యాలాల చరిత్ర యాత్ర


వికారాబాద్‍ జిల్లా యాలాల మండలం యాలాలకు మధిర గ్రామం గోవిందరావుపేటలో కక్కెరవేణి నది ఒడ్డున దిబ్బమీద వరాహస్వామి విగ్రహం కనిపించిందని 2017లో సాక్షి దినపత్రికలో ఒక వార్త అచ్చయింది. రెండోసారి మా చరిత్రబృందం కో-కన్వీనర్‍ బీవీ భద్రగిరీశ్‍ సార్‍ ఈ శిల్పాన్ని చూసానని ఫొటోలు పంపాడు. ఈ అక్టోబర్‍ నెలలో దుర్గ నవరాత్రి ఉత్సవాలలో పాల్లొనడానికి యాలాల వెళ్ళిన ఘంటా మనోహర్‍ రెడ్డి గారు యాలాల్‍ గ్రామం నర్సింహులు, బస్వరాజ్‍, మహేశ్‍లతో కలిసి చూసిన యాలాల, గోవిందరావు పేటలలోని విగ్రహాల ఫొటోలను నాకు పంపారు. గోవిందరావు పేటలో తాను చూసిన శిల్పాన్ని గురించి నన్నడిగారు మనోహర్‍ రెడ్డిగారు. అది ఈ వరాహస్వామిదే. అవి చూసాక ఆ గ్రామంలో అన్ని విగ్రహాలను చూడాలని నేను, భద్రగిరీశ్‍, మనోహర్‍ రెడ్డి గారలు అనుకున్నాం.


అక్టోబర్‍ 25నాటి ఉదయం నన్ను వెంట తీసుకువెళ్ళడానికి కారులో వచ్చారు భద్రగిరీశ్‍ సార్‍. మనోహర్‍ రెడ్డిగారు వారి ఊరు సమీపంలోని గడిసింగాపూర్‍ వద్ద మాతో చేరారు. ముగ్గురం యాలాల చేరేసరికి 12గం.లు కావస్తున్నది.


గ్రామం చేరగానే గాజుల బస్వరాజు, వీరేశం, నర్సింహులు, చంద్రశేఖర్‍, మహేశ్‍, ప్రభాకరాచారి, శివశంకర్‍, వెంకటగిరిరాజు, అయ్యప్ప, అవినాశ్‍, వేంకటేశ్‍ తదితరులు సాదరంగా రిసీవ్‍ చేసుకున్నారు. మరుక్షణం నుంచే మా పర్యటన మొదలైంది. తొలుత గ్రామంలోని చౌరస్తాలో తూర్పునున్న ‘ఊరుడమ్మ’ గుడి చూసాం. తర్వాత బోనమ్మగుడిలో దేవత భవాని. 15యేండ్ల కిందట ప్రతిష్టించిన విగ్రహం. అంతకు మునుపు చెక్కతో చేసిన అమ్మదేవతను పూజించే వారు. చెక్కతో గ్రామదేవతలను చేసి, పూజించే సంప్రదాయం నిజామాబాద్‍ లో కూడా ఎక్కువగానే కనిపిస్తుంది.
హనుమాన్‍ మందిరంలో భక్త శిఖాంజనేయుడు తలకిరువైపుల చక్ర, శంఖాలతో, ఉత్తరాభిముఖుడై కనిపిస్తున్నాడు. ఈ గుడిలో చాళుక్యశైలి గణపతి, జంటనాగులు, నాగదేవత, చతురస్రాకార పానవట్టంలో అమర్చిన సమ తలోపరితల శివలింగం బ్రహ్మసూత్రంతో కనిపిస్తున్నాయి. సూర్య, చంద్రులున్న జంటనాగులు, చిన్న హనుమాన్లు ముగ్గురు, గుడిగోడలో అమర్చివున్న చతుర్భుజి దేవత ఢమరుకం, త్రిశూలం, ఖండిత శిరస్సు, ఖడ్గాలతో, కుడివైపు ముడిచిన సిగతో, తలపై నాగఛత్రంతో కనిపించే కాళిక. శిల్పం 18వ శతాబ్దం తర్వాతదే.


అటు నుంచి గోవిందరావుపేటకు వెళ్తూ, దారిపక్కన పొలాల్లో బేతాళుడున్నాడు చూద్దాం రండని తీసుకెళ్ళారు వీరేశం వాళ్ళు. మేం వెళ్ళేముందే విగ్రహం చుట్టున్న ముళ్ళపొదల్ని విద్యార్థులు అవినాష్‍ బృందం తొలిగించారుట… బాగా నూనెజిడ్డు, మకిలతో ఉన్న విగ్రహం… స్థానకశిల్పం. కుడిమోచేయి గదమీద ఆన్చి, నిలబడిన పురుషమూర్తి, ఎడమచేయి కటిహస్తం. తలమీద జటామకుటం, కొమ్ములు, చెవులకు కుండలాలు, మెడలో హార, గ్రైవేయకాలు, ఉదరబంధం, నీవీబంధం, ఉరుడాలు, దండకడియాలు, కంకణాలతో కనిపిస్తున్న ఈ శిల్పం బేతాళుడు కాదు, శైవద్వారపాలకుడు శృంగి. ఈ విగ్రహానికి తూర్పున అక్కడే పొలాలలో ఛత్రోపరితలంతో ఒక సమలింగం, దానికి ఎదురుగా పెద్దమువ్వల పట్టెడతో రాష్ట్రకూటుల శైలి పెద్దనంది విగ్రహం ఉన్నాయి. వీటి ఆనవాళ్ళతో ఇక్కడొక శివాలయం ఉండేదనిపించింది.


అక్కణ్ణుంచి గోవిందరావుపేట చేరాం అందరం. మేం డ్రైవర్‍ తో 4గురం, యాలాల, గోవిందరావుపేట గ్రామస్తులు 25మందిమి. అంత చిన్నగ్రామంలో అడుగడుగున గుడులే. ఎందుకు అనే ప్రశ్న కలిగింది. వారితో మాట్లాడుతున్నపుడు ఈ గ్రామం కాకరవాణి లేదా కక్కెరవేణి అని పిలిచే చిన్ననది ఒడ్డున ఉంది. ఇక్కడ నది ఉత్తరవాహిని. ఉత్తరవాహినిగా నది ప్రవహించేచోటు ప్రశస్తమనే నమ్మకంతో బౌద్ధ, జైన, హిందూ ధర్మాల దేవాలయాల్ని నిర్మించేవారు పూర్వం. గోవిందరావుపేటలో అందుకే అన్ని దేవాలయాలు. గోవిందరావుపేటలో మార్కండేయాలయం, రామలింగేశ్వరాలయం, శివాలయం, చౌడేశ్వరి గుడులున్నాయి. కక్కెరవేణి నదిమీద చెక్‍ డామ్‍ కట్టారు. నదిలో బ్యాక్‍ వాటర్‍ నిండుగా కనిపిస్తున్నది.


నది ఒడ్డున ఎత్తుగడ్డ, ఇటికెల దిబ్బ మీద నాలుగడుగుల ఎత్తున్న సున్నపురాతిఫలకం మీద చెక్కిన భూవరాహమూర్తి శిల్పం. శిల్పశాస్త్రం ప్రకారం వరాహమూర్తి 1. ఆది లేదా భూవరాహమూర్తి, 2. యజ్ఞవరాహమూర్తి, 3. ప్రళయ వరాహమూర్తి అని 3రకాలు. వైఖానసాగమం, శిల్పరత్నంలలో చెప్పినట్లు ఆదివరాహమూర్తి జటామకుటధారి, చతుర్భుజుడు, శంఖ, చక్రాలుంటాయి. కుడికాలు ఆదిశేషునిపైన ఉండాలి.


గోవిందరావుపేటలో ఉన్నది భూవరాహమూర్తి. ఈ విగ్రహం అపురూపమైన, అరుదైన శిల్పం. వాకాటకశైలి, 5,6 శతాబ్దాలనాటిది. చతుర్బుజుడైన వరాహమూర్తి పరహస్తాలలో ప్రయోగచక్రం, శంఖం, కుడిచేయి సింహముఖముద్ర మీద పీఠంపై కూర్చునివున్న భూదేవి, ఎడమచేయి ఊరుహస్తంగా ఉంది. హార, గ్రైవేయకాలు, ఉదరబంధం, జంధ్యం, జయమాల, ఉరుడాలు, కంకణాలు, దండకడియాలు, తన కుడికాలు శేషసర్పంపై పెట్టి నిల్చున్న స్థానక శిల్పం. శిల్పశాస్త్రానికే మెరుగులు దిద్దిన శిల్పమిది. మధ్యప్రదేశ్‍ లోని ఉదయగిరి వరాహమూర్తితో ఈ శిల్పానికి సామ్య, భేదాలున్నాయి.
విగ్రహం కింద సాతవాహనకాలంనాటి ఇటుకల దిబ్బ కనిపిస్తున్నది. దిబ్బకు ముందు వెనక కుడులున్న రాష్ట్రకూటశైలి రాతిస్తంభాలు అగుపిస్తున్నాయి. ఈ శిథిలావశేషాలన్నీ ఒకప్పుడు ఇక్కడ పెద్ద గుడి వుండేదనడానికి సాక్ష్యాలు. ఇక్కడ శాస్త్రీయమైన నమూనా తవ్వకం చేస్తే, మరిన్ని చారిత్రకాధారాలు లభించే అవకాశం ఉంది.


గోవిందరావుపేటలో శివ మందిరాన్ని చూడ్డానికి మేం వెళ్ళినపుడు గుడి వందేండ్ల కింద కట్టినట్లు ఇల్లువంటి గర్భగుడి, ముందర కట్టెవి దూలాలు, వాసాలు, స్తంభాలతో వరండా, అరుగులున్నాయి. గర్భగుడికిరువైపుల ద్వారపాలకులు దండాలతో, స్వస్తికాసనాల్లో నిల్చుని కనిపించారు. శైవ, వైష్ణవ ద్వారపాలకులు కారు. గర్బగుడిలో పానవట్టంగా చేసి, బాణలింగాన్ని అమర్చిన ఏకవిగ్రహ అధిష్టానపీఠం ఉంది. పీఠానికి మూడువైపుల తామర పూరేకులు చెక్కివున్నాయి. ఇది జైన తీర్థంకరుని అధిష్టానపీఠమే. మరొక గుడిలో జైనశిల్పాలు లభించాయి. జైన తీర్థంకరుని విగ్రహం తల ఒకటి వరాహస్వామి విగ్రహం పరిసరాల్లో దొరికిందని చెప్పారు బసవరాజు. ప్రస్తుతం ఈ గుడిలో లింగం, చిన్ననందులు, వరండాలో రాష్ట్రకూటశైలి పెద్దనంది ఉన్నాయి. విసుర్రాయిలో అడుగురాయి, ఒక తూకపురాయి వంటి తొలిచారిత్రకకాలానికి చెందిన రెండు రాతి పనిముట్లు ఆ పీఠంమీదనే పెట్టివున్నాయి.
గోవిందరావుపేట గ్రామంలో ఉన్న నీలకంఠస్వామి గుడిలో 8అంగుళాల ఎత్తున్న రెండు జైన తీర్థంకరుడు మహావీరుని విగ్రహాలు, రెండు జైన యక్షిణుల అర్చామూర్తులు, మూడు గణపతి అర్చామూర్తులు, మూడేసి లింగాలు, నందులు అర్చా మూర్తులున్నాయి. ముందు జైనధర్మానికి చెందిన జైనబసదు లుండేవని, అవి శివాలయాలుగా పరివర్తనచెందినాయని తెలుస్తున్నది. పురాతన మార్కండేయాలయం శిథిలమై వుంది. ద్వికూటరూపంలో వున్న గుడులకు రెండువందలేండ్ల వయసుండవచ్చనిపిస్తున్నది.


గోవిందరావుపేట ఊరిబయట చౌడేశ్వరిదేవి ఆలయముంది. ఈ దేవీ విగ్రహం పొలం దున్నుతున్న రైతుకు లభించిందని దానికే గుడి కట్టించారని చెప్పారు మిత్రులు. ద్విభుజి దేవత శైవమూర్తికాదు. రెండుచేతులలో తామరపూలను ధరించిన ఈ దేవతామూర్తి లక్ష్మి. పక్కన చిన్న వీరభద్రుని శిల్పముంది. ఈ ఆలయానికి ముందర కొంతదూరంలో రామలింగేశ్వరాలయమని పిలువబడేచోట రాష్ట్రకూటశైలినంది ఉంది. ఒకచెట్టు మొదట్లో అసంపూర్ణంగా చెక్కిన శివలింగమొకటి కనిపించింది. గోవిందరావుపేటకు తూర్పున పొలాల్లో చెట్లపొదల్లో చతురస్రాకార పానవట్టంతో పెద్దలింగం అగుపించింది. శైలిరీత్యా విష్ణుకుండినులకాలంనాటిది ఈ శివలింగం. అక్కడికి దగ్గరలో మరోశివలింగం కనిపించింది. ఎక్కడ చూసినా నందులు, లింగాలు రెండుగ్రామాల్లో.


ఈ పర్యటనలో పగలు రెండున్నర దాటింది. ఆకలి దండిగా దండిస్తున్నది. భోజనాలకు బసవరాజు తమ ఇంటికి మా నలుగురిని ఆహ్వానించాడు. కమ్మనిభోజనం. ఆత్మీయమైన ఆతిథ్యం. ఇంటిల్లిపాది ఆప్యాయత చూపారు. గాజుల వీరేశం, బసవరాజు లిద్దరు కవలలు. టీచర్లు. వీరశైవులైన వీరింట్లోని శివమందిరంలో బ్రహ్మసూత్రంతో లింగం, గణపతి, వీరభద్రుడు, నందుల శిల్పాలున్నాయి.


భోజనానంతరం మళ్ళీ యాలాలలోనే పర్యటన మాది. ముందుగా వీరభద్రేశ్వరాలయానికి వెళ్ళాం. వీరేశం వారింటికి సమీపంలో ఉన్న వీరభద్రుని గుడిని దర్శించాం. ప్రధానదైవం వీరభద్రుడు చతుర్భుజుడు త్రిశూలం, సర్పసహిత ఢమరుకం, ఖడ్గం, డాలులుతో పెద్దమీసాలు, గడ్డంతో కనిపిస్తున్నాడు. 18వ శతాబ్దం తర్వాత శైలిలో చెక్కబడిన శిల్పం. పెద్ద వీరభద్రుని పక్కనే చిన్న వీరభద్రుని అర్చామూర్తి శిల్పముంది. నైరుతి మూలలో అడుగున్నర ఎత్తున్న బ్రహ్మసూత్రసహిత, అర్థగోళోపరితల శివలింగముంది. వాయవ్యమూలలో 16వ శతాబ్దానికి చెందిన మరొక వీరభద్రుని శిల్పముంది. గుడి ముందు రాష్ట్రకూటశైలి చిన్ననంది ఉంది.


ఆ తర్వాత నగరేశ్వరాలయానికి వెళ్ళాం. శాసనాలలో పలుసార్లు పేర్కొనబడిన వ్యాపారకేంద్రం పేరు నకరం.ఈ నకరమే నగరమనే పలుకుబడిగా మారింది. నకరాలలో నకరేశ్వరాలయాలు ప్రసిద్ధమైనవి. ఈ క్షేత్రం శైవధర్మానికి ప్రాతినిధ్యం వహించిందని, విష్ణుకుండినుల నుంచి కళ్యాణీచాళుక్యులదాక శైవం ప్రోత్సహించబడ్డదని, శైవంలో వీరత్వానికి, బలిదానాలకు తలపడే జంగముల కేంద్రంగా వుండేదని తెలుస్తున్నది. యాలాల నగరేశ్వరాలయం చూడడానికి చిన్నదిగానే కనిపించింది. పునరుద్ధరణ చేయబడ్డట్లు మార్పులు కనిపిస్తున్నాయి. ఈ దేవాలయానికి ద్వారబంధం మీద లలాటబింబంగా గణపతి విశేషం. ఛత్రోపరితలంతో శివలింగం, ఒకమూల కేశవమూర్తి శిల్పం గర్భగుడిలో ఉన్నాయి. మొత్తం గ్రామమంతటికి కనిపించిన ఒకే వైష్ణవరూపమిది.


గుడిముందున్న నంది చాళుక్యశైలిలో ఉంది. ఆ ప్రాంగణంలోనే పాండురంగడు, రుక్మీబాయి దేవాలయముంది. ద్వికటిహస్తుడైన పాండురంగని రెండుచేతులలో చక్రం, శంఖం ఉన్నాయి. ఇటీవలి కాలంలోనిదే. ఈ ప్రాంతంలోని చాలామంది వస్త్రవ్యాపారులు, నేతన్నలు మహారాష్ట్రకు వలసపోయారు. అందువల్ల అక్కడి పాండురంగడు ఈ వూరికి వలసవచ్చిన సాంస్క•తిక విశేషం.


చివరన మేం చూసిన బసవన్నగుడి అద్భుతం. నందికే గుడికట్టడం అరుదు. రామప్పగుడి ముందర, కుర్రారం శివాలయం ముందర నందులకు వేదికలకు కట్టింది చూసాను. గుడులలో నందిమంటపాలు, నందులకు ప్రత్యేకంగా అధిష్టానపీఠాలుండడం, అధికారినంది శిల్పాలను చూసాం. కాని, ఇట్ల బసవన్నకే గుడి అరుదు. ఎక్కడైనా నందులు మువ్వలు, గంటలు, పూసలపట్టీలతో, పట్టెడలతో, అల్లిన తాళ్ళతో వేసిన దండముడులతో, దర్భముడులతో కనిపిస్తాయి. ఇక్కడి నంది మెడ నుంచి కిందికి విస్తరించిన పెద్దగంగడోలుతో సజీవంగా కూర్చున్నట్టు చెక్కిన శిల్పం. రాష్ట్రకూటశైలికి చేర్చిన కొత్తసొబగు. ఈ నందిని పోలిన నంది ఇంద్రకల్లులో చూసాంకాని, చిన్నది. ఈ నంది మీటరు ఎత్తుకు మించి ఉంది. అచ్చం ఇటువంటి నందే గుడిబయట పగిలిపోయి కనిపించింది. గుడి ముందర బయట కనిపిస్తున్న శిల్పాలలో రెండు గణపతి శిల్పాలున్నాయి. ఎదురుగా నిలిపివున్న ధ్వజస్తంభం రెండు, మూడువందలేండ్లకు తక్కువే. అక్కడొక రాష్ట్రకూట దేవాలయానికి సంబంధించిన పెద్ద‘కుడు’ దేవతాశిరస్సుతో కనిపించింది.
అటు పక్కన శివలింగవేదికకు పేర్చిన రాళ్ళల్లో ఒక శాసన స్తంభం కనిపించింది. లిపి 10,11వ శతాబ్దాల తెలుగన్నడం. భాష కన్నడం.


‘ నమస్తుంగ శిరశ్చంద్ర చంద్రచామర చారవే, త్రైలోక్య నగరారంభ మూలస్తంభాయ శంభవే, స్వస్తిశ్రీ సమస్త భువనాశ్రయ రాజాధిరాజపరమేశ్వర చాళుక్యకులతిలక…’’ వరకు కనిపిస్తున్న కళ్యాణీచాళుక్య ప్రభుశాసనం. ఆ శాసనస్తంభాన్ని వేదిక నుంచి తీయించి, చదివితే యాలాల గ్రామచరిత్రకు కొత్తపేజీ చేరుతుంది.


మా పర్యటనలో ఆఖరున పెండ్యాల శివశంకర్‍ ఇంటిలో తేనీటివిందు. వారి దగ్గర ఉన్న పురాతన నాణాలను భద్రగిరీశ్‍ సార్‍ పరిశీలించి వాటిలో బహమనీ, అనంతర ముస్లింపాలకుల పాతనాణాలే ఉన్నాయని చెప్పారు.


యాలాలమిత్రులు ఈ రెండుగ్రామాల్లో గతంలో అక్కడక్కడా బంగారునాణాలు లభించినాయన్నారు కాని, వాటి వివరాలు కానీ, ఫొటోలు కానీ లేవు. ఇంతటి చారిత్రకప్రదేశంలో బహమనీరాజుల పూర్వపునాణాలు దొరక్కపోవటం ఒక లోటు అనిపించింది.


కొసమెరుపు: తిరుగుప్రయాణానికి ముందర యాలాల మిత్రులు ఊరిబయట హాస్టల్‍ వెనక ఒక శిల్పాన్ని చూపించారు. అది కత్తి,డాలు ధరించివున్న వీరుని స్మృతిలో వేసిన 18వ శతాబ్దపు వీరగల్లు.


ధన్యవాదాలు:
యాలాల చరిత్రయాత్రకు అన్నీ తామై సాయపడ్డ కవి ఘంటా మనోహర్‍ రెడ్డి, కవలసోదరులు గాజుల వీరేశం, బసవరాజు, తదితర మిత్రబృందానికి

  • శ్రీరామోజు హరగోపాల్‍,
    ఎ : 99494 98698
  • బీవీ భద్రగిరీశ్‍,
    కో-కన్వీనర్‍,
    కొత్త తెలంగాణ చరిత్ర బ•ందం
    ఎ : 917730145

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *