అసాధారణ అతి ఉష్ణోగ్రతలు, దీర్ఘకాలం కొనసాగుతున్న వడగాలులు, తీవ్రమైన వాతావరణ మార్పులతో ప్రపంచ మానవాళి, ప్రాణి కోటి నిప్పుల కొలిమిలో నివసించాల్సిన అగత్యం ఏర్పడుతున్నదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ ప్రతికూల మార్పులతో ప్రతి వేసవిలో దేశాల గరిష్ట ఉష్ణోగ్రతలు అస్థిరంగా, అవాంఛనీయంగా, అనారోగ్యకరంగా మారుతూనే ఉన్నాయి. భూతాపాన్ని అంచనా వేయడం, హరితగ•హ ప్రభావాన్ని (గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్) తగ్గించడం లాంటి లక్ష్యాలను అధ్యయనం చేయడం, పరిష్కారాలు ఇవ్వడానికి పలు దేశాల మహానగరాల్లో ‘చీఫ్ హీట్ ఆఫీసర్’ ఉద్యోగులను నియమించాల్సిన అగత్యం ఏర్పడింది. కార్చిచ్చులు, హరికేన్లు, వరదలు లాంటి విపత్తులతో అధిక ఆస్తి, ప్రాణ నష్టాలు నమోదు అవుతున్నప్పటికీ నేడు వాతావరణ ఉష్ణోగ్రతలు పెరగడం, వడగాడ్పులు వీచడంతో సకల ప్రాణికోటి ఉనికి ప్రమాదంలో పడనుందనే తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2030 నుంచి 2050 మధ్య కాలంలో ప్రతికూల వాతావరణ మార్పులతో పోషకాహారలోపం, మలేరియా, డయేరియా, ఉష్ణోగ్రత ఒత్తిడుల (హీట్ స్ట్రెస్) కారణంగా అదనంగా 2.5 లక్షల మరణాలు నమోదు కావచ్చనే భయానక వార్తలను వెల్లడిస్తున్నారు.
అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు:
‘‘ఐరాస ఇంటర్‍గవర్నమెంటల్ పానెల్ ఆన్ క్లైమెట్ చేంజ్ (ఐపిసిసి)’’ నివేదిక ప్రకారం ఇండియా, యూయస్, స్పేయిన్ లాంటి దేశాల్లో రికార్డు స్థాయిలో పాదరస మట్టాలు (ఉష్ణోగ్రతలు) పైపైకి పొంగడం జరుగుతూనే ఉన్నది. వేసవి కాలంలో స్పేయిన్‍లో గరిష్ట ఉష్ణోగ్రతలు 47.2 డిగ్రీ సెంటిగ్రేడ్, ఇండియాలో 45.8 డిగ్రీలు చేరడం, అమెరికాలో 40 డిగ్రీలు తరుచుగా దాటడం సర్వసాధారణమైంది. ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు తోడై ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆసియా ఖండంలో వడగాడ్పులు, నీటి తేమ సమస్యలతో రాజస్థాన్, గుజరాత్, యూపీ, ఢిల్లీ రాష్ట్రాల్లో పాదరస మట్టాలు పరుగులు తీయడం, వడగాలులు వీచడం చూస్తూనే ఉన్నాం. గత 122 ఏండ్లలో ఎన్నడూ చూడని వడగాడ్పులను మార్చి-2022లో చూసాం. గత 72 ఏళ్ళలో అత్యధికంగా 09 ఏప్రిల్ 2022న ఢిల్లీలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఏప్రిల్-1941లో ఢిల్లీలో 45.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డుగా ఇప్పటికీ రికార్డుల్లో ఉంది. రాజస్థాన్‍లో గరిష్టంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని గమనించాలి. అమెరికాలో వడగాలులతో ఏడాది సగటున 702 మంది మరణించగా, 2004-18 మధ్య కాలంలో మాత్రమే 10,527 మంది వేడి గాలులకు ప్రాణాలు అర్పించారని గణాంకాలు తెలుపుతున్నాయి. 1880 నుంచి ప్రతి దశాబ్దకాలంలో భూ ఉష్ణోగ్రతలు 0.08 డిగ్రీలు పెరుగుతుండగా, గత నాలుగు దశాబ్దాల్లో సగటున 0.18 డిగ్రీలు పెరగడం ప్రమాదకర భవిష్యత్తును సూచిస్తున్నది. ప్రతి ఏట మార్చి నుంచి జూన్ వరకు ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
హరిత గ•హ ప్రభావ భూతాపం:
అతిశీతల చలికాలం, అత్యధిక వేసవి ఉష్ణోగ్రతలు, కరువులు, కార్చిచ్చులు, తుఫాన్లు, వరదలు లాంటి విపత్తులు అసాధారణ వాతావరణ ప్రతికూల మార్పుల వల్ల జరుగుతున్నాయని నిర్థారణ అయ్యింది. భూతాపంతో ఆర్కిటిక్, అంటార్కిటిక్ ద•వాల్లో మంచు కరగడంతో సముద్రమట్టాలు క్రమంగా పెరుగుతూ తీరప్రాంతాలను సముద్ర నీరు ముంచనుందని ఐపిసిసి నివేదిక వివరిస్తున్నది. 1990-2019 కాలంలో మానవ ప్రేరేపిత గ్రీన్ హౌజ్ వాయువుల (కార్బన్ డై ఆక్సైడ్, ఓజోన్, హైడ్రోకార్బన్లు, నైట్రోజన్ ఆక్సైడ్లు, నీటి ఆవిరి లాంటివి) కారణంగా ఉష్ణోగ్రతలు 45 శాతం పెరుగుతున్నాయని, వీటిలో కార్బన్ డై ఆక్సైడ్ మూలంగానే 36 శాతం హరిత గ•హ ప్రభావం పెరిగిందని తెలుస్తున్నది. హరిత గ•హ వాయువులు పెరగడంతో ఉష్ణోగ్రతలు అధికం కావడమే కాకుండా వాతావరణం, నేల, సముద్ర జలాలు ప్రతికూల మార్పులను పొందుతున్నాయని గమనించాలి. 2030 నాటికి భూతాపంతో క్రమంగా మొక్కజొన్న లాంటి ధాన్య దిగుబడులు 24 శాతం వరకు తగ్గవచ్చనే కఠిన వాస్తవాన్ని వెళ్ళడిస్తున్నారు. ఆఫ్రికాలోని సోమాలియా, ఇథియోపియా లాంటి దేశాల్లో అత్యంత పొడి గాలుల అసాధారణ వాతావరణం నెలకొంటున్నట్లు తేలింది.
సముద్రమట్టం పెరుగుదల:
ఐపిసిసి హెచ్చరిక ప్రకారం శిలాజ ఇంధనాల విచక్షణారహిత వినియోగం, మానవ ప్రమేయ పర్యావరణ కాలుష్యాలతో వాతావరణ ప్రతికూల మార్పులతో తీవ్ర వడగాలులు వీచడం జరుగుతోంది. స్విస్జర్‍లాండ్‍లోని పిజోల్ మంచుకొండలు హరితగ•హ వాయువులతో 2006 నుంచి నేటి వరకు 80 శాతం వరకు కరిగాయని, రానున్న దశాబ్దాల్లో 90 శాతం వరకు కరిగిపోవడంతో 2100 వరకు సముద్రమట్టం 2 మీటర్లు పెరిగి 63 కోట్ల జనులు తమ నేలను కోల్పోయే ప్రమాదం ఏర్పడనుంది. ప్రపంచ దేశాలు గ్రీన్ హౌజ్ వాయువులను నియత్రించకపోతే ప్రపంచ మానవ మనుగడ ప్రశ్నార్థకం కానుందని ఐపిసిసి హెచ్చరిస్తున్నది. భూతాపం ఇలాగే పెరిగితే రానున్న దశాబ్దాల్లో మానవ ఆవాసాలు, గ్రామాలు, వ్యవసాయ క్షేత్రాలు, నగరాలు సముద్ర జలాలతో నిండనున్నాయని, నైజీరియా లాంటి కొన్ని దేశాలు తమ తీరప్రాంత రాజధానులను కోల్పోనున్నాయని తెలుస్తున్నది. ప్రపంచ కార్బన్ ఉద్గారాల్లో 30 శాతం చైనా బొగ్గు ఆధార పవర్ కేంద్రాలు కలిగిస్తున్నాయి. 2060 నాటికి జీరో-కార్బన్ ఉద్గారాల దేశంగా చైనా, 2070 నాటికి ఇండియాలను మార్చుటకు చర్యలు చేపడుతున్నారు.
సానుకూల చర్యలే శ్రీరామరక్ష:
పారిస్ అగ్రిమెంట్ సిఫార్సు ప్రకారం 2050 నాటికి కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని, లేనియెడల ప్రస్తుత కార్బన్ ఉద్గార రేటు ఇలాగే కొనసాగితే 2100 వరకు ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీలు పెరుగుతాయని సూచిస్తున్నారు. నగరాల్లో విస్తారమైన రోడ్లు, అధిక జనాభా, వాహనాల గుంపులు, సిమెంట్ కాంక్రీట్ భవనాలు, స్టీల్ వాడకాల వల్ల వాతావరణ ఉష్ణోగ్రతలు ప్రభావితం అవుతున్నాయి. హరిత క్షేత్రాల పెంపు, అడవుల సంరక్షణ, అడవుల నరికి వేతను కట్టడి చేయడం, నగరాలను నందన వనాలుగా మార్చడం, గ్రీన్ స్పేస్‍లను నిర్మించడం, నిర్మాణరంగంలో సానుకూల మార్పులు చేపట్టడం, కాంక్రీట్/స్టీల్ వాడకాన్ని తగ్గించడం, కిటికీల వైశాల్యాలు/వెంటిలేషన్లను పెంచడం, తక్కువ శక్తి వినియోగంతో గ్రీన్ గ•హాల నిర్మాణం, క•త్రిమ మేధో ఆధార హీటింగ్/ కూలింగ్/ లైటింగ్/ఏయిర్/ మేయింటెనెన్స్లతో కనిష్ట శక్తిని వినియోగించడం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని కట్టడి చేయడం, నీటి వినియోగాన్ని నియంత్రించడం, ప్రైవేట్ వాహన వినియోగాన్ని తగ్గిస్తూ ప్రజారవాణాకు పట్టం కట్టడం, ఫ్లైఓవర్ల నిర్మాణాలను నియంత్రించడం, నెట్-జీరో ఎనర్జీ కాలనీలను నిర్మించడం, కనిష్ట శక్తి వినియోగ పట్టణీకరణ ప్రణాళికలు చేపట్టడం లాంటి పలు జాగ్రత్తలు చూసుకోవలసిన సమయం ఆసన్నమైందని పౌరసమాజం తెలుసుకోని ఆ దిశగా స్పందించాలి.
–డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
ఎ : 9949700037