పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి.
పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే కథలు నెరవేర్చేవి. మారిన పరిస్థితులలో ఆ బాధ్యతను బాల సాహిత్యమే నెరవేర్చగలదు.
ఈ మే నెలలో బాలచెలిమి పర్యావరణ కథల పోటీలు - 2023 నిర్వహించింది. తక్కువ సమయంలోనే, వేసవి సెలవులు అయినప్పటికీ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. మొత్తం 51 కథలు వచ్చాయి. కథలన్నీ చాలా బావున్నాయి. బాల సాహిత్య నిపుణులు ఈ కథలను చదివి, చర్చించి ప్రచురణకు 24 కథలు ఎంపిక చేశారు. ఈ కథల పోటీలు నిర్వహించి మరియు పుస్తక రూపాన్నిచ్చింది బాలచెలిమి. - వేదకుమార్ మణికొండ
అదో పల్లెటూరు. పేరు రఘురామాపురం. ఆ ఊరు చూడముచ్చటగా వుంటుంది. చాలా చక్కని దృశ్యాలు కనిపిస్తాయి. అక్కడి ప్రజలు కలిసిమెలిసి వుంటారు. శ్రమ చేస్తూ బతుకుపోరు కొనసాగిస్తున్నారు. ఆ ఊరిలో ఒక పెద్ద చెరువు వుండేది. ఆ చెరువు యించు మించు 3-4 ఊర్లకు జీవనాధారం. ఆ చెరువును ఆనుకొని ఎన్నో సారవంతమైన పొలాలు వుండేవి. రైతులు ఏడాదికి 3 పంటలు పండించేవారు. ఆ ఊరికి దగ్గరలో ఒక అడవి కూడా వుండేది. అక్కడి ప్రజలు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో తమ జీవితాన్ని గడుపుతున్నారు.
కొన్నేళ్ల తర్వాత ఆ ఊరికి దగ్గరలోని అడవిని కొట్టేసి ఒక ప్రైవేటు కంపెనీ వారు అక్కడ ఒక ప్లాస్టిక్ తయారీ ఫ్యాక్టరీని నిర్మించి వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే ప్రమాదకరమైన వ్యర్థ పదార్థాలను చెరువులోకి వదిలేస్తున్నారు. దీనితో జల కాలుష్యం ఏర్పడి చెరువులోని ప్రాణుల జీవనానికి పెను ప్రమాదంగా మారింది. చెరువు నీరు పొలం పనులకు ఉపయోగపడట్లేదు. పంటలు పండక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. వారి జీవనోపాధికి పెను ప్రమాదం ఏర్పడింది.
ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే విష వాయువులు అక్కడి ప్రజలకు ఆరోగ్య సమస్యలను కూడా తెచ్చి పెట్టింది. వాయు కాలుష్యంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటి వరకు ఎటువంటి ఆరోగ్య సమ్యలు లేని వారు ఎన్నెన్నో జబ్బుల బారిన పడ్డారు.
అక్కడి ప్రజలు ఎంతో బాధగా ఇంతకు ముందు జీవితాన్ని స్మరించుకుంటూ ఉండేవారు. ఆ ఊరికి వేసవి సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రాజేష్ అనే అబ్బాయి వచ్చాడు. అక్కడ జరిగిన మార్పులు రాజేష్‍ను తీవ్ర నిరాశకు గురిచేశాయి. రాజేష్ తన స్నేహితులు అక్కడి ప్రజలను ఫ్యాక్టరీ మూసివేయడం కోసం ప్రయత్నించమని ప్రోత్సహించారు. వారంతా కలిసి చుట్టుపక్కల మూడు నాల్గు గ్రామాలలోని ప్రజలను కలిసి ఫ్యాక్టరీ వల్ల కలిగే దుష్పరిణామాలపై తెలిపి ధర్నా చేయ తలపెట్టారు.
అందరూ కలిసి పెద్ద ఎత్తునధర్నా మొదలెట్టారు. ఏడాది పొడువునా ఆ ధర్నా కొనసాగించారు. దానితో ప్రభుత్వం ఆ ప్లాస్టిక్ తయారీ ఫ్యాక్టరీని మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో అందరూ ఎంతో ఆనందపడ్డారు. కొన్నేళ్ల తర్వాత రఘురామాపురం పూర్వ వైభవాన్ని పొందింది. అందరూ రాజేష్ తన స్నేహితులకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
- బి తనుశ్రీ,
ఎ : 949017257