చారిత్రక నగరం ఆకునూరు

ఆకునూరు చరిత్రలో చెరగని చారిత్రకాధారాలున్న పాతనగరం. చరిత్ర సంపన్నమైన ఈ గ్రామంలో రాష్ట్రకూట చక్రవర్తి అమోఘవర్షుని రాజప్రతినిధి, బంధువు అయిన శంకరగండరస శాసనముంది. కాకతీయుల కాలంలో కాకతీయ సైనికులు ఎక్కటీలు (ఒక్కరే అనేక ఆయుధాలతో పోరాడగల సైనికులు, ఇప్పటి కమెండోలవంటివారు) రుద్రదేవుని పేరన ఆకునూరులో రుద్రేశ్వరాలయం కట్టించినపుడు వేసిన కాకతీయశాసనం వుంది. ఈ రెండు శాసనాలు చారిత్రకంగా చాలా విలువైనవి. ఈ శాసనాలలో మనం ఆనాటి సామాజిక సంస్క•తిని తెలుసుకునే ఆధారాలున్నాయి.


ఆకునూరు శాసనాలు:

తేదీలేని ఆకునూరు మొదటి శాసనం మహాసామంతాధిపతి, రట్ట శూరరు, జయధీర, విట్టి నారాయణ, ధర్మరత్నాకర, బిరుదులున్న శంకరగండరస కొలనుపాక-20,000ను పాలిస్తున్న సమయంలో ఆకునూరు పాలకుడు ఇందుపయ్య కొలనుపాకలోని జైనబసదికి ఇచ్చిన దానం, త్రవ్వించిన రట్టసముద్రం చెరువు గురించి తెలియజేస్తున్నది.


ఆకునూరులోని రెండవ శాసనం క్రీ.శ.1172 మార్చి 31నాడు వేయబడ్డది. మహామండ లేశ్వరుడు, అనుమకొండ పురవరాధీశ్వరుడు, శ్రీ కాకతీయ రుద్రదేవ మహారాజు పాలనాకాలంలో ఆకునూరుకు వచ్చి తనపేరిట ఎక్కటీలు కట్టించిన రుద్రేశ్వరదేవరకు మ్రొక్కి, అంగరంగభోగానికి ఆయం (ఆదాయం) ఏర్పాటు చేసినాడు. రాటనాలు నడిపేవారు మాడలు, తోట రాట్నాల రాటనానికి 3సిన్నాలు, తమ్మళివారు 8గద్యాణాలు, గొల్లవారు 2గద్యాణాలు, అనామికులు 4గద్యాణాలు, కుమ్మరులు 1గద్యాణం, శ్రీమంగలి 5రూకలు, వసదివారు 5రూకలు, సంకటేలు 5రూకలు, మాలకరులు 5రూకలు, మాచరాశి 5రూకలు, ఎక్కటీలు 12గద్యాణాలు, ఇంకా కొన్ని సుంకాలు వసూలు చేయడం ద్వారా దేవాలయానికి ఆదాయం కల్పించాడు. బ్రాహ్మణులకు వ్రిత్తులు ఏర్పరచినాడని శాసనసారాంశం.


ఆకునూరులో రెండు దేవాలయాలున్నాయి. ఒకటి శివాలయం. రెండవది రామాలయం. రెండు గుడుల మంటపాలలో ఒకేవిధమైన చాళుక్య, పూర్వకాకతీయశైలి రాతిస్తంభాలున్నాయి. శివాలయంలో చాళుక్యశైలి శివలింగం, కాకతీయశైలి శివలింగం వేర్వేరు గర్భగుడులలో వుండడం విశేషం.


శివాలయం:
శివాలయ ప్రవేశద్వారానికి రెండువైపుల ఉన్న శైవద్వారపాలకులు చతుర్భుజులు. పై చేతులలో శంఖువు, ఢమరుకాలు, అభయహస్తం, త్రిశూలాలతో ఊర్ధ్వజానుభంగిమలో నిల్చునివున్నారు. శిల్పాలులేని చాళుక్యశైలి స్తంభాలు మంటపంలో అగుపిస్తున్నాయి. జైనమతప్రభావం ఉన్నటువంటిది. పూర్తిగా కాకతీయులశైలి కలశంగా మారని పూర్వరూప కలశం దేవాలయద్వారం మీదున్నది. సర్వతోభద్రగోపురంలో, మూలబంధాసనంలో కూర్చున్న గజలక్ష్మి లలాటబింబంగా ఉన్నది. రెండువైపుల రెండు ఏనుగులచేత అభిషేకించబడుతున్న ద్విభుజి లక్ష్మీదేవి రెండు చేతులలో తామరపూమొగ్గలున్నాయి. గర్భగుడి ద్వారబంధం గజలక్ష్మి, కలశాలు కాక నిరాలంకారంగా వుంది. ఈ తీరు ద్వారబంధాలు జైనబసదులకు కనిపిస్తుంటాయి. కాకతీయశైలిలలో చెక్కిన ద్వారబంధమైతే కాదు. గర్భగుడిలో కాకతీయశైలి లింగం, లింగవేదికలున్నాయి. భద్రలింగపీఠంలో ప్రతిష్టించిన సమలింగం రుద్రభాగం శిరోవర్తనంతో వున్నది. లింగంపై బ్రహ్మసూత్రమున్నది. ఈ శివాలయాన్నే ఆకునూరులో ఎక్కటీలు నిర్మించారు.
కొత్త వినాయకుని విగ్రహం. చతుర్భుజుడు. కుడివైపుతొండం కలవాడు. కొత్తగా గుడులలో పెడుతున్న లక్ష్మీగణపతి శిల్పం. దేవాలయప్రాంగణంలో గణపతిసహిత సప్తమాత•కల శిల్పఫలకం గోడలో వుంది. గోడలోనే చిన్న వీరభద్రుని ప్రతిమ వుంది.


భద్రపీఠం మీద ప్రతిష్టించబడిన వీరభద్రుని శిల్పం 3 అడుగుల ఎత్తైనది. త్రిభుజశీర్ష, కీర్తిముఖతోరణంతో అలంకరించబడి వున్నాడు. దక్షసహిత, చతుర్భుజ వీరభద్రుడు. సరులు, మణులతో అలంక•తమైన ముఖపట్టం, మూపుమీద దర్భముడితో ముందుకు మెడకిందకు, మూపురం వెనకకు అలంకరించిన మువ్వలపట్టెడలు, కుచ్చులతో అచ్చమైన నంది కళ్యాణమంటపంలో వుంది. దేవాలయంలోని మరొక గర్భగుడిలో మూడంచుల, వర్తులాకార లింగపీఠంలో శివలింగం ప్రతిష్టితమైనది. ఈ గుడిముందరున్న నంది చిన్నది. మూపుమీద నుంచి ముందుకు, వెనకకు అలంకరించిన గజ్జెలపట్టెడ లున్నాయి.


గుడి ప్రాంగణంలో చతుర్బుజుడైన భైరవుడు జటామండలంతో, పై చేతులలో ఢమరుకం, త్రిశూలాలు, ముందు చేతుల్లో ఖడ్గం, రక్తపాత్రలతో, మెడలో నాగహారాలతో, నడుమున, భుజాల నుంచి ముండమాలతో అతిభంగ భంగిమలో నిలబడి వున్నాడు. దేవాలయం ఆవరణలో కనిపిస్తున్న శాసనస్తంభం కాకతీయులది. గుడి ముందర ఎత్తైన రాతిధ్వజస్తంభముంది.


రామాలయం:
గుడి ఎదురుగా రెండు ధ్వజస్తంభాలున్నాయి. ఒకటి రాతిస్తంభం. స్తంభశీర్షంలో శిఖరశిలమీద గరుడుని శిల్పం వుంది. దేవాలయ మంటపంలోని స్తంభాలు చాలుక్యశైలిలో వున్నాయి. గుడి ద్వారానికి రెండువైపుల చక్ర, శంఖువు, గద, అభయహస్తాలతో కరండమకుటంతో స్వస్తికాసనంలో ఇద్దరు వైష్ణవద్వారపాలకులు నిల్చునివున్నారు. దేవాలయద్వారానికి రెండువైపుల కలశాలు, లలాటబింబంగా అష్టదళపద్మం వున్నాయి. చక్ర, శంఖువులతో ఉత్తరాభిముఖుడైన భక్తాంజనేయుని విగ్రహముంది. 16వ శతాబ్దానికి చెందిన రెండు వైష్ణవద్వారపాలకుల విడిశిల్పాలున్నాయి. దేవాలయం గోడలకు చేర్చిన నాగశిల్పం వుంది. చతుర్భుజాలతో చేతులలో పరశువు, అంకుశం, విరిగిన దంతం, మోదకాలతో ఎడమవైపు తిరిగిన తొండంతో లలితాసనంలో ఉన్నాడు గణపతి.


విడి శిల్పాలలో ఆకునూరి ప్రజలు ఎల్లమ్మగా కొలిచే నాగశిల్పాలున్నాయి. వీటిలో కొన్ని రాష్ట్రకూటులనాటి శిల్పాలున్నాయి. గుడిలో కూడా నాగదేవతా శిల్పాలే వున్నాయి. పోచమ్మగుడిలో దుర్గావిగ్రహమున్నది. ఆ గుడికి ప్రవేశమార్గానికి రెండువైపుల చండి, ముండి శిల్పాలుండడం విశేషం. మరొకచోట ముగ్గురు అమ్మదేవతల్లో ఇద్దరు చాముండలు, ఒక దుర్గ విగ్రహాలున్నాయి. జనగామ జిల్లా కొన్నెగ్రామంలో వున్నట్లు లలితాసనంలో కూర్చున్న తలలేని చాముండ విగ్రహం ఆకునూరులో కనిపించడం ప్రత్యేకం. అక్కడే మరొక సప్తమాత•కా శిల్పఫలకం వుంది. శిల్పశైలినిబట్టి ఈ ఫలకం 10వ శతాబ్దానికి చెందింది.


ఆకునూరు పాటిగడ్డపై జైనం:
ఆకునూరుకు రెండు పాటిగడ్డలున్నాయి. అందులో ఒకదానిపేరు ‘కోటిలింగాల గడ్డ’. పోచమ్మగుడి దగ్గరలో వుంటుంది. ఇక్కడ కొత్తగా జైన తీర్థంకరుడు మహావీరుని విరిగిన ధ్యానాసన శిల్పం, జైన సర్వతోభద్రశిల్పం గుర్తించడమైనది. అంటే 9వ శతాబ్దంలో శంకరగండరసకాలంలో ఇక్కడ జైనమతం ఎంతో ప్రాభవంతో వుండేదని తెలుస్తున్నది. ఇప్పటివరకు సర్వతోభద్ర జైనశిల్పాలు కొలనుపాక, వేములవాడలలో కనిపించాయి.


గ్రామం బయట ‘కోటిలింగాల గడ్డ’గా పిలువబడే పాటిగడ్డమీద 5అడుగుల ఎత్తైన జైన చౌముఖి వుంది. కొలనుపాక జైన సంగ్రహాలయంలో,వేములవాడలో బౌద్ధుల ఉద్దేశికస్తూపాలను పోలిన ఇటువంటి జైనచౌముఖ శిలలు కనిపించాయి. వీటినే జైనులు ‘సర్వతోభద్ర’ అంటారు. అరుదైన ఈశిల్పాలున్నచోటు జైనధర్మకేంద్రం అని చెప్పవచ్చు. అందువల్ల ఆకునూరు ఒక ప్రసిద్ధ జైనక్షేత్రమని చెప్పవచ్చు.


‘బౌద్ధులవలెనే జైనులుకూడా స్తూపాలు, చైత్యాలు నిర్మించుకునేవారు. జైనులు చైత్యాలయాలు నిర్మించు కొన్నట్లు బైరాన్‍ పల్లి శాసనం(వరంగల్‍ జిల్లా శాసనసంపుటి, పే.43, శా.సం.18, 23-28పంక్తులు) వల్ల తెలుస్తున్నది. జైనులు చైత్యాలయాలకంటె జినాలయాల మీదనే శ్రద్ధ ఎక్కువ చూపారు.’ అంటారు బీఎస్సెల్‍ హనుమంతరావు. (ఆంధ్రదేశంలో జైన, బౌద్ధ మతాలు, జైనమతవ్యాప్తి-కారణాలు, పే.141)
ఈ జైన సర్వతోభద్ర శిలమీద నలువైపుల 24వ జైనతీర్థంకరుడు మహావీరుని శిల్పాలున్నాయి. సర్వతోభద్ర శిల శిఖరాన రుషభుని మూర్తి నలువైపుల చెక్కివుంది. అక్కడే విరిగిపోయిన జైన మహావీరుని ధ్యానాసనశిల్పం ఉదరం నుంచి కిందిభాగం మిగిలి కనిపిస్తున్నది.


ఆకునూరులో వీరగల్లులు:
ఆకునూరులో గ్రామం ‘సోమరాజుల కుంట’లో 4శిల్పాలు లభించాయి. వాటిలో రెండు వీరగల్లులు, 3వది నాగముచుళింద పోలికలున్న నాగవిగ్రహం, 4వది రాష్ట్రకూటులనాటి కాలభైరవశిల్పం.


రెండు వీరగల్లులలో ఒకటి రాష్ట్రకూట కాలానికి చెందిన అలంక•త వీరశిల. ఒకటే అంతస్తున్న ఈ వీరశిలలో వీరుడు సర్వాభరణాలు ధరించివున్నాడు. కుడిచేతిలో బాణం, ఎడమచేతిలో విల్లు ధరించి డాకాలు సాచి యుద్ధ సన్నద్ధుడై వున్నాడు. నడినెత్తిన కొప్పు, మూపున వీరశ•ంఖల, నడుమున పట్టాకత్తి ధరించివున్నాడు. ఈ వీరుడు అమరుడైనాడని తెలుపడానికి సూచనగా ఇద్దరు అప్సరాంగనలు వీరుని తలకు రెండువైపుల నిల్చుని వింజామరలు వీస్తున్నారు. ఇటువంటి వీరగల్లు చాలా అరుదు.


రెండవ వీరగల్లులో వీరుని సిగ కుడిపక్కకు కట్టివున్నది. వీరుడు బల్లెంతో శత్రువుమీద దాడికి సిద్ధంగా వున్నాడు. వీరుని నడుమున పెద్దకత్తి వుంది. వీరుడు అంతగా అలంకరింపబడలేదు. ఇది కాకతీయపూర్వశైలిలో చెక్కబడిన వీరగల్లు.


ఆకునూరులో శాతవాహన కాలం నాటి ఆనవాళ్లు:
కోటిలింగాల పాటిగడ్డమీద కొత్త తెలంగాణ చరిత్రబ•ందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్‍ ఒక నాణెం, కుండపెంకులను సేకరించాడు. ఇవి శాతవాహనకాలం నాటివని గుర్తించాడు. లభించిన నాణెం ‘ఫోటీన్‍’లోహంతో చేయబడినది. దానిమీద బ్రాహ్మీలిపిలో లెజెండ్‍ అస్పష్టంగా కనిపిస్తున్నది. నాణానికి ఎడమవైపు తొండం ఎత్తివున్న ఏనుగుబొమ్మపైన ‘స…క…’ అనే బ్రాహ్మీ అక్షరాలు అగుపిస్తున్నాయి. నాణానికి వెనకవైపు ఉజ్జయిని చిహ్నం ఉన్నది. సాతకర్ణి నాణెమిది. ఇటువంటి నాణాలు సాతవాహన సామ్రాజ్య నాణాలని చరిత్రబ•ందం నాణకవేత్త (న్యూమిస్మాటిస్టు) కందుల వేంకటేశ్‍ గారు అన్నారు. నాణెం దొరికిన పాటిగడ్డమీదనే సాతవాహనకాలంనాటి గోటినొక్కులు, పూల డిజైన్లతో కుండ పెంకులు లభిస్తున్నాయి. ఇక్కడ సాతవాహనకాలంనాటి పురా వస్తువుల కొరకు తెలంగాణ వారసత్వశాఖ వారు పరిశోధన జరిపితే మరిన్ని విశేషాలు లభిస్తాయి.


ఆకునూరులో ఒక పురావస్తువు లభించింది. ఈ వస్తువు కాల్చిన బంకమట్టితో చేసిన బొమ్మ. చూడడానికి పచ్చీస్‍, చదరంగం ఆటలలో పెట్టే పావులెక్కనే కనబడుతున్నది. కాని, స్వరూపభేదంవల్ల ఆకునూరు పాటిగడ్డమీద దొరికిన చిన్న మట్టిబొడ్డె లింగరూపాన్ని తలపిస్తున్నది. ఈ కాల్చిన మట్టిముద్ద గొబ్బెమ్మ ఆకారంలో కనిపిస్తున్నది. అడుగున సమతలంగా వుంది. ఈ మట్టిబొమ్మ అడుగున సన్నని తిన్నె వుంది. 5,6 సెం.మీ.ల ఎత్తు, 2 సెం.మీ.ల వ్యాసం కలిగివున్న ఈ టెర్రకోటలింగాకారం కలకత్తా మ్యూజియంలో కనిపించే (నం.6570/ఏ6417) మొహంజొదారొ పురుషావయం (ఫాలస్‍)తో పోలివుంది. మొహంజొదారొ మట్టిబొమ్మ 4,500సం.ల పాతది. కాల్చిన బంకమట్టి బొమ్మ. ఆకునూరులో దొరికిన మట్టిబొమ్మ కూడా కాల్చిన బంకమట్టిబొమ్మే.

రెండింటికి ఉన్న సామ్యాన్ని బట్టి ఆకునూరు బొమ్మ కూడా 4వేల సం.రాల నాటి పురావస్తువుగానే ఎంచవలసివుంది. టీఎల్టీ (థర్మో ల్యూమినెన్స్ టెస్ట్) పరీక్ష చేయిస్తే ఈ బొమ్మ వయస్సు ఖచ్చితంగా చెప్పవచ్చు. గతంలో సాతవాహన కాలంనాటి టెర్రకోటబొమ్మలు, తర్వాత కాలానికి చెందిన లజ్జాగౌరి రాతిబొమ్మ దొరికిన చోటనే ఈ లింగాక•తి దొరకడం విశేషం. ఇవన్నీ ఆ స్థల ప్రాచీనతకు, చారిత్రక ప్రాధాన్యతకు నిదర్శనాలు. ఈ ప్రదేశాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు తప్పక పరిశోధించాల్సిన అవసరముందని ప్రఖ్యాత పురాశాస్త్రవేత్త రవి కోరిసెట్టర్‍ (కర్ణాటక)గారు అన్నారు.


పాటిగడ్డ మీద సాతవాహనకాలంనాటి గోటినొక్కుల డిజైన్ల ఎరుపురంగు కుండ పెంకులు, కొన్ని కుండల కంఠ్లాలు, నీటికూజా ముక్కు (నీళ్ళుపోసే గొట్టం), ఎన్నో సాతవాహన కాలంనాటి ఇటుకల ముక్కలు, నూరుడు రాళ్ళు, దంపుడురాళ్ళు, దొరికాయి. ఇవికాక కొత్తరాతియుగంనాటి రాతిగొడ్డలిముక్క ఒకటి దొరికింది. అంటే ఆకునూరులో రాతియుగాలనాటినుంచి మానవుల ఆవాసాలిక్కడ వుండేవని చెప్పడానికి ఆధారాలు లభించినట్లయింది.


ధన్యవాదాలు:
క్షేత్రపర్యటన, ఫోటోగ్రఫీ: కొలిపాక శ్రీనివాస్‍, అహోబిలం కరుణాకర్‍, సామలేటి మహేశ్‍.

  • శ్రీరామోజు హరగోపాల్‍,
    ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *