20 వసంతాల విద్యా విప్లవంగుండ్రాంపల్లి గ్రంథాలయం


తెలుగు రాష్ట్రాలలో పలు స్వచ్చంద గ్రామీణ గ్రంథాలయాల స్థాపనకు ఆజ్యం పోసిన గ్రామం నిరుద్యోగులకు,పరిశోధకులకు వరంగా మారిన గ్రంథాలయం


విప్లవాలకు మూలం అణిచివేత, బానిసత్వం ఆంక్షలు తెంచుకొని లక్ష్య సాధనకై పోరాడితేనే శిఖరంపై జెండా రెపరెపరాడినట్లు హ•దయం స్వేచ్ఛతో నిండుతుంది. చరిత్రలో ఒక శిఖరాన్ని అధిరోహించి తనకంటూ కొన్ని పేజీలను దక్కించుకుంది ఈ గ్రామం. ఉద్యమాలకు పెట్టింది పేరే నల్లగొండ జిల్లా అదే పట్టుతో గ్రంథాలయ స్థాపన ఒక ఉద్యమంగా భావించి ముందడుగు వేసింది గుండ్రాంపల్లి గ్రామం.
5జీ టెక్నాలజీతో దూసుకు వెళ్తున్న ప్రపంచానికి మూలం ఒక పుస్తకం అయితే, అక్షరం అనే ఆయుధాన్ని చేతపట్టి సమాజాన్ని మార్చగలం అని భావించి గ్రంథాలయం లేక తాము పడ్డ కష్టాలను తమ తర్వాతి తరం పడకూడదని తన తోటి స్నేహితులను ప్రేరేపించి గ్రంథాలయ స్థాపనకు కంకణం కట్టారు గ్రామానికి చెందిన అనుముల శ్రీనివాస్‍.


చరిత్రలోకి చూసినట్లయితే గుండ్రాంపల్లి గ్రామం సాయుధ రైతాంగ పోరాటంలో ప్రత్యేక పాత్రను పోషించింది. తెలంగాణ విముక్తి కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని గడ్డ. నిజాం అనుచరులను తరిమి కొట్టిన చరిత్ర. ఉద్యమంలో సజీవ దహనం చేసిన జంకని జనం. ఇలాంటి చరిత్రకు ఏ మాత్రం తీసిపోకుండా మరొక గ్రంథాలయ చరిత్రను స•ష్టించారు. నాడు వీరు తీసుకున్న గ్రంథాలయ స్థాపన నిర్ణయమే నేటి విద్యార్థుల భవిష్యత్తును నిర్మిస్తుంది.


గ్రంథాలయ ప్రారంభకులు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య గారు, ఆనాటి జిల్లా గ్రంథాలయ చైర్మన్‍ గాదె వినోద్‍ రెడ్డి గారు, ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‍ ఎన్‍ లక్ష్మణ్‍ రావు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు సమక్షంలో ఏప్రిల్‍ 14, 2006న ఈ గ్రంధాలయం పురుడు పోసుకొని గ్రామపంచాయతీ సహకారంతో నేడు కొన్ని వందల మంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది. 24 మందితో ఏర్పడిన ఈ కమిటీ మొదటి విరాళంగా ఒక్కొక్కరు రూ 500/- చొప్పున 12 వేల రూపాయలు విరాళంగా ఇవ్వడమే కాకుండా ‘‘పుస్తక దానం’’ చేయండి అనే పత్రిక ప్రకటన ద్వారా వేలాది పుస్తకాలను, ఫర్నీచర్‍ సేకరించడం జరిగింది. ఈ గ్రంథాలయ పనివేళలు ప్రతి రోజు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు తెరవబడుతుంది. అదేవిధంగా ఆదివారం అయితే అదనంగా మరో మూడు గంటలు తెరవబడుతుంది.
‘‘గ్రంథాలయం మౌన విశ్వ విద్యాలయం’’ అని డా సి నారాయణ రెడ్డి గారు అన్నట్లు ఇక్కడ పుస్తకానికి మరియు మెదడు మధ్య క్రతువు జరుగుతుంది. ఆ క్రతువులో ఎటువంటి లోటుపాట్లు లేకపోతేనే జ్ఞాన ప్రవాహంతో పాఠకుల జీవితాలలో కాంతి నిండుతుంది. 11 దిన, వార, మాస పత్రికలతో ప్రారంభమై నేడు 25 పత్రికలతో ముందుకు సాగుతుంది. అదేవిధంగా పరిశోధనలు చేసే వారు మరియు పోటీపరీక్షలకు సిద్దమయ్యే వారికి సులభంగా ఉండటం కోసం 2018 నుండి వివిధ వార్తా దిన పత్రికలను బైండింగ్‍ చేసి పుస్తకరూపంలో భద్రపరుస్తున్నారు.


పెరిగిన సాంకేతిక విప్లవంలో కూరుకుపోయి యాంత్రిక జీవనానికి అలవాటు పడి పుస్తక పఠనానికి దూరం అవుతున్న సమాజానికి గుండ్రాంపల్లి గ్రామ యువకులు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. నేను బాగుండాలి అనే సమాజంలో మనం అందరం బాగుండాలి అని అది విద్యతోనే సాధ్యమని భావించి పుస్తక సేకరణ ప్రారంభించారు. విభిన్నమైన పుస్తకాలు జాతీయ అంతర్జాతీయ విషయాలు తెలుసుకునే విధంగా తెలంగాణ సాంస్క•తిక, సాహిత్య కథలు, నవలలు, బాల సాహిత్యం, పురాణాలు వంటివి ఎన్నో అందుబాటులో ఉంచారు. పాఠకులకు ఉచిత సేవలను అందిస్తున్నారు. చుట్టూ ఉన్న పరిసర గ్రామాలకు కూడా ఈ గ్రంథాలయం అందుబాటులో ఉండడం వల్ల వారు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
అదే విధంగా ఈ గ్రంథాలయ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించబడుతుంది. ప్రాథమిక ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల నుండి పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థుల వరకు ఎన్నో సాంస్క•తిక కార్యక్రమాలు మరియు పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తూ పాఠకుల్లో ఆసక్తిని నింపుతున్నారు. వేసవి సెలవులను కూడా సద్వినియోగం చేసుకునే విధంగా విద్యార్థులకు శిక్షణ యిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఈ శిక్షణలో భాగంగా చిత్రలేఖనం, అందమైన చేతిరాత రాయడం, కథలు చెప్పడం మెదడుకు పని పెట్టేలా చెస్‍, సుడొకో వంటి ఆటలు నేర్పిస్తూ, తెలుగు, ఇంగ్లీష్‍ మరియు గణితం వంటి అంశాలను కూడా నేర్పిస్తూ విద్యార్థులను ముందుకు నడిపిస్తూ అప్పుడప్పుడు వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తుంది గ్రంథాలయ యాజమాన్యం. గ్రంధాలయం ప్రారంభంలో గ్రంథాలయ పరిరక్షణ సంఘం వారి ప్రోత్సాహం 2014 నుండి తెలంగాణ గ్రంథాలయ సంఘం, ప్రవాస భారతీయులు, హైదరాబాద్‍ బుక్‍ ఫేయిర్‍, రచయితల, ప్రచురణ కర్తల, స్థానిక పరిశ్రమల సహకారం మరవలేనిది.
ఈ మధ్యలో బాలచెలిమి మరియు దక్కన్‍ల్యాండ్‍ వారు ప్రచురించిన పుస్తకాలను ఈ గ్రంథాలయానికి అందజేశారు.


గుండ్రాంపల్లి గ్రంథాలయం స్ఫూర్తితో 2007 నుండి నేటి వరకు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, కడప జిల్లాలో ఎన్నో గ్రామీణ గ్రంథాలయాలు ప్రారంభం అయ్యాయి. రాను రాను మరికొన్ని జిల్లాలకు కూడా విస్తరించడం జరిగింది. జరుగుతూనే ఉంది. ఒక గ్రామం ఆదర్శంగా మారింది అంటే ఆ ప్రజలలో శిక్షణ, క్రమశిక్షణ, నిరంతర అభ్యాసం అనే లక్షణాలు ఉన్నాయని. ఈ లక్షణాలతోనే గూండ్రాంపల్లి యువత నేడు రాకెట్టు వేగంతో దూసుకెళ్తూ ఎంతోమంది యువతకు మార్గదర్శనం చేస్తున్నారు.


-బొద్దుల స్పందన
90103 2444

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *