ఉమ్మడి ఖమ్మం జిల్లా గ్రామ నామాలు

ఖమ్మం తెలంగాణ గుమ్మం అనే పలుకుబడి ఉన్నది. స్తంభశిఖరి, సాల గ్రామాద్రి, న•హర్గిరి, స్తంభగిరి అను ప్రాచీన వ్యవహార నామాలున్నవి. హరిభట్టు రచించిన వరాహపురాణంలో కంబముమెట్టు, స్థంభచల అని ప్రస్తావించబడినది.16వ శతాబ్దంలో శ్రీ క•ష్ణ దేవరాయలు ఖమ్మం కోటను జయించాడని నంది తిమ్మన పారిజాతాపహరణం ప్రబంధంలో ఒక పద్యంలో ‘కంబంబుమెట్ట’ అని ప్రస్తావించి ఉన్నాడు. నిజాం రాష్ట్రం 1870 రైల్వే మ్యాప్‍ ప్రకారం ఈ పట్టణం ఖమ్మం మెట్టుగా పేర్కొనబడింది. ‘‘క•ష్ణానదిని దాటి తెలంగాణలోకి అడుగుపెట్టే దారిలో ఖమ్మం ఉంది. ఖమ్మంలో ఎత్తైన గుట్ట, గుట్ట మీద ఉన్న నారసింహుడిని స్థానిక కైఫియతుల ప్రకారం త్రేతాయుగం నాటి దేవుడని చెప్పుకుంటారు. ఈ పట్టణంలోని నరసింహుని గుట్ట కింద కనిపించే నిలువురాయి దండుబాట మీద, వ్యాపార రహదారి మీద బాటసారులకు కొండ గుర్తుగా నిలిచి ఉంది. ఇదే కంభం (స్తంభం)మెట్టు. మెట్టు అంటే పైకి వెళ్ళడానికి ఎక్కే ఎత్తు అరుగు. స్తంభానికి నరసింహావతారానికి పౌరాణిక బంధముంది. కంభం మెట్టు ఖమ్మం మెట్టయింది. ఇప్పుడు ఖమ్మం అనే పేరు ఒకటే మిగిలింది. ఇక్కడి నరసింహాలయం నుండే మండపాలకు, స్తంభాలకు కావాల్సిన రాళ్లు తరలిస్తూ ఉండేవారట. అందు వలన స్తంభ గిరి గానూ, స్తంభాద్రి’ గానూ ప్రాచీన నామం ఉంది. ఖమ్మం పాలించిన రాజవంశాలు బౌద్ధ జైన మతాలు చారిత్రక అవశేషాలు ఎన్నో బయలు పడినాయి. ఖమ్మం కోటను రెడ్డిరాజులు, వెలమలు, నందవాణి, కాళ్లూరు, గుడ్లూరు వంశాల వారు పాలించారు. 1531లో షితబ్‍ ఖాన్‍ అనబడే సీతాపతి రాజు పరిపాలించాడు.’’ (తెలంగాణ చరిత్ర తొవ్వల్లో : శ్రీరామోజు హరగోపాల్‍. పుట.132-138) 1905 వరకు వరంగల్‍ జిల్లాలో ఖమ్మం భాగంగా ఉండేది. 2011 జనాభా లెక్కల ప్రకారం నాలుగు రెవెన్యూ డివిజన్లు, 46 మండలాలు, 1223 గ్రామాలున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఉమ్మడి జిల్లాను ఖమ్మం జిల్లా మరియు భదాద్రి కొత్తగూడెం జిల్లాలుగా విభజించారు.


అశ్వరావు పేట:- వెలమ సామాజిక వర్గం పద్మనాయక వంశస్థులు పాల్వంచ సంస్థాన పాలకులుగా ఉన్నప్పుడు కాకతీయ ప్రతాపరుద్రుని సైన్యాధ్యక్షులుగా పనిచేసారు. రెండవ ప్రతాపరుద్రుని వద్దనున్న ఒక అశ్వాన్ని లొంగదీసినందున ఈ వంశానికి అశ్వారావు బిరుదు ఇవ్వబడింది. అందువల్ల వీరిని అశ్వారావు వారంటారు. ఈ వంశీయుల పేరు మీదుగానే అశ్వారావుపేట, అశ్వాపురం నామాలు ఏర్పడి ఉండవచ్చు.


కూసుమంచి:- మండల కేంద్రమిది. ‘‘శక సంవత్సరం 1160 కాలం కాకతీయ గణపతి దేవ చక్రవర్తి కాలం నాటి కూసుమంచి శాసనంలో ఎనిమిదవ పంక్తిలో ఈ గ్రామ నామ రూపం కూచమంచ్చి’ అని ప్రస్తావించబడినది. ఈ శాసనంలో మాంగల్లు, జన్నవాడ, నేరడ, బిరవ్రోలు, గోరింటిపల్లి, తాడితోట, కొల్లి గుబ్బలి, కొండ మడంగిడ్ల, పెద్దచెల్క, మోకలదేవి గణపయ్య చుందంరేపల్లి, దొడ్డిబండ, బండపిల్ల గుండ్లు వంటి మరి కొన్ని గ్రామ నామాల ప్రస్తావనలున్నాయి. పెద్ద చెరువు, కారమండి కాలువ, గణప సముద్రం వంటి చెరువుల నామాలున్నాయి.’’ (కొత్త తెలంగాణ శాసనాలు: శ్రీరామోజు హరగోపాల్‍. పుట.102-114)


చొప్పకట్ల పాలెం:- బోనకల్‍ మండలంలోని గ్రామమిది. ‘‘క్రీ. శ.1315 ప్రతాప రుద్రుని కాలం నాటి శాసనం 12,13 పంక్తులలో ఈ గ్రామ నామం చొప్పకట్లపాళము’ అని ఉన్నది. పించిగంచిప్రోలు, తేర్నాన గ్రామ నామాల ప్రస్తావనలు కూడా ఉన్నాయి.’’ (తెలంగాణ చరిత్ర తొవ్వల్లో శ్రీరామోజు హరగోపాల్‍. పుట-205, 210)


నాగులవంచ:- చింతకాని మండలంలోని గ్రామమిది. విదేశీ పాలకులు ఉచ్చారణ కోసం నాగుల్వాంచా, నాగులవాంజె అని రాసేవారు. క్రీ.శ.1687 కంచెర్ల గోపన్న కాలంలో ఈ గ్రామంలో 19 ఏళ్ళుగా నడిచిన డచ్‍ వారి ఫ్యాక్టరీని నేలమట్టం చేయడానికి స్వదేశీ కాంక్షతో కార్మికులు వీరోచితంగా పోరాడిన గ్రామమిది. ప్రముఖ చరిత్రకారుడు కట్టా శ్రీనివాస రావు గారు 2019 అక్టోబర్‍ 13 వ తేదీన డచ్‍ వారిని తరిమి కొట్టిన రోజుకు గుర్తుగా ‘చరిత్రకెక్కని సమరం తలవంచని నాగులవంచ’ పుస్తకాన్ని విడుదల చేశారు. డచ్‍ వారిని వలందులు అంటారు. అందువల్ల ఈ గ్రామాన్ని వలందుల వారి పట్నం, వలందులోరి పట్నం’గానూ పిలిచేవారు.


నేలకొండ పల్లి:- మండల కేంద్రమిది. ‘‘శక సంవత్సరం 1162 గణపతి దేవ మహారాజు కాలం నాటి నేలకొండపల్లి చెరువుగట్టు శాసనంలో 5, 6 మరియు 19,20 పంక్తులలో కొండపల్లి’ అని ప్రస్తావించబడింది. శాసనం 65 నుండి 70 పంక్తుల వరకు ‘శ్రీ కొండపల్లి పురము…. మెచ్చన్‍’ అను కంద పద్యమున్నది.’’ (కొత్త తెలంగాణ శాసనాలు : శ్రీరామోజు హరగోపాల్‍. పుట.117-124) శాసనంలోని ప్రాచీన రూపం కొండపల్లి కాలక్రమంలో నేలకొండపల్లి’గా మారింది.


బయ్యారం:- ‘‘క్రీ.శ.13వ శతాబ్ది కాలానికి చెందిన కాకతి మైలమ బయ్యారం చెరువు శాసనం గణపతి దేవుని వరకు గల కాకతీయ వంశవ•క్షాన్ని వివరిస్తుంది. ఈ శాసనం 47వ పంక్తిలోని బయ్యాంబ ప్రస్తావన ఉన్నది.’’ (మీరూ శాసనాలు చదువొచ్చు: కూర్పరి-ఈమని శివనాగిరెడ్డి స్థపతి. పుట-394)’’ ‘‘గణపతి దేవుని సోదరి మైలాంబ బయ్యారం వద్ద ఒక పెద్ద చెరువు త్రవ్వించి వేయించిన మూడు శాసనములలోని ఒక శాసనంలో మైలాంబ శ్రీశైలాది క్షేత్రములందు శివ ప్రతిష్టలు చేయుట, తన తండ్రి మహాదేవుని పేరున మహదేవపురము, తల్లి బయ్యాంబ పేరు మీదుగా బయ్యవరం, బయ్యారం, తన బిరుద నామమైన ధర్మకీర్తి పేరు మీదుగా ధర్మకీర్తి పురం/ధర్మవరం గ్రామంలో ప్రతిష్టించిందని శాసనం రాసిన రామ దేవుడను కవి వర్ణించాడు.’’ (కాకతీయ శాసన సాహిత్యం, పి.వి.పరబ్రహ్మ శాస్త్రి. పుట-54) శాసనం ద్వారా మూడు గ్రామ నామాలు ఏర్పడిన విధం తెలుస్తున్నది.


భద్రాచలం:- భద్రగిరి అను రూపాంతరమున్నది. ‘‘మూడు వేల సంవత్సరాల సంవత్సరాల క్రితం భదళపురి’గా పిలువ బడినది.’’ (తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు: డా. ద్యావనపల్లి సత్యనారాయణ. పుట-156,157) ‘‘ఈ భద్రాచలం ప్రాంతాన్ని విసురునాడు అని కూడా వ్యవహరించే వారు.’’(తెలంగాణ చరిత్ర తొవ్వల్లో : శ్రీరామోజు హరగోపాల్‍. పుట-226)పూర్వం భద్రుడు అనే భక్తుడు శ్రీ రాముని కోసం తపస్సు చేసి కొండగా మారినాడని ఆ కొండకే భద్రుడి పేరు మీదుగా భద్రగిరి, భద్రాచలం’గా మారిందని స్థల పురాణం, స్థానిక ఐతిహ్యమున్నది.


ముదిగొండ:- మండల కేంద్రమిది. బ•హత్‍ శిల అను నామాంతరమున్నది. ‘‘ముదిగండ, ముదిగొండూరు, ముదిగాండూరు అని ప్రాచీన వ్యవహార నామాలున్నవి. ఈ ముదిగొండతో పాటు కొరవి బొట్టు తదితర పట్టణాలను చాళుక్యులు రాజధానులుగా చేసుకొని పరిపాలించినందు వలన ముదిగొండ చాళుక్యులు అయ్యారు.’’ (తెలంగాణ చరిత్ర సంస్క•తి వారసత్వం: వై.వై.రెడ్డి యానాల. పుట-160) ‘‘క్రీ.శ. 12వ శతాబ్ది కాలం నాటి ముదిగొండ చాళుక్య కుసుమాదిత్యుని కుక్కునూరు రాగిరేకు తెలుగు గద్య శాసనంలో ముదిగొండ చాళుక్యుల వంశ వ•క్షాన్ని, విజయాలను, భాషను చెప్పడం జరిగింది. ఈ శాసనంలో క్రివ్వక అను మరో గ్రామ నామ ప్రస్తావన ఉన్నది. క్రివ్వక’యే క్రమంగా కివ్వక’ గా మారిందని స్పష్టమౌతున్నది.’’ (అలనాటి మేటి తెలంగాణా శాసనాలు: ఈమని శివనాగిరెడ్డి-స్థపతి. పుట-100)


రాజేశ్వరపురం:- నేలకొండపల్లి మండలంలోని గ్రామమిది. శక సంవత్సరం ‘‘1151 కాలం నాటి ఈ గ్రామ శాసనంలో కట్టంగూరు, తాటితోట, కొండపల్లి (నేలకొండపల్లి), సూరాదేవి పల్లి, ముకింద పాయ, దేవరబండ, బొల్లికుంట, ఇప్పల ఎఱ్ఱంగుంట స్థల నామాల ప్రాచీన రూపాలు ఉన్నాయి.’’ (తెలంగాణ చరిత్ర తొవ్వల్లో శ్రీరామోజు హరగోపాల్‍. పుట. 151-155)


ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డా. మొరంగపల్లి భాగయ్య గారి పర్యవేక్షణలో డా. యద్దనపూడి గాయత్రి గారు 2015లో ‘ఖమ్మం జిల్లా గ్రామ నామాలు’ అంశంపై Ph.D పరిశోధన పూర్తి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా గ్రామ నామాలపై అటవీ ప్రాంత ప్రభావం, ఆదివాసీ, గిరిజన జీవన సంస్క•తి, జల శిల పర్వత, భూ, వ•క్ష, జంతు, పక్షి, వస్తు, వంశ, కుల, జాతి, మత, జానపద సంస్క•తి ప్రభావం కనబడుతుంది. పర్ణశాల ప్రాంతాన్ని రథచరగిరి, ధూరపాతకం, పాప ప్రణాశన తీర్థం, గాలవము అను పేర్లతో పిలిచేవారట. కిన్నెర సాని ప్రవాహం ప్రభావంతో ఏర్పడిన కిన్నెర సాని గ్రామం. థంసా ప్రభావంతో థంసలాపురం, బౌద్ధ మత ప్రభావంతో మజ్జి గూడెం, మధిరను నతవాటిసీమ, మధురాపురి’గా వ్యవహరించగా కట్టకూరు-కట్టగూరు, చింటూరు-చింతూరు, టేకులపల్లి-టేక్లపల్లి, పాల్వంచ-శంకరగిరి, బాణాపురం-బాణాలపురం, యటపాక-జటపాక, రేఖపల్లి-రెక్కపల్లి, సత్తుపల్లి-సత్తువపల్లి వంటి ఉమ్మడి జిల్లాలోని అనేక గ్రామ నామాలను పరిశోధిస్తే మరిన్ని వాస్తవ రూపాలు చూడవచ్చు.

డా. మండల స్వామి
ఎ : 9177607603

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *