఒక్కటే. ఇప్పటి దాకా నిరుద్యోగులంతా నిస్పృహలో ఉన్నారు. నిరాశతో ఉన్నారు. బాధల్లో ఉన్నారు. వాళ్లకు ఈ దు:ఖం నుంచి, బాధల నుంచి, ఈ నిరాశ నుంచి ఉపశమనం దొరకాలని కోరుకుంటున్నా.
మీరు ఒక చిన్నహామీ ఇచ్చి దాన్ని ఉల్లంఘిస్తే… అది ఓ చిన్న ఆర్థిక ప్రయోజనం మాత్రమే కలిగించేది. కానీ ఉద్యోగమిస్తానని ఆశలు కల్పించి… ఆరు నెలల నుంచి, ఏడాది నుంచి వారిని తిప్పుకొని, కోర్టుల్లో కేసులు వేసి… వాళ్లు తినే అన్నం గిన్నె లాక్కొని… మళ్లీ నీవు పెట్టకపోతే… చాలా నష్టం జరుగుతుంది. డిప్రెషన్ వస్తుంది. ఏవగింపు వస్తుంది. జీవితంపైనే విరక్తి పుడుతుంది. దయచేసి అటువంటి దశకు తీసుకురావద్దు. నిరుద్యోగులను అందరూ ఎంతగా వాడుకోవాలో అంతగా వాడుకున్నారు. ఇప్పుడు అంతా కూడా కార్యాచరణ రంగంలోకి దిగాలని నేను కోరుకుంటున్నాను. ఎవరి అధికారంలోకి వచ్చినా కూడా సరైన విధంగా దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది. కేటీఆర్ తరహాలో అంతా స్పష్టంగా చెప్పాలి. మేం ఇంత ఇస్తాం… మేం ఇంత చేస్తాం.. అని స్పష్టం చేయాలి. యువతతో కూర్చొని చర్చించాలి. వాళ్లకేం కావాలో వాళ్లే చెబుతారు. ధైర్యం ఉంటే… చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీల వాళ్లు చేయాల్సింది అదే. ఆ పని చేసినందుకు కేటీఆర్ ను నేను అభినందిస్తున్నాను.
- డా।। వంశీ మోహన్ నర్ల
ఎ : 9848902520