సకల సంతోషాల సంక్రాంతి


తెలుగు ప్రజలకు సంక్రాంతి ప్రీతికరమైన పండుగ. సంవత్సరకాలంలో సూర్యుడు 12 రాశులలో నెలకు ఒక రాశి చొప్పున సంచరిస్తాడని ఖగోళశాస్త్రం చెబుతోంది. ఇలా సంచరించే సమయాన సూర్యుడు ఆంగ్ల సంవత్సరం జనవరి వచ్చేసరికి ధనూ రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అంటారు. ఇది పవిత్రమైన కాలంగా ప్రజలు భావిస్తారు. ఎందుకంటే మనకున్న రెండు అయనాల్లో సూర్యుడు దక్షిణాయన కాలం ముగించుకొని ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశిస్తాడు. ఇది సంక్రాంతి రోజునే ప్రారంభమౌతుంది. కనుక ఇది ఉత్తరాయణ పుణ్యకాలం అని పెద్దలు నిర్ణయించారు. అందుకనే మహాభారత యుద్ధంలో భీష్ముడు అంపశయ్యపైన్నే ఉండి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతనే నిర్యాణం చెంది కైవల్యప్రాప్తిని పొందాడని చెబుతారు.


సంక్రాంతి పండుగ క్రమం

సంక్రాంతి పండుగ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది రంగవల్లుల ముత్యాల ముగ్గులు. హరిదాసుల క•ష్ణార్పణం సంకీర్తనలు. ఈ పండుగను పెద్దపండుగ అని కూడా అంటారు. ఇది పుష్యమాసం (జనవరి)లో వస్తుంది. ఈ సమయంలో రైతులు ఇళ్లకు ధన, ధాన్యరాశులు చేరుతాయి. ప్రజలు పాడి పంటలతో, సుఖశాంతులతో ఉంటారు. ఈ సమయంలో వచ్చే సంక్రాంతి పండుగను వరుసగా మూడు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు ‘‘కామభోగి’’, రెండోరోజు ‘‘సంక్రాంతి’’, మూడోరోజు ‘‘కనుమ’’ (పశువుల పండుగ), కొందరు నాలుగోరోజును ‘‘ముక్కనుము’’గా జరుపుకుంటారు.


మొదటిరోజు భోగి
గ్రామాల్లో తెల్లవారుజామునే నాలుగు రోడ్లకూడలిలో భోగిమంటలు వేస్తారు. గ్రామ, ఇంటి అరిష్టాలు, రోగ, పీడలు తొలిగిపోవడానికి మంటలను కాస్తారు. అలాగే ఇళ్లలో బొమ్మల కొలువులు, చిన్న పిల్లలకు భోగిపళ్లు పోయడం, దిష్టి తీయడం వంటి ఆచారాలు చేస్తారు.


రెండో రోజు సంక్రాంతి

పంటలు చేతికి రావడంతో ఇళ్లలో ఉన్న పంటల ధాన్యరాసులను చూసుకొని రైతులు మురిసిపోతుంటారు. సనాతన సంస్క•తిలో సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. నెల రోజుల నుంచే ఈ పండుగ హడావుడి మొదలవుతుంది. దీన్ని నెల పట్టడం అంటారు. ధనుర్మాసం ప్రారంభమయ్యేది అప్పుడే. సంక్రాంతి నెల పట్టిన దగ్గర్నుంచి అంటే డిసెంబర్‍ 14, 15వ తేదీ దగ్గర నుంచి గ్రామాల్లో, పట్టణాల్లో రంగవల్లులు, పండుగ సందడి ఊపందుకుంటుంది. గ•హలక్ష్ములు వేకువజామునే లేచి తమ ఇంటి వాకిళ్లను శుభ్రంగా ఊడ్చి, కళ్లాపి జల్లి ఆపై ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెడతారు. ఇక హరిదాసుల నగర సంకీర్తనలు ప్రజల్ని భగవంతుడిపై భక్తి పారవశ్యంలోకి తీసుకెళ్తాయి. గంగిరెద్దుల వారి సన్నాయి మేళాలు, కొమ్ము దాసరులు, జంగమదేవరలు, బుడబుక్కల వారు తమ కళా రూపాలతో సంక్రాంతి పండుగకు గ్రామ గ్రామాన అలరిస్తూ శోభాయమానం కలిగిస్తూ వినోదాన్ని పంచుతారు. ఎడ్ల పందాలు, బరువులాగుడు పందాలు, కోడి పందాలు, కబడ్డీ క్రీడలు, పతంగులు ఎగరేయడాలు, గుండాటలతో గ్రామాలను సంబరాల్లో ముంచెత్తు తారు. ప్రతీ ఇంటి ముంగిట విభిన్న రీతుల్లో పెట్టిన ముగ్గుల మధ్యలో గొబ్బిళ్లను అలంకరిస్తారు. వాటిని ఆవుపేడతో చేసి వాటిపై గుమ్మడి, బంతి, చేమంతి తంగేడు వంటి పూలను ఉంచి అలాగే నవ ధాన్యాలను పోసి పూజలు చేస్తారు. నెలరోజులపాటు ఇంటి ముందు రంగుల ముగ్గులు వేసి చివరి రోజు ‘‘రథం ముగ్గు’’ వేస్తారు. కార్తీకమాసం మొదలుకొని సంక్రాంతి పూర్తయ్యే వరకు రహదారులన్నీ రంగుల ముగ్గులతో నిండి సంక్రాంతి శోభను విరాజింపజేస్తాయి.


కనుము పండుగ
కనుము పండుగను మూడోరోజు జరుపుకుంటారు. కనుము అంటే పశువు అని అర్థం. ప్రధానంగా పశువులను ఆరాధించే రోజు. హిందువుల సనాతన ధర్మంలో గోవులను పూజిస్తున్న నేపథ్యంలో ఏరువాకతో జీవనాధారమైన గోవుల సంతతి అయిన పశువులను పూజించడం ఆచారం. ఈ నేపథ్యంలో కనుము రోజు పశువులు ఉండే పాకలను శుభ్రం చేస్తారు. పశువులను గ్రామంలోని చెరువులో శుభ్రంగా కడుగుతారు. అనంతరం వాటి కొమ్ములకు పసుపు, కుంకుమలు రాసి, నొసట బొట్టు పెట్టి అందమైన బంతిపూలతో అలంకరించి ఆరాధిస్తారు.

  • దక్కన్‍న్యూస్‍,
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *