నులుక సందయ్యల(మాదిగ గురువుల వారు)జాంబపురాణం-వర్ణ, కుల ఉపకులాల పరిశీలన

అష్టాదశ పురాణాలకు ఏమాత్రం తగ్గకుండ వెలసిన కులపురాణాలలో జాంబపురాణం ఒకటి. దీనికి ‘ఆది జాంబవ మహాపురాణం’ అని మాదిగ జాతి మూల పురుషుడి కథ అని, అదే విధంగా సృష్టికి ఆది పురుషుని కథ అని పరిశోధకులు చెబుతున్నారు.
కాలక్రమేణ జాంబవంతుని సంతతిని నేడు మాదిగలుగ పిలువబడుతున్నారు. అన్ని కులాలకు ఉపకులాలు ఉన్నట్లే, మాదిగసామాజిక వర్గానికి (కులానికి) చిందు, దక్కలి, బైండ్ల, మాష్టి, కిన్నెరలతో పాటు నులుక సందయ్యలు (చందయ్యలు) అను వారు మాదిగల ఆశ్రిత కులంగా ఉంటున్నారు.
నులుక సందయ్యలు తెలంగాణలోని దక్షిణ కాశీగా వెలుగొందుతున్నది కొలనుపాక. అది యాదాద్రి జిల్లా ఆలేరుకు సమీపంలోని కొలనుపాకగ్రామం ఉంది. అక్కడ పద్దెనిమిది కులాలకు సంబంధించిన కుల మఠాలు ఉన్నాయి. అందులో జాంబవంతుని మఠము కూడా ఉన్నది. ఇది ఊరికి నైరుతి భాగంలో నిర్మించడం జరిగింది. ఇక్కడ మాదిగ జాతి మూల పురుషుడు అయిన జాంబవంతునికి పూజారులుగ వీరు ఉంటారు. ఇక్కడ మిర్యాల పరమేశ్వరయ్య, నందదీపం రాజవీరయ్య సంతతికి చెందిన వారు ఉంటు వస్తున్నారు. ఈ సంతతికి చెందిన వారె కొందరు వేములవాడలో శ్రీ రాజన్న సన్నిధిలో మాదిగ సామాజిక వర్గానికి మాత్రమే పంతులు (గురువులు)గా ఉంటూ జాంబపురాణం చెబుతారు. ఐతే పాతకాలంలో మాత్రం గ్రామాలలో కచ్చురం బండిపై ప్రయాణించి, ఊళ్ళో విడిది చేసి జాంబపురాణంను వచన రూపంలో బోధించేవారు.


లోకంలో ఆది-అంతం లేనివాడు జ్యోతిర్మహేశ్వరుడు కాంతి పుంజము వలె వెలుగుతుంటాడు. అప్పుడు సృష్టికి మ•ందుగ అంటే ఆదిగ జన్మించిన వారు జాంబవంతుడు. అందుకని అతడిని ఆది జాంబవుడు అని పిలుచుకుంటారు. అతడినే ఆది జాంబవ మహామునిగ ఈ సామాజిక వర్గం వారు కొల్చుకుంటారు. ఇలా జాంబవంతుని తర్వాత పుట్టిన సకల చరాచరాసృష్టి, దేవదానవులు, మానవులు మొదలగునవి వారందరు అతడిని అనుసరించిన వారలె. తదనుగుణంగానే ఈ నులక సంగయ్యల జాంబవపురాణం ప్రకారం జాంబవంతుడు ‘‘కొందరికి పనులను కల్పిస్తు, పనిముట్లు ఇస్తూ, దానిని వృత్తిగ మార్చడం జరిగింది. ఆ వృత్తులనే రానురాను కులాలుగ మార్పుచెందడం జరిగింది. అందులో భాగంగా తన సొంత కొడుకుని చంపి పంచాననులకు వృత్తి పనిముట్లు కల్పించిన త్యాగమూర్తి జాంబవంతుడు తిరిగి బతికిన అతనె డెక్కలి వారుగ పిలువబడ్డాడు. జాంబవంతుడు పంచబ్రహ్మలను (మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ) స్కాంత రాతి కోటలో ఉండి సమస్తమైన స్వర్ణ రజతభూషణాలు చేస్తు జగతి ప్రసిద్ధి చెందండి అని పంపించాడు. అయితే ఈ జాంబవ పురాణం ప్రకారంగ అప్పటి సమాజంలో పౌరులు వారు వారు చేస్తున్నటువంటి పని – పాటలు, ఆచార వ్యవహారాలను బట్టి వర్ణాలు, కుల – ఉపకులాలుగా పిలువబడినాయి. అందులో పద్ధెనిమిది వర్ణాలు, 24 కులాలు వాటికిని ఉపకులాలు అనేకంగా ఇవ్వబడినాయి.


పదునెనిమిది వర్ణముల నిర్ణయము
(1) అగ్రజాతి శాఖ:
వైదిక బ్రాహ్మణులు – యాగములను చేయువారు.
శాస్త్రాజ్ఞ బ్రాహ్మణ – వేదపారాయణము చేయువారు
పౌరాణిక బ్రాహ్మణ – పురాణములు చెప్పువారు
సాంస్కృతిక బ్రాహ్మణ – సంస్కృతి, వేదములు వ్రాయువారు
జ్యోతిష్య బ్రాహ్మణ – జ్యోతిష్యం చెప్పువారు
యజుర్వేదిక బ్రాహ్మణ – వైద్యము చేయువారు
వ్యాపార బ్రాహ్మణ – దేశాయిలు, కర్ణికములు చేయువారు
పౌరోహిత బ్రాహ్మణ- గ్రామములో పురుహిత
శుభకార్యములు చేయువారు.
వ్యవసాయ బ్రాహ్మణ – వ్యవసాయము చేయువారు.
(2) వైష్ణవాళ్వార్లశాఖ: ‘‘పన్నిరద్ధరాళ్వారు, భూతాళ్వారు, పైదతాళ్వారు, పేయాళ్వారు, తిరుమళిశై ఆళ్వారు, కులశేఖారా ళ్వారు, తొండిఠడిప్యాడి ఆళ్వారు, తిరుప్పాణి ఆళ్వారు, వీరునిచ్చల వైష్ణవుడు, తిరుమంగైఆళ్వారు, పెరిచాళ్వారు, అండాళ్వారు, నమ్మయాళ్వారు, మధురకవి ఆళ్వారు, పాయిగై ఆళ్వారు ఇంక నంబృలు గలరు పెరిమానంభి, తిరుకచ్చవంభి, తిరువల్‍నంభి, మన్నూదునంభి, వడగనంఢి (ఇంక వీరిలో దాసరి వారు గలరు, అడ్కదాసరి, బోడ్కు దాసరి, తాళ్లందాసరి, తప్పెట దాసరి, గంటెదాసరి, యెద్దు దాసరి యెనాటి దాసరి, తాతచారి దాసరి, మాలదాసరి, మాదిగ దాసరి.
(3) జంగమువారి శాఖ: నిజజంగం, హటజంగం, మట్టజంగం, వర్తక జంగం, వీరజంగం, వీణ జంగం, గంటజంగం, వేషజంగం, బొనగ జంగం, చిత్రకంటి జంగం, బుడిగె జంగం.
(4) కాపువారి శాఖ: మొటాటికాపు, చౌదరిక కాపు, పాకనాటికాపు, గోనెకాపు, రెడ్డికాపు, గుడాటికాపు, చెట్టెంకాపు, కమ్మకాపు, పెరిక కాపు, ఆరెకాపు, మున్నూరుకాపు.
(5) గౌండ్ల శాఖ: ఆదిగౌడు, అమరగౌడు, వేదగౌడు, విప్రగౌడు, పుంగమగౌడు, కంఠమగౌడు, ఇంకా అనేక గౌండ్లవారు కలరు.
(6) గొల్లవారి శాఖ: ఎర్రగొల్ల, పాకనాటి గొల్ల, గంపదింపుడు గొల్ల, రాచగొల్ల, పూనాటి గొల్ల, పునాటి గొల్ల, పయ్యావుల గొల్ల, ముదిత గొల్ల, సజ్జనంపు గొల్ల, చక్కని గొల్ల, కర్ణె గొల్ల, పెదవీటి గొల్ల, మందగొల్ల.
(7) వైశ్యవారి శాఖ: కుసుమశెట్టి కోమటి, గోమతుల కోమటి, లాభశెట్టి కోమటి, యోగిన కోమటి, పత్తి కోమటి, జైనా కోమటి, రాత్నాల కోమటి, నేతి కోమటి, భీర కోమటి, అర్వ కోమటి, కల్లంగి కోమటి, పనస కోమటి, సిద్ధె కోమటి, నూనె కోమటి, దోర్నాల కోమటి, విస్తరి పుల్లల కోమటి, దొప్పకోమటి, సర్వ కోమటి, గుమ్మడి కోమటి, కుడుకల కోమటి, కొబ్బరికాయల కోమటి, బెల్లం కోమటి, శర్కర కోమటి, ముర్ధారి కోమటి, వీరియీ యెదున్నూట గోత్రములు, అదుకు నూటనొక్క గోత్రమే నిర్ణయించబడినదిఇ.
(8) పద్మశాలి వారి శాఖ: శాల, పద్మశాల, మాలశాల.
(9) తెనుగు వారి శాఖ: తెనుగువారు, బెస్తవారు, బోయవారు, ముత్రాసివారు, గూళ్ళవారు, తెనుగు పాండ్వలవారు పెద్దమ్మలవారు.
(10) మహ్మదీయ శాఖ: సయ్యద్‍, షేక్‍, మొగిల్‍, పటాన్‍, పక్కీర్‍
(11) యెల్మల శాఖ: రాచయెల్మ, యేకెల్మ
(12) లంబాడి శాఖ: లంబాడి, మారుబడిలంబాడి, వంజర లంబాడి, కొప్పుంబాడి, ముష్కలంబాడి, గవ్వలంబాడి, కుప్పెలంబాడి
(13) వద్ధిరాజుల శాఖ: రాచవొడ్డె, బందవొడ్డె, మట్టివొడ్డె, బంధవొడ్డె, తప్పవొడ్డె, కొండవొడ్డె, కట్టవొడ్డె
(14) యెరుకుల వారి శాఖ: అయ్యెరుకా, పామెరుకా, కిన్నెరెరుక, గవ్వెరుక, బుట్టెరుక, గిలుకెరుక, కుంబెరుక
(15) పాంచానన శాఖ: కర్మరాచారి, వడ్లచారి, కంచరాచారి, కాశాచారి, అవుసులాచారి
(16) మాలవారి శాఖ: వుపమాల – జపమాల, శివకంఠ మాల, పెంటమాల, యెలిమాల, సలిమాల, దూడరిమాల, దుస్కరిమాల, ఆరెమాల, అట్కరిమాల, గూడరిమాల, గుంటమాల, తుంగమాల.
(17) మాదిగవారి శాఖ: కోయమాదిగ, గొండమాదిగ, సంగరి మాదిగ, రుంజ మాదిగ, డప్పు మాదిగ, లండమాదిగ, అవ్వల• మాదిగ, యేల్పు మాదిగ, కిన్నెర మాదిగ, కొమ్ము మాదిగ, సిందు మాదిగ.
(18) వీరాముష్ఠివారి శాఖ: వీరా భటుడు, వీరాంగుడు, వీరసాదుడు, వీరాకటికుడు, వీరాముష్ఠి.


కలియుగము ప్రారంభము నందు కులాలు: 1. బ్రాహ్మణులు – బ్రాహ్మణులుగ, 2. క్షత్రియులు – రాజులుగ, 3. వైశ్య – కోమట్లును, 4. కర్షకులు – కాపువారుగ, 5. హరి అర్చక – వైష్ణవులుగా, 6. లింగాదారక – జంగాలుగ, 7. భోజక – తెనుగువారుగ, 8. పంచానన – పించాదాయులుగా, 9. తంత్వయ – శాల వారుగా, 10. గోరక్షణ – గొల్ల వారుగా, 11. కుంభకారక – కుమ్మరివారుగా, 12. గౌడకా గౌండ్లవారుగా, 13. పురిహోరిక – పెరుకవారున్న, 14. తిలుగాతకా – గాండ్ల వారుగా, 15. వస్త్రభేదిక – మేరవారుగా, 16. క్షార్ణక – మంగలివారుగా, 17. రజక – చాకలివారుగా, 18. నర్తక – భోగము వారుగా, 19. మానిప్పక – లంబాదివారుగా, 20. మహ్మదీయ – తురుకవారుగా, 21. మాతంగ – మాదిగవారుగా, 22. చండాల – మాలవారుగా, 23. వొద్దిక – వొడ్డెరవాండ్లుగా, 24. కిరాతక – ఎరుకలవాండ్లుగా ఇట్లు ఇరువది నాలుగు కులమలులను నిర్ణయంచెను.


కులాలకు-ఉపకులాలు: ఇరువది నాలుగు కులములు, పద్దెనిమిది వర్ణములే కాక ఉప కులాలను కూడా ఈ జాంబపురాణమ నందు వివరించడం జరిగింది. అవి కాపు వారికి-దొమ్మరివారు, శెట్టి లింగమును కట్టినవారికి-వీరముష్ఠి వారు, బ్రాహ్మణులకు – విక్రవినోది, పంచదాయిలకు-పనుసవారు, గౌండ్ల వారికి- యేనూటి వారు, తురుకలకు-పక్కీరువారు, ఆరెవారికి-గోసాయివారు, వెలుమవారికి – బట్టువారు, బట్టునదిగేటివాడు – నాగరిబట్టు, భోగము వారికి-పలుకలవాడు, ఉప్పరివారికి -భీసడిడ్డడు, జంగము వారికి- నందికోల భక్తుడు, ముత్రాసి వారికి కాకిపడ్గెవాడు, మంగలివారికి- అద్దపుసింగడు, శాలవారికి-కూనపూసిలవాడు, చాకలివారికి- గంజికూటివాడు, కుమ్మరివారికి-కక్కెర్లవాడు, కుర్మవారికి – లగారుజోగి, గొల్లవారికి -మందగొల్లవాడు, లంబాడివారికి- దాఠివాడు, మాలవారికి – గుల్లంమల్లుడు, మాదిగవారికి – దక్కలవాడు, దక్కలవానికి అడెగెవాడు కొండ దక్కలివాడు, కొండ దక్కలివానికి-మూగలవాడు, మూగల వారికి -తపలమూగలవాడు, తపల మూగల వారికి-మైలపు చొక్కన్న, మైలపు చొక్కనకు-చొప్పకట్టివాడు, చొప్పకట్టివానికి-సింహశిష్టు- సింహ్మసిష్టుటకు చెపల చోరుడు, చెపలచోరునికి-కులస్తుడు, కులస్తునికి -కులహీనుడు.


ఉపయుక్త గ్రంథాలు:
1) ఆది జాంబవ మహాపురానం
2) నులుక సందయ్యల పాత రాతప్రతి (ఆధారంగ) – వేములవాడ
3) కులపురాణాలు – పులికొండ సుబ్బాచారి
4) పటం కథలు – డా।।గడ్డం వెంకన్న
5) చిందు జాంబ పురాణం – డా।। గడ్డం మోహన్‍రావు
6) డా।।పాండుల సాయిలు-మాదిగ ఆశ్రిత కులాల జీవనవిధానం -సాహిత్యం.


-డా।। పాండుల సాయిలు
ఎ : 96520 27481

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *