ప్రకృతే సౌందర్యం! 20 ప్రకృతే ఆనందం!!మేం మేమే! మీరు మీరే! మా మానాన మమ్మల్ని బతకనీయండి!

గుర్రం కాని గుర్రం! ఏనుగు కాని ఏనుగు!!
జంతువులకు పేరు పెట్టడంలో మానవులుగా మీకు మీరేసాటి! ప్రపంచ స్థాయి భాషలన్నీంటిలో మా జంతువులకు పేర్లుండడం విచిత్రమే! ఈ నేర్పరితనం మీకెలా అబ్బిందో మాకు తెలియదు. చాలా పేర్లు గ్రీకు, లాటిన్‍, ఫ్రెంచ్‍ పదాలతో సంబంధాలు వుంటే, ఆంగ్లం వాటన్నీంటిని స్వంతం చేసుకొని, అవన్నీ ఆంగ్ల పదాలని యావత్‍ ప్రపంచాన్ని భ్రమింప చేస్తున్నది. తెల్లవాడి తెలివికన్నా, వాడు సృష్టించుకున్న ఆంగ్లభాష నేడు ప్రపంచాన్ని ఇంతగా శాసిస్తుందని ఎవరు ఊహించి వుండరు. ఆంగ్లంలో నన్ను హిప్పోపొటామస్‍ (Hippopotamus) అని పిలిచినా అది లాటిన్‍ పదమని చాలామందికి తెలియదు. హిప్పో అనగా గుర్రమని, పొటామస్‍ అనగా నది అని అర్థం. అంటే, నది గుర్రం నీటి గుర్రంగా మారింది. యోరుబా (Yoruba) ప్రాంత ప్రజలు మాత్రం నన్ను నీటి ఏనుగని సంబోధిస్తారు. ఏది ఏమైనా నేను నదుల్ని, ఆ నదుల పరివాహక ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకొని జీవించడం మాత్రం వాస్తవం!


ఆకారంలో నేను నిజానికి గుర్రంలా కాకుండా, ఏనుగులా వున్నా, నాకు ఏనుగు లాంటి దంతాలు, తొండం లేవు. శరీరమేమో ఖడ్గమృగంలా వుండి వెడల్పాటి ముఖం, నోరును కలిగి వుంటాను. సర్కస్‍ల్లో నా నోట్లో ఓ భామ నిల్చొని విన్యాసం చేయడం మీరు చూసే వుంటారు. నా కాళ్ళు కూడా చిన్నగా వుండడంతో గుర్రంలా కాదు కదా, ఏనుగులా కూడా పరుగెత్తలేను. (గంటకు గుర్రం 70 కి.మీ., ఏనుగు 40 కి.మీ. హిప్పొ 30 కి.మీ.) ఇక నా జీవన విధానం గూర్చి కూడా చాలా తక్కువగా తెలుసు, కారణం దాదాపు పగలంతా నేను నీటిలో జీవించి, రాత్రుల్లో ఆహారంకై (శాఖాహారం) భూమిపైకి వస్తాను. ఇలా నిశాచరిగా, ఆహారం కోసం తిరగాడడం బహుశ నేనొక్క జీవినే కావొచ్చు! కొందరు నన్ను ఉభయచరమని (amphibian) అని అనుకొంటారు. కాని, నేను ఉభయచరాన్ని కాదు.


సబ్‍సహారా, దక్షిణాఫ్రికా ప్రాంతానికి చెందిన మాజాతి నీటికి దూరంగా బతకలేవు. మీ దున్నపోతుల్లా, మా శరీర నిర్మాణంకూడా అలాంటిదే మా చర్మం ఏమాత్రం పొడిబారినా మాకు విరేచనాలు (dehydration) అవుతాయి. అయినా, భూమిపై నివసించే భారీ ఆకారం గల ఏనుగు, తెల్ల ఖడ్గమృగం తర్వాత నన్ను మూడోస్థానంలో గుర్తించారు. నీటిలో దాదాపు 16 గంటలపాటు నిద్రపోయే నేను, నిద్రలోనే నీటిపైకి తలలేపి శ్వాసించడం మా ప్రత్యేకత. అలాగే ఏ జంతువు ఇవ్వని విధంగా మా పాలు గులాబి (pink) రంగులో వుండడం విశేషం! ఇక మా మగ హిప్పో జీవితాంతం (40-50సం।।) పెరుగుతూనే వుంటుంది.


నా ఆకారానికి చాలా జంతువులు జడిసినా, నా చిన్నారులకు మొసళ్ళ నుండి, ఇతర జంతువుల నుండి ప్రమాదముంటుంది. ఇక ఇతర జంతువులకున్నట్లే, మానవుల నుండే మాకు నిరంతర ప్రమాదంతో పాటు, వర్షాభావ పరిస్థితి కూడా ప్రాణ సంకటంగా వుంటుంది. కారణం, మేం అత్యధికంగా (సుమారు 7000 పౌండ్లు) నీటిని వాడుతాం. గతంలో కెన్యాలో దాదాపు నాలుగు రుతువులలో వర్షాలు కురవని స్థితి. దాంతో నీటి కొరత ఏర్పడి, మా జాతికి మరణసంకటం అయింది. అనేక హిప్పోలు చని పోయాయి. దీనితో పాటు, మా నోటి దంతాల కోసం వేట సాగుతుంది. మా చర్మాలకు మీ మానవులు విలువకట్టి, తోలు అలంకరణ సామా గ్రిని తయారు చేసుకొంటారు. అనూహ్యంగా మా కొరుకుడు పళ్ళు (canine) ముందటి
పళ్ళు(inlisors) నిరంతరం పెరుగుతూ (20 అంగుళాల వరకు) వుంటాయి. అమెరికాలోని హ్యూమన్‍ సొసైటి గణాంకాల ప్రకారం 2009 నుంచి 2018 వరకు, 9,000 పళ్ళను (teeth), 700 చర్మపు భాగాల్ని, 4,400 తోలు వస్తువుల్ని అమెరికా దిగుమతి చేసుకుంది. అనగా 3,081 హిప్పోల జీవితాలన్న మాట! ఇది ఇలా వుంటే, మా ఆవాసప్రాంతాలు కుంచించుకు పోవడం, వాణిజ్యంగా వాటిని ఉపయోగించడంతో మా జనాభాకు సరిపడడంలేదు. అందుకే, జాంబియా ఆదేశపు లుయాంగ్వా నదిలో మా సంఖ్య పెరిగిందని (వారి లెక్కల ప్రకారం 5 వేల హిప్పోలకు ఆ నది ఆవాసాన్ని కలిగిస్తుంది) అదనంగా 2,200 హిప్పోలకు స్థలం లేదని, సంవత్సరానికి 2000 హిప్పోలను చంపే చట్టాన్ని చేసింది. దీన్ని ఆదేశ జంతు ప్రేమికులు నిరసిస్తున్నారు.


అందుకే మా జనాభా గత 20 సం।।లలో 20 శాతం వరకు తగ్గాయి. ఇప్పుడు మా జనాభా ప్రపంచంలో కేవలం 1,15,000-1,30,000 వరకు మాత్రమే వుంది. అందుకే ఐయుసిఎన్‍ మమ్మల్ని ప్రమాదంలో (endangered) వున్న జంతువుగా రెడ్‍ లిస్టులో చేర్చింది. అమెరికాలోని హ్యూమన్‍ సొసైటి, హ్యూమన్‍ సొసైటీ ఇంటర్నేషనల్‍ సంస్థలు హిప్పోల ఆవాస ప్రాంతాల్ని పర్యావరణ సున్నిత స్థలా(environmentally sensitive area) కింద చేర్చాలని డిమాండ్‍ చేస్తున్నాయి.


అయితే, మా జాతి వుంటేమి, పోతేనేమి అనే భావన వుండవచ్చు. కాని, నేను పర్యావరణ హితకారిణి. నీటిలో దారుల్ని చేయడం, పోషకాల పునరుద్దరణ (fresh water nutrient recycling) చేయడంతో నీటి ఆవాసంగా జీవించే చేపలకు, పక్షులకు ఇతర చిరు జంతువు లకు నేనో కేంద్ర బిందువుని. అనగా మీ మానవులకు ప్రత్యక్షంగా ఆహార కొరత లేకుండా చూసే జంతువునన్న మాట!
ఇలా మమ్మల్ని వేటాడుతూ పోతే, మీ మరణాన్ని మీరే కొని తెచ్చుకున్న వారే కారా?


నేనూ సింహాన్నా…. మరి రాజును కాదే!
పైన ప్రస్తావించినట్లు, నాకు ‘సింహం’ అనే రారాజు పేరును తగిలించారు. కాని, నేను మీ భూచర సింహాన్ని కాదు! నేను స్నేహశీలిని. గాలాపాగోస్‍ (galapagos) దీవులకు డార్విన్‍ మహాశయుడు వచ్చినప్పుడు మాతో సముద్రంలో ఈదాడు. దీన్ని బట్టి మేమెంత స్నేహశీలులమో ఆలోచించండి! అలాగే మేం సింహాంలా ఘర్జించలేము. మాలోని కాలిఫోర్నియా సముద్ర సింహం మాత్రం కుక్కలా అరవగలదు. అతి శీతలాన్ని తట్టుకునే చర్మ సౌందర్యం మాది. ఇదే మా పాలిట శాపంగా మారి మాపై వేటు సాగుతున్నది. మాలాంటి బొచ్చు (fur) గల సమూహం (clade) చాలానే వున్నాయి. ఇందులో కొన్ని ధృవ ప్రాంతాల్లో జీవనయానం సాగిస్తే, మరికొన్ని మహాసముద్రాల తీరాల వెంబటి జీవిస్తాయి.


మా కాళ్ళ వేళ్ళు తెడ్డులా మారి అతికి వుండడంతో మా సమూహాన్ని (pinnipeds) చేప రెక్కల (fin) అని, లాటిన్‍లో తెడ్డులాంటి కాళ్ళ (filpper footed) జంతువులని సంబోధిస్తారు. ఈ సౌకర్యమే నీటిలో వేగంగా ఈదడానికి తోడ్పడుతాయి. అలాగే భూమిపై వడివడిగా నడవడానికి
ఉపయోగపడుతాయి. అందుకే మమ్మల్ని నీటిలో, భూమిపై (semiacquatic) నివసించే జంతువుల కింద చేర్చారు. మేమంతా క్షీరదాలమే గాని ఉభయచరాలం కాము. మా సమూహంలో సుమారు తొమ్మిది జాతులుంటే, మా ప్రజాతిలో నాతోపాటుగా (sea lion) బొచ్చు సీల్సు (fur seals), సాధారణ సీల్స్(seals), వాల్‍రస్‍(walrus)లు ప్రధానమైనవి. మరో ఉప కుటుంబానికి (sub family) చెందిన నీటి కుక్కలు (otters) కూడా మాలాంటి చర్మాన్నే కలిగివుంటాయి.


మా ఈతను, మా సౌందర్యాన్ని చూసి మమ్మల్ని సముద్రపు దేవకన్యలు (angels of the sea) అని మీరు పేరు పెట్టారు. ఇది మాకెంతో సంతోషాన్ని కలిగించే అంశమే! వెడల్పైన చెవులతో, పొడువాటి ముందు కాళ్ళతో, నాలుగు కాళ్ళపై నడవగలిగే సామర్థ్యంతో, మందపాటి జుట్టు (సుమారు 46,500 ప్రతి చ.సెం.మీ.కు.)తో విశాలమైన చాతీతో వుండే మా అయిదు రకాల ప్రజాతులలో (genera), ఒకప్పుడు ఏడు జాతులుగా వుండేవారం. ఇందులో జపనీస్‍ సముద్ర సింహం అంతరించి పోగా, మిగతా ఆరు ప్రపంచ వ్యాపితంగా, ముఖ్యంగా పసిఫిక్‍ మహాసముద్ర తీర ప్రాంతాల్లో కనపడుతాం. ఉత్తర అట్లాంటిక్‍ సముద్ర తీరాల్లో మా ఉనికి లేదు. మా ఈత వేగం గంటకు 30 కీ.మీ. నుంచి 50 కి.మీ. వరకు వుంటుంది.


ప్రస్తుతం ఆస్ట్రేలియా, గాలాపాగోస్‍, న్యూజిలాండు సముద్ర సింహాలు అపాయకర స్థితిలో (endangered) వున్నాయి. దీనికి గల కారణాలు చూడండి ఎంత విషాదకరంగా వుంటాయో? మా మాంసానికి, మానుంచి లభించే విలువైన నూనెకు, కొవ్వుకు (blubber), ఎముకలకు, మీసాలకు(whiskers), తాళ్ళకు (cordages), తెరచాపలకు (baid arkas), అలంకరణ సామాగ్రి వాడుతారు. ఇక మా జీర్ణాశయ పేగుల, కడుపు భాగాల్ని నీటి నిరోధిత (water proof) వస్తువుల, దుస్తుల తయారికి వాడుతారు.


ఇలా మానవుల అవసరాల్ని తీర్చుకోవడానికి, మమ్మల్ని వేటాడి చంపని రోజులేదు. వీటన్నీంటికి తోడు మేం పర్యావరణ రక్షణలో, ఆహారపు గొలుసు నియంత్రణలో విశేషంగా తోడ్పడుతూ వుంటాం. మేం మాంసాహారులు కావడంతో నీటిలో చేపల్ని, కీటకాల్ని నియంత్రించి, ఆహార సమతుల్యతకు దోహదపడుతూ వుంటాం! మాకు మేముగా భారీ తెల్ల షార్క్లకు, తిమింగలాలకు ఆహారంగా కూడా ఉపయోగపడుతాం. చాలామంది మమ్మల్ని సీల్స్గా భావిస్తారు. మాది ఒకే సమూహం అయినా, మాది వేరే జాతి.


ఇంతటి విశిష్టత కలిగిన మా జాతిని, మీ మానవులు స్వార్థానికి బలి తీసుకోని రోజులేదు. దీంతో మా సంఖ్య ప్రపంచ వ్యాపితంగా రోజు రోజుకు తగ్గిపోతూ వున్నది. అమెరికాలో ప్రసిద్ధిగాంచిన కాలిఫోర్నియా సముద్ర సింహాల సంఖ్య కేవలం రెండు లక్షలలోపే!. దక్షిణ అమెరికాలో 2,20,000 మాత్రమే! స్టెల్లర్‍ (steller) సముద్ర సింహాల సంఖ్య కేవలం 80 వేలు కూడా లేము.


IUCN జాబితా ప్రకారం ఆస్ట్రేలియా, గాలాపాగోస్‍, న్యూజీలాండ్‍ జాతులు అపాయకరపు దశలో (endangered) వుండగా, స్టెల్లర్‍ సముద్ర సింహాలు ప్రమాదపుటంచున (near threatened) వున్నట్లుగా గుర్తించింది.


ఇప్పటికైనా మీ స్వార్థచింతన మానుకుంటే, మాకేకాదు, మీకూ క్షేమమని గుర్తించండి! కంటితుడుపు చర్యగా మా జాతిని అపాయకర స్థితిలో వున్న జాతిగా గుర్తించి 1911లో అంతర్జాతీయ బొచ్చు సీల్స్ ఒప్పందం (IFST) కిందికి తీసుకొచ్చారు. వంద సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కాలంతోపాటుగా మా సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. పరిస్థితి ఇలాగే వుంటే ఏకజాతి మానవులుగా భూమిపై మీరెలా మనజాలుతారో ఆలోచించండి!


మాకు దంతాలున్నా… ఏనుగులం కాదు.
దాదాపుగా సముద్ర సింహాల్లా, సీల్స్ల్లా కనపడే మేము వాల్‍రస్‍ (WALRUS)గా పిలవబడుతున్నాం. పాత తరానికి చెందిన మేం, దాదాపు మహా సముద్రాల తీర ప్రాంతాల్లో అగుపిస్తాం. పోతే ఏనుగులా మాకు అడుగున్నర పొడవైన దంతాలు (TUSKS) మా దవడకు ఇరుపక్కల వుంటాయి. ఈ దంతాలు మీటరు వరకు కూడా పెరుగుతాయి. ఏనుగు దంతాలు ముందుకు వంగుతే, మావి వెనక్కి వంగి వుంటాయి.


ఉత్తర ధృవప్రాంతాల్లోని కళ్ళు ఎర్రగా, ఆకర్షణీయంగా వుండే మేము, నీటి తీరాల్లో, భూమిపై సంచరిస్తూ వుంటాం. భారీ శరీరంతో, అతి మందమైన చర్మంతో, తిత్తిలాంటి ఆకృతితో వుంటాం. మా దంతాలు మాకు పిక్‍ ఆక్స్(pickaxe) లా పనిచేసి, ఆహార సేకరణలో తోడ్పడుతాయి. ఇసుకలో మంచులో తవ్వి, లోన దాగి వున్న చిన్నపాటి జీవుల్ని, మొలిస్కా పట్టి తింటాం. పోతే మా దంతాలే మాకు ప్రాణ సంకటం కూడా! ఆహారపు వేటకు ఉపయోగించడంతో అవి రాళ్ళకు, గట్టి మంచుకు తట్టుకోలేవు. తరచూ ఒరిపిడికి గురై చీము పట్టడంతో ఆహారం సేకరించలేక మరణిస్తూ వుంటాం.
అట్లాంటిక్‍, పసిఫిక్‍ వాల్‍రస్‍లుగా మేం కెనడా, గ్రీన్‍లాండ్‍, నార్వే, రష్యా, బ్రిటన్‍ సముద్ర తీరప్రాంతాలో కూడా అగుపిస్తాం. ధృవ ఎలుగుబంట్లు, కిల్లర్‍ తిమింగలాలు మాకు ప్రధాన శతృవులు. ఎక్కువగా మొలస్కా లాంటి జీవుల్ని తిని జీవించే మేము, సహజంగా ఎవరిని ఇబ్బంది పెట్టం. కాని, మా జోలికి వస్తే మాత్రం ఎవరిని విడువం!


అన్ని జంతువులకు మీ మానవులు పేరు పెట్టినట్లే, మాకు డానిష్‍(danish) భాషలో నీటి గుర్రమని, నీటి ఆవు అని పేరు. ఇంత భారీ శరీరం (సుమారు ఒక టన్ను) వున్నా, మంచుపై, నేలపై మేం కుక్కలా పరుగెత్తగలం. మా ఇతర సోదర జాతిలా మా శరీరాన్ని, శరీర భాగాల్ని, అంతర్గత భాగాల్ని, ఎముకల్ని, చర్మాన్ని, మీ మానవజాతి వారి అవసరాలకు, స్వార్థానికి వాడుకుంటున్నారు. ఎస్కీమోలు, మా జీర్నాశయ భాగాలతో డ్రమ్స్ను, వాయిద్యాల్ని చేసుకుంటారు. ఇక దంతాలు సరేసరి! అందుకే మాపై వేట నిరంతరం కొనసాగుతూనే వున్నది.
2022 నాటి గణాంకాల ప్రకారం పసిఫిక్‍ వాల్‍రస్‍ల సంఖ్య సుమారు 2,500గా తేలింది. అట్లాంటిక్‍ వాల్‍రస్‍ల సంఖ్య కేవలం 25 వేల లోపే! ఈ విధంగా 1981 నుంచి 1990 మధ్యకాలంలో పసిఫిక్‍ వాల్‍రస్‍ల సంఖ్య సగానికి సగం పడిపోయింది. అందుకే మా జాతిని కూడా IUCN జాబితాలో, అపాయకర స్థితిలో వున్న జీవిగా గుర్తించారు.


మా సోదరి ఫ్రెయా (Freys)కు మరణదండన!

సుమారు 600 కి.గ్రా. బరువుతో, నార్వే సముద్ర తీర ప్రాంతంలో, ఇతర పశ్చిమ యూరపు దేశాల్లో అగుపించే పిన్న వయస్సు మా సోదరి ఫ్రెయా (నార్వే ప్రభుత్వం పెట్టిన పేరు), మానవులకు అపాయకరమని (నిజానికి మీ మానవులే మాకు అపాయకరం) భావించి నార్వే ప్రభుత్వం చంపమని ఆదేశిస్తే, ఆగస్టు 14, 2022న కాల్చి చంపారు. మీ రక్షణ కోసం, ఇలా మా జాతిని అంత మొందించడం ఎలాంటి న్యాయమో ఆలోచించండి. ఇలా జంతువుల్ని, అమానవీయంగా చంపుతూ, మీరొ క్కరే ఎలా జీవిస్తారో ఒక్కసారైనా ఆలోచిస్తున్నారా…?
మా గూర్చి, మాలాంటి జాతి గూర్చి కొన్ని విషయాల్నే మీ దృష్టికి తెచ్చాం. ఇతర జాతుల గూర్చి, వాటి దుస్థితి గూర్చి ఎంత చెప్పినా తక్కువే! అయినా మానవజాతే అత్యుత్తమ జాతని భావిస్తూ వున్నారు. చివరగా, చిన్న ఆకారంతో, అందంగా అగుపించే నీటి కుక్క (otter) 18వ శతాబ్దంలో ఒక మిలియన్‍ వుండగా, ప్రస్తుతం రెండువేలు కూడా లేకపోవడం గమనార్హం! (వచ్చే సంచికలో మరికొన్ని సముద్ర జంతువుల గూర్చి చూద్దాం!)

  • డా।। లచ్చయ్య గాండ్ల,
    ఎ : 9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *