ఇతర భాషల్లో రాణించిన తెలుగు పొలిటికల్ కార్టూనిస్టులు ఎవరెవరున్నారని ఆలోచన చేసినప్పుడు ‘న్యూస్ టైమ్’ లో పనిచేసిన వెంకట్ గుర్తుకు వస్తారు. అలాగే ‘బిజినెస్ లైన్’ లో రాణించిన రవికాంత్. వీరిద్దరి కంటే ముందు ‘డెక్కన్ క్రానికల్’ లో సోహెబ్ రాజకీయ వ్యంగ్య చిత్రాలు వెలువరించారు. తర్వాత 1992 నుంచి సుభాని. అయితే వీరిద్దరికీ నడుమ కొంతకాలం మరో పొలిటికల్ కార్టూనిస్టు ‘డెక్కన్ క్రానికల్’ లో దర్శనమిస్తారు. ఆయనే సుధీర్ తైలంగ్.
ఈ. పేరు చెప్పగానే కొందరికైనా ‘ది హిందూస్తాన్ టైమ్స్’ లో వారు తరం క్రితం వేసిన తొలి పేజీ కార్టూన్లు గుర్తుకొస్తాయి. ఆయన ఇంటి పేరు ‘తైలంగ్’ పదాన్ని గమనిస్తే అది తెలంగాణ అనే మాట నుంచో, తెలుగు అనే మాట నుంచో విరూపమై ఏర్పడిందేమో అనే సందేహం రాకమానదు. సుధీర్ తైలంగ్ మాత•భాష తెలుగని, ఇంట్లో అదే మాట్లాడేవారని అతనిని సన్నిహితంగా తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. దీనితో కొంత ఆసక్తి కలిగి రెండు దశాబ్దాల క్రితం ఢిల్లీలో కెన్నాట్ ప్లేస్ ఫుట్పాత్ మీద నేను కొనుక్కున్న ఆయన కార్టూన్ల పుస్తకం గుర్తుకొచ్చింది. నా సొంత లైబ్రరీలో గాలిస్తే దొరికింది. అదే 2002 లో ప్రచురణ అయిన 150 కార్టూన్ల పుస్తకం సుధీర్ తైలంగ్స్ ‘బిగ్ కార్టూన్స్’.
తెలుగులోనే కాదు చాలా భాషా పత్రికల్లోనూ ఇంకా ఇంగ్లీషు పత్రికల్లో కూడా ఇప్పుడు పొలిటికల్ కార్టూన్లు దాదాపు అంతరించిపోయాయనేడానికి సాక్ష్యం అవి లేని ఇప్పటి భారతీయ పత్రికల తొలిపేజీలే. ఒకవైపు పాలిటిక్స్ బాగా పోలరైజవడం, దాంతో పాటు ఆలోచనలు మాత్రమే కాకుండా సంఘర్షణాత్మకమైన క్రియలు కూడా పెరగడంతో తొలి పేజీలో పెద్ద పెద్ద సెటైర్లను తలపించే కార్టూన్లూ ఇంకా ఎడిట్ పేజీలో ‘మిడిల్’ గా పిలవబడే వ్యంగ్య రచనలూ పూర్తిగా అంతర్ధానమయ్యాయి. మరోవైపు మనదేశంలో న్యూస్ టెలివిషన్ విశ•ంఖలమైన వ్యాప్తి కూడా ఇంకొక కారణం కావచ్చు. తెలుగు దినపత్రికల్లో తొలి పేజీ పెద్ద కార్టూన్లతోపాటు, క్రమంగా ప్యాకెట్ కార్టూన్ కూడా తొలి పేజీ నుంచి తప్పిపోవడం లేదా లోపలి పేజీల్లోకి జారిపోవడమో జరిగిపోయింది.

ఈ నేపథ్యంలో దాదాపు 20 ఏళ్ల తర్వాత సుధీర్ తైలంగ్ ‘బిగ్ కార్టూన్స్’ పుస్తకం మళ్లీ చూస్తుంటే మహా ముచ్చటగా ఉంది దినపత్రికలో మనకు కనబడిన సైజులోనే ఉండే రీతిలో రాజీవ్ గాంధీ, విశ్వనాధ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, పీ వీ నరసింహారావు, ఐ కే గుజ్రాల్, వాజపేయి ప్రధాన మంత్రులుగా ఉన్న సమయంలో ఆయన గీచిన ‘ది హిందూస్తాన్ టైమ్స్’ కార్టూన్లు ఈ సంకనంలో చోటుచేసుకున్నాయి. ప్రధాన మంత్రులు కాకపోయినా ఆనాటి రాజకీయాలను నడిపిన ఎల్ కే అద్వానీ, దేవీలాల్, జయలలిత, లల్లు ప్రసాద్ యాదవ్, టి ఎన్ శేషన్ వంటి ప్రముఖులు కూడా ఈ కార్టూన్లలో కనపడతారు. రామ్, రోటి, రహీం, సోషల్ జస్టిస్, స్టెబిలిటీ వంటి మాటలు వేరువేరు కాంబినేషన్లో పరీక్షల్లో జవాబులు రాస్తూ కాపీ కొడుతున్న విద్యార్థులుగా ఎల్కే అద్వానీ, రాజీవ్ గాంధీ, వి.పి.సింగ్ వంటి వారిని చిత్రించి ‘స్కూళ్ళలో మాస్ కాపీ’ అనే వార్తను పత్రికలో కనబడేటట్టు చూపించారు. ‘‘ఐదేళ్లయితే కానీ మాకు తిరిగి కనిపించ వద్దు’’ అని ఓట్లు అడగడానికి వస్తున్న పెద్ద నాయకులను విసుక్కుంటున్న ఓటర్లు, పలుసార్లు వచ్చిన మధ్యంతర ఎన్నికలను గుర్తు చేస్తూ వేసిన వ్యంగ్య చిత్రం భలే ఉంది.
… ఇలా ఈ 150 కార్టూన్లను తిరిగేస్తుంటే, పదేళ్లకు మించిన కాలపు దేశ రాజకీయాలు.. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశం నేపథ్యంగా నడిచినవి మన మదిలో సినిమా రీలుగా నడిచిపోతాయి. పుస్తకం తిరిగేసిన తర్వాత సుధీర్ తైలంగ్ వివరాలు ఏమిటని సెర్చ్ చేస్తే కాస్త విషాదం మిగిలింది. 1960 ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని బికనేర్ లో జన్మించిన సుధీర్ 2016 ఫిబ్రవరి 6న బ్రెయిన్ క్యాన్సర్ తో రెండేళ్ల పాటు పోరాడి చివరకు 55 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కనుమూయడం బాధాకరమే. మహారాష్ట్రపు కుటుంబపు వ్యక్తి అయిన సుధీర్ 10 ఏళ్ల వయసులో కార్టూన్ వేశారట. 22 ఏళ్ళ వయసులో ‘ ఇలాస్ట్రేటెడ్ వీక్లీ’ లో చేరి మొదట ‘నవభారత్ టైమ్స్’ లో కార్టూనిస్టుగా పనిచేసి, పిమ్మట ‘ హిందుస్థాన్ టైమ్స్’ లో చేరి ఇంగ్లీష్ కార్టూనిస్ట్గా సుదీర్ఘకాలం పనిచేశారు. చివరలో ఇండియన్ ఎక్స్ప్రెస్, ఏషియన్ ఏజ్ వంటి పత్రికల్లో కూడా ఉద్యోగం చేశారు.
కార్టూనిస్టుగా చేరిన తొలి రోజుల్లో ఆర్ కె లక్ష్మణ్ దగ్గర పనిచేసి ఎంతో స్ఫూర్తి పొందిన సుధీర్ ఆయన సృష్టించిన కామన్ మ్యాన్ లాగానే, ‘జోలెవాలా’ క్యారెక్టర్‍ను సృజించారు కానీ కొనసాగించలేదు. 2004 లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా పొందిన వీరు1992-2012 కాలంలో 7 కార్టూన్ల సంకలనాలు విడుదల చేశారు. మన్మోహన్ సింగ్ కాలపు రాజకీయ వ్యంగ చిత్రాలను ‘నో ప్రైమ్ మినిస్టర్’ పేరుతో 2009లో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. భారతదేశపు ప్రఖ్యాత కార్టూనిస్టుల ప్రతిభను, నైపుణ్యాన్ని గుర్తుచేస్తూ దూరదర్శన్ లో ‘50 ఇయర్స్ ఆఫ్ లంఫూనింగ్’ అనే పేరుతో రెండు భాగాల యానిమేషన్ ఫిలిమ్ ను పాతికేళ్ల క్రితం రూపొందించారు.
- డా. నాగసూరి వేణుగోపాల్
ఎ : 9440732392