పాతరాతియుగంలో సహజసిద్ధమైన గుహలు, కొండ చరియల కింద నివసించిన ఆదిమ మానవుడు, ఆహార సంపాదనలో భాగంగా, మైదానాల్లో కొచ్చాడు. జంతువుల నుంచి రక్షణ కోసం, కొద్దిపాటి గుహల్లాంటి గుంట ఆవాసాల్లో నివసించాడు. ఆ తరువాత నీటి వనరుకు దగ్గరగా, ఆరుబయలు ప్రదేశాల్లో ఎండ, వానల నుంచి తప్పించుకొనేందుకు పూరిళ్లును నిర్మించుకొన్నాడు. ముతకరకం రాతి పనిముట్ల స్థానంలో, నునుపు దేలేట్లు కొనల్ని అరగదీసి, పదునైన, నాణ్యమైన రాతి పనిముట్లను తయారించు కొన్నాడు. పశువులను మచ్చిక జేసుకొన్నాడు. పంటల్ని పండించుకొన్నాడు. ఆహార సంపాదన దశ నుంచి ఆహార నిల్వ చేసుకొనే స్థాయికి ఎదిగాడు. సంచార జీవనాన్ని వదలి, ఒక చోట స్థిరనివాస మేర్పరచు కొన్నాడు. జీవన విధానంలో పెనుమార్పులకు దారి తీసిన పదునుగల రాతి పనిముట్లను కొత్తగా ప్రవేశపెట్టిన ఈ యుగాన్ని కొత్త రాతియుగమన్నారు. ఇంకా అతడు, రవాణా సౌకర్యాన్ని కల్పించుకొన్నాడు. చేతితోనూ, సారెపైనా తిప్పి, వివిధ రకాల కుండల్ని తయారించుకొన్నాడు. అడపాదడపా వాటిపై రంగులతో అలంకరించాడు. అంతేకాదు, ఈ యుగంలోనే లోహాన్ని ప్రత్యేకించి రాగిని కనుగొని, పనిముట్లకు, ఆభరణాలకు వినియోగించు కొన్నాడు. ఇన్ని మార్పులు తెచ్చిన ఈ యుగాన్ని గార్డెన్ ఛైల్డ్, కొత్తరాతియుగ విప్లవం అన్నాడు.
ఎక్కడిదాకో ఎందుకు, ఇక్కడ, మనదేశంలోని తెలంగాణాలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ కొత్తరాతియుగపు స్థావరాలు లెక్కలేనన్ని వెలుగు చూశాయి. కొన్ని స్థావరాల్లో జరిపిన తవ్వకాల్లో ఆసక్తికర విషయాలు తెలిసాయి. శ్రీశైలం నీటిముంపు ప్రాంతమైన మునుపటి మహబూబ్నగర్, ప్రస్తుత నాగర్కర్నూల్ జిల్లా, కొల్లాపురం సమీపంలోని చిన్నమారూరు వద్ద 1977-78లో పురావస్తు శాఖ అధికారులు, వి.వి.కృష్ణ శాస్త్రి, జి.కృష్ణంరాజు జరిపిన తవ్వకాల్లో గుండ్రటి ఆకారంలో నిర్మించుకొన్న ఒక కొత్త రాతియుగపు ఇల్లు బయల్పడి, అప్పటి జనజీవన విధానానికి, ఇంటి నిర్మాణ ప్రారంభానికి అద్దం పట్టింది.
చిన్నమారూరు గ్రామం చివరలో, ఒక మీటరు మందంగల దిబ్బపై జరిపిన తవ్వకాల్లో బయల్పడిన 4.90 మీ.ల వ్యాసంలో ఉన్న, చుట్టూ నాపరాళ్లను పాతుకొని, మధ్యలో మట్టి, కంకర కలిపి దిమ్మెచగొట్టి గట్టి పరచిన నేల, సరిగా సెంటర్లో, నిట్టాడిని నిలబెట్టటానికి ఒక నాపరాయిని పరచిన ఆనవాలు, ఆశ్చర్యాన్ని కలిగించాయి. పశ్చిమానికి ప్రవేశ ద్వారంతో గల ఈ చుట్టింటి చుట్టూ చిన్న చిన్న కొమ్మల్ని పాతి, ఆకు ఆలమును జోడించి, మట్టి లేక పేడతో అలికి, దడిగట్టి, గుడిసె పై కప్పుకు గడ్డీగాదాన్ని వాడి, అందులో కుటుంబ సమేతంగా నివసించాడు అప్పటి మానవుడు. గమ్మత్తేమిటంటే, ఆ గుడిసెకు ఆగ్నేయంగా మూడు నాపరాళ్లు అడ్డంగా పాతి ఒక పొయ్యిని ఏర్పాటు చేసుకోవటం. తవ్వకాల్లో అదే ఇంటి నుంచి ఒక సానరాయి, ఒక నూరుడు రాయి, పదును గల రాతి గొడ్డళ్లు, గచ్చరంగు మట్టి పాత్రలు, బయల్పడి అది ఆనాటి మానవులు నివసించిన ఇల్లు అని తేల్చాయి. అదే కాలానికి చెందిన ఇలాంటి ఇళ్లు ఆంధ్రలో హులికల్లు, కర్ణాటకలో తెక్కలకోట, తమిళనాడులో పైయంపల్లి, మహరాష్ట్రలో చందోలిలో వెలుగుచూశాయి. తెలంగాణాలో ఇప్పటి ఆకాశ సౌధాలకు ఆదిగురువైన ఈ కొత్తరాతియుగపు చిన్నమారూరు చుట్టిల్లే, తెలంగాణ తొలి చుట్టిల్లు. తెలంగాణా ఇంటినిర్మాణ చరిత్రలో ఇదొక మైలురాయి.
-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446