తడి చెత్త – పొడి చెత్త : పర్యావరణ న్యాయం

మనం పలు సందర్భాలలో సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉంటాం. వివక్షల గురించి గొంతెత్తుతూ ఉంటాం. సామాజిక రుగ్మతల గురించి వాటిని నివారించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటాం. పలు సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటాం. ఏ ఒక్క సదర్భంలోనూ మనకు పర్యావరణ న్యాయం గురించి గుర్తుకు రాదు. అసలు అటువంటిది ఒకటుందనే విషయం కూడా స్ఫురించదు. ఎవరి రాజకీయ దృక్పథాలు ఏవైనప్పటికి, భిన్న సామాజిక సమూహాలు ఏ రాజకీయ లక్ష్య ప్రయోజనాలు ఆశిస్తూ ఉన్నప్పటికీ అందరమూ ఆలోచించవలసిన అవసరం పర్యావరణ న్యాయం విషయంగా ఉంది. ఇదొక ఉమ్మడి అంశం. ఇదొక సమష్టి లక్ష్యాన్ని నెరవేరుస్తుంది. పర్యావరణ న్యాయం విషయంగా మనం వివక్షా పూరితంగా ఉన్నామనిగానీ, పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నామని గానీ మన గుర్తింపులో ఉండదు. ఎందుచేతనంటే పర్యావరణం, పర్యావరణ చైతన్యం అనేది మన సమాజంలో బలంగా పాదుకోలేదు.


మన ఇళ్ల నుంచి రోజుకు ఎంత చెత్త వీధుల్లో పోగు పడుతూ ఉన్నదో కనీసంగా కూడా తెలియదు. గోడల మీదనుంచి చెత్తను కాలవల్లోకి పారబొయ్యటానికి అలవాటుపడ్డాం. లేదా వీధుల చివర మున్సిపాలిటీయో, కార్పొరేషనో ఏర్పాటు చేసిన ‘గార్బేజ్‍ బిన్స్’లో నింపడం తెలుసు. కొందరు బిన్స్లో కాకుండా దాని పరిసరాల్లో నింపి వస్తారు. కనీసం లోపలకు జారవిడిచే ఓపిక కూడా ఉండదు. ఇట్లా వీధులు పోగుచేసుకున్న చెత్త అంతా మన చేతుల్లోంచి వ్యర్థమైపోయిన వనరు అయ్యుంటుందనీ, అది చెత్తకాదు సంపద అని కూడా తెలియదు. అసలు ఈ చెత్త అంతా ఎక్కడకు చేరుతుంది? మనకు దూరంగా విసిరేయాలనుకుంటున్న చెత్త ఏ నిరుపేదల ఆవాసాలకు దగ్గరగా చేరి ఆ పేదలకు తీవ్ర అనారోగ్యాలకూ, ఆర్థిక ఇబ్బందులకు గురిచేసి వారిని, వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తుందని, వారిని హరించి వేస్తుదని కూడా తెలియదు. మన చుట్టూ మన ఆరోగ్యాల కోసమే తెరవబడిన ఆ సంఖ్యాక ఆసుపత్రులు, ఎమర్జన్సీ ట్రామాకేర్‍ సెంటర్లు వాటి మెడికల్‍ వేస్టేజ్‍ను ఎక్కడకు పంపుతున్నామో కూడా మనకు అర్థం కాదు.
స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన మంచినీరు, కాలుష్యరహిత వాతావరణం అందరమూ కోరుకునేదే. కానీ, అటువంటి పరిస్థితులను సృష్టించుకోవలసిన అవసరం, బాధ్యత మనందరి మీదా ఉంది.


సమాజంలో అన్ని సామాజిక సమూహాలు సమానంగా చూడబడాలి. వనరుల పంపిణీ విషయంలో ఇప్పటికే బహు అసమానతలు కొనసాగుతున్నాయి. ప్రకృతి వనరులను వినియోగించుకునే హక్కు అందరికీ సమానమే అయినప్పటికీ, అవి అందుబాటులో కొందరికే చెందుతున్నాయనేది స్పష్టంగా అర్థమయ్యే విషయమే. కాలుష్యానికి, వ్యర్థాల అధికోత్పత్తికి, అపరిశుభ్ర వాతావరణానికి కారణమైన మనమే. ఆ నెపాన్ని పేదల మీదకు, ఆకలి, దారిద్య్రం మీదకు నెట్టివేసేందుకు వెనకాడటం లేదు. ఇప్పటికీ పెట్టుబడిదారీ సంపన్న దేశాలు తమకు అక్కరలేని, తాము వినియోగించని అసంఖ్యాక వస్తూత్పత్తులను అవి వినియోగించగా మిగిలిన వ్యర్థాలను అభివృద్ధి చెందుతున్నాయనే లేదా తక్కువ అభివృద్ధిలో ఉన్న దేశాలనే వాటి మీదకు వొదులుతున్నాయి. సమృద్ధి సంపన్నత కలిగిన వర్గాలు ఇక్కడ ఉత్పాదించిన సకల అనర్థదాయక వ్యర్థాలను పేద, నిస్సహాయ వర్గాలకు బట్వాడ చేస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా ప్రస్తావించటం ఎందుకంటే వినియోగము, వ్యర్థాల గురించి ఆలోచించవలసిన అవసరం ఎంతయినా ఉంది. వర్తమానంలో నేడు ఆర్థిక సమృద్ధితో సంబంధం లేకుండానే అతి వినియోగం అనే ఒక రుగ్మతకు గురైంది. అందువల్ల జీవన విధానంలో, జీవన శైలుల్లో అది మరింత అతిగా వ్యవర్తిల్లుతోంది.


ఒక అధ్యయనం ప్రకారం తమ రంగును బట్టి ఈ వ్యర్థాల చేత బాధితమవుతూ ఉన్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఆఫ్రికా అమెరికను, లాటిన్‍ అమెరికన్లు, ఆసియావాసులు, పసిఫిక్‍ దీవుల ప్రజలు, స్థానిక అమెరికావాసులు, శ్రామిక వర్గాలు, పేదలు పారిశ్రామిక వ్యర్థాల వల్ల, అపరిశుభ్రవాయు కాలుష్యం వల్ల, కలుషిత నీటి వల్ల సురక్షితం కాని పని ప్రదేశాలలో పని చేయటం వల్ల ఎన్నో బాధలకు గురవుతున్నారు. అటువంటిదే కాకపోయినా అంతకు తక్కువేమీ కాకుండా బాధితులవుతున్న వర్గాలు ఎవరో ఇక్కడ గుర్తించటం పెద్ద కష్టమేమీ కాదు. కనీస వసతులు కూడా కరువైన చోట మునిసిపల్‍ వ్యర్థాలు పేరుకుపోయిన స్థలాల్లో, విష వ్యర్థాల మధ్య జీవనం సాగిస్తున్నారు. పర్యావరణ పరంగా వీరికి మనం మిగులుస్తున్న న్యాయం ఏమిటి? సంపదను అనుభవిస్తున్నదెవరు? వ్యర్థాలతో బాధితులవుతున్నది ఎవరు?


మన రాష్ట్రంలో తడిచెట్ట – పొడి చెత్త సేకరణ ఆయా స్థానిక సంస్థల ద్వారా ఉద్యమతుల్యంగా సాగుతున్నది. ఉదయాన్నే చెత్తబండి వచ్చిందమ్మో! చెత్తబండి అంటూ మైకులలో మనకు విసుగనిపించేంతగా చెత్త నినాదాలు వింటున్నాం. ఆ చెత్త బండికి ఇంత చెత్తపడేసి చేతులు దులుపుకుంటున్నాం. నిజానికి జరగవలసిందేమిటి? చెత్త ఘనవ్యర్థాల ఉత్పత్తిలో, సేకరణలో వ్యర్థాల నిర్వహణ పక్రియలో పర్యావరణ హితవరులుగా మనం చైతన్యవంతంగా భాగస్వాముల కావటం. అంటే వ్యర్థాల నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులను బాధ్యతగల పౌరులుగా గుర్తించటం వాటికి పరిష్కార మార్గాలను, దారులను వెతకటం.


కొన్నిచోట్ల చైతన్యం గల స్థానికులు, పౌరులు కలిసి చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి, సంస్థలను ఏర్పాటు చేసి పర్యావరణ న్యాయం అందరికీ అందేట్లుగా చేస్తున్నారు. పేదలున్నచోట అడగటానికి నోరులేని వాళ్ళున్నచోట తమ హక్కులు తాము
ఉపయోగించుకోవటం ఎరుగని వారున్నచోట మన ఘనత వహించిన ఘనవ్యర్థాలను చేర్చకుండా ఉండేట్లు చూస్తున్నారు.
కాలుష్య కారకులు, కాలుష్య నియంత్రకులతో రాజీపడకుండా భవిష్యత్‍ తరాల పిల్లలకు ఆరోగ్యప్రదమైన అవరణాలను సృష్టించాలి. కాలుష్య నియంత్రణా యంత్రాంగం తాత్కాలిక వాగ్దానాలను, హామీలను డంపింగ్‍ యార్డ్లను ఏర్పాటు చేసే సందర్భంలో ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అటువంటి హామీలకు లొంగకుండా ఉండాలి.


ల్యాండ్‍ ఫిల్స్ గురించి శాస్త్ర సమాజం ముప్పును అంచనా వేసే విశ్లేషణా నిపుణులు ఎన్నైనా చెప్పవచ్చుగాక వాటి అనర్థాల గురించి ఒక ఎరుకను కలిగి ఉండటం అవసరం.
కాలుష్య ఉత్పాదకులను నిలవరించటం. వారిని సమర్థించే వారి వెంట నడిచే ఎన్నికైన ప్రజాప్రతినిధులను వ్యక్తిగతంగా బాధ్యులను చేసి, వారు చేస్తున్నది పొరపాటనో, తప్పనో చెప్పగల చైతన్యం పెంచుకోవటం.


నిజానికి పర్యావరణ విధ్వంసాలను వ్యతిరేకిస్తూ, ప్రతిఘటిస్తున్న వారితో వాదించకుండా వారు ఈ విధ్వంసాలను గురించి ఎందుకు మాట్లాడుతున్నారో సానుకూల దృష్టితో ఆలోచించే సంయమనాన్ని ప్రదర్శించటం ఒక అవసరంగా భావించాలి.


వాస్తవంగా చెపితే ఎవరో ఒకరి ఇంటి వెనకో, ముందో ఈ వ్యర్థాలను వదిలిపెట్టడమో లేదా సురక్షిత వ్యర్థ నిర్వహణ అనేది వొట్టిమాట. అందుకే పర్యావరణ న్యాయంఅడిగేవారు ఒకే లక్ష్యనినాదం కలిగి ఉంటారు. ‘నాట్‍ ఇన్‍ ఎనీవన్స్ బ్యాక్‍ యార్డ్’ అని. ‘నాట్‍ ఆన్‍ ప్లానెట్‍ ఎర్త్’ అంటూ ఉంటారు.
మరీ ముఖ్యంగా చేయ వలసింది అక్కరలేని పరిశ్రమలను, వ్యర్థాల నిర్వహణ సౌకర్యాలను ఒకేచోట కాకుండా, పేదలు, మైనారిటీ ప్రజలు, శ్రామికులుండే మురికి వాడలుండే చోట కాకుండా వాటిని సమానంగా ఉండేట్లుగా చట్టాలు రూపొందించమని ఎన్నికైన ప్రతినిధులను వత్తిడి చేయటం.
ఒక దేశం నుండి మరొక దేశానికి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి హానికారక, విధ్వంసపూరక వ్యర్థాల ఎగుమతులను ఆపటం. ఇవన్నీ ఈ చైతన్యంలో భాగమే.


వీటన్నిటికీ మించి అతి తక్కువ వ్యర్థాలను సృష్టించే వ్యవస్థలుగా పరివర్తితం కావటం అత్యవసరం. పర్యావరణ న్యాయం జరగాలంటే ముందుగా కాలుష్య నివారణ జరగాలి. వ్యర్థాలను తగ్గించాలి. వీటితో పాటుగా నాలుగు పర్యావరణ సూత్రాలను వంట బట్టించుకోవాలి.
ఒకటి : ప్రతిదీ మరొక దానితో ముడిపడి ఉంటుంది.
రెండు : మనం ఉత్పాదించే వ్యర్థానికి మార్గమే లేదు.
మూడు : పొల్యూషన్‍కు డైల్యూషన్‍ పరిష్కారం కాదు.
నాలుగు : కాలుష్యాన్ని, వ్యర్థాలను తక్కువగా
ఉత్పాదించటమే సరైన మార్గం. మనం వాడే వాటిని తిరిగి వాడేవిధంగా రీసైకిల్‍ చేయటం. భౌతిక వస్తు సంచయ ఆర్థికపు అసమర్థతను ఎదుర్కోవటం నుంచి వినియోగదారీ సమాజం తప్పుకోలేదు.

  • డా।। ఆర్‍. సీతారామారావు
    ఎ : 9866563519

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *