ప్రకృతే సౌందర్యం! 25 ప్రకృతే ఆనందం!! ఎల్లలెరుగని పక్షులం! కల్లలెరుగని జీవులం!!

అది వాగా సరిహద్దు. అమృత్‍సర్‍కు, లాహోర్‍కు మధ్యన వుండే భారత్‍, పాక్‍ల సరిహద్దు. రోజు సాయంత్రం ఇక్కడ ఇరు దేశాల పతాకాల అవనతం వుంటుంది. దినమంతా ఇరుదేశాల సైనికులు తప్ప జనాలు కనపడరు. అటు నుంచి మహమ్మద్‍ అలీ జిన్నా, ఇటు నుంచి మహాత్మా గాంధీ చిత్రపటాలు ఒకరినొకరు పలకరించుకుంటున్నట్లుగా వుంటాయి. సాయంత్రం ఇటు నుంచి హాజరైన జనాలు కేరింతలు, చప్పట్లు, ఈలలు, పాక్‍ వ్యతిరేక నినాదాలు పైనున్న మేఘాల్ని కూడా కదిలిస్తాయి. రోజా సినిమాలోని పాటల బ్యాండ్‍ మేళం ఆ నినాదాలకు తాళం వేస్తాయి. అదే సంధ్యా సమయంలో ఇరు ప్రాంతాల్లో ఎత్తుగా వున్న చెట్లపైన ఓ అలజడి, ఆహ్లాదం మొదలైతుంది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటూ రకరకాల పక్షులు గుంపులు గుంపులుగా, సైనిక విమానాల విన్యాసాల్లా ఎగురుతూ తమతమ గూళ్లను చేరుకుంటాయి. వాటి కిలకిలారావములు జనాల హోరులో, బ్యాండ్‍ చప్పుళ్లలో ఎవరి చెవికెక్కని వైనం! అలా ఓ రెండు గంటల పాటు సాగే నిత్య నాటకంలో ప్రకృతి ఒడిలోని పక్షులు భేషజాలు లేకుండా, మతాల పట్టింపు లేకుండా, జాతి భేధాల్ని దరిరానీయకుండా దేశాల సరి హద్దులంటూ గిరిగీసుకోకుండా తమతమ గూళ్ళల్లోకి, స్థావరాల్లోకి చేరడం సహజమే అయినా, మానవుల వక్రబుద్ధికి ఓ చెంపపెట్టు లాంటిదే!


ఈ తతంగం తర్వాత తిరుగుముఖం పట్టిన జనాల్లో, ముఖ్యంగా యువతలో కట్టలు తెంచిన ఆవేశం, దేశభక్తి ఇరు దేశాలగుండా పారే జీలం నదినే మంచెత్తేలా వుంటుంది. ఇవేవి పట్టని విహంగాలు, తమకేవి ఎల్లలంటూ, తమ దేశాలేవంటూ జనాలవైపు చూస్తూ నిద్రకు ఉపక్రమించడం ఓ ప్రకృతి వింతకాదా..!


ఇంతటి విశాల దేశభక్తిగల యువతను ‘…మీలో ఎంతమంది సైన్యంలో చేరుతారని..’ పక్షులు ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానాలు వస్తాయో ఊహించవచ్చు! అయినా, అటు పక్కనేగల లాహోర్‍ జైల్లో అమరులైన భగత్‍సింగ్‍, సుఖ్‍దేవ్‍, రాజుగురువులు ఎంతమందికి గుర్తుకు వస్తారో కూడా తెలియని విషయమే! పక్షులకు, ప్రకృతికి లేని పట్టింపులు అతి తెలివిపరులమని విర్రవీగే మానవులకెందుకో తెలియదు.


ఈ సందర్భంగా వివిధ రకాల పక్షులు వివిధ ఖండాల్ని, దేశాల్ని ఎలా స్వంతం చేసుకుంటాయో చూస్తే మనం సిగ్గుతో తలవంచు కోవాల్సిందే! రాచరిక ఠీవిలేదు, సైన్యం లేదు, కవాతులేదు, యుద్దం లేదు. దేశాల సరిహద్దుల లెక్కలేదు. భూగోళమే ఆవాసంగా, ధృవాలే సరిహద్దుగా ఎలా విహరిస్తాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఉత్తరార్ద్రగోళంలో శీతాకాలం వచ్చిందంటే చాలు, వేలాది పక్షులు భూమధ్యరేఖ ప్రాంతాల్లోని తూర్పు, పశ్చిమ ఆసియా దేశాలకు, భారత ఉపఖండానికి వలసలు వచ్చేది తెలిసిందే! జాతి, మత, ప్రాంతీయ బేధాలు లేని ఈ పక్షిజాతి వలసలు వాటి మనుగడకే అయినా, ప్రకృతి పరంగా, పర్యావరణ విషయంగా ఎంతో దోహదపడడమే కాక, ఆహారపు గొలుసు నియంత్రణలో, మానవ మనుగడకు సహకరించడంలో వాటికవే సాటి! ఈ సృష్టిలో పక్షుల గమనం, గమ్యలో మార్పులు వచ్చినా గతి తప్పినా, భౌగోళిక జీవరాశిపై ఎలాంటి విపత్తులు వస్తాయో ఊహించడం కష్టమే!
అలాంటి కొన్ని పక్షుల్ని చూద్దాం!


ఒంటి దాన్నే! అయినా గతి తప్పలేదు (ఒమిడి – Omid పక్షి)
సైబీరియా దక్షిణ ప్రాంతంలోని మనోవాట్‍ నది తీర ప్రాంతంలో వుండే నేను ఓ కొంగ (crane) జాతి పక్షిని. నేను ఒంటరి దాన్ని ఎందుకయ్యానో మీ మొద్దుబారిన బుర్రలకు అర్థం చేసుకునే శక్తి, ఓపిక లేదు. వందలాది సంవత్సరాలుగా, మాపై జరిగిన వేటలో అన్ని కనుమరుగు కాగా, నేనొక్క దాన్నే మిగిలాను. ప్రతీ శీతాకాలంలో సైబీరియా నుంచి సుమారు 5,000 కి.మీ. ప్రయాణించి ఇరానుకు చేరుకుంటాను. గత 16 సం।।లుగా నా ఒంటరి జీవితాన్ని పరిశీలించిన, ఇరాన్‍ పక్షి ప్రేమికులు నాకు ఒమిడ్‍ (omid), అనగా నమ్మకం (hope) అనే పేరు పెట్టారు. నాతో జతగా వుండే ఆడ కొంగ (Arezoo- కోరిక (desire) 2008 చివర్లోనే నన్ను వీడి శాశ్వతంగా వెళ్లిపోయింది. ప్రకృతి పరంగా అందుకే నేను ఒంటరి దాన్ని అయ్యాను. అయినా నిరాశపడకుండా, బెంగపడకుండా ప్రతీ చలికాలంలో సైబీరియా నుంచి బయలుదేరి ఉత్తర, పశ్చిమ ఖజికిస్తాన్‍, వోల్గానది (రష్యా)ను దాటి, దక్షిణ అజర్‍బైజాన్‍ ద్వారా ఇరాన్‍ చేరుకొని, తిరిగి వసంతంలో (spring) నా జన్మ స్థలానికి వెళ్ళడం నా జీవన చర్యగా మారిపోయింది.
నా ఒంటరి జీవితాన్ని పరిశీలించిన ఇంటర్నేషనల్‍ క్రేన్‍ ఫౌండేషన్‍ (ICF) బెల్జియం నుంచి రొయా (Roya) అనే ఆడ కొంగని నాకు తోడు చేసారు. సుమారు 34 రోజులు కలిసి మెలిసి తిరిగిన మేము, సైబీరియా వెళ్ళాల్సిన సమయం ఆసన్నం కావడంతో బయలుదేరాం. కాని, నా సహచరి నాతో కొంత దూరం వరకు వచ్చి ఆగిపోయి వుంటుంది. ICF పరిశీలకుల ప్రకారం, రొయా మార్చి 5, 2023న ఇరాన్‍లోని టోన్‍కాబన్‍ (Tonekabon) ప్రాంతంలో కనబడినట్లుగా చెపుతున్నారు. ఏమి జరిగిందో తెలియదుగాని, మా జంట తిరుగు ప్రయాణంలో అజర్‍బైజాన్‍లో చూసినట్లుగా, రాజస్థాన్‍లోని కియోలాడియో ప్రాంతంలో చూసినట్లుగా చెప్పుకుంటున్నారు. వచ్చే శీతాకాలంలో తప్ప మా గూర్చిన సమాచారం తెలియక పోవచ్చు. (నోటు: సహజంగా ఆడ పక్షులు సంతానోత్పత్తి సమయంలో ఎగరలేవు).


గగనతలంలో ఎగిరే అతిపెద్ద పక్షి – సారస్‍ (Sarus)
సుమారు అయిదు అడుగుల ఎత్తులో 1.5 మీ. చొప్పున గల రెక్కలతో వుండే నేను ప్రపంచంలోనే ఎగిరే అతి పెద్ద పక్షిగా గుర్తింపు పొందాను. సరస్సులను ఆధారంగా చేసుకొని జీవనం సాగించడంతో నన్ను సారస్‍, అనగా సరస్సు (lake) అని పిలుస్తారు. భారత్‍లోని ఉత్తరప్రదేశ్‍లోని మెటవా, మణిపూర్‍ ప్రాంతాల్లో దక్షిణ తూర్పు ఆసియాలో, నేపాల్‍, ఆస్ట్రేలియాలో కనపడే నేను, ఈ మధ్యన కనపడని జాబితాలోకి చేరుతున్నట్లుగా కథనాలు. 15వ శతాబ్దంలో నా ఉనికిని గుర్తించారు. శతాబ్దాల క్రితం కొంగ జాతుల వారసురాలిగా నన్ను ఫాదర్‍ ఆఫ్‍ ఇండియన్‍ ఒరింతాలోజిష్ట (Orinthologist) ఎవో హ్యూమ్‍ ( A O HUME ) చెపుతూ వుండేవాడు. ఒకప్పుడు భారత్‍ ఉపఖండంలో 40 వేలకు పైగా వున్న మా సంఖ్య తుది దశకు చేరుకున్నట్లుగా అంటున్నారు. బాతుల్లా, కోళ్లలా నేను ఓ సంఘజీవినే. 1972లో అటవి జీవుల సంరక్షణ చట్టలో నన్ను చేర్చినా ఆశించిన ఫలితాలు లేవు. దీనికి కారకులు ఎవరో ఊహించండి.


ధృవాలే సరిహద్దుగా ఆర్కిటిక్‍ టెర్న్ (Arctric Tern)

బహుష భూమిపై చలించే జంతువులలో నా లాగా వలస వెళ్ళే జంతువులు లేవనుకుంటాను. నిజానికి నా ఆవాసం ఉత్తరధృవపు గ్రీన్‍లాండ్‍. కాని శీతాకాలంలో ఇతర పక్షుల్లా నేను సంతానోత్పత్తికై ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిందే! అయితే, అత్యధికంగా పక్షులు సైబీరియా నుంచి, భూమధ్యరేఖ ప్రాంతాల ఆవాసాలకు వలస వెళ్ళుతాయి. కాని నా విడిది దక్షిణ ధృవపు అంటార్కిటాలోని వెడ్డెల్‍ (Weddle) సముద్రం. సుమారు 6 వేల కి.మీ. దూరాలకు వలస వెళ్ళే పక్షులే ఎంతో విశిష్టతను కలిగి వుంటాయి కదా! కాని నా పయనం ఏకంగా సుమారు 90వేల కిలోమీటర్లు. మీకిది ఆశ్చర్యం కావచ్చు! కాని, మీ పక్షి ప్రేమికుల్ని అడిగి తెలుసుకోండి. ఇంత వైవిధ్య జీవితాన్ని గలిగిన నన్నన్నా రేపటి తరానికి సజీవంగా చూపించండి!


నింగిలోనే నిద్ర – బార్‍ టేయిల్డ్ గాడ్‍విట్‍

సుమారు 15 అంగులాల పొడవుండే నేను అలస్కా వాసిని. ఇతర పక్షుల్లాగానే నేను ఆస్ట్రేలియాకు వలసపోతాను. పోతే, ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేనెక్కడా ఆగను. మరి నిద్ర, ఆహారమంటారా..? ఈ పయాణంలో ఆహారం తీసుకోకుండా, స్కాండినేవియా నుంచి ఆస్ట్రేలియాకు, సుమారు 30 వేల కి.మీ. ఎగురుతూనే నిద్రపోతాను తెలుసా! ఇది ఎలా అంటారా… నా అంతర్గత అవయవాల జీవక్రియల్ని కుంచించుకోవడంతో, నా మెదడులో కొంత భాగం నిద్రపోయేలా చేస్తాయి. ఇది ప్రకృతి ప్రసాధించిన గొప్పవరం కదా! నా గమన మార్గం కూడా అతి పెద్ద సముద్రమైన పసిఫిక్‍ సముద్రమే! వాతావరణం అనుకూలిస్తే, నా వేగం గంటకు 100 కి.మీ. అందుకే కాబోలు నన్ను మీ గిన్నీస్‍ బుక్‍ ఆఫ్‍ వరల్డ్ రికార్డులో చేర్చారు.
నాలాగే ఆల్‍బట్రాస్‍ పక్షి కూడా ఎగురుతూనే నిద్రపోతుంది. మాలా మీకు ఈ కళ అబ్బితే… మరెంత విధ్వంసకులు అవుతారో? మా పరిస్థితి కూడా, IUCN జాబితాలోని రెడ్‍లిస్టులో చేర్చారు కదా!


పిల్లల పెంపకంలో తండ్రులమే గొప్ప (Winter tailed – white -(erowned sparrow))
పిచ్చుకల జాతికే చెందిన నేను ఉత్తర ధృవ ప్రాంతంలో, కెనడా, అలస్కాలలో వుంటూ కాలిఫోర్నియాకు వలసపోతూ వుంటాను. నా ప్రత్యేకత ఏమంటే, నా సహచరి పెట్టిన గుడ్లను రక్షించి పొదగడం. పిల్ల పక్షులకు గూళ్ళు నిర్మించడం. వాటికి ఆహారాన్ని అందించడం. ఇలా ఏ పక్షి చేయని పనిని నేను ఆరు మాసాలు చేస్తాను సుమా! నన్ను చూసైనా, మీ మగజాతి కొంచెం ఆలోచించాలి.


అనుకరించుటలో వేణుమాధవ్‍కు గురువులం (Mimicry Birds)
మాకున్న కంఠంతో మమ్మల్ని అనుకరణ (మిమిక్రి) పక్షులని అంటారు. సంగీత పరమైన గొప్ప శక్తిని, పాడే చక్కని గొంతును ప్రకృతి మాకు ప్రసాధించడమే కాక, ఇతర పక్షులలా మేము వాటి కూతల్ని అనుకరిస్తాం! చాలా పక్షులు, మమ్మల్ని వాటి సహచరులని భ్రమిస్తాయి. మా కళనే మీరు అనుకరిస్తూ, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఆపాధించు కుంటారు. మరి మమ్మల్ని మీ రేపటి వారసులకు భద్రంగా చూపలేరా..?


నేతగాళ్ళ గురువుని ((Weaver Bird)
ఆఫ్రికా, ఆసియా ఖండాలలో మా జాతి పక్షులు సుమారు 100 రకాలు అని మీ లెక్కలు చెపుతున్నాయి. ప్రకృతి ప్రసాధించిన నైపుణ్యతతో మేము ఏ ఇంజనీరింగ్‍ డిగ్రీ చేయకున్నా అందమైన గూళ్ళను మా పిల్లలకై నిర్మిస్తాం. మా కళ ఇంతవరకు మీ మానవులకు అబ్బలేదు. లేకుంటే, మా గూళ్ళ (Nests) పేటెంట్లుగా మీరే చలామణి అయ్యేవారు. ఒక్కొక్క గూటికి సుమారు వెయ్యి గడ్డి పరకల్ని సేకరించాలి. సేకరించడానికి సుమారు 500-1000 చక్కర్లు కొట్టాలి. ఇలా ఓ 20 రోజులు పాటు శ్రమించి గుండ్రని ద్వారాన్ని, ఓ వరండాను, లోపల నివసించడానికి గదిని నిర్మిస్తాం. ఈ పనిని కూడా, మా మగజాతి చేపడితే, మధ్యలో ఆడపక్షి వచ్చి చేరుతుంది. అలా ఆ గూడు నచ్చుతే, సంసారం చేస్తుంది. మరి మీరో! నమ్మి వచ్చిన సహచరిని అవసరమైతే ఇంటి నుంచి తన్ని తరిమేస్తారు కదా! దీన్ని కూడా కథలుగా, గాధలుగా చెప్పుకుంటారు.


మగాళ్ళమే! అయినా వయ్యారులమే! (Flamingos)

అందమైన ఆడవారి నడకను మా జాతితో (హంస) పోలుస్తారు. కాని మీకు తెలియని ఆసలు విషయం మా మగజాతి గూర్చి. ఆడ పక్షిని ఆకర్షించడానికై మా మగజాతి సంప్రదాయబద్ధమైన (ritual) నాట్యాన్ని చేస్తాయి. ఆడజాతిని ఆకర్షించి జతకడుతాయి. ఇదంతా ఓ అనుకూలమైన ప్రాంతంలో, సరస్సుల తీరాన జరుగుతుంది. ఈ క్రతువుకై 50వేలకు పైగా పక్షులు ఒక దగ్గరకు చేరుతాయి. దీన్నే మీరు హంసలదీవి అని అంటారు. మాలో పశ్చిమఆఫ్రికా నుంచి ప్రతీ శీతాకాలంలో వస్తాం. మమ్మల్ని చూడాలనుకుంటే, అక్టోబర్‍, నవంబర్‍ మాసాల్లో పోరుబందర్‍ రండి! మా విన్యాసాల్ని తిలకించండి. ఆనందిం చండి. అసూయపడి మారణకాండ మాత్రం సాగించంకండి.


రాజ హంసలమే! కాని, సరస్సుల్లో, మడుగుల్లో కలుపుతీసే కూలీలం:

మాకు రాజహంస (Flamingo) అని ఎందుకు పేరు పెట్టారో తెలియదు. కాని, ఆహారపు వేటలో మేం సరస్సులను, నీటి మడుగలను, సముద్ర తీరాల్ని అన్వేషిస్తాం. స్వచ్ఛమైన నీటిలో కన్నా, బురద నేలలు మాకు ఇష్టం. మా పొడుగాటి కాళ్ళు, నీటి లోతుల్లోకి వెళ్ళి, అడుగు నేలను గుల్లబార్చును. మా పొడవాటి మెడ, ముక్కుచే, కొంకిలా మార్చి, నేలను సారవంతం చేస్తాం. దీంతో నీటి, బురద ఆడుగు భాగానికి ఆక్సిజన్‍ అందేలా చేయడంతో, లోపల ఆల్గే భాగా అభివృద్ధి చెందుతాయి. ఈ ఆల్గేను చేపలు, వెన్నముక లేని జీవులు ఆహారంగా తీసుకుంటాయి. అంటే, మా ఆహారంతో పాటు, ఇతర జల జీవులకు ఆహారాన్ని సమకూర్చే తల్లి పాత్రను పోషిస్తామన్న మాట!
ఇప్పటికే చాలా విషయాల్ని మీ దృష్టికి తెచ్చాం! చివరగా చైనా కథ చెప్పి ముగిస్తాం!


పిచ్చుకలా.. మజాకా..?
మేం 5-10 సెం.మీ. పొడవుంటే చిన్న జీవులం. మానవులతో మా సహవాసం పదివేల సంవత్సరాలుగా అని అంచనా! మా గూర్చిన ‘కిచకిచలు’ మీకు తెలిసినవే! చిన్న చిన్న కీటకాలతో పాటు, మేం పంట చేళ్ళ ధాన్యాల్ని తిని జీవిస్తాం. అయితే, గియితే మా ద్వారా కొంత పంట నష్టం జరగవచ్చు! పెద్ద ఎత్తున ఆలోచిస్తే, ఈ నష్టం టన్నుల్లో వుండవచ్చు! దీన్ని తీవ్రంగా పరిగణించిన చైనా 1950లో పిచ్చుకల నిర్మూలనా కార్యక్రమాన్ని చేపట్టింది. లక్షలాది పిచ్చుకల్ని నిర్మూలించింది. కాని, కథ అడ్డం తిరిగింది. మా జాతి ఎలా అంతరించిందో, అంతకన్నా ఎక్కువ మోతాదుల్లో పంటల దిగుబడి దారుణంగా పడిపోయింది. కారణం – మా కన్నా, క్రిములు, కీటకాలు, చీడపురుగులు పంటలను అధికంగా ధ్వంసం చేసాయి. దీన్ని గుర్తించిన చైనా ప్రభుత్వం, నాలికను కర్చుకొని, లెంప లేసుకుంది. మాజాతి పునరుద్దరణకు నడుం బిగించింది.


అటవి సంపదకు మేమే కారకులం!

అశోకుడు చెట్లు నాటించెను. హరితహారానికి కర్తలం! ఇలా ఎన్నో అభూత కల్పనలు మీ పుస్తకాల్లో వుంటాయి. కాని, ఏ చరిత్ర రచయిత గాని, పర్యావరణ వేత్తలుగాని, అటవి సంపదకు ప్రధానకారణం పక్షి అని రాయని మీ నిజాయితిని ఏమనాలి..?
ప్రపపంచ వ్యాపితంగా పేరుగాంచిన, అమెజాన్‍ అడువులు గావచ్చు, దండకారణ్యం కావచ్చు. ఇదంతా మా పక్షులచే జరపబడిన బీజవ్యాప్తి అని గుర్తించండి! వేలాది, లక్షలాది మొక్కల్ని, చెట్లని, వృక్షాల్ని (ఏక, బహు వార్షికాలు) యావత్‍ భూగోళానికి పరిచయం చేసింది, పంపిణి చేసింది మేమే! ఇప్పటికి చేస్తున్నది కూడా మేమే! అలాంటి మమ్మల్ని విచక్షణ రహితంగా నిర్మూలిస్తే అటవి సంపద అంతరిస్తుంది. అప్పుడు మీ మనుగడ ఎలా వుంటుందో ఆలోచించండి. కాబట్టి, అడవులు మీ సొత్తు కాదు. మా సొత్తుగా గుర్తించండి.

చివరగా, 1854లో అమెరికా లోని ఓ ఆదివాసి పెద్దాయన (Head), నాటి అమెరికా, అధ్యక్షునికి రాసిన లేఖలోని ఓ వాక్యంతో ముగిస్తాం. ‘‘భూమి మానవుల్ని సృష్టించింది గాని, మానవుడు భూమిని సృష్టించలేదు.’’ (వచ్చే సంచికలో కీటకాల సేవల్ని చూద్దాం!)

  • డా।। లచ్చయ్య గాండ్ల,
    ఎ : 9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *