మాడభూషి రంగాచార్య స్మారక సంఘం వారు గత ఇరవై యేళ్లుగా బాలసాహిత్య రంగంలో చేస్తున్న కృషి ఎంతో శ్లాఘనీయం. ప్రతి ఏటా నవంబరు నెలలో హైదరాబాద్‍లోని పాఠశాలల బాలబాలికలకు కథల పోటీ నిర్వహిస్తుంది. అందులో బాగున్న కథలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు పదకొండు ప్రోత్సాహక బహుమతులను మార్చి 11న అందజేయడంతో పాటు ఇద్దరు బాల సాహితీవేత్తలను సన్మానించడం జరుగుతుంది.
ఈ యేడాది మార్చి 11న హైదరాబాద్ నగరంలోని శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో గిరిజ పైడిమర్రి అధ్యక్షతన స్మారక సమావేశం జరిగింది. సంస్థ కన్వీనర్ మాడభూషి లలితాదేవి సాహితీరంగంలో తమ సంస్థ చేస్తున్న కృషిని వివరించారు.
ముఖ్య అతిథిగా చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఛైర్మన్, దక్కన్‍ల్యాండ్, బాలచెలిమి పత్రికల సంపాదకులు మణికొండ వేదకుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాలసాహితీవేత్త డా. సిరి రాసిన ‘రాచ ఏనుగు’ బాలల కథల పుస్తకాన్ని ఆవిష్కరించారు. బాల సాహితీవేత్తల సన్మానం, విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. వేదకుమార్ తన ప్రసంగంలో విద్యార్థులలోని సృజనాత్మక శక్తులను వెలికి తీయాలని, ఆ బాధ్యత ప్రధానంగా ఉపాధ్యాయులది, తల్లిదండ్రులది అని చెప్పారు. అలాంటి పిల్లలకు తాము ఎల్ల వేళలా అండగా ఉంటామని చెపుతూ… ఆ సందర్భంలో బహుమతులు అందుకున్న పిల్లలకు బాలచెలిమి పత్రికను సంవత్సరం పాటు ఉచితంగా అందజేస్తామన్నారు. పిల్లలు రాసిన సృజనాత్మక రచనలను తమ పత్రికలో ప్రచురిస్తామని చెప్పి వాళ్ళను ప్రోత్సహించారు. బాల సాహిత్యరంగంలో మాడభూషి రంగాచార్య స్మారక సంఘం చేస్తున్న కృషిని కొనియాడారు.
సన్మాన గ్రహీత మొలక బాలల పత్రిక సంపాదకులు తిరునగరి వేదాంత సూరి మాట్లాడుతూ… వార్త దినపత్రికలో మొగ్గ పిల్లల పేజీకి తాను చాలా కాలం ఇన్‍చార్జిగా పనిచేసానని ఎంతోమంది మొగ్గ (పిల్లలు) పాఠకులు ఈనాడు ఉన్నతస్థానంలో ఉన్నారని, పిల్లలు అనుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదని అన్నారు.
సన్మానగ్రహీత బాలసాహితీవేత్త గరిపెళ్లి అశోక్ మాట్లాడుతూ.. మునుపెన్నడూ లేనంత విస్త•త స్థాయిలో ఈనాడు బాల సాహిత్యం వస్తున్నదని, బడి పిల్లలే తమ జీవితంలోని సంఘటనలను కథలుగా రాస్తున్నారని తెలిపారు.
ఈ కథల న్యాయ నిర్ణేతగా బాలసాహితీవేత్త డా. హారిక చెరుకుపల్లి మాట్లాడుతూ.. అన్ని కథలూ బాగున్నాయని, కానీ పోటీ అన్నాక కొన్ని కథలను మాత్రమే ఎంపిక చేయడం తప్పదని, బహుమతి రాని పిల్లలు నిరుత్సాహపడవద్దని చెపుతూ పిల్లలు రాసిన నాలుగు కథలను సమీక్షించారు. సెల్‍ఫోనును అర్థవంతంగా ఎలా ఉపయోగించవచ్చునో తెలిపే కథ ప్రథమ బహుమతికి ఎంపికైంది. దీనిని ఎనిమిదో తరగతి చదివే మాంకాల
ఉజ్వల రాసింది. మార్కులే కొలమానం కాదంటూ… జడ్.పి.హెచ్.ఎస్. బొల్లారం ఎనిమిదో తరగతి విద్యార్థి గణపతి వెంకట్రావు రాసిన కథ ద్వితీయ బహుమతి పొందింది.
- పైడిమర్రి గిరిజ
ఎ : 994944341