పిల్లలే నయం


‘‘గొప్ప ఉపన్యాసం చేయలేని పని ఓ చిన్న కథ చేస్తుంది.’’
నేను ఉంటున్న గేటెడ్‍ కమ్యూనిటీలో ఓ సంవత్సరం క్రితం ఓ సంఘటన జరిగింది. ఓ ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ కొట్టుకున్నారు. ఆది చిలికి చిలికి గాలివానగా మారింది. ఆ తరువాత పెద్దవాళ్ల జోక్యం మొదలైంది. కమ్యూనిటీలో ఓ వాట్సప్‍ గ్రూప్‍ ఉంది. అందులో నేను కూడా ఓ సభ్యుడినే. ఆ గ్రూపు నిండా ఆ గొడవకి సంబందించిన చర్చలే చర్చలు. చివరికి తిట్టుకునే స్థాయికి చేరుకుంది. ఇరు పక్షాలను శాంత పరచడానికి కొంతమంది ఆ గ్రూపులోనే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. ఆ చర్చలు అలాగే కొనసాగాయి. చూసి చూసి విసుగెత్తి నేను ఓ చిన్న కథని పోస్ట్ చేశాను. అది లియో టాల్‍ స్టాయి రాసిన కథ ‘‘పెద్దల కన్నా పిల్లలు తెలివిగలవాళ్ళు’’ అన్న కథ. ఆ కథని పోస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపటికి అందరూ శాంతించారు. చర్చలు ఆగిపోయాయి. ఆలోచనల్లో పడ్డామని ఆ తరువాత వాళ్ళే చెప్పారు.


ఆత్మాభిమానం, అహంకారం లేని మనుషులు ఎవరూ ఉండరు. అయితే అవి తగుమోతాదులో ఉండాలి. తక్కువ ఉన్నా మంచిది కాదు ఎక్కువ ఉంటే చాలా కష్టం. భరించలేము. అవి మన తల మీద వెంట్రుకల లాంటిది. మన వేళ్ళ మీద ఉన్న గొర్ల లాంటివి కూడా. అవి అసలే ఉండకూడదని అనలేము. అలాగే పెంచితే చూడలేము. కష్టం కూడా కలిగిస్తాయి.
అందుకని వెంట్రుకలుని మనం కత్తిరిస్తాం. గొర్లని కూడా తీసేస్తాం.
ఈగోకి పర్యాయ పదాలు అయిన ఆత్మ అభిమానం అహంకారం లాంటివి మన తల వెంట్రుకలు, గోర్ల లాంటివే. వాటిని మనమే నియంత్రించాల్సి ఉంటుంది. మరో విధంగా చెప్పాలంటే అవి ఎక్కువ పెరగకుండా వాటిని కత్తిరిస్తూ ఉండాలి.
అభిమానాన్ని అహంకారాన్ని చంపివేయకూడదు. వాటిని కూడా తగు మోతాదులో ఉంచాలి. పెరగకుండా చూడాలి. వాటిపై విజయం సాధించాలి. ఇప్పుడే మనం ఆనందంగా ఉంటాం.


చిన్నపిల్లల్లో ఇవి ఉండవు. మరో విధంగా చెప్పాలంటే చాల తక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని టాల్‍ స్టాయి ‘‘పెద్దల కన్నా పిల్లలు తెలివిగలవాళ్ళు’’ అన్న కథలో చాలా సున్నితంగా మనసుని తాకే విధంగా చెప్పారు.
లియో టాల్‍ స్టాయ్‍ గొప్ప రచయిత. అతను రష్యన్‍ దేశస్తుడైనా ప్రపంచానికంతటికీ చెందిన వ్యక్తి. ఎన్నో గొప్ప కథలని అతను రాశాడు. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పెద్ద కథలను ఎంత ఎక్కువగా రాశారో అదేవిధంగా చిన్న కథలను కూడా అంత ఎక్కువగా రాశారు.
ఇక కథలోకి ప్రవేశిద్దాం.
అది వర్షాకాలం. రష్యా దేశం లోని ఓ గ్రామం. బాగా కురిసిన వర్షానికి వర్షం నీరు రోడ్డుమీద వరదలుగా పారుతూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత వర్షం తెరిపి ఇచ్చింది. కానీ ఇంకా ఆ వర్షపు ఛాయలు పోలేదు.
అవి ఈస్టర్‍ పండుగ రోజులు. ఇద్దరు పిల్లలు కొత్త దుస్తులు వేసుకుని ఆ వీధిలోని వర్షం నీరు దగ్గర ఆడుతూ ఉంటారు. ఇద్దరివీ కొత్త దుస్తులే. ఆ ఇద్దరిలో మలాషా చిన్నది అకుల్యా పెద్దది.


మలాషా ఆ వర్షపు నీరులో ఎగిరి గంతేసింది. అందులో బురద కూడా ఉంది. ఆమె ఎగరడం వల్ల ఆ గుంటలోని బురద ఎగిరి అకుల్యా దుస్తుల మీద పడింది. ఆ బురదని తుడిచి వేయడానికి ఆ అమ్మాయి ప్రయత్నం చేసింది. దానివల్ల ఆమె గౌను పూర్తిగా పాడైపోయింది. బురదమయం అయిపోయింది.
సరిగ్గా ఆ సమయంలోనే ఆకుల్యా తల్లి అక్కడికి వచ్చింది. తన కూతురు గౌను వైపు చూసింది. అది పూర్తిగా పాడైపోయిన విషయాన్ని గమనించింది. అకుల్యాని తిట్టింది.
‘‘ఎట్లా నీ గౌనుని పాడు చేసుకున్నావు.?’’ మందలింపుగా అడిగింది ఆకుల్యా తల్లి.
ఆకుల్యా భయపడింది. తల్లి కొడుతుందేమోనని అనుకుంది.
‘‘మలాషా ఆ బురద నీటిలో ఎగరడం వల్ల ఆ బురద
నీళ్ళు నా మీద పడ్డాయి. వాటిని తుడిచే ప్రయత్నంలో గౌన్‍ అంతా బురదమయం అయ్యింది.’’ తల్లికి జరిగిన విషయం చెప్పింది అకుల్యా.
తన కూతురు కొత్త బట్టలను మలషా ఖరాబు చేసిందని తెలిసి అకుల్య తల్లి మలాషాని పట్టుకుంది.
ఆమె పిర్రల మీద రెండు దెబ్బలు కూడా వేసింది. ఆ దెబ్బలకి ఆమె కోపానికి మలషా భయపడిపోయి ఏడుపు లంకించుకుంది. మలాషా ఇల్లు అక్కడికి దగ్గరే. ఆమె ఏడుపు ఆమె తల్లికి వినిపించింది. ఆమె ఒక్కసారిగా పరుగెత్తుకొని అక్కడికి వచ్చింది.


‘‘ఎందుకు ఏడుస్తున్నావు..?’’ అని మలాషాని అడిగింది.
‘‘ఆమె నన్ను కొట్టింది’’ అని చెబుతూ అకుల్యా తల్లిని చూపించింది తన తల్లికి మలాషా.
దాంతో మలాషా తల్లికి పట్టలేని కోపం వచ్చింది. ఆమెను తిట్టింది. ఇద్దరూ తిట్టుకోవడం ప్రారంభించారు. అది కాస్త చిన్న కొట్లాటగా మారింది. వాళ్ల అరుపులతో ఆ వీధి దద్దరిల్లింది.
ఆ వీధిలోని ఆడవాళ్ళు ఒక్కొక్కరు అక్కడికి రావడం ప్రారంభించారు. వచ్చిన వాళ్ళకి జరిగిన విషయాన్ని వాళ్ళ ధోరణిలో వాళ్ళు వివరిస్తూ వాళ్ళు అరుచుకోవడం కొనసాగించారు. అలా వచ్చిన వ్యక్తులు కొంతమంది అకుల్యా తల్లి వైపు, మరి కొంతమంది మలాషా తల్లి వైపు చేరి అరుచుకోవడం కొనసాగించారు. కొద్దిసేపటికి ఆ కొట్లాట వీధి పోరాటం లాగా పరిణమించింది. మగవాళ్ళు కూడా అక్కడికి రావడం మొదలుపెట్టారు.
దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న అకుల్యా నానమ్మ ఇంటి నుంచి బయటకు వచ్చింది.
‘‘పండుగ రోజుల్లో ఎవరు ఇట్లా గొడవ పడకూడదు గొడవ పడకండి’’ అని అంటూ అందరిని వారించే ప్రయత్నం చేసింది.
ఆమె చెప్పే మాటలని ఎవరూ వినిపించుకోలేదు. ఆ ప్రయత్నమూ చేయలేదు. ఆమెను ఆమె మాటలను ఎవరూ లక్ష్య పెట్టలేదు.
ఈ గొడవ ఇలా జరుగుతూ ఉండగానే అకుల్యా, మలషా అక్కడి నుంచి దూరంగా నడిచారు. వాళ్లిద్దరూ మళ్లీ స్నేహితులై పోయారు. వాళ్ల దగ్గర ఉన్న కాగితాలతో కాగితపు పడవలు చేసి వర్షపు నీటిలో వేయడం మొదలుపెట్టారు. ఆ వర్షపు నీటి ప్రవాహానికి అవి కదులుతూ ఉంటే ఇద్దరూ కేరింతలు వేస్తూ ఆడుకోవడం మొదలు పెట్టారు.


అకుల్యా వాళ్ళ నానమ్మ ఆ ఇద్దరు పిల్లలు ఆడుకోవడాన్ని గమనించింది. కొట్లాడుతున్న ఆ గుంపును గట్టిగా మందలించింది.
‘‘మీకేమైనా బుద్ధి ఉందా.? జ్ఞానం ఉందా.? పిల్లల వైపు చూడండి వాళ్ళు ఆ గొడవని ఎప్పుడో మర్చిపోయారు. తిరిగి స్నేహితులై పోయినారు. పెద్దవాళ్ళై ఉండి, చెప్పినా వినకుండా కొట్లాడు కుంటున్నారు. ఇంత చిన్న గొడవని పెద్దగా చేస్తూ తిట్టుకుంటున్నారు. మీకు సిగ్గుగా లేదా..? అరిచింది పెద్ద గొంతుతో ఆమె.


అ అరుపుతో అక్కడ గుమికూడిన స్త్రీలూ, పురుషులు అరుపులు మాని ఒక్కసారి పిల్లల వైపు చూశారు.
పిల్లలు నిష్కల్మషంగా ఆడుకుంటూ కనిపించారు. వాళ్ళందరూ సిగ్గు పడ్డారు. ఎవరికి వారే అక్కడి నుంచి కదిలి తమ ఇళ్లల్లోకి వెళ్ళిపోయారు. కాస్సేపటికి అక్కడ ప్రశాంత వాతావరణం ఏర్పడింది.


ఇది టాల్‍ స్టాయి రాసిన చిన్న కథ. కథ చిన్నదే కానీ అర్థవంతమైన కథ. ప్రతి విషయాన్ని పిల్లలు త్వరగా మర్చిపోతారు. అదే విధంగా త్వరగా క్షమిస్తారు. పెద్దవాళ్లు అలా ఉండరు దానికి కారణం వాళ్లలో ఉన్న ‘‘ఈగో’’. అది ఆత్మాభిమానం కావచ్చు అహంకారం కావచ్చు.
వీటిని తగ్గించుకోవడానికి పిల్లలే అవసరం లేదు ఈ స•ష్టిలోని ఏ జంతువుని చూసినా చాలు. వాటి నుంచి ఎన్నయినా మనం నేర్చుకోవచ్చు.
పదిమంది చేయలేని పని ఓ చిన్న కథ చేసింది. మా కమ్యూనిటి సంఘటనే ఓ ఉదాహరణ.


మంగారి రాజేందర్‍ (జింబో)
ఎ : 944048300
1

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *