సాదిక్‍ అంటే నిరంతర చలనం!

ఒక సంఘ సేవకుడి గురించి మాట్లాడుకుందాం. ఒక మనసున్న స్నేహితుడి గురించి మాట్లాడుకుందాం. ఒక సాహిత్య ప్రేమికుడి గురించి మాట్లాడుకుందాం. సాహిత్యానికి నాలుగు చక్రాల కాళ్ళిచ్చి తోపుడుబండి పేరిట ఊరూరా చేర్చిన కార్యకర్త గురించి మాట్లాడుకుందాం. చదువుకోవడానికి ఆర్ధికసాయం అవసరమైన వాళ్ళకు నేనున్నానని అండగా నిలబడ్డ ఒక చేయూత గురించి మాట్లాడుకుందాం. ఒక జర్నలిస్ట్ గురించి ఒక ఆధునిక పెళ్లిళ్ల పేరయ్య గురించి ఒక ప్రేమికుడి గురించి హిందీ పాటల పిచ్చిలో రెండు చెవులు కోసేసుసుకున్న వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. అందరినీ కన్నీళ్లలో ముంచి అర్ధాంతరంగా లోకంనుంచి నిష్క్రమించిన ఒక మనీషి గురించి మాట్లాడుకుందాం. ఇంతమంది గురించి వేర్వేరుగా కాదుగానీ ఇవన్నీ ఒక్కడే అయిన సాదిక్‍ గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి తోపుడుబండి సాదిక్‍గా తెలిసిన ఈ మనిషి నడిచొచ్చిన దారినిండా ముళ్ళు గోతులు చీకట్లు తప్ప మరేమీ లేవు. అసలు దారంటూ లేని నేలమీద నడిచి శిఖరాగ్రానికి చేరినవాళ్ళలో అతి తక్కువ మందిలో ఉండే నమ్రత, స్నేహగుణం సాదిక్‍ సొంతం. ఉదయంలో జర్నలిస్టుగా ప్రయోగవాదం పంచన నిలిచి కార్మిక నాయకుడై ఎదురుదెబ్బలు తిని దారి మార్చి మ్యారేజ్‍ బ్యూరోలో తేలిన చమత్కారి ‘వశిష్ఠ’ సాదిక్‍. తను పనిచేసిన పత్రిక మూతపడితే తట్టుకోలేక మళ్ళీ తెరిస్తే కోటి రూపాయలిస్తానన్న మనసున్న మనిషి సాదిక్‍. మతాంతర ప్రేమలో మునిగి అదే అమ్మాయిని జీవిత భాగస్వామిగా తన కలంపేరులోనూ భాగస్వామిగా చేసుకున్న విశ్వమానవుడు ఉషా సాదిక్‍. ‘వశిష్ఠ’ కలం పేరుతో ‘యూనివర్సల్‍’ మ్యారేజ్‍ బ్యూరో స్థాపించడం ద్వారా వేలాదిమందికి పెళ్లి సంబంధాలు కుదిర్చారు. సాదిక్‍ తండ్రిని చిన్నతనంలోనే కోల్పోయారు. ఖమ్మం సిద్ధారెడ్డికళాశాలలో డిగ్రీ వరకు చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేసారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలలో చురుకుగా ఉండేవారు.


‘కొందరు/లోకం ఖాళీ చేస్తే /వెలితి/వెక్కిళ్ళు పడుతుంది/చరిత్ర గర్వంగా/ శాశ్వతపుట లిఖిస్తుంది’ అని అతని ఆచరణ, అతని సంకల్పం, అతని సేవాతత్పరతలకు ఒక కవి ఇచ్చిన కితాబు. ‘‘సాదిక్‍ గారు లేకపోవడం వో పెను విషాదం. వారిదగ్గర నుండి వో పుస్తకం, ఓ బూట్ల జత, వో స్కూలు బాగు, వో చలి దుప్పటి, ఓ అన్నం ముద్ద.. ఇంకేదో ఇంకేదో అందుకున్న ఏ పిల్లవాడైనా, ఏ ఆడబిడ్డ అయినా ఎలా మర్చిపోతారు ఈ ప్రేమమూర్తిని..’’ అని ఒక సాహిత్యకారుడు భావించడం అంటే, ఇవాళ్టి కాలంలో ఎందరో చేద్దామనుకుంటూ తాము చేయలేకపోతున్న పనుల్ని భుజానికెత్తుకొని సాదిక్‍ చేశాడని నిండుమనసుతో కూడిన మెచ్చుకోలు.


పేద పిల్లలకు సాయం చేసేందుకు తోపుడుబండి ఫౌండేషన్‍ను స్థాపించారు. ఫౌండేషన్‍ ద్వారా విరాళాలు, వేలాది మంది పేద పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, స్కూల్‍ యూనిఫామ్స్, పాఠశాలలకు ఫర్నిచర్‍ సమకూర్చారు. అనాథ పిల్లలకు చేయూతనిచ్చారు.
ముఖ్యంగా యువతరాన్ని దగ్గరకు తీసుకోవడం, వాళ్ళల్లో ఒకడిగా కలిసిపోవడం, ఆ తర్వాత చిన్ని పిల్లల యోగక్షేమాలవైపుకు దృష్టి మరల్చడం, అనేక కార్యక్రమాలు చేపట్టడం- సాదిక్‍ దీర్ఘదర్శిలా కనిపిస్తాడు. అసలు తోపుడుబండి ప్రాధమికంగా మొదలయ్యింది కవిత్వం పాఠకులకు చేరువచేద్దామని, వాళ్ళద్వారా కొనుగోళ్లు చేయిద్దామని, విస్తృతంగా ప్రచారం చేద్దామని. ఆ తరవాత మొత్తం సాహిత్యం వైపుకు, ఆ తర్వాత పాఠశాలలవైపుకు, పిల్లల అవసరాల వైపుకుమళ్ళి విస్తృతమై అదొక ఫౌండేషన్‍ లా రూపుదిద్దుకుంది. బుక్‍ ఫెయిర్‍లలోకి ప్రవేశించి అక్కడికి వచ్చిన సందర్శకుల చేతిలో పుస్తకాలు ఉంచి సెల్ఫీలు దించి, సోషల్‍ మీడియాను పుస్తకప్రపంచంగా మార్చిన సాదిక్‍ సమాజాన్ని పుస్తకాలవైపుకు ఎన్ని రకాలుగా ఆకర్షించాలో ఆలోచించి ఆచరించి చూపాడు. తోపుడుబండి మీద వంద రోజుల్లో వెయ్యి కిలో మీటర్లు తిరిగి పుస్తకాలను పంచిపెట్టారు. కొంతమంది స్నేహితులు పుస్తకాలు కొనేందుకు సహకరించారు.


పుస్తకాలపండుగలకు జవజీవాలను ఇవ్వడానికి ముచ్చటైన ప్రయత్నాలు చేసి సఫలం చేసాడు. పుస్తకాలబండి, తోపుడుబండి సాదిక్‍గా క్రమేణా అతని పేరు స్థిరపడేంతగా అతని కార్యాచరణ కొనసాగింది. అతని మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేంతగా అతను చివరినిమిషంవరకు కృషిచేస్తూనే ఉన్నాడు. దాతలకు ఏవో విన్నపాలు చేస్తూనే ఉన్నాడు. పిల్లలతో కలిసి వాళ్లకు ఏవేవో ఇస్తూనో, భోజనాలు పెడుతూనో కనపడుతూనో ఉన్నాడు. అందుకే ఎవరూ అతను ఇప్పుడు లేడు అంటే అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. కల్లూరు మండలంలోని దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కావలసిన వస్తువులను దాతలనుంచి సేకరించి అందించేవారు. ఇందుకోసం కొన్నాళ్లుగా కల్లూరులోనే స్థిరపడ్డారు. కొవిడ్‍ సమయంలో పేద విద్యార్థులకు సెల్‍ఫోన్లను ఉచితంగా అందించి వారి విద్యాభివృద్ధికి తోడ్పడ్డారు. చనిపోవడానికి ముందురోజు కూడా 200 మంది బాలబాలికలకు షూస్‍ ఇచ్చారు. తన మానవీయ సేవలతో అందరి మన్ననలు పొందారు సాదిక్‍. ఇటువంటివాళ్లను మరణంతో కలిపి ఊహించుకోలేం అన్నది ప్రతి ఒక్కరి గుండె లోతుల్లోంచి వచ్చే మాట.. అదీ అతని జనంతో ఉన్న మమేకత. ఆచరణలోని స్వచ్ఛత, పారదర్శకత.


సాదిక్‍ నవంబర్‍ ఏడున ఈ లోకాన్ని వీడిపోయారని, ఆయన లేరు అనేది అబద్దం. ఆయన ఉనికి అందరి గుండెల్లో శాశ్వతం అన్నదే నిజం.
(ఆంధ్రజ్యోతి ఎడిట్‍ పేజి, 9.11.2024)


-కవి యాకూబ్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *