అతను మనకు ఎదురవగానే అతని ముందు మోకరిల్లి ఆ పాదాలకు ప్రణామం చేయాలనిపిస్తుంది.
అతనొక నిరంతర పాదయాత్రికుడు. లోకసంచారి, ఘుమక్కడ్, ఆవారాబాదల్.
అతను ప్రపంచాన్ని తన పాదముద్రలతో గ్రంథస్థం చేస్తున్నవాడు.
అతను గాస్పర్ ఓరెహెక్. స్లోవేనియా దేశస్తుడు. ఆ దేశం ఒకప్పుడు యుగోస్లావియాలో అంతర్భాగం.
చరిత్రలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సరిగ్గా పైలా పచ్చీసు వయస్సులో ఇల్లు వదిలి 1984 జూన్ 29న మహాభినిష్క్రమణంగా ప్రపంచ మార్గం పట్టి నేటికి 23 సంవత్సరా లయింది. (ఈ కథ నేను 2005లో రాసాను). ఈనాటికీ ఇంటి ముఖం చూడనేలేదు. తన 46 సంవత్సరాల వయస్సులో 45 దేశాలను, లక్షా ఏభై వేల కిలోమీటర్లను తిరిగిన ‘‘ఈ లోకం చుట్టిన వీరుడు’’ మహారాష్ట్ర సరిహద్దులుదాటి నిజామాబాద్ జిల్లాలోని పిట్లం చేరుకున్నాడన్న వార్త దినపత్రికలలో చదివిన నేను ఆత్రమాత్రంగా ఎదురేగి బిర్కూర్ గ్రామ పొలిమేరలో అతి వెచ్చని సూర్య కిరణాలుసోకే సుప్రభాతపు వేళలలో అతడిని కలిసి కావలించుకున్నాను. అతడిని కొత్తగా, మొదటిసారిగా కలిసినట్లనిపించ లేదు నాకు.
‘‘ఖ్వాబోమే మిలే అఖ్సర్’’.
టాలెమీ, మెగస్థనీస్, హ్యుయాన్‍త్సంగ్ – ఫాహియాన్, ఇబన్ బటూ టా, మార్కోపోలోలకు ఇంకా ఎందరెందరికో వారసుడతను.
బుద్ధుడు, శంకరాచార్యుడు, గాంధీ, కన్ఫ్యూషియస్, మావో మాదిరిగానే పాదయాత్రల ద్వారా లాంగ్‍మార్చ్ల ద్వారా ప్రపంచ మార్గాన్ని మార్చటానికి ప్రయత్నిస్తున్నవాడు. బహుశా పాదయాత్ర సంస్క•తి ఆసియా సంస్క•తిలో నుండే ఉద్భవించిందేమో!
చల్ అకేలా ముసాఫిర్ లాగే వీపున ఒక రక్‍సాక్ తగలించుకొని, సాదాసీదా టీషర్ట్ – ప్యాంట్‍తో, తలకో క్యాప్, పాదాలకు జాగింగ్ షూస్‍తో ఖాళీ ఖాళీ గ్రామీణ రోడ్ల మీద, కాలిబాటల మీద, పిల్లబాటల మీద చకచకా నడుస్తూ వెళ్లే అతనిని చూస్తుంటే ప్రపంచ యాత్రికుడని ఎవరికీ అనిపించదు. ఆమ్ ఆద్మీలాగా, మన చల్నేదో బాలకిషన్ లాగ కనబడుతడు తప్ప అతనొక ‘‘దేశ్ విదేశీ బంజారా’’ అని ఎవరూ గుర్తించరు.
ప్రపంచ యాత్రికులను కలుసుకోవాలని, వారి అనుభవాలను తెలుసుకోవాలని నేను చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాను. చివరికి నా కోరిక నెరవేరింది. రెండు మూడు రోజులు ఆ పాదయాత్రికుడి వెంబడి తిరుగుతూ, తింటూ పడుకుంటూ బిర్కూర్, వర్ని, రుద్రూర్, బోధన్, ఆర్మూర్ గ్రామాలలో పర్యటించాను. ఒక గ్రంథాలయంలో, కొన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఆయన ఉపన్యాసాలకు అనువాదకుడిగా పనిచేసి నాకు తెలిసిన కొంచెం ఇంగ్లీషు, కొంచెం తెలుగును సార్థకం చేసుకున్నాను. ఆ ఉపన్యాసాల సారాంశమే ఈ రచన. ఆ నాలుగైదు రోజులు అతడి సహవాసంలో ముట్టుకుంటే అంటుకునే ముచ్చట్లు అండ్ ముచ్చట్లలో మునిగిపోయాను. ఆ నిరంతర యాత్రికుడి ‘‘యాత్రా కథనం’’ ఇది.
నాది స్లోవేనియా దేశం. సోవియట్ యూనియన్ పతనానంతరం 1992-93 లలో యుగోస్లోవియా కూడా నాలుగు ముక్కలయ్యింది. ఆ నాలుగు ముక్కలలో ఓ ముక్క మా స్లోవేనియా, స్మాల్ ఈజ్ బ్యూటీ అన్నట్లు కేవలం రెండు కోట్ల జనాభా. భూభాగం మీ తమిళనాడులో సగం ఉంటుంది. చలికాలంలో ఉష్ణోగ్రత మైనస్ పదిహేను ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీలు దాటదు. ఆ మాత్రం ఎండకే మేం అపసోపాలు పడిపోతాం.
మాది స్లావ్ జాతి. మా మాతృభాష పేరు స్లోవియా. మా పూర్వీకులు సైబీరియా మంచు ఎడారి ప్రాంతంలో నివసించేవారు. ఆనాటి రష్యాకు, ఇంకా కింది యూరపు దేశాలకు సైబీరియా వలస పక్షుల మాదిరిగా ఆయా దేశాలకు వలస వచ్చారు. యూరపు దేశాల జాతులలో స్లావ్ జాతి బాగా బలమైన, సాహసమైన జాతి. బహుశా నా లోపల ప్రవహించే నా పూర్వీకుల రక్తమే నన్నిట్లా దేశ దేశాల వెంబడి త్రితున్నదేమో!
1984లో నేను అప్పటి యుగోస్లావియా నుండి బయలుదేరిన తర్వాత నా దేశం నాలుగు ముక్కలయ్యింది. అలీన ప్రపంచ విదేశాంగ విధానాన్ని రూపొందించిన మార్షల్ టిటో, మీ దేశంలో స్థిరపడిన మదర్ థెరిసా మా యుగోస్లావియాకు చెందినవారే. ప్రపంచాన్ని చుట్టుముట్టిన మార్కోపోలో మా స్లోవేనియాకు చెందినవాడు. అంతెందుకు జగజ్జేత అలెగ్జాండర్ కూడా మా స్లోవేనియాలోని మాసిడోనియాకు సంబంధించినవాడే.
మాది ఆదర్శ కుటుంబం. నాన్న కెమికల్ ఇంజనీర్. అమ్మ హౌస్ వైఫ్ మరియు సోషల్ వర్కర్. ఆ దయగల తల్లి అనేక మంది అనాథ పిల్లల్ని సొంత తల్లిలా పెంచి పెద్ద చేసింది. ఇంటికి నేనే పెద్ద కొడుకును. నాకో తమ్ముడు, ముగ్గురు చెల్లెళ్లు. అప్పుడు వారంతా పెళ్లి చేసుకుని, ఇల్లు చూసుకుంటూ చక్కగా కాపురాలు చేసుకుంటున్నారు.
ఇక నేనేమో బ్రహ్మచారిగానే ఉండిపోయి బహుదూరపు బాటసారిగా దేశ దేశాల రహదారులపై ఒకటి – ఒంటరి అంకెలా సాగిపోతున్నాను. ఈ తిరుగుడు పిచ్చి నాకు చాలా చిన్నప్పుడే పట్టుకుంది. నా బాల్యంలో నాకు ఆటపాటలేమీ లేవు. కాని విపరీతంగా కథల పుస్తకాలు చదివేవాడిని. ఈజిప్టు, ఇరాక్, ఇండియా, చైనా దేశాలు నన్ను బాగా ఆకర్షించాయి. భారతదేశానికి సంబంధించిన కథలు నన్ను వెంటాడి వేధించినాయి. రాజులు, రాణులు, వజ్రాలు, వైఢూర్యాలు, ఏనుగులు, కోతులు, దయ్యాలు, దొంగల కథలు నన్ను కలల ప్రపంచంలోకి నెట్టివేశాయి. ఏదో ఒకరోజున ఈ దేశాలన్నింటినీ కాలి నడకతో వెళ్లి చూస్తాను అని అందరితో అంటుంటే వారందరూ నా ముఖం మీదనే నవ్వేసి ‘పిచ్చి మాలోకం’ అని వెక్కిరించేవారు.
పెరిగి పెద్ద కాలేజీకి వచ్చి చరిత్రలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే సరికి నా ‘పిచ్చి’ మరింత ముదిరిపోయింది.
రోడ్లు నన్ను ‘రా రమ్మని’ పిలువసాగినాయి.

కిం కర్తవ్యం?
ఉద్యోగం, పెళ్లి, ఇల్లు, ‘మకాన్ సే దుకాన్, దుకాన్ సే మకాన్’ లాంటి ‘కుటుంబరావుల’ జీవితాన్ని ఎంచుకోవాలా లేక ‘ఎల్లలోకములొక్క ఇల్లై’ అన్నట్లు సైబీరియా స్వేచ్ఛా విహంగంలా ఎగిరిపోవాలా అని జీవితం చౌరస్తాలో నిలుచున్నాను. చివరికి మనస్సు చెప్పిన మార్గమే, అంతరాత్మ ప్రబోధాన్నే అనుసరించి ఇట్లా ‘జంగమ దేవరగా’ మారాను.
రెండు వేల డాలర్లను మూటకట్టుకొని ఇల్లు వదిలాను. అందులో ప్రతి డాలర్ నా స్వార్జితమే. విద్యార్థిగా ఉన్నప్పుడే సెలవు రోజులలో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసి నా ప్రపంచ పాదయాత్ర కోసం పైసా పైసా చీమ మాదిరిగా పోగు చేసుకున్నాను. కాని అది ఏ మూలకు కూడా సరిపోలేదు. ఇప్పటి వరకూ దేశదేశాల ప్రజలందించే ఆర్థిక సాయంతోటే ఈ అనంతయాత్ర కొనసాగుతుంది.
ఇక అమ్మానాన్నల సంగతంటారా?
నేను ఏ మార్గాన్ని ఎంచుకుంటే సుఖంగా ఉంటుందో మా అమ్మకు తెలుసు. అందుకే అమ్మ నాకు అడ్డు చెప్పలేదు.
‘అర్బ••పు •ధ•వ, ఇంటి మీద బెంగతో వారం పది రోజులలో ఇంటికి తిరిగి రాడూ?’ అని నాన్న అందరితో అన్నాడట.
అట్లా నన్ను తక్కువ అంచనా వేసి నాన్న ‘తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయినాడని నాకు ఫోన్ ద్వారా తెలిసినా నేను ఇంటికి తిరిగి వెళ్లనే లేదు. అప్పుడప్పుడు అమ్మతో ఫోన్లో మాట్లాడుతుంటాను అన్నాడు చెమర్చిన కండ్లతో దరహాసపు పెదాలతో.
ఇంటి నుండి బయలుదేరి పొరుగు దేశం రుమేనియా చేరుకున్నాను. అంతా కొత్త. అలవాటు లేని ప్రాణం అపసోపాలకు గురైంది. ఆకలి, నీరసం. ఒక పార్కులో బెంచీ మీద వాలి మగత నిద్రలోకి వెళ్లి లేచి కూచోని చూసేసరికి తల కింది బ్యాగ్ మాయం. సర్వం గోవిందా! కృష్ణార్పణం. ఆకలి నీరసంతో వున్న నేను ఆ బ్యాగును మోయలేననుకుని భగవంతుడే నాకు సహాయం చేయటానికి ఆ ‘దొంగగారిని’ పంపించాడని నాకు నేను సర్దిచెప్పుకున్నాను.
జోర్దాన్‍లో నడుస్తున్నప్పుడు అమావాస్య కటిక చీకటి రాత్రి. ఆకాశం పందిరి కింద ఎడారి ఇసుక తిన్నెలపైన్నే నడుం వాల్చి నిద్రపోయాను. తెల్లారి లేచేసరికి నా పక్కనే ఒక పెద్ద ఎడారి పాము. నన్ను ఆనుకుని వెచ్చగా నిద్రపోతుంది. ఎడారి పాములు ఎంత విషపూరితమో మీకు తెలియదు. అయినా దాన్ని చూసి నేనేం కంగారుపడలేదు. ఒంటరి చలిరాత్రిలో నాకు తోడూ నీడా – నెచ్చలీ నేస్తమూ ఆయిన ఆ పాముకు కృతజ్ఞతలు చెప్పి లేచి వెళ్లిపోయాను.
మరోసారి సూడాన్ దేశపు అరణ్యమార్గంలో ఒక పొద పక్కన హఠాత్తుగా సింహం కనబడింది. ఆశ్చర్యంగా అది నన్ను చూస్తూ నిలబడిపోయింది. భయంతో నేను శిలలా నిల్చున్నాను. ఒకరి కండ్లలోకి మరొకళ్లం కాసేపు సూటిగా చూసుకున్నం. కాసేపటికి అది లంఘించి అదృశ్యమైంది. నేను బతుకు జీవుడా అని ముందుకు సాగాను. సింహం నన్ను తినలేదు. బహుశా దానికప్పుడు ఆకలిగా లేదేమో? లేక నా తెల్ల తోలు తినటం దానికి నచ్చలేదేమో?
ఆఫ్రికా కుగ్రామాలలో పర్యటించేటప్పుడు ఆకలితో చచ్చే చావు వచ్చిపడింది. ఆ నల్లనయ్యలు అందరూ ఆతిథ్యమిచ్చేవారే. భోజనానికి పిలిచేవారే, కాని నాకే వారు భోజనం చేసే పద్ధతి సయించక పస్తులు పడుకునేవాణ్ణి. ఎందుకంటారా? ఒకే ఒక పెద్ద పళ్లెం ముందు పది మంది ఇంటిల్లిపాది చుట్టూ గుండ్రంగా కూచునేవారు. ఎంగిలి చేతుల్ని పళ్లెంలోకి జొప్పిస్తూ, ఒకొక్కటి ఐదు వేళ్లూ పూర్తిగా నాకుతూ నాలుక చప్పరిస్తూ, లొట్టలు వేస్తూ భోజనాలు చేసేవారు. ఆ ‘ఎంగిలి – మంగలం’ పద్దతి చూసేసరికి నాకు వాంతికొచ్చేది. నాకు ప్రత్యేకంగా పళ్లెం పెట్టమని అడగటం మర్యాద కాదు కదా! ఆ భోజనం, ఎంగిలి సయించక ఆకలి లేదని అబద్దమాడి పస్తులు పడుకున్నాను. ఏ గ్రామానికి వెళ్లినా ఇదే పద్ధతి. ఇక ఆకలితో చస్తానన్న భయంతో చివరికి ముఖం వెనక్కి తిప్పి చేయి ముందుకు చాచి ఆ ఎంగిలి తంతు చూడకుండా భోజనం చేసేవాణ్ణి. ఆ రుచి మాత్రం పరమాద్భుతం.
ఆఫ్రికా దేశాలలో తిరుగుతున్నప్పుడు పాములు, తేళ్లు, క్రిమికీటకాలు భయంతో నేల మీద కాకుండా చెట్ల కొమ్మల మీద పడుకొనేవాణ్ణి. ఈ అలవాటు నాకు బంగ్లాదేశ్‍లో ఉపయోగపడింది. అక్కడ వరదలలో చిక్కుకొన్నాను. నలభై గంటలపాటు చెట్ల కొమ్మల మీదే గడిపాను. వరద నీళ్లలో కొట్టుకుపోకుండా నన్ను నేను బట్టపేలికలతో చెట్ల కొమ్మలకు బంధించుకునే వాణ్ణి.
సాహసం సమక్షంలో మృత్యువు ఒక లెక్కకాదు. మృత్యువుకు మనం ఎందుకు భయపడాలి. జీవితం ఒక పుస్తకం లాంటిది. ఏ పేజీ దగ్గర జీవితం ఆగిపోతుందో ఒక్క భగవంతుడికి మాత్రమే తెలుసు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు కదా! మరి మనం చావు గురించి నిరంతరం భయపడటం కంటే బతికినంత కాలం మంచిగా బతకటం, ఇతరులకు మంచి చేయటం మన లక్ష్యంగా ఉండాలి.
ఈజిప్టు దేశంలో ఒక చోట చిన్న పిల్లలు కట్టె ముక్కల్ని తమ పండ్లతో కొరుకుతూ తినటం చూశాను. ఎంత దరిద్రమో అని దుఃఖమొచ్చింది. తినటానికి మరేమీ దొరకలేదా? ఎంత దరిధ్రం అని వారిని పరామర్శించాను. వారంతా ఒకటే నవ్వు. కట్టె ముక్కలు కాదు ‘షుగర్‍కేన్’ అని వారి జవాబు. అట్ల మొదటిసారి జీవితంలో చెరుకు గడల్ని చూశాను. రుచి కూడా చూశాను. మా శీతల దేశాలలో షుగర్‍కేన్‍లు పండవు. భూమిలో షుగర్ బీట్స్ పండించబడతాయి. వాటి నుండి షుగర్ ఉత్పత్తి చేయబడుతుంది.
అట్లా దేశ దేశాలు తిరుగుతూ టర్కీ సరిహద్దులో చెక్‍పోస్టుకు చేరుకునేసరికి ప్రశ్నల మీద ప్రశ్నలు. వారి భాష నాకు, నా భాష వారికీ అర్థం కాక పెద్ద సీన్ క్రియేట్ అయింది. నిజానికి నాకు ఇంగ్లీష్ భాష కూడా సరిగ్గా రాదు. నా యాత్రలో రోడ్ల మీదనే ఆ భాష నేర్చుకున్నాను. నా మాతృభాష ‘స్లోవియా’ ఒకటే నాకు వచ్చు.
ఎక్కడ్నుంచి, ఎట్లా వస్తున్నావు అని అక్కడి అధికారి ప్రశ్నించాడు. కాలినడకన అన్న నా జవాబు నమ్మకం కలిగించక తన కార్యాలయం నుండి ఇవతలికి వచ్చి ఇటూ అటూ కలియజూశాడు. ఏదైనా కారు లేదా మోటార్ సైకిల్ అయినా కనబడుతుందేమోనని! ఏమీ లేకపోయేసరికి ‘చాగిసెల్, చాగిసెల్’ అని గట్టిగా అరిచాడు.
తిడుతున్నాడేమోనని నేను భయపడ్డాను. కాని తర్వాత తెలిసింది. చాగిసెల్, చాగిసెల్ అంటే వెరీగుడ్, వెరీగుడ్ అని. ఆ తర్వాత ఆ అధికారి నాకు మంచి భోజనం పెట్టాడు. దారి బత్తెంగా వెయ్యి ‘లీరా’లు జేబులో పెట్టాడు. తోవల తినటానికి ‘తోషాదాన్’ కట్టించాడు. బహుదూరపు బాటసారిని ప్రేమించనిదెవరు?
అక్కడ్నుంచి టర్కీ రాజధాని ఇస్తాంబుల్ చేరుకున్నాను. అక్కడ విలేకరులు అనేక ప్రశ్నలు అడిగారు. మీ అమ్మ ఏం చేస్తుంది అన్న ప్రశ్నకు హౌస్‍వైఫ్ అనే బదులు హాస్యంగా ‘హోం మినిస్టర్’ అని అన్నాను. అంతే తెల్లారి అన్ని పత్రికలలో ‘యుగోస్లావియా హోం మినిస్టర్’ కొడుకు మన దేశంలో పాదయాత్ర అని పెద్ద పెద్ద హెడ్డింగులతో వార్తలు వచ్చాయి. పోలీసులు, ప్రభుత్వ అధికారులు అందరూ నాకు రాచమర్యాదలు చేయడం ప్రారంభించారు.
వారి సంతోషాన్ని భగ్నపరచడం ఇష్టం లేక ఆ దేశం వదిలేవరకూ మౌనం వహించాను.
యూరపు దాటి ఆసియా ఖండపు ప్రవేశ ద్వారం టర్కీ నుండి ఇరాక్‍లోకి ప్రవేశించాను. నేను మొదటిసారిగా భారతీయులను కలుసుకున్నది ఆ దేశంలోనే. ఇరాక్‍లో రెండు లీటర్ల పెట్రోల్
ఉచితంగా సంపాదించవచ్చు గానీ రెండు గ్లాసుల మంచినీళ్లు డబ్బిచ్చినా దొరకవు. ఆ ఎడారి దారులలో నాకు దాహం వేసినపుడల్లా ట్రక్కు డ్రైవర్ల దగ్గరికి వెళ్లాను. వారు నలుగురైదుగురు ఒక చోట కూర్చుని తమ రెండు చేతులతో చప్పట్లు చరుస్తున్నట్లు ఏదో పనిలో నిమగ్నులై ఉన్నారు. వారి దగ్గరికెళ్లి మీరు చప్పట్లు కొడుతున్నారా అని ప్రశ్నించాను. వారు పకాలున నవ్వి కాదు రెండు చేతులతో చపాతీలు చేస్తున్నాం అని హిందీలో అన్నారు. నా అవసరాన్ని గమనించి మంచినీళ్లేకాదు వారితో పాటు రొట్టెలు కూడా తిని వెళ్లమని ఆహ్వానించారు. సంతోషంగా భోజనం ముగిసింది. వారి తలల మీద బాండేజీల మాదిరిగా ఏవో కనిపించాయి. అంత
ఉక్కపోత ఎండలలో వాటిని ధరించారంటే ఏదో అనారోగ్యంతో ఉన్నారని అనుమానించి మీరు తలలకు ఏం కట్టుకున్నారూ? అని ప్రశ్నించాను.
‘‘వి ఆర్ సిక్’’ అన్నారు వాళ్ళు. సిక్ అంటే •ఱ•• అనుకొని ఏం మందులు వాడుతున్నారు? ఏ డాక్టరు దగ్గరికి వెళ్లారు అని మళ్లీ ప్రశ్నించాను. నా ప్రశ్నలకు వారు తమ పొట్టలు చెక్కలయ్యే టట్లు నవ్వి, ఆ తరువాత సిక్కుమతం గురించి వారి తలపాగాల గురించి అంతా వివరించారు. ఈసారి నవ్వటం నావంతయ్యింది.
నేను ఆప్ఘానిస్తాన్ వైపు వెళ్తున్నట్లు తెలుసుకున్నవారు కొంత దూరం వరకు తమ ట్రక్కులో లిఫ్ట్ ఇస్తాం రమ్మని ఆహ్వానించారు. ‘‘సారీ’’ నేను పాదయాత్రికుడిని ‘‘నడవటమే నా ధర్మం’’ అని వారికి నచ్చచెప్పి ముందుకు నడిచాను.
(తరువాయి వచ్చేసంచికలో)
-పరవస్తు లోకేశ్వర్,
ఎ: 91606 80847