చరిగొండ చరిత్ర

చరికొండ గ్రామము పాత మహబూబ్‍ నగరం జిల్లా, కల్వకుర్తి తాలుకా, ఆమనగల్‍ మండలంలో వుండేది. ఇప్పుడది రంగారెడ్డి జిల్లా, కడ్తాల మండలానికి మార్చబడ్డది. గ్రామానికి ఉత్తరంగా మేడిపల్లి నక్కేర్త, తూర్పున కొలుకులపల్లి, దక్షిణాన నాగిళ్ళ, పడమర ముదివెన్ను గ్రామాలున్నాయి.


చరికొండలో అడివి దాదాపు 5వేలఎకరాలలో విస్తరించి వుండేది. అడవిలో నీటివూటల కాలువలు, వూరి దగ్గర పారే కల్లెడ వాగు, గౌరమ్మ చెరువు చరికొండ నీటివనరులు. ఊరావల గుట్టల్లో నాగప్పచెరువు, పెరుమాండ్ల కుంట, కొత్తచెరువులు అదనపు నీటిసంపదలు. ఊరికి వ్యవసాయాధారాలు.


చరిగొండసీమ ప్రశస్తి
కవులకు పుట్టినిల్లు, బుధకాండము మెట్టినఇల్లు, అగ్రసం
భవులకు నల్లయిల్లు, పలువర్ణములున్‍ విలసిల్ల నిత్యమై
భవములపెల్లు, దుర్మతుల పాలిటి ముల్లు అనంగ జెల్లు, నుం
కువయయి శ్రీలకున్‍ ‘చరియగొండ’ సదా శుభవర్తి గావునన్‍
(దుందుభి పత్రికలో గుండూరు హనుమత్‍ శర్మగారు రాసిన కల్వకుర్తి సీమ ప్రశస్తి పద్యాన్ని చరియగొండ ప్రశస్తికనువుగా మార్చినందుకు మన్నింపుకోరుతూ…)
చరిగొండ చారిత్రకంగా, సాహిత్యపరంగా, రాజకీయపరంగా అన్నివిధాల బహుధా ప్రశంసలకు యోగ్యతగల పట్టణం. చరిగొండ ధర్మన్న చరిగొండకు ఖ్యాతితెచ్చిన గొప్పకవి ఈ వూరి వాడే.
గ్రామంలో ఉత్తరదిశలో రుక్మిణీ, సత్యభామా సమేత వేణుగోపాలస్వామి దేవాలయముంది. ఈ దేవాలయంలోని స్వామికి ప్రతిసంవత్సరం ఫాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.


ఇంకా ఈ గ్రామంలో గ్రామదేవతలు దుర్గమ్మ, పోచమ్మ, కోటమైసమ్మలకు గుడులు వున్నాయి. దుర్గమ్మదేవత మహిమ కలదని, భయంకర స్వరూపిణి అని చెప్పుకుంటారు ప్రజలు. దుర్గమ్మ అష్టభుజి. చక్రం, త్రిశూలం, ఖడ్గం, శంఖం, విల్లు, గదలు ఆరుచేతులలో, మిగిలిన రెండు నిజహస్తాలు అభయ, వరదహస్తాలుగా ఉన్నాయి. మణిమయకిరీటం, సింహవాహనంపై దేవి సుఖాసనంలో ఆసీనురాలై వున్నది. కొత్త శిల్పం.
ఊరి సమీపంలోని పెరుమాండ్లకుంట దగ్గర శివాలయం ఉంది. అది శిథిలమైన గుడి. అక్కడొక తలలేని నంది పడివుంది. ఆ గుడికెదురుగా ఉన్న రాతిగుండు చెక్కి వున్న అర్థశిల్పాలు చాలా విశేషమైనవి. అక్కడ కనిపించే మూడు శిల్పాలలో

1.మొదటి శిల్పం చతుర్బుజుడైన మూర్తి వెనక రెండు చేతుల్లో వంపుదిరిగిన దండాన్నెత్తుకుని, ముందు కుడిచేయిని లాస్యంగా వదిలి, ఎడమచేతిలో ఫలం ధరించివున్నాడు. పాదాలు నాట్యభంగిమలో వున్నాడు. శివగణంలోనివాడు.
2.మధ్యలో నాలుగు చేతులతో, మూడు కాళ్ళతో కనిపిస్తున్నది. శివుని ప్రమథగణంలోని ప్రముఖుడు భ•ంగి. నాట్యలోలుడు. పరమశివభక్తుడు. అర్థనారీశ్వరునిలో పార్వతిని వదిలి శివునికొక్కనికే మొక్కి దేవతచేత శపించబడ్డవాడు.
3.మూడవ చివరి శిల్పం నందిది. నంది భ•ంగి నాట్యాని కనువుగా మ•దంగం వాయిస్తున్నాడు.

ఇంతవరకు తెలంగాణాలో ఒకేచోట ఇటువంటి శిల్పాలు అగుపించలేదు. అక్కడికి కొంత దూరంలో ఒక రాతిగుండుకు 4 అర్థశిల్పాలు చెక్కివున్నాయి. పరిశీలిస్తే 3గురు శైవమత గురువులు ఆసనస్థితిలో… అగుపిస్తున్నారు. చివర కాయోత్సర్గభంగిమలో జైన తీర్థంకరుని శిల్పం వుంది. 6,7 శతాబ్దాల నుంచి అతిశైవశాఖలైన కాలాముఖులు, కాపాలికులు, మాహేశ్వరులు, వీరవ్రతుల వంటివారు బౌద్ధ, జైన మత నిర్మాణాలు, గురువుల మీద దాడులు చేసేవారు. ఇక్కడ ఈ ముగ్గురు కాలాముఖగురువులు జైన గురువు మీద దాడిచేసిన సందర్భం అనిపిస్తున్నది.
ఆ పరిసరాల్లోని ఒకరాతిగుండుకు చెక్కిన చతుర్భుజ గణపతి. పొట్టమీద ఉదర(నాగ)బంధం. మూషికవాహనం. 9,10 శతాబ్దాల శిల్పశైలి. పెట్రోగ్లైఫ్‍ వంటి శిల్పం లోతులేని అర్థశిల్పం.


రాతిగుండుకే చెక్కిన విలుకాడు వీరుడు. పొడవైన జడతో కత్తి, డాలుతో కనిపిస్తున్నాడు. శైలిని బట్టి ఈ వీరగల్లు శిల్పం 17, 18 శతాబ్దాలకు చెందినది. గ్రామరక్షణకై ప్రాణత్యాగం చేసిన వీరుని యాదిలో వేసిన స్మారకవీరశిల.


గ్రామము చివర పాతకాలంనాటి మసీదు వుంది. అక్కడికి దగ్గరగా హజ్రత్‍ పీర్‍ గయిబ్షావలి దర్గాషరీఫ్‍ ఉన్నది. అక్కడక్కడ పాతకాలం కుతుబ్షాహీల కాలంనాటి ముస్లింసమాధుల మీద బొడ్డురాళ్ళు పడివున్నాయి. సమాధులు వుండివుండాలి.
గ్రామానికి ఉత్తరదిశలో ఖిల్లాగుట్ట వుంది. గుట్టమీద కోట ఆనవాళ్ళున్నాయి. గుమ్మటాలు అని ప్రజలు పిలుచుకునే కట్టడాలు 4 మిగిలివున్నాయి. ఈ కోటను రేచెర్ల పద్మనాయకులు కట్టించారని చరిత్ర. రాచకొండను, దేవరకొండను పాలించిన పద్మనాయకులే చరిగొండలో కోటను నిర్మింపజేసారు.
ద్వారము నుంచి కోట లోపలికి ప్రవేశించగానే పెద్దబావి అగుపిస్తుంది. ఆ బాయి వొడ్డున నిలబడి రాయి విసిరితే అవతలి వొడ్డుకు పడదని స్థానికులు చెప్పుకుంటారు. అంత పెద్దబాయన్న మాట.


మరొకచోట ఒక బండకింద వున్న బావిని ‘కన్నికల బావి’ (కన్నెలబాయి?) అని పిలుస్తారు. ఆ బండ కిందకు కొందరు స్త్రీమూర్తుల శిల్పాలు చెక్కివున్నాయి. కూలిన ఆర్చులతో శిథిలమైన నివాసాలజాడలు. భోగందాని మంటపంగా పిలువబడే కాపలా స్థానం. చాలాదూరం మిగిలివున్న రాతి కోటగోడ కనిపిస్తాయి.


పద్మనాయకరాజు తవ్వించిందే చరిగొండలోని గౌర సముద్రం. రేచెర్ల పద్మనాయక రాజయిన రెండవ లింగమనీడు శాలివాహన శకము 1349, ప్లవంగనామ సంవత్సర, మార్గశిర పౌర్ణమినాడు అనగా క్రీ.శ. 1427 డిసెంబర్‍ 4వ తేదీన లింగమనీడు భార్య గౌరీదేవి పేరున ఈ చెరువు నిర్మాణము చేయించెనని చరిగొండ శాసనమువల్ల తెలుస్తున్నది. అంతేగాక ఆమె శ్రీశైల మల్లిఖార్జున స్వామికి, తిరుపతి వెంకటేశ్వరస్వామికి కానుకలు అర్పించిందట. భక్తులకు ధర్మసత్రాలను కట్టించినదట.


చెరువుకట్ట మీద తొవ్వలో హనుమాండ్లు, తిరునామపీఠం చెక్కిన రాతిస్తంభం ఉంది. దుర్గమ్మగుడి ముందు నుంచి పొయ్యే గౌరమ్మచెరువు కాలువ గ్రామాన్ని రెండుగా చేసింది. కాలువకు దక్షిణాన చరికొండ పట్టి పడకలు, ఉత్తరాన చరికొండ పట్టి కల్వకుర్తి. వెనుకటి తూర్పుకోట, పడమటికోట అని ఇద్దరు మక్తేదార్ల నివాసాలు శిథిలస్థితిలో వున్నాయి.


గౌరమ్మ చెరువు ఆవలి వొడ్డున పడమర దిక్కున ఒక దేవాలయమున్నది. వాటిని క•ష్ణాపురము గుళ్ళు అంటారు. పెరుమాళ్ళకుంట శిథిల దేవాలయానికి వైష్ణవ ద్వారపాలకు లున్నారు. ద్వారానికి లలాటబింబంగా గజలక్ష్మి. ద్వారానికి కుడిపక్కన పెద్ద భక్తాంజనేయుని విగ్రహముంది. అంతరాళ ద్వారానికి లలాటబింబం చతుర్భుజి లక్ష్మిదేవిని ఏనుగులు అభిషేకిస్తున్నాయి. సుఖాసనస్థితి. దేవాలయద్వారానికి రెండువైపుల కీర్తిముఖతోరణాలతో చతుర్భుజులైన వైష్ణవద్వారపాలకులు. లోపల మంటపస్తంభాలు కనిపిస్తున్నాయి. అక్కడి శిథిల దేవాలయ ద్వారానికి కూడా లలాటబింబం గజలక్ష్మియే. వైష్ణవ ద్వారపాలకులు.


త్రిభుజశీర్ష రాతిఫలకమ్మీద అర్థశిల్పంగా చతుర్భుజుడైన వీరభద్రుని విగ్రహం అభంగ భంగిమలో అగుపిస్తున్నది. దక్షుడున్నాడు.


కోనాపురం నుండి చరికొండకు వచ్చే తొవ్వలో రాకాసిగుళ్ళు, రాక్షసుల బొందలు అని పిలువబడే మెగాలిథిక్‍ సమాధులున్నాయి.
చరిగొండ ధర్మన్న చిత్రభారత కావ్యం రాసిన కవి. చరిగొండ వాడే. వరంగల్‍ నేలిన షితాబుఖానను సీతాపతి వద్ద మంత్రిగా పనిచేసిన ఎనమలూరి పెద్దనకు 8 ఆశ్వాసాల ప్రబంధ కావ్యాన్నంకితం చేసాడు చిత్రభారత కవి చరిగొండ ధర్మన్న. పెద్దన ధర్మపురికి చెందినవాడు. ధర్మన్న జీవితాకాలాన్ని ఆయన రచనలతో లెక్కించి క్రీ.శ. 1480 నుంచి 1530గా నిర్ణయించారు. ధర్మన్న ‘‘శతలేఖిన్యవధాన పద్యరచనా సంధాన సురత్రాణ చిహ్నితనామా, చరికొండ ధర్మసుకవీ’’ అని పిలువబడ్డాడు. చరిగొండ ధర్మన్న అవధానంలో ప్రవీణుడు. గంటకు వందపద్యాలు చెప్పగలవాడట.
మరొక ప్రతిభావంతుడైన కవి చరిగొండకే చెందిన హొన్నయ్య. ఈయన 17వ శతాబ్దంలో ‘జ్యోతిష్యరత్నాకరం’ రచించాడు. ప్రస్తుతమీ గ్రంథం లాస్‍ ఏంజెల్స్ గ్రంథాలయంలో వుందని ‘చరిగొండ చరిత్ర’ రాస్తున్న యారీదా రాధాక•ష్ణా రావు గారు చెప్పారు.


చరిగొండ గధేగల్‍ శాసనం:
చరిగొండ ఖిల్లా మీద బండరాయిపై కుతుబ్షాహీలకాలంనాటి ఒక శాసనఫలకం ఉంది.
శాసనభాష: తెలుగు శాసనలిపి: తెలుగు శాసనపంక్తులు: 12.
శాసన సందర్భం: దాన శాసనం.
శాసన సమయం: శక సం. 1418 నలనామ సం.ర ఆశ్వయుజ శుద్ధ దశమినాడు అనగా క్రీ.శ. 1496 సెప్టెంబర్‍ 17వ తేదీ శనివారం.
శాసనకాల పరిపాలకుడు: బీదర్‍ బహమనీసుల్తాను షాబుద్దీన్‍ మహమూద్‍ (1482-1518) పాలనలో తెలంగాణా గవర్నర్‍ కుతుబుల్‍ ముల్క్.
దానగ్రహీత: బొమ్మజియ్యవ తిపజియ్యవ బసవజయ్య.

శాసనపాఠం:
 1. స్వస్తిశ్రీ శాక 1418 అగు నల సంవత్సర ఆశ్వజ
 2. శుద్ధ 10గు నాడు ఖానె ఆజంమల్లూఖా నవొదయలుంగారి
 3. మలుక శరఖు మలుక మింన్నాజయినుకారు పరమా వొదయలు
 4. 0గారు చరికొండ్డ బొంమజియ్యవ తిపజియ్యవ బసవజయ్య గార్కి ఇ
 5. చ్చిన శాసనపత్రము।। హులిమఖలోను వలివేండ్రి చలిమల వె
 6. స్వకాలం యెనిమిది నెల్లొని(క్మా)పొయను కట్టడిచేశి మీకు సిప్పా
 7. హంజా నవొదయలుంగారు మాకు గవురసముద్రవెన
 8. క ఖా.. పుట్టెడు వడ్లపొలం యిచ్చినారు. ఆ పొలంలోన మీ
 9. కు వొరబూవుపొలం యిస్తిమి।। ఖాన వొదయలుంగా
 10. రు కారు పరమాయిచ్చన కవులు క్రమాననిని మున్ను ఇస్తిమి యె
 11. యింద్దుకు యవ్వరు తప్పినాంను వాని ఆలి మింద గాడిది
 12. …యెక్కును మంగళ మహా శీశీశ్రీ
  శాసనం కొసన స్త్రీపైన పడుతున్న గాడిద బొమ్మ చెక్కివుంది.

శాసన సారాంశం:
బీదర్‍ బహమనీ సుల్తాను షాబుద్దీన్‍ మహమూద్‍ (1482-1518) పాలనలో తెలంగాణా గవర్నర్‍గా కుతుబుల్‍ ముల్క్ వున్నపుడు రాజప్రతినిధి ఖాన్‍ ఆజం అలీఖాన్‍ మాలిక్‍ సరఖ్‍ మాలిక్‍ మిన్నా జైన్‍ పరమవొదయలుగారు చరికొండలోని బొమ్మజియ్య గారి బసవజయ్యకు వేసవికాలంతో పాటు 8నెలలు పంటసాగు చేసుకునే, పుట్టెడు వడ్లు పండే భూమిని గౌరసముద్రము వెనక యిచ్చాడు. ఇది కవులుగా యివ్వబడింది. ఇందుకు ఎవరు తప్పినా, శాసనం తప్పినవాని భార్యమీద గాడిద ఎక్కును అంటే వానిభార్య గాడిదచే భోగింపచేయబడునని శాసన శాపోక్తి చెప్పబడింది.
ఇటువంటి శాసనాలను ‘గధే(గాడిద)గల్లు’లంటారు.


గధేగల్లులు: వీరగల్లు, సతిగల్లు, వీరశైవభక్తిగల్లు, జంతువీరగల్లులు చూసాం. కొందరికి మాత్రమే తెలిసిన కొత్తది ‘గధే(గాడిద)గల్లు’. మహారాష్ట్ర (బరోడా, బీజాపూర్‍, తుల్జాపూర్‍), గోవా, గుజరాత్‍, బీహార్‍, తెలంగాణాలలో ఈ గాడిదగల్లులు కనిపిస్తున్నాయి. ఇవి ప్రధానంగా 11వ శతాబ్దం నుంచి కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఇవి దానశాసనశిలలు. సాధారణంగా దానశాసనాలలో అంతిమంగా దానాన్ని తప్పినవారు పాపాన్ని మూటగట్టుకుంటారని హెచ్చరించే శాపోక్తుల శ్లోకాలుంటాయి. అటువంటి హెచ్చరికగా శాసనాల కింద స్త్రీతో గాడిద సంభోగ ద•శ్యాలు చెక్కివుండడం ‘గాడిదగల్లుల’ ప్రత్యేకత. నాటి పాలకుల ఆజ్ఞ, అధికారం, శాసనాన్ని పాటించని, విధేయత చూపనివాడి తల్లిని లేదా వాడింటిలోని స్త్రీని గాడిదతో సంభోగింపచేసే శిక్ష వేస్తారని సూచించే శిలాఫలకం ఈ ‘గధేగల్‍’. ఇది దారుణమైన శాసనం. Harshada Wirkud వంటి చరిత్రకారులు వీటిని (Asscurse steles) అన్వేషించి బయటకు తీయించి పరిశోధనలు జరిపి పుస్తకంగా తెచ్చారు. ఇంకా కొంతమంది పరిశోధనలు చేసారు, చేస్తున్నారు కూడా.
పై శాసనం తరవాత వేయబడిన మహబూబునగర్‍ జిల్లా శాసనాల సంపుటిలో పేజి.నం.167, శాసనం సం. 70 కోయల కొండ శాసనంలోని 57,58 పంక్తులలో శాసనాన్ని తప్పిన వారు ‘… యిదిగాక తమ మానము గాడుదులకు యిచ్చిన….’ అని వుండడం చేత ఆ శాసనం మరొక ‘గధేగల్లు’ శాసనంగా చెప్పవచ్చు.


ఈ శాసనంలో పేర్కొనబడిన గౌరసముద్రం ప్రస్తావన మహబూబునగర్‍ జిల్లా శాసనాల సంపుటిలో పేజి.నం.105, శాసనం సం. 34 చరికొండశాసనం, చరికొండలో గతంలో చదివి, పరిష్కరించబడిన శాసనం రేచెర్ల పాలకులు 2వలింగమనేడు పాలనా కాలంలో క్రీ.శ. 1427 సం.లో వేయబడినది. తెలుగులిపి, సంస్క•త భాషలలో వున్నది. లింగమనేడు భార్య గౌరి తనపేర చరికొండలో ఒక చెరువును తవ్వించింది. ఆ చెరువు ఇప్పుడు ఆమె పేరుతో ‘గౌరసముద్రమ’నే పిలువబడుతున్నది.


ధన్యవాదాలు: ఫోటోలు, చారిత్రక వివరాలు: వై.రాధాక•ష్ణారావు, చరిగొండ చరిత్ర రచయిత.

 • శ్రీరామోజు హరగోపాల్‍,
  ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *