జాఫర్ మాము

(గత సంచిక తరువాయి)
సగం చచ్చిన శవంలా ఉన్న జాఫర్‍ వొదినను ఒక మరాఠా పహీల్వాన్‍ తన బుజాల మీద వేసుకుని గుర్రం వైపు ఉరుకుతుంటే ఆమె ఏడేండ్ల కొడుకు ‘‘మేరే అమ్మీకో మత్‍ లేజావ్‍, ఉస్కో చోడ్‍ దో’’ అనుకుంట అతనికి అడ్డమడ్డం తిరిగిండు. దాంతో ఆ దుర్మార్గుడికి కోపం వచ్చి చేతిల ఉన్న తల్వార్‍ను ఆ పసిపోరడి మెడవైపు ఝుళిపించిండు. అంతే వొక్క వేటుతో ఆ పిల్లగాడి తల లేత మెడ నుండి వేరయ్యి క్రింద భూమి మీదికి చెండులాగ దొర్లిపోయింది. కాని అప్పుడొక భయంకర దృశ్యం అక్కడున్న వాళ్లకు కనబడింది. తలకాయ క్రిందికి దొర్లిపోయినా ఆ మొండెం మాత్రం నేలకు ఒరగలేదు. కొన్ని సెకండ్ల వరకు ఆ పిల్లగాడి మొండెం అటుఇటూ ఉరికి ఉరికి ఆఖరికి నేలమీద దబ్బున పడింది. కాల్జేతులు తపతపా కొంచెం సేపు చేప పిల్లలాగ కొట్టుకుని, కొట్టుకుని ఆ శరీరం ఇటూ అటూ కొంచెం సేపు తండ్లాడి ఆ తర్వాత చలనం ఆగిపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన ఊరోళ్లకందరికి చాలా ఏండ్ల వరకు వాళ్ల కలత నిద్రలల్ల తలలేని ఆ పిల్లవాడి మొండెం అటు ఇటు ఉరుకుతున్నట్లు, మేరే ‘అమ్మీకో మత్‍ లేజావ్‍’ అని ఒర్లుతున్నట్లు పీడకలలు వచ్చి వాళ్లను వెంటాడి, వేధించేవి.


మరాఠీ మూకలు వెళ్లినంక ఆ ఊర్ల మిగిలిన ముస్లిం ముసలి స్త్రీ పురుషులందరూ కట్టగట్టుకుని ఊరి మధ్య బొడ్రాయికాడ హిందువుల కాళ్లమీద పడి ‘‘వాండ్లెవరో వేరే ఊరి మనుషులు చేతులల్ల చచ్చే కంటె మన ఊరోళ్ల చేతులల్ల చచ్చినమన్న తృప్తి అయినా మాకుంటది మమ్మల్ని మీరే చంపి పుణ్యం కట్టుకోరాదుండ్రి’’ అని వొలవొలా ఏడ్చిండ్రు. అప్పుడు హిందువు లందరూ వాళ్లను లేపి తమ గుండెలకు కావలించుకుని వాండ్లు భీ ఎక్కెక్కి కండ్ల నీళ్లు కార్చిండ్రు. కార్చిన కన్నీళ్లకు, పారిన రక్తానికి హిందూముస్లిం తేడాలు ఉంటయా?
తప్పించుకున్న అనేకమందితో కల్సి జాఫర్‍ అతని అన్నయ్యా పెద్దరోడ్డు మీద నుండి గాక పొలాలల్ల నుండి, అడవుల నుండి కట్టుబట్టలతో కాలినడకన హైద్రాబాద్‍ షహర్‍ చేరుకున్నరు. అట్ల
వాళ్లు స్వదేశంలనే కాందిశీకులయి పోయిండ్రు.
పట్నం చేరుకునేసరికి అదొకప్పుడు ఆసఫ్‍జాహీలు పరిపాలించిన హైద్రాబాద్‍ కాదు. నిజాం యూనియన్‍ సర్కార్‍కు లొంగిపోయాడు. రాచరికం స్థానంల ప్రజాస్వామ్యం పేరుతో మిలటరీ పాలన ఏర్పడింది. ఆ సైనిక ప్రభుత్వానికి మద్దతుగ ఆంధ్ర నుండి వచ్చిన సివిల్‍
ఉద్యోగుల పెత్తనం కనబడుతుంది. విజేతల ఆధిపత్యధోరణి అంతటా విస్తరించింది. నగర సంస్క•తిలో, జీవన విధానంలో మార్పు స్పష్టంగా కనబడుతుంది.
గతం గాయాలను మర్చిపోదామని వారిద్దరు మళ్లీ పెండ్లిళ్లు చేసుకున్నరు. కొత్తగ పట్నం జీవితానికి అలవాటుపడిండ్రు. ఎవరో నవాబుగారి సిఫారస్‍తో జాఫర్‍కు చప్రాసీ నౌఖరీ దొరికింది. అక్షర జ్ఞానం లేని అన్నమాత్రం చార్మినార్‍ కాడ రిక్షాగ మారిపోయిండు. ఆ గడ్డుదినాలల్ల చానా మంది ముస్లింల బ్రతుకు నావలు తలక్రిందులై కాలక్రమేణా వారి జీవితాలు సమాజపు అట్టడుగు పొరలలకు వెళ్లిపోయి తర్కారీబండీలుగ, ప్యాజ్‍ ఔర్‍ మౌజ్‍కీ బండీలుగ, సైకిల్‍ పంక్చర్లు లేదా హర్‍ ఏక్‍ మాల్‍ దుక్నాలుగ మారిపోయినయి. ఇక రాబోయే రోజులన్నీ కూడా ‘‘జీవఫలం చేదువిషం’’ అన్న సంగతి వారికి తెలిసిపోయింది.


కాలం పగబట్టిన నాగుపాములా వారి బ్రతుకుల్ని మరోసారి కసిగా కాటేసింది. అదే 1962 గైర్‍ ముల్కీ గోబ్యాక్‍ ఉద్యమం. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తొలిదశ అది. తొలితరం పోరాటం కూడ. సెప్టెంబర్‍ నెల హైద్రాబాద్‍కు అచ్చిరాదని పెద్దల అనుమానం, భయం. ఈ నెలలోనే ఔరంగజేబు గోల్కొండ ఖిలా మీద హమ్లాచేసి పట్నాన్ని పట్టుకున్నడు. 1909ల మూసీకి వరదలు వొచ్చి పట్నం సాంతం కొట్టుకు పోయింది ఇదే నెలల. ఆలేరు దగ్గర వసంతవాగుల రైలుపడి అగ్గిపెట్టెల్లాగ కొట్టుకపోయింది ఇదే నెలల. 1948 పోలీస్‍ యాక్షన్‍ జరిగింది ఈ సెప్టెంబర్‍ నెలనే. ఇగ మళ్లీ ఇప్పుడేం ముంచుకొస్తదో అని ముసలోళ్లు భయపడుతుండగ గైర్‍ ముల్కీగోబ్యాక్‍ ఉద్యమం రానే వచ్చింది.
పోలీస్‍ యాక్షన్‍ తర్వాత ఉసిళ్లలా వచ్చిపడిన ఆంధ్రులు స్థానికుల నోళ్లు గొట్టి విద్యా ఉద్యోగాలలో తిష్టవేసిండ్రు. లంచాల వ్యవస్థతో దొంగ ముల్కీ సర్టిఫికెట్లు పుట్టుకొచ్చినయి. వీటికి వ్యతిరేకంగా ముల్కీలు కాని వాళ్లంతా వెనక్కి పోవాలని విద్యార్థులు ఉద్యమాన్ని నడిపారు. తెలంగాణా అంతటా అగ్గి అంటుకుని ప్రజలు అగ్గిపిడుగులైనారు. ఇడ్లీసాంబార్‍ గోబ్యాక్‍, గోంగూరపచ్చడి గోబ్యాక్‍ అన్న నినాదాలు నింగిని అంటినాయి. ‘‘సర్వర్‍ దండా’’ అనే ఒక ఉర్దూకవి నీలం సంజీవరెడ్డి మీద ఒక వ్యంగ్య వైభవ కవిత రాసిండు..
‘‘సంజీవరెడ్డి మామా
అయ్యయ్యో రామరామ
కైసా హై ఏ జమానా
పాడేంగే తేరా పైజామా
రూపయికో భిక్త బియ్యం
దిన్‍ మే హీ దిక్త దయ్యం
సంజీవరెడ్డి మామ
అయ్యయ్యో రామరామ’’

ఉర్దూ కవిత్వంలో కవి పెట్టుకున్న కలం పేరును ‘‘తఖల్లూస్‍’’ అంటారు.
ఈ సర్వర్‍ అనే కవి కలం పేరు పాలకులపై ముల్లుగర్రలా పనిచేసింది. సర్వర్‍ దండా కవితలు సామాన్యుల్ని కడుపుబ్బనవ్వించి చివరికి చైతన్యపరిచేవి.
సైఫాబాద్‍ సైన్స్ కాలేజీ విద్యార్థులు జులూస్‍ లేసి నిజాం కాలేజీ చేరుకుని బంద్‍ చేసిన గేట్లను బద్దలు కొట్టి క్లాసులల్ల ఉన్నోళ్లను ఇవతలికి గుంజి ఆబిద్‍షాప్‍ దాక ఊరేగింపు నడిపిండ్రు. కట్మల్‍ల్లు (పోలీసోల్లకు ముద్దుపేరు) లాఠీలకు పని అప్పగించి పోరల కాల్జేతుల బొక్కలు ఇరగ్గొట్టిండ్రు. తలలు పగిలిన కాలేజీ విద్యార్థులు బ్యాండేజీలు కట్టుకుని నుదుటికి ‘కఫన్‍’ కట్టుకున్నట్లు తమకు తాము వీరులుగా భావించుకుని ఛాతీలు చూపించుకుంట తిరుగుతున్నారు.


ఇగ ఆ మర్నాడు సిటీ కాలేజీ స్టూడెంట్స్ క్లాసులు బాయ్‍ కాట్‍ చేసి జులూస్‍ తీసిండ్రు. జులూస్‍ హైకోర్టు దాటి మదీనా హోటల్‍ చౌరాస్తాలకు చేరంగనే పోలీసుల కాల్పులు జరిగినయ్‍. విద్యార్థులు చనిపోయిండ్రు. వారి శవాలను బందోబస్తు మధ్య ఉస్మానియా దవాఖానాకు తరలించిండ్రు. ఆ శవాలను వాపస్‍ ఇవ్వాలని ప్రజలు పత్తర్‍గట్టీ పోలీస్‍ నాకామీద దాడి చేసిండ్రు. నగరం నవనాడులు బంద్‍ అయినాయి. నిరవధిక కర్ఫ్యూ విధించబడింది. పోలీసులు నరక లోకపు జాగిలమ్ములుగ సడక్‍ల మీద పహరా కాసిండ్రు. అలలు అలలుగ ఉద్యమకెరటాలై ప్రజలు తిరగబడ్డరు. చార్మినార్‍ దగ్గర మక్కామసీదు సాక్షిగ, మాతా లక్ష్మీమందిర్‍ సాక్షిగ మళ్లీ కాల్పులు జరిగినయ్‍. అమాయకంగా రిక్షా తొక్కుకుంట రోడ్డుమీదికి వచ్చిన జాఫర్‍ అన్నయ్య నెత్తికి తుపాకి గుండు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.


కోహీర్‍ ఆకుపచ్చ పొలాల మధ్య ఆనందంగా రోజులు గడిపిన ఒక అమాయకపు రైతుబిడ్డ కాలవాహిని అలల వాలున నగరానికి కొట్టుకొచ్చి బ్రతుకు బండి ఈడ్చుతూ చరిత్ర రథచక్రాల క్రింద నలిగి అకాల మరణానికి గురయ్యిండు. ఆ పాపం ఎవ్వరిది? గరళ కంఠుడైన జనాబ్‍ జాఫర్‍ మియా కాలం కత్తుల వంతెన మీద ముందుకు మున్ముందుకే నడిచి నడిచి ఒక మలుపులో ఒక మజిలీలో మా బాపును కలుసుకుని ఆ సాయంసంధ్య వెలుగుచీకట్ల్ల మా దివాన్‍ఖానాలోని ఆరాం కుర్చీల కూచుని తన ఎదలోని గుండె గాయాలను ఆవిష్కరించుకుని తనను తాను స్వాంతన పరుచుకున్నాడు.
హమేఁ ఆదత్‍ సీ పడ్‍గయీ
దర్ద్ ఓ గమ్‍ సహెనే కీ
హమ్‍ తబ్‍ బీ ముస్కరాతే హైఁ
జబ్‍ ఆయే బాత్‍ రోనే కీ

‘మాకు ఒక అలవాటుగా మారింది
విషాదాన్ని భరించి సహించటం
అయినా మేం చిర్నవ్వులు చిందిస్తూనే ఉంటాం
కన్నీరు కార్చే క్షణాలలో సహితం’.
× × ×
నా బాల్య జీవితానికి జాఫర్‍ మామూ జీవితంతో ఒక బొడ్డుతాడు సంబంధం ఏర్పడిపోయింది. విడదీయరాని అనుబంధమయ్యింది.
మొదటిసారి నేను బడికి పోయింది ఆయన సైకిల్‍ మీదనే. ఆయన సైకిల్‍ తొక్కుతుంటె వెనుక సీటు మీద నేను చక్లంముక్లం కూర్చుని, సంకల కొత్తపలక ఇరికించుకుని జోరుగ, హుషారుగ బడికి పోయిన. అట్ల నా చదువుకు శ్రీకారం చుట్టింది జాఫర్‍ మామూనే. అక్కడ పెద్ద పంతులతో ‘‘సదర్‍ సాబ్‍కా బేటా’’ అని ఘనంగ ఉర్దూల పరిచయం చేసిండు. అపుడప్పుడూ ఇంటర్వెల్లుల తెల్లటి సీమెండి టిఫిన్‍ డబ్బల అమ్మ కలిపిచ్చిన ‘‘మామిడికాయ పప్పన్నం’’ పట్టుకొచ్చెటోడు.


బాపుకు ఆరోగ్యం బాగలేకపోతే ఒక నెల దవాఖానాల ఉన్నడు. ఆ నెలరోజులు మా శాలిబండా నుండి నాంపల్లి సర్కారీ దవాఖానాకు అంత దూరం సైకిల్‍ మీద ‘‘తోషాదాన్‍’’ (టిఫిన్‍ క్యారియర్‍) మోసుకపోయేది. ఇడిసిన మురికి బట్టలు వాపస్‍ తీసుకొచ్చి ఉతికి ఇస్త్రీ చేసినవి పట్టుక పోయేది. మేం పిల్లలం బాపుకోసం రంధి పెట్టుకున్నమని గమనించి మమ్మల్ని ఖుష్‍ చేసేందుకు రసాలూరే తియ్యటి మల్‍గోబా మామిడిపండ్లు, చల్లచల్లటి కర్బూజాలు, తర్బూజాలు పట్టుకొచ్చేది.
ప్రతిజండా వందనం పండుగకు ఒకసేరు తియ్యటి బూంది, సవ్వాసేరు కారా మిక్చర్‍ రెండూ వేరు వేరు చెంగేరీలల్ల (వెదురు బుట్టలు) కట్టించుకుని వాటి మీద గులాబీ రంగులో మెరిసే పన్నీని అతికించుకుని మా ఇంటికొచ్చి అమ్మకు అందచేసెటోడు. ఆయన తెచ్చిన మిఠాయి తింటేనే మాకు జండా వందనం పండుగ పూర్తయినట్టు అనిపించేది.


ఒకసారి నాకు ‘‘టైఫాయిడ్‍’’ వచ్చి మంచంల అరిగోసపడిన. ఒకసారి క్రిందికి మీదికైతే డాక్టర్‍ సాబ్‍ స్వయంగ ఇంటికి వచ్చి నాడీ నిదానం చేసి ముఖం చిన్నగ చేసుకుని పక్క అర్రలకు పోయి అమ్మాబాపులతో చెవులల్ల ఏందో గుసగుస మాట్లాడంగనే వెక్కెక్కి ఏడుస్తున్న అమ్మ గొంతుచప్పుడు వినబడింది. ఆయన పోంగనే నన్ను హడావుడిగ మంచం మీద నుండి దించి క్రింద ఉత్త చాపల పండబెట్టిండ్రు. నాకు తప్ప సంగతి అందరికి సమజ్‍ అయినట్టుంది. కొంచెం సేపు బేహోష్‍ అయ్యి మళ్లీ కండ్లు తెరిచేసరికి నాపక్కన కూర్చున్న జాఫర్‍ మామూ కనిపించిండు.
ఆయన నెత్తిమీద బూరుటోపీ లే. వొంటిమీద నల్లని శేర్వానీ లే, నోట్లె జర్దాపాన్‍ భీ లే. తెల్లని పాలవెన్నెలాంటి మల్లెపూల లాల్చీ, తెల్లటి పైజామా అసుంటి డిరస్‍ల ఆయన్ని నెనెప్పుడు చూడలే. అవి పవిత్ర రంజాను మాసపు ఉపవాసదినాలేమో. కండ్లకు నల్లని సుర్మానేగాక ఆయన వొంటిమీద నుండి చమేలీ అత్తరు సువాసన సన్నగ గుభాళిస్తుంది. నా జ్వరం కండ్లకు ఆయన అల్లా పంపిన ‘‘ఫరిస్తా’’ దేవదూతలాగ కన్పించిండు. నాజూకుగ నా అరచేతిని తన చల్లటి చేతులల్లకు తీసుకుని లోపల్లోపల ఖురాన్‍ కల్మాలను, సురాలను స్మరించుకుంట ఎర్రదారం ఉన్న తావీజ్‍ను నా మెడల కట్టిండు. అది సరిపోదన్నట్లు నాంపల్లి బజార్‍ఘాట్‍ల ఉండే యూసుఫిఁయా దర్గా దట్టీ భీ నా కుడి బుజానికి గట్టిగ కట్టిండు.
అట్లనే నిద్రలకు జారిపోయిన. సాయింత్రం దీపాలుపెట్టే యాళ్లకి మేల్కొచ్చి జరం జారింది. డాక్టర్‍సాబ్‍ కీ ‘‘దవా’’ ఏందో గని జాఫర్‍ మామూ ‘‘దువా’’కా అసర్‍ మాత్రం నన్ను బ్రతికించింది.
ఆ తర్వాత ఆయన మళ్లీ నాకు కనబడలేదు.


× × ×


‘‘జాఫర్‍ మియా బడికి రాక వారం రోజులయ్యింది’’ అన్నడు బాపు.
‘‘వొళ్లేమైనా బాగలేదేమో’’ అన్నది అమ్మ.
ఇంకో వారం రోజులు గడిచినయ్‍.
‘‘కనీసం రుఖ్సత్‍ దరఖాస్త్ (లీవ్‍ లెటర్‍) అయినా పంపలే’’ అన్నడు విచారంగ.
‘‘మరి నువ్వే వాళ్లింటికి పోయి తెలుసుకోరాదా’’ నిష్ఠూరంగ అన్నది.
ఆ తెల్లారి పొద్దుపొద్దుగాల్నే అతనుండే ఖాజీపురా మొహల్లాకు పోయి ఒక గంట తర్వాత ఢీలా ముఖంతో ఇంట్లకొచ్చిండు.
‘‘ఏమైనా తెల్సిందా’’ అడిగింది ఆయన వాలకాన్ని అనుమానంగ చూస్తూ.
‘‘జాఫర్‍ మియా లేడు’’ అని బాపు గుడ్లల్ల నీళ్లు గుబగుబమని పొంగుతుంటే గద్గద స్వరంతో జవాబిచ్చిండు.
‘‘అదేంది ఏమైందాయనకు?’’ నోరెళ్లబెట్టి భీరిపోయింది అమ్మ.
‘‘ఎవరికి ఏమీ చెప్పకుండా మొత్తం కుటుంబంతో సహా మాయమయ్యిండట. బస్తీల అందర్నీ విచారించిన. వాళ్లకు కూడా ఏమీ తెలువదట.’’
అమ్మ ఏడ్చింది.
ఆమెను సముదాయించబోయి బాపు అంత కంటె ఎక్కువ ఏడ్చిండు.
అమ్మాబాపులు ఏడ్చిన తర్వాత కొద్దిరోజులకే మా ఇంటికి టపాల (పోస్టు) ఒక లిఫాఫా (కవరు) వొచ్చింది. అమృత్‍సర్‍ నుండి జాఫర్‍ మామూ రాసిన ఉత్తరం అది. ఉర్దూల ఉన్న ఆ ఉత్తరాన్ని బాపు చదివి అమ్మకు తెలుగుల సమ్‍జాయించిండు. ముక్తసరిగ దాని సారాంశం.


‘‘నాకన్నీటి కథ అంతా మీకు తెలుసు. అవన్నీ జరిగి పదేండ్లు దాటినా ఇంకా భయం భయంగ పాము పడగ నీడక్రింద ఉన్నట్లే బ్రతికిన. నెత్తిమీద కత్తి వేలాడుతుంటే భద్రత, భరోసా ఇవ్వని బ్రతుకు దాని భవిష్యత్తు చీకటిగానే కనబడింది. ఇది మా రాజ్యం కాదని, మళ్లీ మతకల్లోలాలు చెలరేగితే ముస్లింలు మిగలరని నా భయం. ఈ దేశంలో ముస్లింలెప్పుడూ రెండవ తరగతి పౌరులనేది జీవితం నాకు నేర్పిన గుణపాఠం. పాకిస్తాన్‍ మమ్మల్ని గౌరవిస్తుందని, రక్షిస్తుందని నా దృఢ విశ్వాసం. ఢిల్లీలో వీసాలు సంపాదించి అమృత్‍సర్‍కు వచ్చిన. రేపు ఉదయం ఫజర్‍ నమాజులు హిందుస్తాన్‍లో ఆఖరిసారి చదివి ‘‘వాఘా’’ బార్డర్‍ దాటి పాకిస్తాన్‍లో నాకుటుంబంతో సహా ప్రవేశిస్తున్న.
ప్యార్‍ కర్నా పేషా హై హమారా
ఆప్‍ కో యాద్‍ కర్నా ఆదత్‍ హై హమారా
ఆప్‍ పాస్‍ రహేఁ యా దూర్‍
దిల్‍ మే బసాలేనా ఫిత్రత్‍ హై హమారా

‘ప్రేమించటమే వృత్తి నాది
మిమ్మల్ని స్మరించటమే మనాది నాది
మీరు దూరమున్నా దగ్గరున్నా
హృదయంలో ప్రతిష్టించటమే ప్రవృత్తి నాది’
నా నిష్క్రమణ గురించి నేనెవరికి చెప్పలేదు. ఈ రహస్యం మీకు మాత్రమే చెబుతున్న. మీరు చూపించిన ప్రేమాభిమానాలకు లాఖ్‍లాఖ్‍ శుక్రియాలు. ఖుదా హాఫీజ్‍, ఆప్‍కో ఆఖ్రీసలాం. అమ్మాకో మేరా నమస్తే. బచ్చోంకో మేరా దువా.


ఆ ఉత్తరాన్ని చేతిల పట్టుకుని అమ్మాబాపులు ‘‘ఇంట్ల నుండి పీనుగ లేచినట్టు’’ పెద్దగా ఏడ్చిండ్రు. ఆ ఉత్తరం చాలా కాలం మా సందుగలో ఉండె.
పూల్‍ బన్‍కర్‍ ముస్కురానా జిందగీ
ముస్కరాకే గమ్‍ భులానా జిందగీ
హర్‍దిన్‍ న మిల్‍ పాయేతో క్యా హువా
దూర్‍ రహకర్‍ భీ దోస్తీ నిభానా జిందగీ

‘పూవు వోలె చిర్నవ్వులు చిందించటమే జీవితం
చిర్నవ్వులతో చింతలను మరిపించటమే జీవితం
ప్రతి రోజూ కలిసి కనబడక పోతేనేం
దూరతీరాల నుండే స్నేహాన్నికొనసాగించడమే జీవితం.


× × ×


ఆరు పదుల క్రిందటి దుఖ్‍భరీ పురానీ కహాని ఇది.
‘‘ఈ దేశాలు, ఈ సరిహద్దులు, ఈ ముళ్లకంచెలు, ఈ గీతలు, ఈ గోతులు, ఈ గోడలు, ఈ గొడవలు ఎవరు ఎందుకు ఏ ప్రయోజనాల కోసం సృష్టించిండ్రో? మనుషుల్ని మనుసుల్ని ముక్కలు ముక్కలు చేసే దేశాలు, దేశదేశాల రాజకీయాలు’’.
ఇప్పటికి ప్రతి జండా వందనం పండుగ నాడు నేను జాఫర్‍ మామూ తెచ్చే మిఠాయి కోసం ఎదిరిచూస్తుంటాను. ఆయనెక్కడుంటేనేం ఏ దేశంలో వుంటేనేం! హమేషా అల్లా దయ వల్ల చల్లగా సలామత్‍గ ఉండాలి.
‘‘మందిర్‍ తోడో
మస్జిద్‍ తోడో
మగర్‍ ప్యార్‍ బరా
దిల్‍ మత్‍ తోడో.’’

(బులేషా, సూఫీ కవి, పంజాబ్‍)
(చార్‍మినార్‍ కథలు-పుస్తకం నుంచి)


-పరవస్తు లోకేశ్వర్‍,
ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *