అవును ఇప్పుడది ఒక ఊరు. క్రీ.శ.12-13 శతాబ్దాల్లో కాకతీయ విధేయ సామంతులైన గోన వంశీయుల రాజధాని పట్టణం. చుట్టూ ఎత్తైన మట్టిగోడ, లోతైన కందకం, రాకపోకలకు ప్రవేశ, నిర్గమ ద్వార తోరణాలు, నిత్యం జనసమ్మర్ధం, అధికార గణంతో కిక్కిరిసిన పాలనా కేంద్రం. కోటలోపల వరుసలు దీరిన రాచబాటలు, సువిశాల ప్రాంగణాల్లో ఆకాశాన్నంటుతున్న భవంతులు, తళుకులీనుతూ ఆకాశంలోని సూర్య చంద్రుల్లాంటి ఆలయాల బంగారు కలశాల ధగధగలు, ఒకటి కాదు రెండు కాదు, లెక్కలేనన్ని గుళ్లు, గోపురాలు. వాటి నిండా కనువిందుచేస్తున్న వాలుతూ, లేస్తున్న వందల కొద్ది పావురాలు. ఊరికి వెలుపల సముద్రాన్ని తలపించే చెరువు. దాని నీటితో కళకళలాడుతున్న పచ్చటి పొలాలు. వికృతి అన్న మాటకు అర్థం లేకుండా చేస్తున్న సుందరతర ప్రకృతి. వెరశి ఆ ఊరు వడ్డమాను, నాగకర్కర్నూల్ తాలూకాలోని నందివడ్డెమాను. నిజానికి అది వడ్డమానుకాదు. వర్ధమానపురం. 24వ జైన తీర్థాంకరుడైన వర్ధమాన మహావీరుని ఆలయం వల్ల వర్ధమానపురమైంది. రాను రాను వడ్డమానైంది. ఊరి బయట శివాలయం, రంగమండపంలో ఉన్న అతి పెద్ద నంది శిల్పం వల్ల నంది వడ్డమానైంది.
కాకతీయ గణపతి దేవుడు, రుద్రమదేవిల సామంతుడైన గోనగన్నారెడ్డిది అదే వూరు. క్రీ.శ.1229 నాటి అతని శాసనమే అందుకు సాక్ష్యం. ద్విపద ఛందస్సులో రంగనాధ రామాయణాన్ని రాసిన గోనబుద్ధారెడ్డిదీ, క్రీ.శ.1294లో రాయచూరు కోటగోడల్ని కట్టిన గోన విఠలరెడ్డిది అదే వూరు. ఆ వూరిలో ఉన్న వీరభద్ర, కాళిక, గౌరమ్మ, చెన్నకేశవ, వర్ధమాన జైన దేవాలయాలతో పాటు, అరుదైన త్రైపురుష దేవాలయముంది. ఇది ఈ వూరికే కాదు, తెలంగాణా, ఆంధ్రాల్లో అరుదైన దేవాలయం. ప్రస్తుత బాపట్ల జిల్లా, వలివేరు (మావూరు)లో క్రీ.శ.12వ శతాబ్ది త్రైపురుష దేవాలయముంది. కర్ణాటకలోని బేలూరులో క్రీ.శ.9వ శతాబ్దినాటి, బీజాపూర్ జిల్లా సలోద్గిలో క్రీ.శ.945 నాటి, రాయచూరు తాలూకా బల్లల్లిలో క్రీ.శ.1022 నాటి, అదే జిల్లా జావూరులో క్రీ.శ.1135 నాటి త్రైపురుషాలయాలున్నాయి.
ఇంతకీ త్రైపురుషాలయమంటే ఏమిటి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విడిదిగానీ, హరిహరపితామహ అన్న పేరున ఒకే విగ్రహంలో ముగ్గురు దేవతల్ని చెక్కి ప్రతిష్టించిన ఆలయాన్ని త్రైపురుష దేవాలయమంటారు. అందులో అలాంటి అరుదైన త్రైపురుషాలయం నందివడ్డమాన్లో ఉంది. సృష్టి, స్థితి, లయ కారులైన ముగ్గురికి ప్రాధాన్యత, మూడు మత శాఖల మధ్య సమన్వయం కోసం, స్మార్త స్ఫూర్తితో గోన వంశీయులు ఈ ఆలయాన్ని నిర్మించి, మతసామరస్యానికి శ్రీకారంచుట్టారు.
మూడు గర్భాలయాలు, వాటికి ఆనుకొని అర్ధమండపాలు, చూడముచ్చటి ద్వారశాఖలు, పైన ఎత్తైన కదంబ నాగరశైలి విమానాలు, అన్నీ బాగానే ఉన్నాయి. అంగరంగభోగాల్లో రంగభోగాన్నందించే రంగమండపంలో నర్తకి నర్తించే రంగశిల ఉందిగానీ, మండపం మాయమైంది. తరతరాల ఆలయ సంస్క•తికి తీరని గాయమైంది. అర్ధమండపం ముందు గోడలు, జాడలు తప్పుతున్నాయి. గర్భాలయంలో ధూప, దీప, నైవేద్యాలందుకోవాల్సిన మూలమూర్తులు ఎక్కడికెళ్లాయో ఎవరికీ తెలియదు. ధ్వజస్థంభం నిజరూపం కోల్పోయింది. బలిపీఠం వెలివేయబడింది. నందివాహనం నామరూపాల్లేకుండా పోయింది. ప్రాకారం ఆకారం కోల్పోయింది. నిత్యకళ్యాణం, పచ్చతోరణాలతో కళకళలాడిన త్రైపురుష దేవాలయం వెలవెలబోయింది. చూపరుల కళ్లల్లో నీరొలికిస్తుంది. ఎవరికోసమో ఎదురు చూస్తోంది!
–ఈమని శివనాగిరెడ్డి-స్థపతి,
ఎ : 9848598446