అభ్యాసనా సంక్షోభం – ప్రమాదంలో భవిష్యత్తు తరాలు Learning Crisis – Future at Stake

మొదటిసారి జాతీయ విద్యావిధానంలో నాణ్యమైన విద్యా లోపం దాని తీవ్రతను గుర్తించి 5 కోట్ల మంది విద్యార్థులకు కనీస విద్యా సామర్ధ్యాలు లేవని ఈ విషయంలో ప్రభుత్వాలు తక్షణమే సరైన భాషా సామర్ధ్యాలు, గణిత నైపుణ్యాలు అందించే దిశగా రాజీపడకుండా స్పందించాలని లేని పక్షంలో వచ్చే 5 సంవత్సరాలలో 10 కోట్ల మంది విద్యార్థులు బడికివచ్చి కూడా నిరక్షరాస్యులుగానే మిగిలిపోతారని బలంగా చెప్పింది. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా దేశంలో విద్యావిధానం గురించి మాట్లాడం అర్థం లేని విషయం అని, ఈ ద•క్కోణంలో చూస్తే వర్తమాన పరిస్థితులలో దేశ విద్యా రంగం సంక్షోభంలో ఉందని విస్పష్టంగా తెలియజేసింది. ఈ నివేదికలో కనీస సామర్ధ్యాలు అందించడం అతిముఖ్యమైన అంశంగా ప్రస్తావించారు. ఈ పనిని తల పెట్టకుండా అసలు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడడం అర్ధం లేని విషయం అని కుండ బద్దలు కొట్టినట్లు నివేదించారు. విద్యా సామర్ధ్యాలు అందని పిల్లలు ప్రభుత్వ, ప్రైవేటులో చదువుతున్న మొదటి తరం బడికి వచ్చిన పిల్లలు ఇంకా సూటిగా చెప్పాలంటే బడుగు బలహీన వర్గాల పిల్లలే..


అభ్యసన సంక్షోభం:
దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్‍ అచీవ్‍ మెంట్‍ సర్వే (NAS) ప్రకారం మన రాష్ట్రంలో విద్యా సామర్ధ్యాలను పరిశీలించినట్లయితే అయిదవ తరగతి విద్యార్థులు తెలుగులో 43 శాతం, లెక్కలలో 35 శాతం మరియు పరిసరాల విజ్ఞానంలో 38 శాతం, ఎనిమిదవ తరగతి విద్యార్థులు తెలుగులో 48 శాతం, లెక్కలలో 32 శాతం, సామాన్య శాస్త్రంలో 35 శాతం మరియు సాంఘీక శాస్త్రంలో 34 శాతం మరియు పదవ తరగతి విద్యార్థులు తెలుగులో 36 శాతం, లెక్కలలో 29 శాతం, సామాన్య శాస్త్రంలో 34 శాతం, సాంఘీక శాస్త్రంలో 36 శాతం మరియు ఇంగ్లీషులో 48 శాతం మాత్రమే తరగతి వారి విద్యా సామర్ధ్యాలు కలిగి ఉన్నారు. అదేవిధంగా ఈ నివేదికలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యా సామర్ధ్యాలనును పరిశీలించితే కొంచెం అటు ఇటు తప్ప పెద్దగా ఏమి తేడా కనిపించడం లేదు.


ఇక సామజిక వర్గాల వారిగా విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు ఇంకా ఎక్కువ ఆందోళనకరంగా ఉన్నాయి. ఎస్‍.సి విద్యార్థులు 28 నుండి 48 శాతం, ఎస్టీ విద్యార్థులు 27 నుండి 46 శాతం, బీసీ విద్యార్థులు 29 నుండి 48 శాతం మాత్రమే విద్యా సామర్ధ్యాలు కలిగి ఉన్నారు.
రాష్ట్ర విద్యా శాఖ విద్యా సామర్ధ్యాలను మెరుగు పరచడానికి ప్రతి విద్యా సంవత్సరం ఒక కొత్త కార్యక్రమంతో హడావిడి చేస్తుంది. కానీ విద్యార్థులందరికి తరగతి వారి సామర్ధ్యాలు అందాయా లేదా అని సమీక్ష చేయకుండానే విద్యా సంవత్సరాన్ని పూర్తి చేస్తుంది. ఈ సంవత్సరం కూడా ప్రాథమిక స్థాయికి ‘తొలి మెట్టు’ అని ఉన్నత స్థాయి విద్యార్థులకు ‘లెర్నింగ్‍ ఇంప్రూవ్‍ మెంట్‍ పోగ్రామ్‍’ అనే కార్యక్రమం తీసుకుంది. కానీ ఈ కార్యక్రమం కూడా విద్యార్థుల నాణ్యమైన విద్య మెరుగుకు అంతాగా దోహదపడలేదని క్షేత్ర స్థాయి పరిశీలనలో తెలుస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం తెలంగాణలో సగానికి ఎక్కువ విద్యార్థులు ప్రైవేటు విద్యా సంస్థలలో చదువుతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలలో కూడా తరగతి వారి సామర్ధ్యాలు అందడం లేదని కేంద్ర నివేదిక ద్వారా తెలుస్తుంది. ఈ విద్యార్థులకు కనీసం ప్రభుత్వ విద్యార్థులకు నామమాత్రంగా నైనా నిర్వహించే కార్యక్రమాలు అసలే లేవు. ఈ విషయంలో పర్యవేక్షణ కానీ సమాచారం కానీ విద్యా శాఖ వద్ద లేవు. నాణ్యమైన విద్యను ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థలలో చదువుచున్న విద్యార్థుల విద్యాప్రమాణాలు మెరుగు పరచడానికి ప్రభుత్వం యుద్ద ప్రాతిపదిక మీద విద్యా ప్రమాణాలను మూల్యాంకనం చేసి తక్షణ చర్యలు చేపట్టాలి.


సంక్షోభంలో విద్యా వ్యవస్థ:
కస్తూరి రంగరాజన్‍ కమిటీ తన నివేదికలోని లోని 2వ అధ్యాయంలో దేశంలో ప్రస్తుతం పాఠశాల విద్య లో చదువుతున్న వివిధ తరగతులలో అధిక శాతం విద్యార్థులకు కనీస భాషా నైపుణ్యాలు, గణిత సామర్ధ్యాలు లేవని, వారికి కనీస విద్యా సామర్థ్యాలు అందడంలేదని అసర్‍, ఇతర జాతీయ స్థాయి నివేదికలను ఉటంకిస్తూ స్పష్టంగా వెల్లడించింది.
రాష్ట్రంలో ప్రతి సంవత్సరం విద్యా సంస్థలు తెరుచుకున్న మొదటి నెలలో అనగా జూన్‍లో వెనుక బడిన పిల్లల మీద కొంత ద•ష్టి పెట్టి ప్రాథమిక స్థాయి పరీక్షలు నిర్వహించి చదువులలో వెనుకబడిన పిల్లలకు 3R’s అని LEP, తొలిమెట్టు అనే కార్యక్రమాలను గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం తరగతి వారి విద్యా సామర్థ్యాలు పొందలేక పోయిన పిల్లల సంఖ్య ఈ కార్యక్రమాల ద్వారా తగ్గక పోగా ఇంకా ఎక్కువ అవుతున్నాయని సామాజిక కార్యకర్తలు నిర్వహించిన క్షేత్ర స్థాయి సామాజిక పరిశీలనలో కూడా బయటపడింది.


క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు, ఉపాధ్యాయులు ఆలోచిస్తున్న విధానాలను, తల్లిదండ్రుల ఆశయాలను పట్టించు కోకుండా విద్యావ్యవస్థలో అతి ముఖ్యమైన ఈ వర్గాలతో ఏ రకమయిన సంప్రదింపులు జరపకుండా హడావిడిగా ఒక కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం రూపొందిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాలను రూపొందించి ప్రతి విద్యార్థి నిజంగా చదువులలో ఎంత ముందుకు వెళ్లారు అనే విషయాలకన్నా ఎక్కువగా ‘MIS’ లో నింపడానికి పలు రకాలైన Formats నింపడానికే టీచర్లు సమయం కేటాయించ వలసి వస్తోందన్నది నిర్వివాదం. వీటి వలన అసలు లక్ష్యం పక్కతోవ పడుతుందని
ఉపాధ్యాయులు అభిప్రాయపడుతుంటారు.


విద్యా సామర్థ్యాలు అందించడానికే ఈ మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం కానీ వ్యవస్థలో ఒక టీచర్లు తప్ప విద్యాశాఖలో వివిధ స్థాయిలలో ఉన్న అధికారులకు ఈ విషయంలో పట్టింపు ఉన్నట్లు కనిపించదు. వారి క్షేత్ర పర్యటనలో బడులకు వెళ్ళిన రోజులు కానీ వెళ్ళినా మధ్యాహ్నం భోజనం, బాత్రూంలు, వస తులు, టీచర్ల హాజరు, పిల్లల హాజరు, మధ్యాహ్నభోజన వివరాలు, పుస్తకాల పంపిణీ వివరాలు మొదలగు అంశాలపైననే ఎక్కువగా ద•ష్టి సారిస్తారు కానీ వారి పరిధిలో చదువుతున్న విద్యార్థుల విద్యా సామర్థ్యాలు ఎంతవరకు సాధించారు, ఎలా సాధించాలి అని ఒక్క సమాచారం కూడా వీరి కార్యక్రమాలలో లేవంటే మనకు అర్థం అవుతుంది మండల, విద్య, రాష్ట్ర విద్యా శాఖల పరిస్థితి. పాఠశాల సందర్శనలో తరగతి వారి అభ్యసన ఫలితాలను పర్యవేక్షించడానికి వీరి వద్ద సరియయిన సమాచారం లేదు.


ఇప్పటికైనా విద్యార్థులకు నేర్పించే అవకాశాలు కల్పించడం ఆలస్యం అయిందని అనుకోవడానికి వీలు లేదు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం అసలు ఎవరు ఎంత నేర్చుతున్నారు ఎంత నేర్వడంలేదనే సమాచారం మన విద్యాధికారుల వద్ద లేకపోవడమే అని గమనించాలి. స్కూలు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఈ సమాచారం అంతా గంపగుత్తగా అంకెల రూపంలో లేదా శాతాల రూపంలో ఉంటుంది తప్ప విద్యార్థుల గురించి ఉండదు.


బడులకు వెళ్ళడంతోనే నేర్చుకున్నట్లు కాదు. ఎప్పుడైతే ప్రతి విద్యార్థిని ద•ష్టిలోఉంచుకొని వారి అవసరాలను గమనించి, ప్రతి రోజు ప్రతి విద్యార్థి ప్రగతిని గమనించినప్పుడే బోధన జరుగుతున్నట్లు అని అర్ధం. ఇలా ఎన్ని తరగతి గదులలో జరుగుతోంది అన్నది ప్రశ్నార్ధకమే. ఈ మార్గంలో కష్టపడి పనిచేస్తున్నఉపాధ్యాయులకు ఎంత మటుకు ప్రోత్సాహం కానీ, సహాయం కానీ విద్యా శాఖ నుండి అందుతుందనేది కూడా ఒక ప్రశ్న గానే మిగులుతుంది. ఈ దుస్థితి ప్రభుత్వ విద్యాలయాలలోనే కాకుండా అత్యధిక శాతం ప్రైవేటు బడులలో కూడా ఇంచుమించు అలాగే ఉందని నివేదికలు ద్వారా తెలుస్తుంది.


రాష్ట్ర విద్యా శాఖ పనితీరు కేంద్రం విడుదల చేసిన గ్రేడింగ్‍ ఇండెక్స్ (పిజి.ఐ) 2021 నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో అభ్యసన ఫలితాలు, మౌలిక వసతులు, సమానత్వం, పాలనా పక్రియ, విద్యార్థుల నమోదు మరియు ఉపాధ్యాయులకు విద్యా శిక్షణ అనే ఆరు అంశాల ప్రాతిపదికన పాయింట్లు కేటాయించింది. ఈ పాయింట్ల ఆధారంగా రాష్ట్రాలకు వివిధ కేటగిరీల (గ్రేడ్‍-లెవెల్స్)ను నిర్ధారించారు. ఈ నేపధ్యంలో తెలంగాణారాష్ట్రం 1000 పాయింట్లకు కేవలం 479.9 పాయింట్లతో దేశంలోని 36 రాష్ట్రాలలో 31 వస్థానంలో నిలిచింది. అంటే కింది నుంచి ఆరోస్థానంలో నిలిచింది. తెలంగాణ కన్నా తక్కువ పాయింట్లు పొందిన అయిదు రాష్ట్రాలు, బీహార్‍ మరియు నాలుగు ఈశాన్య రాష్ట్రాలుమాత్రమే ఉన్నాయి. ఇక అతి ముఖ్యమైన ‘అభ్యసన ఫలితాల’లో 240 పాయింట్లకు కేవలం 36.6 పాయింట్లతో దేశంలో 35వ స్థానంలో నిలిచింది, ఒక్క మేఘాలయ మాత్రమే తెలంగాణా కన్నా వెనుకబడివుంది.


ప్రైవేటు బడుల లోను కొరవడిన అభ్యసన సామర్ధ్యాలు:
తెలంగాణలో దాదాపు యాభై శాతం పైగా పిల్లలు ప్రైవేటు బడులలో చదువుచున్నారు. ప్రైవేటు బడులలో చదువుతున్న పిల్లలకు నాణ్యమైన విద్య అందుతోందా లేదా అనేది పర్యవేక్షించ వలసిన బాధ్యత విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వానిదే. ప్రభుత్వ బడుల కంటే ప్రైవేటు బడులు నాణ్యమైన విద్యనందిస్తాయనే అపోహలు చాలానే ఉన్నాయి. అతి ఖరీదైన ఫీజులు వసూలు చేసే కొద్ది బడులు తప్ప (ధనిక వర్గాల పిల్లలు మాత్రమే ఈ బడులకు వెళ్తారు) అత్యధిక శాతం ప్రైవేటు బడులలో కూడా విద్యా సామర్ధ్యాలు అందడం లేదని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ప్రభుత్వ బడుల మీద కనీసం బహిరంగంగా చర్చ జరుగుతుంది కానీ, సగానికి పైగా పిల్లలు చదువుతున్న ప్రైవేటు బడులలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. ఈ బదులలో నాణ్యమైన విద్యా అందుతుందనే అపోహలో పేద, మధ్య తరగతికి చెందిన కుటుంబాలు తమ పిల్లలను పంపిస్తున్నారు. రేయింబవళ్లు కష్టబడి సంపాదించిన దానిలో ఎక్కువ శాతం తమ పిల్లల చదువుపై ఖర్చు చేస్తూ తమ పిల్లల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ మొక్కుబడి చదువులతో శిక్షణ లేని టీచర్లతో ఈ బడులను నడిపిస్తున్న యజమాన్యాల పట్ల ప్రభుత్వ యంత్రాంగం సరియయిన పర్యవేక్షణ చేయడంలేదు. ఈ బడులలో విద్యా ప్రమాణాల పర్యవేక్షణ చేయకపోతే జాతీయ స్థాయి నివేదికలలో తెలంగాణ ఎప్పుడు వెనుక బడే ఉంటుందని గమనించాలి.


ప్రజా ప్రతినిధులు బాధ్యతను గుర్తించాలి:
ఇక ప్రజాప్రతినిధులైతే విద్యా సామర్ధ్యాల మీద ద•ష్టి పెట్టిన సంధార్భాలు చాలా తక్కువ. వారి ద•ష్టి అంతా నిర్మాణ పనులమీద ఎక్కువ. మండల మరియు జిల్లా సర్వ సభ్య సమావేశాలలో తాము ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాలకు, మండలాలకు రోడ్లు, భవనాల గురించి చర్చించినంత శ్రద్ధగా తమ ప్రాంతంలోని బడికి వెళుతున్న పిల్లల విద్యా సామర్ధ్యాల గురించి చర్చించిన సందర్భాలు అసలే ఉండవు. బడులకు కావలసిన మౌలిక వసతుల గురించి మాత్రం చర్చ జరుగుతుంది. చాలా సందర్భాలలో ప్రజా ప్రతినిధులు బడులను సందర్శిస్తారు. టీచర్ల పదవి విరమణ, లేదా జాతీయ పండగలప్పుడు, వార్షిక పండుగలకు బడిని సందర్శించుతారు కానీ బడిలో నాణ్యత గురించి చర్చ జరగదు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇదే పద్దతి అనుసరిస్తారు తప్ప భిన్నంగా ఏమి ఉండరు. ఎన్నికల హడావిడి తప్పితే వీరికి వీరి నియోజకవర్గాలలో ఉన్న పిల్లల నాణ్యమైన విద్య గురించి ఎప్పుడు పట్టించుకున్నట్లు కనిపించదు. వారి వారి నియోజక వర్గాలలో టీచర్ల కొరత గురుంచి కానీ విద్యార్థుల విద్యా విషయాల గురుంచి కానీ అసలె ద•ష్టి సారించరు. ఈ విషయంలో పాలక పక్ష, ప్రతిపక్ష ప్రజా ప్రతినిధుల మధ్య ఏమి తేడా ఉండదు. ప్రతి గ్రామ పంచాయితీ ప్రతి ఎమ్మెల్యే ఎంపీ ప్రతి నెల తమ పరిధిలో చదువుతున్న విద్యార్థుల విద్యా సామర్ధ్యాల మీదనే సమీక్షలు నిర్వహిస్తేనే తప్ప ఈ పరిస్థితులలో మార్పు రాదు.


విద్యా శాఖ అధికారుల జవాబుదారీతనం పెంచాలి:

విద్యా సామర్ధ్యాల సాధన విద్యా శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారి బాధ్యత. కానీ ఇతర పనులన్నీ ప్రధాన బాధ్యతగా నిర్వహిస్తూ అసలు పనిని విస్మరిస్తుంటారు. మండల విద్యా అధికారి నుండి మొదలుకొని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వరకు విద్యాసామర్ధ్యాలు అందించే ప్రధానమైన బాధ్యతను వదిలి ఇతర పనులమీద ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. ట్రాన్స్ఫర్లు, మీటింగులు, పంపిణీ, నియామకాలు, పరీక్షల నిర్వహణ, పదవ తరగతి ఫలితాలపై ద•ష్టి. ఇవి ప్రధానంగా వారి దినచర్యగా ఉంటుంది కానీ తన పరిధిలో ఉన్న పిల్లలు చదువుతున్నారా లేదా అనే విషయాన్ని చాలా మొక్కుబడిగా నిర్వహిస్తూ పనిలో అతి తక్కువ సమయాన్ని దీనికి కేటాయిస్తుంటారు. మండల విద్యాశాఖ అధికారి నుండి విద్యాశాఖ సెక్రటరీ వరకు ఒకనెలలో వారు నిర్వహించిన విధులను కనుక పరిశీలించినట్లైతే చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది వారి వారి సమయాన్ని విద్యా సామర్ధ్యాల పరిశీలనకు ఏ మాత్రం వెచ్చించచడం లేదని. విద్యా శాఖలో ఉండి జీతాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ నెలలో కొన్ని పాఠశాలలు సందర్శించి విద్యా సామర్ధ్యాల సమీక్ష జరపాలి. పిల్లలకు విద్యా సామర్ధ్యాలు అందించే బాధ్యత సంపూర్ణంగా విద్యాశాఖ తీసుకోవాలి. ఇది ప్రైవేటు లేదా ప్రభుత్వ బడులకు హాజరవుతున్న పిల్లల విషయంలో పరిష్కరించవలసిన అత్యవసర సమస్య.


బోధనేతర పనుల నుండి ఉపాధ్యాయులను విముక్తి చేయాలి:

టీచర్లకు బోధనేతర పనులు అప్పచెబుతూ తరగతి గదిలో గడపాల్సిన ఉపాధ్యాయుని సమయాన్ని వ•ధా చేయడమే కాకుండా ఉపాధ్యాయులకున్న బోధించే హక్కును హరించివేస్తున్నారని గమనించాలి. ఈ మధ్య కొంత మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను అడిగితే వారు తయారు చేసిన జాబితా చూసి వారే ఆశ్చర్య పోయారు. అందులో కొన్ని మచ్చుకు ఆవరణ, తరగతి గదులు శుభ్రం చేయించుకోవడం (స్వీపర్‍లు ఉండరు), నీళ్లు ఏర్పాటు చేసుకోవడం, మధ్యాహ్నభోజనం (MDM) తినే వాళ్ళెందరో లెక్కవేసుకుని రిజిస్టర్‍లో రాసుకుని దాని ప్రకారం వెచ్చాలు వంట చేసే వాళ్లకు ఇవ్వడం, కోడిగుడ్ల లెక్క రిజిస్టరు, రైస్‍, పప్పు రిజిస్టరు వంటి వాటిని అప్‍-డేట్‍ చేసుకోవడం, మండల రిసోర్సు సెంటర్‍ (MRC) వాళ్ళు అడిగే వివిధ సమాచారాన్ని నిర్దేశిత ఫార్మాట్లలో నింపి ఆన్‍ లైన్‍, ఆఫ్‍ లైన్‍లలో సమర్పించడం, యూనిఫారాలు, పుస్తకాలు, ప్రతిదాన్నీ బయోమెట్రిక్‍తో ఇవ్వడం, నమోదు చేయడం, అప్‍ లోడ్‍ చేయడం, వివిధ జయంతులూ వర్ధంతులూ వంటి కార్యక్రమాలు జరిపినప్పుడు ఫోటోలు తీసి వెబ్‍సైట్‍లోకి అప్‍ లోడ్‍ చేయడం, పరీక్షల మార్కులను ఎప్పటికప్పుడు అప్‍ లోడ్‍ చేయడం, టాయిలెట్ల ఫోటోలను అప్‍ లోడ్‍ చేయడం, వివిధ దినోత్సవాలప్పుడు ఆయా శాఖలు ఇచ్చే కార్యక్రమాలు నిర్వహించి అప్లోడ్‍ చేయడం, SC, మైనారిటీ స్కాలర్షిప్‍ల కోసం పిల్లల వివరాలను అప్లోడ్‍ చేయడం, జీతాల బిల్లులు చేసుకోవడం (చాలా స్కూల్స్లో క్లర్క్లు ఉండరు), వివిధ శిక్షణా కార్యక్రమాలకు హాజరుకావడం,భోజన పళ్ళాలకు దాతల్నీ,వాటిని కడిగేందుకు, నీళ్ళూ, సబ్బులూ, పీచులూ, చీపుర్లూ, అన్నీ సమకూర్చడం, శుభ్రత పాటించేటట్లు వంట గది సిబ్బందిని ఒక కంట కనిపెట్టడం. బియ్యం నిల్వలు ఎప్పటికప్పుడు అప్డేట్‍ చేస్తూ నెలవారీగా యాప్‍లో సమర్పించాలి. ప్రతిరోజూ పదకొండు నుంచి సాయంత్రం లోపు ఎవరోఒకరు ఎం.డి.ఎం సంఖ్య, వచ్చిన, తిన్న, వాడిన గుడ్లసంఖ్యతో సహా యాప్‍లో వేయించాలి. ఎం.డి.ఎం. కోసం మూడు రిజిస్టర్లు మెయిన్టెయిన్‍ చెయ్యాలి.
ఇవి కూడా పనులేనా అనిపిస్తాయి, సాకులు అనికూడా అనిపిస్తాయి.కానీ ఉపాధ్యాయులు బడి కొచ్చి ప్రార్ధన సమయం కాగానే నేరుగా తన పిల్లల లోకం లోకి వెళ్ళడానికి ఇవి కానరాని మానసిక శత్రువులు. వీటన్నిటి మీదా మనసు పెడుతూ పాఠాలు అద్భుతంగా బోధించే కెపాసిటీ చాలా తక్కువ శాతం మందిలో ఉంటుందేమో. టీచర్లకు బోధనేతర పనులనుండి విముక్తి జరిగినప్పుడే తరగతి గదిలో బోధన చేసే అవకాశం కలుగుతుందని ఒక టీచరు సామాజిక మాధ్యమంలో తన గోడు వెళ్లబోసుకున్నాడు. పైన చెప్పిన పలు పనులు చేసి కూడా బోధన చేయలేరా అనే వాదన రావచ్చు. ఈ చర్యల వలన బోధన అనేది విద్యా శాఖకు ప్రాధాన్యతాంశం కాదు అనే సందేశం కూడా వెళుతుందని గమనించాలి.


బడ్జెట్‍ కేటాయింపులు:

గత తొమ్మిది సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్‍ పరిశీలించినట్లైతే విద్యారంగానికి నగదు రూపాయలలో పెరిగినట్లు కనిపించినా మొత్తం బడ్జెట్‍లో విద్యారంగానికి ప్రతి సంవత్సరం తగ్గుతూనే వస్తుంది. తెలంగాణ ఏర్పడిన తరువాత 2014-15 ప్రవేశ పెట్టిన మొదటి బడ్జెట్‍ లో విద్యకు 10.89 శాతం కేటాయించగా 2023-24 బడ్జెట్‍లో 19,093 కోట్లు మాత్రమే కేటాయించారు ఇది మొత్తం బడ్జెట్‍ 2,90,396 లక్షల కోట్లలో కేవలం 6.57 శాతానికి పడిపోయింది. ఇది దేశంలోని ఇతర రాష్ట్రాల సరాసరి చూస్తే 15.2 శాతం కాగా మన రాష్ట్రం చాలా చాలా తక్కువ కేటాయిస్తుందని అర్ధం. విద్య కోసం రాష్ట్రాల బడ్జెట్‍ లో విద్యకు కేటాయించాలని చేసిన వివిధ జాతీయ స్థాయి కమిషన్లు ప్రతిపాదనలకు ఇది చాలా తక్కువ. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలంటే నిధులు కూడా చాలా అవసరం. బడ్జెట్‍ లో కనీసం 20 శాతం నిధులను కేటాయించాలి. అంటే ప్రస్తుతం మన రాష్ట్ర మొత్తం బడ్జెట్‍లో విద్యా శాఖకు దాదాపు 60 వేల కోట్ల రూపాయలు కేటాయించాలి.


రాజకీయ చిత్తశుద్ది అనివార్యం:
పాల్‍ స్కిద్మోర్‍ (Paul Skidmore) అనే విద్యావేత్త ప్రపంచం లోని విద్యాశాఖ మంత్రులకు ఒక లేఖను విడుదల చేస్తూ నాణ్యమైన విద్య మీద ద•ష్టి పెట్టడమంటే కొరివితో తలగోక్కొవడమే అని రాస్తాడు. బడిని అందుబాటులోకి తేవడానికి ముఖ్యమంత్రి గారి ఛాంబర్‍ నుండే పర్యవేక్షించవచ్చు. తరగతి గది నిర్మాణాలు, భోజనశాలల నిర్మాణం, ప్రహరీ గోడల నిర్మాణం, కంప్యూటర్ల సరఫరా, పుస్తకాల ముద్రణా పంపిణీ, ఏకరూప దుస్తుల పంపిణీ, మధ్యాహ్న భోజన సరఫరా మొదలగు వాటిని సమకూర్చడానికి, పర్యవేక్షించడానికి పెద్ద సమస్య రాదు. సరఫరా చేసే వాళ్ళు, పర్యవేక్షించే వాళ్ళు ఏదో ఒక రూపంలో లబ్ది పొందుతారని అర్ధం. కానీ, అభ్యసన ఫలితాలు సాధించాలంటే వాటికి తగిన సంస్కరణలు తీసుకురావాలంటే విద్యా శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారిని జవాబుదారిగా చేయవలిసి ఉంటుంది. అలాగే టీచర్ల కొరతను తీర్చ వలసి ఉంటుంది. రిటైర్‍ అయిన టీచర్ల స్థానం లో వెంటనే టీచర్ల భర్తీ చేసే విధానం రూపొందించవలసి ఉంటుంది. పాఠశాలలు సబ్జెక్ట్ టీచర్లు కొరత లేకుండా ఉంటుంది. తరగతి వారి టీచర్లను ఇవ్వ వలసి ఉంటుంది లేదా సర్దుబాటు చేయవలసి ఉంటుంది. శిక్షణా కార్యక్రమాలతో టీచర్ల నాణ్యతను పెంచవలసి ఉంటుంది, టీచర్ల సంఘాలతో తలపడవలసి వస్తుంది. అంతే కాకుండా అభ్యసన ఫలితాలపై ద•ష్టి పెడితే విద్యా వ్యవస్థలో ఉన్న ప్రతి స్థాయిలో ప్రతి ఒక్కరు జవాబుదారీతనంతో బాద్యత వహించే విధంగా ఉంటుంది. ఈ సవాళ్లను ఎదుర్కొంటూ ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థలో కఠిన నిర్ణయాలు ఈ దిశగా తీసుకుంటేనే భవిష్యత్తులో తెలంగాణ లో బడులకు వెళ్ళిన పిల్లలు కస్తూరిరంగన్‍ కమిటీ తన నివేదికలో చెప్పినట్లుగా నిరక్ష్యరాస్యులుగా మిగిలి పోకుండా నైపుణ్యతతో కూడిన విద్యార్థులుగా బడులనుండి బయటకు వస్తారు. బంగారు తెలంగాణకు సార్ధకత తెస్తారు.


నాణ్యమైన విద్య ను అందించడం ప్రభుత్వ చట్ట బద్ద బాధ్యత:
ముందుగా రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఒక సంక్షోభంగా గుర్తించాలి. నాణ్యమైన విద్య అందించక పోవడం అంటే రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలి. ప్రజలు ఎదుర్కొనే అనేక సామాజిక వెనుకబాటుకు ప్రభుత్వాలు బాధ్యత వహించవలసి ఉంటుంది. ముఖ్యంగా తరతరాల వెనుకబాటు తనం కొనసాగుతుంది. తీవ్రమైన ఆర్ధిక సామాజిక అసమానతలు కొనసాగుతాయి. రాజ్యాంగస్పూర్తి అయిన సామాజిక న్యాయం అందకుండా పోవడమే కాకుండా ఉన్న అసమానలతో పాటు నూతన అసమానతలు పెరుగుతాయి. నైపుణ్యత లేని అసంఘటిత కార్మికులుగా, తక్కువ వేతనాలతో పేదరికం విషవలయంలోకి నెట్టబడతారు. నాణ్యమైన విద్యను అందించే గ్యారంటీ ప్రభుత్వం చట్టబద్ద బాధ్యతగా తీసుకొని విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం యుద్ద ప్రాతిపదిక మీద తక్షణ చర్యలు చేపట్టాలి.


చివరగా :
ప్రస్తుతం పెద్ద సంక్షోభంలో ఉన్న విద్యా వ్యవస్థకు తక్షణ మార్పులను చేపట్టటం అత్యవసరమే అయినా మొత్తం పాఠశాల వ్యవస్థలోనే విప్లవాత్మక మార్పులు చేయడానికి దీర్ఘ కాల ప్రణాళికలు వేయాలి. ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని పూర్తిగా నిషేదించాలి. అన్నీ అభివ•ద్ది చెందిన దేశాలలో మాదిరిగా ధనిక పేద తేడా లేకుండా పిల్లలందరూ తమ నివాస ప్రాంతాలలోనే ఒకే రకమైన బడులలో విద్యను అభ్యసించే విధంగా విధాన నిర్ణయాలు చేయాలి. సమాన విద్య నాణ్యమైన విద్యను అందించే పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. అందుకు కావలిసిన చట్టాలను రూపొందించాలి.

  • ఆర్‍. వెంకట్‍ రెడ్డి
    ఎం.వి.ఫౌండేషన్‍
    ఎ : 9949865516

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *