పోర్చుగీస్‍ పాలకుల నిరంకుశత్వంతో పోరాడిన రేడియో యోధలిబియా లోబో సర్దేశాయి

మొన్న రిపబ్లిక్‍ డే సందర్భంగా పద్మశ్రీ పొందిన లిబియా లోబో సర్దేశాయి మనదేశంలో ఇటీవలికాలంలో జరిగిన రెండు స్వాతంత్య్రోద్యమాలను దగ్గర నుంచి చూసిన అద్వితీయమైన వ్యక్తి. 2025 మే25 వతేదీన తన నూటొకటవ పుట్టినరోజును జరుపుకోబోతున్న అపురూపమైన వనిత కూడా ఈమె. గోవాలో ప్రాక్టీస్‍ చేసిన తొలి లాయరు మాత్రమే కాదుబీ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గోవా, దమన్‍, దయ్యు కేంద్రపాలిత ప్రాంతానికి టూరిజం డైరెక్టర్‍ గా కూడా సేవలందించారు. అంతేకాదు గోవా కాలేజ్‍ ఆఫ్‍ హోమ్‍ సైన్స్ ను ప్రారంభించిన ఈమె విలక్షణంగా నెలకొల్పిన గోవా ఉమెన్‍ కో-ఆపరేటివ్‍ బ్యాంక్‍ ఇప్పటికీ కేవలం మహిళా ఉద్యోగులతో దిగ్విజయంగా నడుస్తోంది. భర్తతో కలిసి Voz da Liberdabe అని పోర్చుగీసు భాషలో, Goenche SodvonechoAwaz పేరుతో కొంకణి భాషలో ప్రసారాలు చేసిన సీక్రెట్‍ రేడియో చరిత్ర అపూర్వం.


విమానానికి రేడియో ట్రాన్స్ మీటర్‍ బిగించి ఇంకా లౌడ్‍ స్పీకర్‍ అమర్చి, పూలు చల్లుతూ 451సంవత్సరాల చరిత్రలో స్వాతంత్య్రం పొందిన గోవా అంటూ ప్రకటిస్తూ ఒక రెండు గంటలపాటు ఆకాశయాన ప్రసారం చేశారు! అవును, అత్యంత ఆశ్చర్యమనిపించే ఈ సంఘటన 1961 డిసెంబరు 19న గోవాకు స్వేచ్ఛ సిద్ధించిన వేళ జరిగింది. 1955 నవంబరు 25న మొదలైన ఈ సీక్రెట్‍ రేడియో గోవాకు స్వాతంత్య్రం లభించిన రోజున విజయోత్సవంలో పాల్గొని, ఆ వార్తను ప్రకటిస్తూ తన ప్రసారాలు ఆపివేసి విలువైన చరిత్రగా మారిపోయింది.


1510వ సంవత్సరంలో గోవా ప్రాంతం పోర్చుగీసు స్థావరంగా మారిపోయింది. బ్రిటీషువారు భారతదేశపు చాలా భాగాలు ఆక్రమించినా పాండిచ్చేరి ఫ్రెంచి వారి చేతిలోకి వెళ్ళిపోయినట్టు గోవా, డయ్యు, డమన్‍ పోర్చుగీసు చేతిలో ఉండిపోయాయి. గోవాకూ, మిగతా భారతదేశానికి పెద్దగా సంపర్కం లేకుండా సాగిపోయింది. 1932 గోవా గవర్నర్‍ గా యాంటోనియో డి ఒలివీరా సలాజార్‍ వచ్చిన తర్వాత ఆంక్షలు పెరగడం, ప్రజల హక్కులు హరించడం పెద్ద ఎత్తున మొదలైంది. భారత్‍-పోర్చుగల్‍ సంబంధాలు రెండవ ప్రపంచ యుద్ధానంతర పరిణామాల మీద ఆధారపడి బెడిసికొట్టాయి. 1940వ దశకం నుంచి స్వాతంత్య్ర పోరాటం గురించి ఆలోచనలు, ప్రయత్నాలు మొదలయ్యాయి. 1954లో దాద్రానగర్‍, హవేలీ విముక్తి పొందడం కొత్త ఆలోచనలకు ద్వారాలు తీసింది. 1954 గోవాకు విముక్తి కావాలని సరిహద్దు ప్రాంతంలో శాంతియుతంగా ప్రవేశించిన సత్యాగ్రహులను అప్పటి పోర్చుగీస్‍ ప్రభుత్వం క్రూరంగా చంపి వేసింది. దాంతో 1955లో భారత ప్రభుత్వం ‘ఎకనమిక్‍ బ్లాకేడ్‍’ ప్రకటించాల్సి వచ్చింది. ఫలితంగా గోవా పరిస్థితి ఎలా ఉందంటే బంగాళ దుంపలు (నెదర్లాండ్‍ నుంచి)బీ వైన్‍ (పోర్చుగీసు) కూరలు, బియ్యం (పాకిస్తాన్‍) బీ టీ (శ్రీలంక), సిమెంట్‍ (జపాన్‍), ఉక్కు (బెల్జియం నుంచి) దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. 1961లో చేపలు పట్టే భారతీయుల పడవలపై గోవా కాల్పులకు దిగడంతో పరిస్థితి తారస్థాయికి వచ్చింది.


గోవా లేబరేషన్‍ కోసం బొంబాయి నుంచి రహస్యంగా పోరాడుతున్న నికోలోవ్‍ మేనెంజీస్‍ ఇంకా వామన్‍ సర్దేశాయి , లిబియా లోబో కలసి రెండు వైర్లెస్‍ రేడియో సెట్లతో రేడియో ట్రాన్స్మిటర్‍ ను సిద్ధం చేశారు. 1955 నవంబరు 25న ఉదయం 7 గం.లకు ‘వాయిస్‍ ఆఫ్‍ ఫ్రీడమ్‍’ అనే సీక్రెట్‍ రేడియోను వంద కిలోమీటర్ల దూరంలో ఉండే అంబోలి (Amboli) అడవుల నుంచి ప్రారంభించారు. తర్వాత మేనెంజీస్‍ ఆ బృందం నుంచి తప్పుకోవడంతో ప్రసారాలు 50 కిలోమీటర్లు దూరంలో ఉండే కన్నడ ప్రాంతమైన క్యాజల్‍ రాక్‍ కు మారాయి. ట్రాన్స్ మీటర్‍ ను ఒక ట్రక్కుకు బిగించి ప్రసారాలు చేసేవారు. గోవా అధికారికంగా చేసే ప్రాపగాండాను వమ్ము చేస్తూ నడిచిన ఈ సీక్రెట్‍ రేడియో ప్రసారాలకు భారతదేశంతో పాటు ఇతర దేశాల నుంచి కూడా మద్దతు లభించేది. ఆసియా, ఆఫ్రికా ఖండాలలో వలస పాలనకు వ్యతిరేకంగా నడిచే ఉద్యమాల వార్తలను కూడా ఇచ్చేవారు. ఈ విషయంలో గోవా ఒంటరి కాదనే భావం కల్గించి, ధైర్యం నూరిపోయడానికి వారి వార్తల పరిధిని సైతం పెంచారు. ఈ రేడియో ఇండియా భూభాగం నుంచి ప్రసారం అయ్యేది కనుక, గోవాలో జరిగే పోరాటానికి మద్దతు ఇస్తూ పలువురు భారతీయ నాయకుల ప్రసంగాలు రేడియో ద్వారా చేశారు. 1956 జూలై 15న వినోబాభావే తన రేడియో ప్రసంగంలో శాంతియుతంగా గోవాను వదిలి వెళ్ళిపొమ్మని పోర్చుగీసు వారిని కోరారు. భారత్‍ పార్లమెంటులో, ఇతర దేశాలలో ఈ విషయంపై జరిగే చర్చల సారాంశాన్ని కూడా శ్రోతలకు ఎప్పటికప్పుడు అందించేవారు. 1961 డిసెంబరులో ఆపరేషన్‍ విజయం మొదలయ్యాక ‘వాయిస్‍ ఆఫ్‍ ఫ్రీడమ్‍’ బృందం అడవుల నుంచి బెల్గాం ప్రాంతానికి వచ్చింది. ఆ సమయం నుంచి ప్రతి గంటకూ ప్రసారాలు చేశారు. గోవా ఆర్మీ నుద్దేశించి భారత రక్షణ మంత్రి వి.కె.కృష్ణ మీనన్‍ 1961 డిసెంబరు 15న ఈ సీక్రెట్‍ రేడియోలో ప్రసంగిస్తూ చర్చలకు ఆహ్వానించారు. భారత సైన్యం లోపలికే రాకుండా గోవా ఆర్మీ డిసెంబరు 17న బ్రిడ్జిని కూల్చివేసింది. సుమారు 36 గంటలు వాయు, సముద్ర, భూ తలాలపై కూడా భీకర పోరాటం నడిచింది. తర్వాత డిసెంబరు 19న గోవా ప్రాంతం భారత భూభాగంలో కలసిపోయింది. ఇండియన్‍ ఎయిర్‍ ఫోర్స్ విమానం నుంచి ‘వాయిస్‍ ఆఫ్‍ ఫ్రీడమ్‍’ రేడియో బృందం గోవా విముక్తి సమాచారాన్ని ఆకాశ మార్గం గుండా ప్రకటించింది.


1924 మే 25న పనాజీ నగరానికి దగ్గరలో ఉన్న పొర్వోరి గ్రామంలో జన్మించిన లిబియా లోబో బాల్యంలోనే ఆమె కుటుంబం బొంబాయికి తరలి వెళ్ళింది. అంబేద్కర్‍ ప్రారంభించిన సిద్ధార్థ కళాశాల నుంచి డిగ్రీ పొందిన లిబియా లోబో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇటలీకి చెందిన కారాగరవాసుల ఉత్తరాలను చదివి పరిష్కరించేవారు. ఆల్‍ ఇండియా రేడియో, బొంబాయి కేంద్రంలో స్టెనోగానూ, లైబ్రేరియన్‍ గాను సేవలందించిన ఆమెకు కవి నిజీమ్‍ ఎజ్కిల్‍ ద్వారా ఎం.ఎన్‍.రాయ్‍ పరిచయమవడం విశేషం. గోవా విమోచన మూడవ వార్షికోత్సవం అంటే 1964 డిసెంబర్‍ 19న వామన్‍ సర్దేశాయి, లిబియా లోబో వివాహం చేసుకున్నారు. వామన్‍ సర్దేశాయ్‍ 1992లో పద్మశ్రీ పొందగా, లిబియా లోబో 2025లో ఆ అవార్డు పొందారు. 1994లో వామన్‍ సర్దేశాయి మరణించిన తర్వాత ఆయన పేర పేదలకు చేయూతనిస్తూ వేదాంత ఇన్స్టిట్యూట్‍ను స్థాపించిన లిబియా లోబో ప్రస్తుతం పనాజీలో ఉంటున్నారు.

  • డా. నాగసూరి వేణుగోపాల్‍
    ఎ : 9440732392

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *