‘నిక్కమయిన మంచి నీలమొక్కటి చాలు,
తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల
చదువ పద్యమరయ జాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినురవేమ’
ఈ వేమన పద్యం తెలియని తెలుగు వారు ఉండరేమో. ఇక్కడ ప్రస్తావించిన నీలము ఒక మహారత్నంగా అందరికి పరిచయం. నవరత్నాలలో దీన్ని విశేషంగా పేర్కొన్నారు. శనితో అనుసంధానించబడటం వల్ల ఈ రత్నం కొంత భయాన్ని, అప్రతిష్ట కూడా మూటకట్టుకుంది.
నీలమణి చరిత్ర
ప్రారంభం నుండి మానవ నాగరికతకు సుపరిచితం. గరుడపురాణం ప్రకారం సంహరించబడిన బలి చక్రవర్తి శరీరభాగాలు భూమిపై పడి రత్నాలుగా మారాయి. అందులో కన్నులు నీలలుగా, కండలు కనక పుష్యరాగాలుగ మారినట్లు చెప్తారు. అగ్నిపురాణం లోను, శివపురాణం లోను నీలాల ప్రసక్తి ఉంది. అర్థశాస్త్రంలోను, బ•హత్సంహితలోను ఇవి ప్రస్తావించబడ్డాయి.
నీలమణి రావణగంగా నదికి సమీపంలోని పద్మకరదేశంలో కనిపిస్తుంది అని వరాహమిహిరుడు తన బ•హద్సంహితలో వివరించాడు. నరహరి తన రాజనిఘంటువులో ‘‘లోహితక వజ్రమౌక్తికా మరకత నీలమహోపలః పంచ..’’ అనగా ఐదు గొప్ప విలువైన రాళ్లు మాణిక్యం, వజ్రం, ముత్యం, మరకతం మరియు నీలమణి అని పేర్కొన్నాడు. ఇంద్రనీల, మహేంద్రనీల, మహానీల, మయూరనీల, శౌరీరత్న మొదలైన పేర్లతో కూడా ఇవి వ్యవహరించబడుతాయి.
నీలమణి బల్లలపై పది ఆజ్ఞలు (టెన్ కమాండ్మెంట్) చెక్కబడి ఉన్నాయని ప్రాచీన హెబ్రీయులు విశ్వసించారు. కానీ చరిత్రకారులు బైబిల్లో ప్రస్తావించబడిన నీలిరంగ రత్నాలు లాపిస్ లాజురి కావచ్చు అని నమ్ముతారు.
గ్రీకు లాటిన్ భాషలలో సఫిరస్, సఫిరోస్ అంటే నీలి రంగు కలది అని అర్ధం. సఫైర్ అనే పేరు ఈ విధంగా వచ్చింది. అయితే సఫైర్లు అన్నీ నీలిరంగులో ఉండవు. రూబీ మరియు సఫైర్ రెండు కొరండం యొక్క రత్నం ప్రభేదాలు. క్రోమియం జాడలు కలిగ ఉన్న కొరండం ఎరుపు రంగు సతరించుకొని రూబీగా పిలువబడుతోంది. జాడలలో ఫెర్రస్ వంటి ఇతర మూలకాలు ఉంటే కొరండం వేరే రంగులను సంతరించుకుంటుంది. కొరండంలోని ఎరుపు మరియు ఎరుపు షేడ్స్ మాణిక్యాలు అయితే ఇతర రంగులలో ఉన్న కొరండంను సఫైర్‍గా వ్యవహరిస్తారు. వీటిలో రంగులేని తెల్లని నీలమణి, వివిధరకాల నీలిరంగులతో కూడిన నీలమణి ఉన్నాయి. పసుపురంగులో ఉండే నీలమణిని కనక పుష్యరాగం అంటారు. పసుపు నీలం కలిసి ఉన్న దానిని పీతాంబరి అంటారు. ఈ నీలమణి ఆకుపచ్చ రంగుతో సహా వివిధ రంగులలో లభిస్తుంది. ప్రస్తుతం నీలమణి అనే పదాన్ని రత్నాలకు మాత్రమే కాకుండా అనేక వ్యుత్పన్న అర్థాల్లో ఉపయోగిస్తున్నారు. వ్యక్తి పేరు, పర్వతాల పేరు మరియు వివిధ రకాల మామిడి కాయల పేర్లు మొదలైనవి ఇందులో ఉన్నాయి. శ్రీక•ష్ణ నామంగా కూడా ఇది ప్రసిద్దం.
ఉపయోగాలు మరియు ఖనిజ సమాచారం
నీలమణి (Sapphire)లో కొరండం, ఇనుము, టైటానియం, క్రోమియం, వెనాడియం లేదా మెగ్నీషియం వంటి రకరకాల ఖనిజ మూలకాలతో కూడిన అల్యూమినియం ఆక్సైడ్ (Al2O3)ను కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా నీలం రంగులో ఉంటుంది. కానీ సహజమైన ‘‘ఫాన్సీ’’ నీలమణి పసుపు, నారింజ, ఆకుపచ్చ రంగులలో కూడా ఉంటుంది. ‘‘పార్టి నీలమణి’’ రెండు లేదా అంతకంటే ఎక్కువ రంగులను చూపుతుంది. పింక్ కలర్ కొరండంను ప్రాంతాన్ని బట్టి రూబీ లేదా నీలమణిగా వర్గీకరిస్తారు. సాధారణంగా సహజమైన నీలమణిని సానపట్టి రత్నాలుగా నగలలో ధరిస్తారు.
పెద్ద క్రిస్టల్ బౌల్స్లో పారిశ్రామిక లేదా అలంకరణ ప్రయోజనాల కోసం వాడుతారు. ప్రయోగశాలలలో వాటిని క•త్రిమంగా కుడా స•ష్టించవచ్చు.
నీలమణి విశేషమైన కాఠిన్యం కారణంగా మోహ్స్ స్కేల్‍లో 9, (వజ్రం తరువాత మూడవ కఠినమైన ఖనిజం) ఇన్ఫ్రారెడ్ ఆప్టికల్ భాగాలు, అధిక-మన్నిక విండోస్‍లో నీలమణిని ఉపయోగిస్తారు. రిస్ట్ వాచ్ స్ఫటికాలు, కదలిక బేరింగులు, సున్నితంగా ఉండే ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇంకా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, జిఎయన్- ఆధారిత బ్లూ ఎల్‍ఇడిలు వంటి వాటిలో ఉపయోగిస్తారు.
నీలం-రసాయన ఫార్ములా
aluminium oxide, Al2O3. రంగు- Every color including parti-color, except red (which is ruby). స్ఫటిక ఆక•తి- massive and granular. స్ఫటిక వ్యవస్థ-Trigonal. చీలిక- None ఫ్రాక్చర్, Conchoidal, splintery. కఠినత్వం-9.0. ద్యుతిగుణం- Vitreous. వక్రీభవన గుణకం -1.762-1.778 విశిష్ట గురుత్వం 3.95-4.0
కొరండం రకాలు
కొరండం రెండు రత్నాల రకాల్లో నీలమణి ఒకటి. మరొకటి రూబీ (ఎరుపు కొరండం). నీలం బాగా తెలిసిన నీలమణి రంగు అయినప్పటికీ, అవి బూడిద, నలుపుతో సహా ఇతర రంగులలో కుడా ఉంటాయి. కొన్ని రంగులేనివిగా ఉంటాయి. నీలమణి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, కంబోడియా, కామెరూన్, చైనా (షాన్డాంగ్), కొలంబియా, ఇథియోపియా, ఇండియా (కాశ్మీర్), కెన్యా, లావోస్, మడగాస్కర్, మాలావి, మొజాంబిక్, మయన్మార్ (బర్మా), నైజీరియా, రువాండా, శ్రీలంక, టాంజానియా, థాయిలాండ్, యునైటెడ్ స్టేట్స్ (మోంటానా), వియత్నాంలలో లభ్యమవుతాయి. రూబీ, నీలమణి రెండూ మయన్మార్ యొక్క మొగోక్ స్టోన్ ట్రాక్ట్లో కనిపిస్తాయి. నీలమణి గ్రానైటిక్ పెగ్మాటైట్స్ లేదా కొరండం సైనైట్లలో దొరుకుతుంది.
కొరండం నిల్వలు మరియు వనరులు
NMI డేటా ప్రకారం కొరండం మొత్తం నిల్వలు మరియు వనరులు 294 వేల టన్నులుగా అంచనా వేయబడింది. ఇందులో నీలమణి నిలువలు 450 కిలోలు మాత్రమే, జమ్మూ కాశ్మీర్‍లో ఉన్నట్లు తెలుస్తుంది.
భారతదేశంలో కొరండం రూబీ మరియు నీలమణి కోసం అన్వేషించడానికి అపారమైన సంభావ్యత ఉంది. ప్రస్తుతం అధికారిక రికార్డు ప్రకారం ఉత్పత్తి శూన్యం.
కాశ్మీర్ నీలం
నీలమణులలో కాశ్మీరీ నీలం ను ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. వైలెట్-బ్లూ కాశ్మీర్ నీలమణి వేలంలో వి 2,42,000 మిలియన్ల ధరకు విక్రయించబడింది. ఈ నీలమణులు నాణ్యతతో కూడిన ఉన్నతమైన కార్న్ఫ్లవర్ నీలం రంగును కలిగి ఉంటాయి. నీలమణిని కలిగి ఉన్న శిల చినాబ్ లోయలో 1880వ సంవత్సరంలో ఒక షికారి ద్వారా మొదటిసారిగా కనుగొనబడింది. సుంజమ్ మరియు మాచెల్ గ్రామం సమీపంలో ల్యాండ్ స్లిప్ కారణంగా పదార్ పొరుగున గ్నీస్‍లోని ఇంటర్‍కలేటెడ్ క్రిస్టలిన్ సున్నపురాయి బహిర్గతమైంది.
FR మాలెట్ ఈ సమాచారాన్ని GSI రికార్డులలో ప్రచురించాడు.
‘‘ఈ నీలాలు ఎక్కువగా డబుల్ షట్కోణ పిరమిడ్‍లు తరచుగా ఎగుడు దిగిడు ఆకారంలో ఉంటాయి. క్షితిజ సమాంతర స్ట్రైషన్స్తో చాలా చదునుగా మరియు లోతుగా గీతలతో ఉన్నాయి. పెద్ద సంఖ్యలో ఇవి పాల మరియు లేత నీలం బూడిద రంగులో ఉన్నాయి. చాలా వరకు సిల్కీనెస్ ద్వారా అసంపూర్ణంగా కనిపిస్తాయి. అక్కడక్కడ టూర్మాలిన్ లోకి నీలమణి చొచ్చుకుపోయి కనిపిస్తుంది’’.
1882 నుండి 1905 వరకు ఓల్డ్ కాశ్మీర్ గనుల్లో నీలాలు దొరికాయి. 1905లో వీటిని మూసివేశారు. 1906 నుండి 1927 వరకు 39,209 తులాల నీలమణులు పాత (ఓల్డ్) మరియు కొత్త గనుల్లో కలిపి ఉత్పత్తి జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అధికారికంగా ఎలాంటి ఉత్పత్తి జరిగినట్లు సమాచారం లేదు. మార్కెట్‍లో మాత్రం అక్కడ అక్కడ ఇవి కనిపిస్తూనే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ గనుల్లో దొరికే నీలాలు అన్ని ఓల్డ్ కాశ్మీర్ గనుల్లో నీలాల వలె విలువైనవి కావు. పాత కాశ్మీర్ గనుల నుండి నీలమణి మరియు POK మరియు జమ్మూ ప్రాంతాల నుండి వచ్చిన నీలమణుల మధ్య తేడాను గుర్తించడంలో జాగ్రత్తగా ఉండాలి.
నీలమణి నిర్మితి
మైక్రోస్కోప్ ద్వారా పరిశీలిస్తే కాశ్మీర్ నీలమణిలో పెద్ద సంఖ్యలో సూదులవంటి పార్గసైట్ స్పటికాలు చిన్న ప్రిస్మాటిక్ డ్రావిట్‍లు, అంచులు స్పష్టంగా లేని జిర్కాన్‍లు పునశ్శోషణం చేయబడిన ఫెల్డ్స్పార్, ధూళిని, దుమ్ము మేఘాలను మరియు బ్రష్ యొక్క స్ట్రోక్‍లను పోలి ఉండే దుమ్ము తెరలను గుర్తించవచ్చు. ఇలాంటి నిర్దిష్ట చేరికలు ఇతర నీలాలలో ఉండవు.
మ•దువైన నీలం రంగు మరియు కంటి శుభ్రమైన అపారదర్శకత ఈ నీలమణి యొక్క ప్రత్యేక లక్షణం. కాశ్మీర్ నీలమణి యొక్క అధిక విలువ కారణంగా అమ్మకం దారులు ఇతర నీలమణిని కాశ్మీర్ నీలమణిగా నమ్మించటానికి ప్రయత్నిం• •వచ్చు. కొన్ని శ్రీలంక నీలమణి ముఖ్యంగా రత్నపురా నుండి 12 కిమీ దూరంలోని ఎలిగుడాలోని గని నుండి వచ్చిన నీలమణి కాశ్మీరీ నీలమణిని పోలి ఉంటుంది. తరచుగా పెద్ద ల్యాబ్‍లు భౌగోళిక స్థానాన్ని సరిగ్గా ధ•వీకరించడంలో విఫలమవుతాయి.
మోంటానా నీలమణి
ఇవి నీలమణిలో ఒక విశేష స్థానాన్నికలిగి ఉన్నాయి. మ•ధువైన కార్న్ఫ్లవర్ బ్లూ మరియు వివిధ రకాల ఇతర రంగులు మోంటానా నీలమణి యొక్క ప్రత్యేకత. మోంటానా మరియు యోగో నీలమణి రెండూ మోంటానాకు చెందినవి. ఇవి కాకుండా శ్రీలంక నీలమణి, బర్మీస్ నీలమణి కూడా మార్కెట్‍లో గౌరవించబడు తున్నాయి.
కనక పుష్యరాగం
ఈ రత్నం అన్ని నవరత్నాలలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. గురు రత్నంగా దీనికి జ్యోతిష్య ప్రాముఖ్యత ఉంది. ఖనిజ శాస్త్రపరంగా ఇది కొరండం కుటుంబానికి చెందిన నీలమణి. ఈ రత్నాలు ముఖ్యంగా శ్రీలంక ద్వారా సరఫరా చేయబడతాయి మరియు దక్షిణ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి.
స్టార్ సఫైర్
రత్నం యొక్క ఉపరితలంపై నక్షత్రం వలె కనిపించే ఆప్టికల్ ద•గ్విషయం కారణంగా నక్షత్ర నీలమణికి ఆ పేరు వచ్చింది. ఇది సూదుల వంటిరూటైల్ చేరికల కారణంగా సంభవిస్తుంది. ఈ నక్షత్రం నీలమణి విలువను పెంచుతుంది.
రంగు మార్పు నీలమణి (Colour change sapphire):
కొన్నిసార్లు నీలమణి వేర్వేరు కాంతిలో రంగు మారుతూ ఉంటుంది. వివిధ మూలకాల చేరికలు తరంగదైర్ఘ్యాల శోషణలో వ్యత్యాసాన్ని కలిగిస్తాయి. నీలమణి యొక్క నీలం రంగు గులాబీ రంగులోకి వివిధ కాంతి పరిస్థితులలో మారుతుంది. దీనిని రంగు మార్పు నీలమణి అంటారు. ఈ లక్షణం వల్ల దానికి మార్కెట్‍లో ఎక్కువ ధర పలుకుతుంది.
చరిత్రలో నీలమణి
పూర్వ ఆధునిక భారతదేశపు రత్నాల ప్రస్తావన ప్రయాణికుల ఖాతాలో కనిపిస్తుంది. Pliny భారతదేశంలోని అనేక రత్నం మైనింగ్ స్థలాల గురించి ప్రస్తావించారు. పర్షియన్ యాత్రికులు భారతదేశంలోని రత్నం వాణిజ్య కేంద్రాల గురించి కూడా ప్రస్తావించారు. అల్బెరూని భద్రత కోసం ఉత్తర భారతం నుండి దక్షిణాదికి తీసుకెళ్లిన భారతీయ రత్నాల గురించి ప్రస్తావించారు. అమీర్ ఖుస్రూ (1252-1325) దక్షిణం నుండి దోచుకున్న రత్నాల గురించి వివరంగా వివరించాడు. వాటిలో నీలమణి ప్రస్తావన ఉంది. Thakur Pheru (1270) అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క విస్తారమైన రత్నాల సేకరణను వివరించాడు, ఇందులో ఇతర రత్నాలతో పాటు నీలమణి కూడా ఉంది.
ఒడెరోడో బార్బోసా (1519). విజయనగరం రత్నాల మార్కెట్‍లోని రత్నాల గురించి వివరంగా వివరించాడు. అందులో శ్రీలంకకు చెందిన నీలమణిలు కూడా ఉన్నాయి. టావెర్నియార్ గోవాను రత్నాల వ్యాపారానికి పెద్ద కేంద్రంగా వివరించాడు. అందులో నీలమణి కూడా ఉన్నాయి. మొఘలులు రత్నాలను ఇష్టపడేవారు. అక్బర్ తన ఖజానా ఒక క్రమపద్ధతిలో నిర్వహించాడు. జహంగీర్ రత్నాలను బాగా ఇష్టపడేవాడు.
ఔరంగజేబు ఆధీనంలో ఉన్న రత్నాలను పరిశీలించడానికి టావెర్నియర్‍కు అనుమతించబడింది. ఔరంగజేబు ఖజానాలోని విస్తారమైన రత్నాల సేకరణలో ఒక పెద్ద ఓరియంటల్ అమెథిస్ట్ (నీలమణి)తో కూడిన గొలుసు ఉంది. టావెర్నియార్ ఒక పెద్ద 158 క్యారెట్ ‘‘ఓరియంటల్ పుష్పరాగాన్ని’’ (పసుపు నీలమణి) కూడా వివరించాడు. అది అష్టభుజి ఆకారంలో ఉంది. పట్టాభిషేకం సమయంలో ఔరంగజేబు దానిని తన టోపీలో ధరించాడు.
నెమలి సింహాసనం గురించి వివరిస్తున్నప్పుడు టావెర్నియర్ (1605-1689) నెమలి యొక్క ఎత్తైన తోకలో పొదిగిన నీలమణుల గురించి ప్రస్తావించాడు.
చరిత్రలోని ప్రసిద్ధ నీలమణులు
రాక్‍ఫెల్లర్ నీలమణి:
1934లో భారతీయ మహరాజు నుండి పొందిన దీర్ఘచతురస్రాకార స్టెప్ కట్ 62 క్యారెట్ బర్మీస్ నీలమణి
స్టార్ ఆఫ్ ఇండియా:
శ్రీలంక నుండి 536 క్యారెట్ల పెద్ద కాబోకాన్ కట్ గ్రే బ్లూ స్టార్ నీలమణి. అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ చీ•లో ప్రదర్శించబడింది.
లోగాన్ నీలమణి:
422.99 క్యారెట్ శ్రీలంక నీలమణి ప్రస్తుతం స్మిత్‍సోనియన్ మ్యూజియం వాషింగ్టన్‍లో ప్రదర్శించబడింది.
బొంబాయి స్టార్:
ప్రస్తుతం స్మిత్‍సోనియన్ మ్యూజియం వాషింగ్టన్‍లో ప్రదర్శించబడిన శ్రీలంక నుండి 182 క్యారెట్ల పెద్ద కాబోఛొన్.
ఆడమ్ యొక్క నక్షత్రం:
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నక్షత్రనీలమణి. శ్రీ లంకలోని రత్నపురా గనుల్లో నుండి తవ్వినది. దీని బరువు 1404.49 క్యారెట్లు.
Mr. AJ హోప్ తన సుప్రసిద్ధ నీలమణి Merveilleuxని ప్రదర్శించాడు. ఇది పగటిపూట నీలి రంగు మరియు రాత్రికి అమెథిస్ట్ వలె రంగు మారుతుంది.’’ అని S. M ఠాగూర్ తన ‘‘మణిమాలలో’’ పేర్కొన్నాడు.
-చకిలం వేణుగోపాలరావు,
డిప్యూటి డైరెక్టర్ జనరల్ జిఎస్‍ఐ(రి)
ఎ: 9866449348
- శ్రీరామోజు హరగోపాల్, ఎ : 99494 98698