బాబా – సియాసత్‍ మరికొన్ని అనుబంధాలు

‘‘సియాసత్‍’’ అంటే ఉర్దూలో రాజకీయం అని అర్థం. ఈ అర్థం తెలియని నాటి నుంచే సియాసత్‍తో మాకు చిన్నప్పటి నుంచి ఒక గాఢమైన అనుబంధం. సియాసత్‍.. ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన ఉర్దూ దినపత్రికల్లో ఒకటి. హైదరాబాద్‍ నగరం నుంచి వెలువడే సియాసత్‍ ప్రతీ రోజు మా ఇంట్లో దర్శనం ఇచ్చేది. దాని శీర్షిక మీద అర్ధ చంద్రాకారంలో ఉండే నల్లని గదిలో తెల్లని పావురం బొమ్మ ఆకట్టుకునేది. మా తండ్రి అంబారావు దేశ్‍పాండే ప్రతి రోజు సాయంత్రం సియాసత్‍ను చదవడం ఒక తప్పనిసరి కార్యకలాపం. ఆయన కోసం సియాసత్‍ ఇంటికి వచ్చేది. మా తండ్రి తరం వాళ్ళు అందరు ఉర్దూ మీడియంలోనే చదువుకున్నారు. కాబట్టి బోథ్‍లో చాలా మంది ఇంటికి సియాసత్‍ వచ్చేది. సియాసత్‍తో పాటు ఆంధ్రభూమి తెలుగు దినపత్రిక, దక్కన్‍ క్రానికల్‍ ఇంగ్లీష్‍ దినపత్రిక కూడా ఊరికి వచ్చేది. అయితే అవి ఎవరి ఇళ్లకు వెళ్ళేవో తెలియదు కానీ బోథ్‍ శాఖా గ్రంథాలయంలో మాత్రం కనిపించేవి. అనాటికి.. అంటే 1950, 60, 70వ దశకాల్లో హైదరాబాద్‍ నుండి ఆదిలాబాద్‍ జిల్లాకు రవాణా సౌకర్యాలు, రోడ్లు ఇప్పుడున్నట్టు ఉండేవి కావు. పత్రిక మొదట నిర్మల్‍ వచ్చేది. నిర్మల్‍ నుంచి బోథ్‍కు పత్రిక వచ్చేసరికి సాయంత్రం అయ్యేది.

సియాసత్‍ ఇంటింటికీ పంపిణీ అయ్యేసరికి సాయంత్రం అయ్యేది. కాబట్టి సాయంత్రం బాబా సియాసత్‍ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఆప్పుడప్పుడు వారి ముచ్చట్లలో సియాసత్‍లో అచ్చయిన వార్తలపై మా ఇంటి గద్దెపై చర్చలు జరిగేవి. ఆ చర్చల్లో సియాసత్‍ ఎడిటర్‍ అబిద్‍ అలీ ఖాన్‍ పేరు కూడా వినిపించేది. పిల్లలం మేము పెద్దయ్యే వరకు అంటే.. నేను పదవ తరగతి వచ్చే వరకు సియాసత్‍ మా ఇంటికి వచ్చేది. సియాసత్‍ ఏజెన్సీ, పంపిణీ గురించి శ్యాం దాదా మరికొన్ని సంగతులు గుర్తు చేసినాడు. బోథ్‍ లో సియాసత్‍ పత్రికకు కత్తూరి భాస్కర్‍ సేట్‍ ఏజెంట్‍గా ఉండే వారు. ఆయనకు ఒక మెడికల్‍ షాప్‍ కూడా ఉండేది. ఆ షాప్‍ను ఇప్పుడు వారి పెద్ద కుమారుడు, నా క్లాస్‍మెట్‍ జగదీష్‍ నిర్వహిస్తున్నాడు. వాడికి సియాసత్‍ ఏజెన్సీ ఉందో లేదో తెలియదు. పత్రికను ఇంటింటికీ పంపిణీ చేయడానికి వారి వద్ద సమీ అని ఒకాయన పని చేసేవాడు. అతను ఒక పెద్ద చేతి సంచిలో పేపర్లు పెట్టుకొని కాలినడకన ఇంటింటికీ పంచేవాడు. అందుకే అతను ‘‘పేపర్‍ సమీ’’గా పేరు పొందినాడు.


సియాసత్‍ ఎడిటర్‍ జనాబ్‍ అబిద్‍ అలీ ఖాన్‍ లౌకిక ద•క్పథం కలవాడు. ఆయన అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం (అంజుమన్‍ తరఖి- పసంద్‍ ముసన్నఫీన్‍ ఏ హింద్‍)లో సభ్యుడు. కాబట్టి పత్రికను కూడా ఆ ద•క్పథంలోనే నడిపించాడు. 1949 ఆగస్ట్ 15న తన సహచరుడు మహబూబ్‍ హుస్సేన్‍ జిగర్‍తో కలిసి సియాసత్‍ పత్రికను స్థాపించాడు. లౌకిక ద•క్పథం కలిగిన రచయితలను అబిద్‍ అలీ ఖాన్‍ ప్రోత్సహించేవాడు. ముస్లింలు కానీ,
ఉర్దూ మాత• భాష కానీ ఉర్దూ రచయితలను బాగా ప్రోత్సహించేవాడు. భిన్నాభిప్రాయాలకు చోటు కల్పించేవారు. కాబట్టి సియాసత్‍లో
ఉర్దూ మాత• భాష కాని రచయితలు తమ రచనలను సియాసత్‍కు పంపేవారు. చాలా మంది ముస్లిం కానీ వారు ఉర్దూ రచయిత లుగా గుర్తింపు పొందడానికి సియాసత్‍ దోహదం చేసింది. అట్లా 74 ఏండ్లుగా పత్రిక నిరాఘాటంగా నడుస్తున్నది. 1992లో అబిద్‍ అలీఖాన్‍ గారు మరణించాక ఆయన కుమారుడు జనాబ్‍ జాహెద్‍ అలీఖాన్‍ పత్రిక బాధ్యతలను చేపట్టినాడు. ఆయన కూడా తండ్రి అడుగుజాడల్లో నడిచి సియాసత్‍ ఔన్నత్యాన్ని సమున్నతంగా నిలబెట్టినాడు.


ఇంతకు ముందు చెప్పినట్టు.. సియాసత్‍ పత్రికకు బోథ్‍ నుండి మా కాక వరుస, మా తండ్రి పేరే ఉన్న అంబారావు దేశ్పాండే గారు వ్యాసాలు రాసే వారు. ఆయన వ్యాసాలు వందల సంఖ్యలో సియాసత్‍లో అచ్చు అయినాయి. 2013లో సియాసత్‍లో ఆయన రాసిన వ్యాసాలను కొన్నిటిని ఎంపిక చేసి దిల్లీలో ఉన్న ఎడ్యుకేషన్‍ పబ్లిషింగ్‍ హౌస్‍ వారు ‘‘మేరే తాసురాత్‍ (నా ప్రతిస్పందనలు)’’ శీర్షికతో పుస్తకంగా ప్రచురించారు. ఈ పుస్తకం ప్రచురణ అయిన నాటికి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినారు. ఆయన బతికుండగా ఒక పని మాత్రం జరిగింది. రాష్ట్ర ఉర్దూ అకాడెమీ 2000 సంవత్సరంలో ఉర్దూ రచయితల సంక్షిప్త జీవిత విశేషాలతో, రచయితల ఫోటోలతో ఒక పుస్తకాన్ని ప్రచురించింది. ఆ పుస్తకంలో అంబారావు దేశ్‍పాండే ఉర్దూ రచయితగా నమోదు అయినాడు. అంబారావు దేశ్‍పాండే బోథ్‍ తొలితరం రచయితలలో ఒకరు కావడం బొంతల వాసులమైన మా అందరికీ గర్వకారణం.


ఇక సామల సదాశివ గారు సియాసత్‍ గురించి, అబిద్‍ అలీఖాన్‍ గురించి, జిగర్‍ సాబ్‍ గురించి, సియాసత్‍లో తన రచనల గురించి తన వద్దకు ఆదిలాబాద్‍ వచ్చే అభిమానులకు అనేక ముచ్చట్లు చెప్పేవారు. అవన్ని ఆయన రచనలలో చోటు చేసుకున్నాయి కూడా. సదాశివ గారు తెలుగు, సంస్క•తం, ఉర్దూ, పార్శీ, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్‍ భాషలలో పండితుడు. ఆ భాషలలో చదవడమే కాదు రాయగలడు కూడా. అందుకే ఉర్దూ సాహిత్యం గురించి తెలుగులో, తెలుగు సాహిత్యం, మరాఠీ సాహిత్యం గురించి ఉర్దూలో విస్త•తంగా రాసే వారు. ఆయన ఉర్దూ రచనలకు సియాసత్‍ వేదికగా నిలచేది. అట్లే భారతీయ శాస్త్రీయ సంగీతం విశేషాలను విస్త•తంగా మూడు భాషల్లోనూ రాసినాడు. అవన్నీ ప్రజాదరణ పొందినాయి. పాఠకుల్లో భారతీయ శాస్త్రీయ సంగీతంపై ఆసక్తిని పెంపొందించినాయి. సియాసత్‍ను నిర్వహిస్తున్న అబిద్‍ అలీఖాన్‍, జిగర్‍ సాహెబ్‍ లు ఆయనకు మంచి మిత్రులు. హైదరాబాద్‍ వెళితే వారిద్దరినీ తప్పకుండా కలిసేవారు. అబిద్‍ అలీఖాన్‍ మరణించాక జిగర్‍ సాహెబ్‍ ఉన్నంత వరకు సియాసత్‍కు రచనలు పంపేవాడినని, జిగర్‍ సాహెబ్‍ మరణించినాక సియాసత్‍కు రచనలు పంపడం తగ్గించానని సదాశివ గారు చెప్పేవారు. ఏది ఏమైనా సియాసత్‍ కారణంగా ఉర్దూ పాఠకులకు తెలుగు, మరాఠీ సాహిత్య సౌరభాలు తెలిసి వచ్చాయి. అందుకు రచయితగా సదాశివ గారు, ఆ రచనలకు వేదిక కల్పించిన సియాసత్‍ సంపాదకులు అబిద్‍ అలీ ఖాన్‍, సహ సంపాదకులు జిగర్‍ సాహెబ్‍ల మధ్య బలపడిన స్నేహం, సాహిత్యాభిలాష దోహదం చేసింది.

సియాసత్‍ లో సదాశివ గారు 300 పైగా వ్యాసాలు రాసినట్టుగా తెలుస్తున్నది. అయితే ఆయన పేరు మీద ఉర్దూలో ఏవైనా పుస్తకాలు వెలువడినాయో లేదో తెలియదు. మళ్ళీ బాబా దగ్గరకు వస్తాను. ఆయనకు మేము కూడా ఉర్దూ నేర్చుకోవాలని అభిలాష ఉండేది. అందుకు ఆయన ఉర్దూ వర్ణమాల పుస్తకాలను తెప్పించాడు. అలీఫ్‍, బె, పె.. ఇట్లా ఉర్దూ వర్ణమాలను నేర్చుకున్నాము కూడా. ఆ తర్వాత కొంచెం పెద్దయ్యాక డా. గుండేరావు గారి వద్ద ఉర్దూ నేర్చుకున్న జ్ఞాపకం. ఉర్దూ అక్షరాలను గుర్తు పట్టడం అప్పటికే నేర్చుకొని ఉన్నాను కనుక గుండేరావు గారి వద్ద నేర్చుకున్న ఉర్దూ వలన సియాసత్‍లో శీర్షికలు చదువగలిగే స్థితికి వచ్చాను. ఉర్దూలో నా పేరు కూడా రాసేవాడిని. చిన్న అక్షరాలు మాత్రం చదవడం కష్టంగా ఉండేది. సియాసత్‍లో వచ్చే సినిమా ప్రకటనలు చదివేవాళ్ళం. బోథ్‍ శాఖా గ్రంథాలయంలో తెలుగు, ఇంగ్లీష్‍ పేపర్లు దొరక్కపోతే సియాసత్‍ పట్టుకొని శీర్షికలు చదివే ప్రయత్నం చేసేవాడిని. సినిమాల పేర్లు చదివేవాడిని. అట్లా సియాసత్‍తో నాఉర్దూ భాషా సంబంధం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పుడు కూడా సియాసత్‍ కనబడితే హెడ్‍ లైన్‍ కరెక్ట్గా చదివితే సంత•ప్తి పడతాను. చదువలేకపోతే నిరాశపడను. ఎప్పటికైనా సియాసత్‍ లో హెడ్‍ లైన్స్ మాత్రమే కాదు వార్తలో వాక్యాలు కూడా చదవుతానని అనుకుంటాను. ఎందుకంటే అది నా విరాసత్‍ కాబట్టి.


1981లో హైదరాబాద్‍లో ముఫ్ఫాఖంజా ఇంజనీరింగ్‍ కాలేజీలో చేరాను. బంజారా హిల్స్ రోడ్‍ నంబరు 3లో ఉండేది కాలేజీ. ఇప్పుడు కూడా అక్కడనే ఉన్నది. అది సుల్తాన్‍ ఉల్‍ ఉలూమ్‍ ఎడ్యుకేషన్‍ సొసైటీ వారు ఏర్పాటు చేసిన ముస్లిం మైనారిటీ కాలేజీ కాబట్టి ముస్లిం విద్యార్థులు ఎక్కువగా ఉండేవారు. ఈ కాలేజీలో నాది రెండవ బ్యాచ్‍. నేను చేరినప్పుడు ఉస్మానియా ఇంజనీరింగ్‍ కాలేజీ ప్రిన్సిపల్‍గా పని చేసి రిటైర్‍ అయిన ప్రొ।। అబిద్‍ అలీ ఖాన్‍ గారు కాలేజీ ప్రిన్సిపాల్‍గా ఉండేవారు. క్రమశిక్షణకు మారు పేరు ఆయన. కాలేజీలో నా సహ విద్యార్థులతో ఉర్దూలోనే మాటలు సాగేవి. వారిలో తెలుగు మాట్లాడేవారు, తెలుగు చదివే వారు తక్కువే. అబ్దుల్‍ రాఫె ఒక్కడే తెలుగు మీడియంలో చదివిన వాడు మా క్లాస్‍లో ఉండేవాడు. మధ్యాహ్నం లంచ్‍ తర్వాత, క్లాసులు లేకపోతే కాలేజీ లైబ్రరీలో గడిపేవాడిని. అక్కడ మళ్ళీ సియాసత్‍ తారసపడేది. నేను చేతుల్లోకి తీసుకొని చదువుతుంటే నా ముస్లిం దోస్తులు ‘‘తెరెకో ఉర్దూ పఢ్‍ నే ఆతా క్యారె’’ అని ఎగతాళిగా అడిగితే గల్లా ఎగిరేసి సినిమా పేర్లను చదివి వినిపించేవాడిని. అప్పటికి వారికి నమ్మకం కుదరలేదు. సినిమా బొమ్మ చూసి ఊహించి చదువుతున్నానని వారి అనుమానం. మొదటి పేజీలో శీర్షిక చదివితే చూపిస్తే అప్పుడు వీడికి నిజంగానే ఉర్దూ వచ్చునని నమ్మినారు. కాలేజీలో మనకు కొంత ఫేస్‍ వ్యాల్యూ కూడా పెరిగింది. వారితో మంచి స్నేహం పెరిగింది. ఆ స్నేహం ఇప్పటికీ కొనసాగుతున్నది. నాతో పాటు నా కాలేజీ మిత్రులు మహబూబ్‍ హుసేన్‍, రియాజ్‍ హైదర్‍, బాబా షర్ఫుద్దిన్‍, సిద్ధిఖీ, నా సీనియర్‍ సాజిద్‍ తదితరులు సాగునీటి శాఖలో ఇంజనీర్లుగా చేరారు. సియాసత్‍ మీద, ఉర్దూ భాష మీద నా వ్యామోహం ఇంకా కూడా కొనసాగుతున్నది.


సియాసత్‍ కార్యాలయానికి వెళ్ళి జాహెద్‍ అలీ ఖాన్‍ గారిని కలిసే అవసరం ఒకసారి ఏర్పడింది. 2013లో నవాబ్‍ అలీ నవాజ్‍ జంగ్‍ బహాదూర్‍ జీవిత చరిత్ర రాసే సమయంలో సియాసత్‍లో ఆయన గురించి మంచి సమాచారం లభిస్తుందని మిత్రులు చెపితే నేను, నా సహచర ఇంజనీర్‍ సల్లా విజయ్‍ కుమార్‍ అబిడ్స్లో ఉన్న సియాసత్‍ ఆఫీసుకు వెళ్ళి జాహెద్‍ అలీ ఖాన్‍ గారిని కలిశాను. ఆయన నా పేరు చూసి అంబారావు దేశ్‍పాండే మీకు తెలుసా అని అడిగాడు. ఆయన నాకు చాచా లాంటి దగ్గర బంధుత్వం ఉందని తెలిసి చాలా ఆప్యాయంగా నాకు చాతనైనంత సహాయం చేసి పంపించాడు. పత్రికలో అ రోజుల్లోనే బ్యూరో చీఫ్‍గా పని చేస్తున్న రశీదుద్దీన్‍ ఖాన్‍ గారు పరిచయం అయినారు. ఆయనతో పరిచయం తర్వాతి రోజుల్లో స్నేహంగా మారింది. 2014లో హరీష్‍ రావు సాగునీటి మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేను ఒఎస్‍డిగా ఆయన పేషీలో చేరాను. అదే సమయంలో ఉర్దూ అకాడెమీ ద్వారా ఉర్దూ అనువాదకుల నియామకాలు జరిగాయి. మా పేషీకి కూడా సాజిదా అనే మహిళకు పోస్టింగ్‍ ఇచ్చారు. సాగునీటి రంగంలో జరుగుతున్న అభివ•ద్దిపై వార్తలను ఆమె అనువాదం చేసేది. అన్ని ఉర్దూ పత్రికలకు వార్తలు పంపినా కూడా సియాసత్‍ లోనే అనేక వార్తలు ప్రచురితం అయ్యేవి. ఫోటోలు అచ్చు అయ్యేవి. వాటిని చదివి నా కాలేజీ మిత్రులు పత్రిక క్లిప్పింగ్స్ పంపించేవారు. తెలుగులో అచ్చు అయిన నా వ్యాసాలను కూడా నా పేరు మీదనే అనువాదం చేసి ప్రచురించేవాడు రషీద్‍ గారు. అట్లా ఉర్దూ రాకపోయినా నన్ను సియాసత్‍ రచయితగా మార్చినాడు. థ్యాంక్స్ సియాసత్‍.


ఇక ఏప్రిల్‍ 2024లో నా పదవీ విరమణ తర్వాత ఉర్దూ, మరాఠీ భాషలను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను. కాలం, ఆరోగ్యం సహకరిస్తుందనే అనుకుంటున్నాను. ఉర్దూ నా తండ్రి భాష, మరాఠీ నా తల్లి భాష. వీటిని నేర్చుకోవడం పెద్ద కష్టమైన పని ఏమి కాదని నాకు తెలుసు. సియాసత్‍ను మళ్ళీ మా ఇంటికి తెప్పించుకుంటానన్న నమ్మకం నాకు ఉన్నది. 25 డిసెంబర్‍ మా తండ్రి అంబారావు దేశ్‍పాండే వర్ధంతి సందర్భంగా ఈ జ్ఞాపకాలు.

  • శ్రీధర్‍రావ్‍ దేశ్‍పాండే,
    ఎ : 94910 60585

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *