తెలంగాణ చరిత్ర ఆధిపత్య వ్యతిరేక పోరాటాల చరిత్ర. తెలంగాణకు మరోపేరు పోరాటాల పురిటి గడ్డ. ప్రపంచంలో జరిగిన, జరుగుతున్న ఉద్యమాలకు పాఠాలు చెప్పిన ప్రజా ఉద్యమాల చరిత్ర తెలంగాణా రాష్ట్ర సాధన చరిత్ర.
నాగరికత అంటే ప్రకృతి వనరులను వినియోగించుకోగలిగిన సామర్థ్యం. సంస్క•తి అంటే ప్రజల జీవన విధానం. ప్రతి ప్రాంతానికీ తమదంటూ నాగరికత, సంస్క•తి వుంటాయి. ప్రకృతి వనరులను ఎంతబాగా వినియోగించుకోగలిగితే అంతగా నాగరికత అభివృద్ధి చెందుతుంది. ఆ నాగరికత ప్రజల జీవన విధానంలో పలు మార్పులు తెచ్చి సంస్క•తీ భాగాలైన సాహిత్యం, కళలు, వేష, భాషలు యిలా జీవితంతో సంబంధం వున్న ప్రతి అంశంపై ప్రభావం చూపుతుంది.
ప్రకృతి వనరులు ప్రజలందరికీ సమానంగా అందకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు అవరోధంగా నిలుస్తాయి. పల్లెల సాధికారత, కుల వృత్తుల మనుగడ ప్రశ్నార్థక మవుతాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మృగ్యమవుతాయి. దీనివల్ల ప్రతి రంగంలో అసమానతలు బలీయంగా పెరుగుతాయి. సామాన్యుడి రోజు వారీ జీవితం గడవటమే కష్టమవుతుంది.
ప్రకృతి వనరులైన నీళ్లు, ఆర్థిక పరమైన నిధులు, పరిపాలనా అంశమైన నియామకాలు తెలంగాణ ప్రజలకు ఎందుకు దూరమయ్యాయో ప్రజలు తెలుసుకున్నారు. తమవి తమకే చెందాలన్న చైతన్యం పెరిగింది. ఈ అస్తిత్వ చైతన్యమే తెలంగాణా మలిదశ ఉద్యమానికి ఊపిరిపోసింది. ప్రతి పల్లె, ప్రతి యిల్లు, యింట్లోని ప్రతి మనిషి ఉద్యమానికి అంకితమయ్యారు. కుల, మత బేధాలు, స్త్రీ పురుష తేడాలు, చిన్నా పెద్ద వయో పరిమితులను అధిగమించి సకలజనులు రాష్ట్ర సాధనకోసం ఒకే గొంతుకై, ఒకే పిడికిలై నిలిచారు. ధూంధాంలు, సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ, ధర్నాలు, ఊరూరా నిరాహార దీక్షలు, పాదయాత్రలు, సెమినార్లు, మిలియన్ మార్చ్, సాగర హారం, సదస్సులు, నిరంతర చర్చలు చరిత్రలో అజరామరంగా నిలిచిన ఉద్యమ రూపాలు.
బలిదానాలు, త్యాగాలు ఉద్యమాన్ని నిరంతరం నిత్యాగ్నికీలగా నిలిపాయి. ఈ ఉద్యమాలే రాష్ట్రాన్ని యిచ్చామన్నవారి, తెచ్చామన్నవారి రాజకీయ పక్రియను వేగవంతం చేసాయి. అనివార్యతను కల్పించాయి. రాష్ట్రాన్ని సాధించాయి.
జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ విజయోత్సవాలను జరుపుకుంటున్న సందర్భంలో ఏ ప్రజా ఆకాంక్షలు ఉద్యమ కారకాలయ్యయో అవి ఎంత వరకు నెరవేరాయో, నెరవేరక పోతే నెరవేరడానికి యిప్పుడు మనం ఏం చెయాల్సి వుందో పునరాలోచించాల్సి వుంది. వాటి సాధనకు కృషి చేయాల్సి వుంది.
ప్రజలు చైతన్యవంతులు. చరిత్ర తిరగరాసే శక్తి ప్రజలకెప్పుడూ ఉంటుంది.
(మణికొండ వేదకుమార్)
ఎడిటర్