వ్యాక్సిన్‍ సాంకేతికతలో సాటిలేని దిగ్గజం…!! ఏ ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్‍ టెక్నాలజీ


(2023వ సంవత్సరానికి ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్‍ సాంకేతికతపై పరిశోధనకు గానూ
ఫిజియాలజి (మెడిసిన్‍) విభాగంలో నోబెల్‍ బహుమతి వచ్చిన సందర్భంగా…)

(గత సంచిక తరువాయి)


ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్లు – ప్రయోజనాలు :

 • ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్లను సులభంగా, వేగంగా తయారు చేయవచ్చు.
 • ఎంఆర్‍ఎన్‍ఏ పరిజ్ఞానంతో కొత్తరకం వైరస్‍లకు టీకాలను రూపొందించడమే గాకుండా, తరచూ మారిపోయే సార్స్ (SARS), కోవిడ్‍, ఇన్‍ప్లూయెంజా వంటి వైరస్‍లను ఎదుర్కొనే టీకాలను అతి త్వరగా పునరుద్దరించవచ్చు.
 • మానవాళికి సవాల్‍గా నిలుస్తున్న జబ్బులకూ ఎంఆర్‍ఎన్‍ఏ పరిజ్ఞానం పరిష్కారం చూపనుంది. ఉదా।।కు కొరుకుడుపడని సైటో మెగాలో వైరస్‍. ఇది 5 ప్రొటీన్ల సహాయంతో మనిషి కణాల్లోకి ప్రవేశిస్తుంది, బయటకు వస్తుంది. అందువల్ల ప్రొటీన్‍ అధారిత టీకాలకు వ్యాధి కారకాన్ని గుర్తించడం కష్టమైన పని.
 • ఎంఆర్‍ఎన్‍ఏ పరిజ్ఞానానికి ఇది చాలా తేలిక. కణాలు 5 ప్రొటీన్లను ఉత్పత్తి చేసేలా జన్యు సూచనలు ఇవ్వగలదు. సైటో మెగాలో వైరస్‍ ఎంఆర్‍ఎన్‍ఏ టీకా మీద 3వ దశ ప్రయోగాలు జరుగుతున్నాయి.
 • ఎంఆర్‍ఎన్‍ఏ పరిజ్ఞానంతో క్యాన్సర్‍ టీకాలు కూడా తయారు చేయవచ్చు. నిజానికి క్యాన్సర్‍ను అడ్డుకోవడం చాలా కష్టం. క్యాన్సర్‍ కణాలు అతివేగంగా పెరుగుతాయి. మందుల ప్రభావాన్ని బలహీన పరుస్తాయి. ఇక్కడే ఎంఆర్‍ఎన్‍ఏ పరిజ్ఞానం ఆశాకిరణంగా కనిపిస్తోంది. దీని సహాయంతో కణితుల మీదుండే బోలెడన్ని యాంటిజెన్ల మీద ఒకేసారి దాడి చేసేలా టీకాలను రూపొందించవచ్చు.
 • ఎంఆర్‍ఎన్‍ఏ పరిజ్ఞానాన్ని జన్యు సవరణ చికిత్సలకూ వినియోగించవచ్చు. ఎంఆర్‍ఎన్‍ఏ పరిజ్ఞానంతో పుట్టుకొచ్చిన ఎంజైమ్‍లు పని పూర్తయ్యాక వెంటనే కనుమరుగౌతాయి. అరుదైన జన్యుసమస్యల చికిత్సకు ఇదెంతో మేలు చేస్తుంది. ఎంత వరకు జన్యుసవరణ అవసరమో అంతవరకే చేస్తుంది. ఇలా అవాంఛిత సవరణలను తప్పించవచ్చు.
 • క్యాపస్టన్‍ థెరపెటిక్స్ ఎంటి సంస్థలు మరో అడుగు ముందుకేసి ఎంఆర్‍ఎన్‍ఏ సాయంతో ఇంకాస్త బలంగా జబ్బులతో పోరాడేలా రోగనిరోధక కణాలకు శక్తిని సంతరింపచేయాలని చూస్తున్నాయి.
 • శరీరంలో ఆయా భాగాల్లో మాత్రమే పనిచేసేలా కూడా ఎంఆర్‍ఎన్‍ఏ పరిజ్ఞానం రూపుదిద్దుకుంటోంది.


పరిమితులు :

 • ఎంఆర్‍ఎన్‍ఏ అణువులు త్వరగా క్షీణిస్తాయి. అందువల్ల వీటిని -90 నుండి -50 డిగ్రీల సెల్షియస్‍ ఉష్ణోగ్రత వద్ద నిల్వచేస్తారు.
 • మనుషుల్లో కొంతమంది యొక్క రోగనిరోధక వ్యవస్థ వ్యాధికారక జీవులపై కాకుండా, శరీరంలోని ఆరోగ్యకరమైన కణజాలాలపై దాడిచేసి వాటిని నాశనం చేస్తుంది. దీనినే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్‍ అంటారు. ఇలాంటి ఆటోఇమ్యూన్‍ డిజార్డర్‍ ఉన్న వ్యక్తులపై ఎంఆర్‍ఎన్‍ వ్యాక్సిన్స్ ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి.
 • ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్స్ అనేవి మానవాళికి కొత్తగా పరిచయం చేయబడ్డాయి. 2020వ సం।।రానికి ముందు వాటిని మానవాళిపై వినియోగించడానికి అనుమతి ఇవ్వలేదు. కాబట్టి ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్ల వల్ల తెలియని స్వల్ప మరియు దీర్ఘకాలిక దుష్ప్రభావాలు తలెత్తవచ్చు.


వ్యాక్సిన్లు – రకాలు


i) లైవ్‍ అటెన్యుయేటెడ్‍ వ్యాక్సిన్లు :
ఇందులో క్రియారహితం చేయబడిన వ్యాధి కారక జీవిని
ఉపయోగిస్తారు. ప్రత్యక్షంగా వ్యాధి కారక జీవినే ఉపయోగించడం వల్ల ఇవి చక్కటి పనితీరును ప్రదర్శిస్తాయి. బలహీన రోగ నిరోధకశక్తి కల్గి ఉన్న వారిలో, కీమోథెరపీ చికిత్స తీసుకునే వారిలో ఈ వ్యాక్సిన్లు ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. ఉదా।। చికెన్స్ పాక్స్, ప్లూ, ఎంఎంఆర్‍ వ్యాక్సిన్లు
ii) ఇన్‍ యాక్టివేటెడ్‍ వ్యాక్సిన్లు :
ఈ రకమైన వ్యాక్సిన్లలో వ్యాధికారిక జీవిని పూర్తిగా నిర్వీర్యం చేసి వినియోగిస్తారు. శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ వ్యాక్సిన్‍ రోగనిరోధక వ్యవస్థ యొక్క ప్రతిస్పందనలను మెరుగుపరుస్తుంది. ఉదా।। హెపటైటిస్‍, ఇన్‍ ప్లూయెంజా, పోలియో, రేబీస్‍ వ్యాక్సిన్లు.
iii) సబ్‍-యూనిట్‍ వ్యాక్సిన్లు : ఈ రకమైన వ్యాక్సిన్లు పూర్తి వ్యాధి కారక జీవిని కాకుండా, వ్యాధికారక జీవి నుండి కొంత భాగాన్ని మాత్రమే తీసుకొని వ్యాక్సిన్‍గా వాడతారు. ఉదా।। డీపీటీ వ్యాక్సిన్‍
iv) టాక్సాయిడ్‍ వ్యాక్సిన్లు : ఈ రకమైన వ్యాక్సిన్లలో బ్యాక్టీరియా మరియు వైరస్‍లు ఉత్పత్తి చేసిన విషపూరిత పదార్థాలను క్రియారహితం చేసి వ్యాక్సిన్‍గా వాడతారు. ఉదా।। డీపీటీ వ్యాక్సిన్‍
v) కంజుగేట్‍ వ్యాక్సిన్లు: బ్యాక్టీరియా యొక్క పూతలో పాలిశాకరైడ్స్ అని పిలవబడే కొంత భాగాన్ని వ్యాక్సిన్‍గా వినియోగిస్తారు. ఉదా।। హెపటైటిస్‍బి, న్యుమోకోకల్‍ మరియు మెనింగో కోకిల్‍ వ్యాక్సిన్లు.


కోవిడ్‍-19 వ్యాక్సిన్లు – రకాలు


i) పూర్తి వైరస్‍ వ్యాక్సిన్‍ (Whole Virus Vaccine) :
లైవ్‍ అటెన్యుయేటెడ్‍, ఇన్‍ యాక్టివేటెడ్‍ వ్యాక్సిన్లు ఈ రకం కిందికి వస్తాయి. వీటికి సాంప్రదాయ నిల్వ పరిస్థితులు మాత్రమే అవసరం. ఉదా।। కోవాగ్జిన్‍ (భారత్‍ బయోటెక్‍) ఇది ఇన్‍ యాక్టివేటెడ్‍ రకానికి చెందినది.
ii) ప్రొటీన్‍ – సబ్‍ యూనిట్‍ వ్యాక్సిన్‍ :
ఈ రకానికి చెందిన వ్యాక్సిన్లలో పూర్తి వ్యాధి కారక జీవిని కాకుండా, ఆ వ్యాధికారక జీవి యొక్క ప్రొటీన్లను వినియోగిస్తారు. ఇది రోగనిరోధక వ్యవస్థ యొక్క ప్రతిస్పందనలను మెరుగు పరుస్తుంది. వీటి ఉత్పత్తి ఖర్చుతో కూడినది. భవిష్యత్‍లో బూస్టర్‍ డోసుల అవసరం కావచ్చు. ఉదా।। నోవావాక్స్ (Nova Vax) (విదేశాలు), కోవావాక్స్ (Covovax) అనే పేరుతో ఇండియాలో సీరం ఇన్సిస్టిట్యూట్‍ ఆఫ్‍ ఇండియా – పూణే దీనిని ఉత్పత్తి చేస్తోంది.
iii) ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్లు :
వీటిలో వ్యాధికారక జీవి యొక్క ఎంఆర్‍ఎన్‍ఏ జన్యు క్రమాన్ని వ్యాక్సిన్‍గా వాడతారు. ఇది శరీరంలోకి వెళ్ళిన వ్యాధికారక జీవి యొక్క ప్రొటీన్లను తయారు చేస్తుంది. వీటిని వెలుపలి నుండి వచ్చిన హానికారక ఏజెంట్‍గా గుర్తించి మన శరీరంలోని లింఫోసైట్లు (బీసెల్స్, టీసెల్స్) వీటిని ఎదుర్కొనేందుకు యాంటీ బాడీలను తయారు చేస్తాయి. ఉదా।। ఫైజర్‍ (బయోఎన్‍టెక్‍, జర్మనీ), స్పైక్‍వాక్స్ (మెడెర్నా-అమెరికా)
iv) వైరల్‍ వెక్టర్‍ వ్యాక్సిన్లు :
వ్యాధికారక జీవి యొక్క జన్యుక్రమాన్ని మానవ శరీరంలోకి ప్రవేశపెట్టడానికి ఎడినో వైరస్‍ లాంటి హాని చేయని వైరస్‍లను ఇందులో వాహకాలుగా వినియోగిస్తారు. ఉదా।। కోవిషీల్డ్ (సీరం ఇన్సిస్టిట్యూట్‍ ఆఫ్‍ ఇండియా), స్పుత్నిక్‍-వి (రష్యా).


ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో కాటలిన్‍ కరికో, డ్రూ వెయిస్‍ మన్‍ల కృషి ఏమిటి!?


ఎంఆర్‍ఎన్‍ఏ పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యాక్సిన్‍లను తయారు చేసేటపుడు క్వాటలిన్‍ కరికో, డ్యూ వైజ్‍మెన్‍లకు కొన్ని సవాళ్ళు ఎదురయ్యాయి. వీరు ప్రయోగశాలలో డీఎన్‍ఏనుండి ఎంఆర్‍ఎన్‍ఏ తయారుచేసి, దానిని మానవ శరీరంలోకి పంపించినపుడు, మానవ శరీరం ఆ ఎంఆర్‍ఎన్‍ఏను లోపలికి తీసుకోకుండా తిరస్కరించింది. ఈ ఎంఆర్‍ఎన్‍ఏను బయటి నుండి వచ్చిన వ్యాధికారక ఏజెంట్‍గా గుర్తించి, మానవ శరీరం ఇన్‍ఫ్లమేటరీ లక్షణాలను ప్రదర్శింది. క్షీరదాలలోని డీఎన్‍ఏ నుండి ఏర్పడే ఆర్‍ఎన్‍ఏ తరచుగా రసాయనిక మార్పులు చెందుతుందని వీరిరువురు గ్రహించారు. ప్రయోగశాలలో తయారుచేసే ఎంఆర్‍ఎన్‍ఏలో ఇలా రసాయనిక మార్పులు జరగడం లేదని వీరు గమనించి, ఎంఆర్‍ఎన్‍ఏ న్యూక్లియోసైడ్‍ బేస్‍లలో రసాయనిక మార్పులు చేయడం ద్వారా, విభిన్నరకాల ఎంఆర్‍ఎన్‍ఏ వేరియంట్లను తయారు చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలో ఎంఆర్‍ఎన్‍ఏలోని యూరిడిన్‍ (Uridine) అనే బేస్‍ని తొలగించి, దాని స్థానంలో సూడో యూరిడిన్‍ (Seudo Uridine) అనే బేస్‍ని చేర్చడం జరిగింది. ఈరకమైన మార్పులు చేసిన ఎంఆర్‍ఎన్‍ఏని మానవ శరీరంలోకి పంపించినపుడు, ఆశ్చర్యకరంగా మానవశరీరం దానిని శరీరంలోకి ప్రవేశించేందుకు అనుమతించింది. ఇన్‍ఫ్లమేటరీ లక్షణాలను ప్రదర్శించడం కూడా ఆపేసింది. దీనిపై వీరు 2005లో ఒక పరిశోధన పత్రం సమర్పించారు. వీరి పరిశోధన వల్ల ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్లను వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. కోవిడ్‍-19 నుండి కోట్లాది మంది ప్రాణాలను కాపాడడంలో వీరి పరిశోధనలు కీలకపాత్ర పోషించాయని నోబెల్‍ కమిటీ ప్రశంసించింది.


చివరగా : ప్రగతిపథంలో మానవాళి ఎంతవేగంగా ముందుకు వెళుతున్నప్పటికీ, అదే వేగంతో విభిన్న రకాల వింత వ్యాధులు వారిని చుట్టుముట్టి, ముప్పేటా దాడిచేస్తున్నాయి. సార్స్, జికా, నిఫా, మంకీపాక్స్, కోవిడ్‍ లాంటి వింత వ్యాధులు, క్యాన్సర్‍ లాంటి మొండి వ్యాధులు మానవాళిని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్‍ సాంకేతికత కనుగొనబడడం, మానవాళికి తమ భవిష్యత్‍పై సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది. మొడెర్నా కంపెనీ ఇప్పటికే మంకీపాక్స్, జికా, నిఫా వైరస్‍ల మీద ఎంఆర్‍ఎన్‍ఏ ఆధారిత టీకా ప్రయోగాలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. క్యాన్సర్‍ వ్యాధికి కూడా ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్‍లు అందుబాటులోకి రానున్నాయని, అవి ప్రస్తుతం క్యాన్సర్‍ చికిత్సకు వినియోగిస్తున్న కీమోథెరపీ కన్నా సమర్థవంతంగా పనిచేస్తాయన్న సమాచారం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ దిశగా శాస్త్రవేత్తల కృషి ఫలించాలని మనం కూడా ఆశిద్దాం.


-పుట్టా పెద్ద ఓబులేసు,
స్కూల్‍ అసిస్టెంట్‍, జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల

రావులకొలను, సింహాద్రిపురం, కడప
ఎ : 9550290047

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *