ఎంతకాలం జీవించామన్నది కాదు ప్రధానం, ఎలా వెలిగామన్నది కీలకం – అని బిగ్గరగా చప్పట్లు చరచాలనిపిస్తుంది భాగ్యనగర్ రేడియో స్మ•తులను నెమరువేసుకుంటే! నేతాజీ సుభాష్ చంద్రబోస్ నడిపిన ఆజాద్ హింద్ రేడియో, రామమనోహర్ లోహియా నేత•త్వంలో సాగిన ఆజాద్ రేడియో వంటి ప్రతిష్ఠాత్మక చరిత్ర ఇక్కడ మన మదిలో మెదులుతుంది. 1942లో నేతాజీ తన రేడియో ఛానల్ ను తొలుత జర్మనీ నుంచి, పిమ్మట సింగపూర్ నుంచి, తర్వాత రంగూన్ నుంచి నిర్వహించారు. ఇంగ్లీషు, హిందీ, తమిళం, బెంగాలి, మరాఠి, పంజాబి, పుష్టో, ఉర్దూ భాషలలో ఈ రేడియో ప్రసారాలు సాగాయి. రామ మనోహర్ లోహియా అజ్ఞాత నేత•త్వంలో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఒక్కోరోజు ఒక్కో చోటు నుంచి ట్రాన్స్ మీటర్లు మార్చుతూ చేసిన ప్రసారాలు కేవలం 78 రోజులే నడిచాయి. అయినా బ్రిటీషు సామ్రాజ్యపు నీడలో వెలువడే అపసవ్య వార్తల వెల్లువలో ఈ రేడియో కేంద్రాలు చిరు దీపాలుగా వెలగడమే కాదు, చిరు ద్వీపాలుగా భాసించి స్వాతంత్య్ర కీలలను ప్రజ్వలింప చేశాయి.
బ్రిటీషు ఇండియా కాలంలో మైసూరు, హైదరాబాదు, తిరువాన్కూరు, ఔరంగాబాదు మొదలైన సంస్థానాలకు కూడా రేడియో కేంద్రాలుండేవి. ఇవి అప్పటి బ్రిటీషు ప్రభుత్వం నిర్వహించే రేడియో కేంద్రాలకు అదనం. ఈ రేడియో కేంద్రాలన్నీ ఇంగ్లీషు వారి పాలనను సమర్ధిస్తూ నడిచినవే! స్వాతంత్య్ర సమరం గురించి గానీ, ప్రజల ఇక్కట్ల గురించి గానీ ఈ కేంద్రాల ప్రసారాలలో ఉండేవి కావు. కనుకనే ఆజాద్ హింద్ రేడియో, ఆజాద్ రేడియో వంటివి అవసరమైనాయి. ఇలా చరిత్రలో తళుక్కుమనే ప్రజా రేడియో కేంద్రాలు భాగ్యనగర్ రేడియో ది వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ వంటివి. నైజాం పాలనకు వ్యతిరేకంగా, సంస్థానం సరిహద్దులో ఉండే కర్నూలు నుంచి భాగ్యనగర్ రేడియో నడవగా గోవాలో పోర్చుగీసు పాలనకు వ్యతిరేకంగా, గోవా సరిహద్దు అడవుల నుంచి ది వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ రేడియో ప్రసారాలు చేసింది. నిజానికి ఈ రేడియో కేంద్రాల ప్రసారాల గురించి, వాటి తీరుతెన్నుల గురించి చారిత్రక వివరాలు పెద్దగా లభ్యం కావడం లేదు. మనకున్న సమాచారం ఆధారంగానే వాటి సేవలూ ప్రస్తుతిస్తూ, మరిన్ని చారిత్రక ఆధారాల కోసం అన్వేషిద్దాం.
వెల్దుర్తి మాణిక్యరావు తన పుస్తకం ‘హైదరాబాదు సంస్థానంలో స్వాతంత్య్రోద్యమం’లో ఇలా పేర్కొన్నారు.
‘‘భాగ్యనగర్ రేడియో ప్రసారాల వల్ల హైదరాబాదు రాష్ట్ర స్వాతంత్య్ర సమరానికి అనేక ప్రయోజనాలు కలిగాయి. మొదటి స్టేట్ కాంగ్రెస్ నాయకత్వాన జరుగుతున్న విముక్తి ఉద్యమం గురించి ప్రజల్లో విరివిగా ప్రచారం చేయగలిగారు. రజాకార్లు, మజ్లీసువారు, ముస్లిం కాంది శీకులు, మతోన్మాదులైన నిజాం పోలీసులు సైనికులు సంస్థానంలో ప్రజలపై జరిపే అత్యాచారాలను, దుండగాలను, దోపిడీలను, దురంతాలను బట్టబయలు చేసి వారి నిజస్వరూపాల్ని బహిర్గతం చేసే వీలు కలిగింది. సంస్థానంలో ఎటువంటి రాక్షసత్వం స్వైరవిహారం చేస్తూ ఉన్నదో అందరూ తెలుసుకోగలిగారు. స్టేట్ కాంగ్రెస్ కార్యకర్తలు నిజాం దుష్టశక్తులను ఎలా ఎదుర్కొంటున్నారో ప్రజలు తెలుసుకోవడానికీ, వారికి ధైర్యం, మనో నిబ్బరం కలిగించడానికి ఈ రేడియో కేంద్రం ఎంతగానో ఉపకరించింది…’’
అదీ భాగ్యనగర్ రేడియో కీర్తి పుంజం. అయితే ఈ రేడియో వెనుక భాసించే సాహసి – పాగా పుల్లారెడ్డి (10 మే 1919-20 అక్టోబరు 2010). గద్వాల ప్రాంతం మనోపాడు మండలం జల్లాపూర్ గ్రామంలో జన్మించిన పుల్లారెడ్డి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ సహాయంతో చదువుకున్నారు. 1947-48 కాలంలో హైదరాబాదు సంస్థానం విముక్తం కావడానికి చేపట్టిన ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నారు.
గద్వాల పురపాలక సంఘం ఛైర్మన్ (1968)గా, గద్వాల శాసన సభ్యులు (1972)గా సేవలందించిన పుల్లారెడ్డి తొలుత 1952లో గద్వాల – అలంపూర్ ద్విసభ్య నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసన సభకు ఎన్నికయ్యారు. హైదరాబాదు, ఆంధ్రరాష్ట్రాల విలీనం సమయంలో కొత్త రాష్ట్రానికి ఆంధప్రదేశ్ అనే పేరును పాగాపుల్లారెడ్డి సూచించగా బూర్గుల రామక•ష్ణారావు బలపర్చారు.
మరి భాగ్యనగర్ రేడియోకు, పాగా పుల్లారెడ్డికి అనుబంధం ఏమిటి? గడియారం రామక•ష్ణశర్మ ఆత్మకథ ‘శతపత్రము’లో కొంత సమాచారం స్టేట్ కాంగ్రెస్ పునరుద్ధరణ – నిజాం విముక్తి పోరాటం అనే అధ్యాయంలో కనబడుతుంది. అన్ని సంస్థానాలు భారత దేశంలో చేరిపోగా ఒక నిజాం నవాబు మాత్రం తాను స్వతంత్రంగా ఉంటానని 1947 జూన్ నెలలో ప్రకటించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే స్టేట్ కాంగ్రెస్ ప్రధమ మహాసభ హైదరాబాదులో బాగా జరిగింది. దీని తర్వాత జూన్ నెల చివరలో షోలాపూరులో జరిగిన కార్యవర్గ సమావేశంలో – హైదరాబాదు సంస్థానంలో స్వాతంత్య్రోద్యమం తీవ్రస్థాయిలో జరపాలని నిర్ణయించారు. తెలంగాణ, కర్ణాటక, మరాట్వాడా ప్రాంతీయ సమితులు సంస్థానం బయట సరిహద్దులలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. పాగా పుల్లారెడ్డిని కర్నూలుకు, టి. హయగ్రీవాచారిని బెజవాడకు సర్వాధికారులుగా నియమించి సర్దార్ జమలాపురం కేశవరావు జైలుకు పోయారు. ఆగస్టు 15న చెన్నిపాడు, మానవపాడు, ఇటికలపాడు, ఉండవెల్లి గ్రామాలలో ఎవరెవరు సత్యాగ్రహం చేస్తారో వివరాలను గడియారం రామక•ష్ణ శర్మ అలంపూరు పోలీసు స్టేషన్‌కు అందించారు. ఈ దశలో పాగా పుల్లారెడ్డి తనను సత్యాగ్రహం మానుకోవాలని గడియారం రామక•ష్ణ శర్మకు సలహా యిచ్చి పట్టుబట్టారని శర్మ ఆత్మకథలో రాసుకున్నారు. పాగా పుల్లారెడ్డి నేత•త్వంలో ఉద్యమ కార్యక్రమాలు పెద్ద స్థాయిలో కర్నూలులో విజయవంతంగా జరిగాయి.
బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపిన రేడియో ట్రాన్స్ మీటర్ ను ‘లోకనాయక్’ జయప్రకాష్ నారాయణ్ నుంచి వనపర్తి రాజారామేశ్వరరావు బొంబాయికి తెప్పించి పాగా పుల్లారెడ్డి కార్యాలయానికి ఇచ్చారు. ఈ ట్రాన్స్ మీటర్ దక్కన్ రేడియో కంటే శక్తివంతమైనదీ, ఫలితంగా భాగ్యనగర్ రేడియో ప్రసారాలు విజయవాడ, మద్రాసుకు కూడా వినబడేవి. కర్నూలులో స్టేట్ కాంగ్రెస్ కార్యాలయం పక్కన ఉండే పల్లెపాడు జాగీర్దారు చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో ట్రాన్స్ మీటర్ ను రహస్యంగా ఉంచారు. చంద్రశేఖర్ రెడ్డి కుమారులు జనార్దన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి ధ్యేయం ట్రాన్స మీటర్‌ను ఇంట్లో ఉంచుకోవడమే కాక చక్కగా నడిపించేవారు. ఈ రేడియో ప్రసారాలు ఏరోజు మొదలు అయ్యాయో సమాచారం ప్రస్తుతం లభ్యం లేదు గానీ ప్రసారాలు ప్రతిరోజూ సా. 7 గంటలకు నుంచి 8 గం. దాకా తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషులో నడిచేవి. మొదట అరగంటలో మూడు భాషల్లో వార్తలు, పిమ్మట మూడు భాషలలో ప్రసంగాలుండేవి. వార్తా బులిటన్లల ప్రచురణ, రేడియో ప్రసార బాధ్యతలు గడియారం రామక•ష్ణ శర్మకు అప్పగించారు. గొట్టుముక్కల క•ష్ణమూర్తి సహాయకులు.
ఉర్దూ ప్రసారాల బాధ్యతను వకీలు నాగప్ప చూసేవారు. దక్కన్ రేడియోలో కురుగంటి సీతారామయ్య కాంగ్రెస్‌నూ, స్వాతంత్య్రోద్యమాన్ని అవహేళన చేస్తూ ప్రసంగాలు చేస్తుండేవారు. వీటిని ఖండిస్తూ, నిజాం ప్రభుత్వ దురాగతాలను హాస్యధోరణిలో ఖండిస్తూ ప్రసంగాలు, వార్తలు రూపొందించేవారని గడియారం రామక•ష్ణ శర్మ తన ఆత్మకథ ‘శతపత్రము’లో వివరించారు.
వనపర్తి రాజా, పాగా పుల్లారెడ్డి మధ్య అభిప్రాయ విభేదాలు రావడంతో ట్రాన్స్ మీటర్ తిరిగి ఇచ్చేయమని రాజారామేశ్వరరావు నిర్బంధం చేయడంతో వెనక్కి ఇచ్చేశారు. అలా 1948 జనవరి 30న గాంధీజీ కనుమూశారనే వార్తను ప్రసారం చేసి భాగ్యనగర్ రేడియో చరిత్ర పుటల్లో కలిసిపోయింది! అంతటి ఉజ్జ్వల చరిత్రకు భాగ్యనగర్ రేడియో సాక్షీభూతం. ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా భాగ్యనగర్ రేడియో ఘనమైన చరిత్ర తెలుసుకోవడం స్ఫూర్తిదాయకం!!
- డా. నాగసూరి వేణుగోపాల్
ఎ : 9440732392