సెప్టెంబర్ 16న ఓజోన్ పరిరక్షణ దినోత్సవం
ఒక ఆక్సిజన్ అణువులో సాధారణంగా రెండు ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆక్సిజన్ అణువుకు మరో ఆక్సిజన్ పరమాణువు జతచేరినప్పుడు ‘ఓజోన్’ అణువు ఏర్పడుతుంది. మూడు ఆక్సిజన్ పరమాణువులతో కలసి ఏర్పడుతుంది గనుక ‘ఓజోన్’ను ‘ట్క్రెయాక్సిజన్’ అని కూడా అంటారు. ఓజోన్ పొర స్ట్రాటోస్పియర్ వద్ద భూమికి 15 నుంచి 35 కిలోమీటర్ల ఎత్తున ఆవరించి ఉంటుంది. రుతువుల్లో మార్పుల బట్టి, భౌగోళిక పరిస్థితుల బట్టి ఓజోన్ పొర మందం మారుతూ ఉంటుంది. వాతావరణ కాలుష్యం కారణంగా ఓజోన్ పొర దెబ్బతింటోంది. నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, హెడ్రాక్సిల్, క్లోరిన్, బ్రోమిన్ వంటి వాటి వల్ల ఓజోన్ పొర దారుణంగా తరిగిపోతోంది. ఓజోన్ పొర సహజమందాన్ని పోగొట్టుకున్నా, పూర్తిగా నాశనమైనా ఓజోన్ పొరకు చిల్లు పడిందని అంటాం.
పుడమి చుట్టూ ఆవరించి ఉన్న సహజ కవచానికి చిల్లు పడింది. ఈ చిల్లు నానాటికీ విస్తరిస్తోంది. కవచానికి ఏర్పడిన ఈ చిల్లులోంచి తీక్షణమైన అతి నీలలోహిత కిరణాలు నేలను తాకుతున్నాయి. వీటి తాకిడి వల్ల మనుషులు చర్మ కేన్సర్ బారిన పడుతున్నారు. సముద్ర జీవులు ముప్పు అంచుకు చేరుకుంటున్నాయి. ఈ పరిస్థితిని అరికట్టడానికి జాగ్రత్తలు తీసుకోకుంటే, భూమ్మీద ఉన్న సమస్త జీవరాశులకూ ముప్పతప్పని పరిస్థితి ఏర్పడుతుంది. పుడమి చుట్టూ ఆవరించి ఉన్న సహజ కవచమే ‘ఓజోన్ పొర’.
ఓజోన్ పరిరక్షణకు..
ఓజోన్ పొర పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి 1985లో ఓ సమావేశం నిర్వహించింది. దీనికి వాటిల్లుతున్న ముప్పును గుర్తించి, దీన్ని అరికట్టాలని నిపుణులు, శాస్త్రవేత్తలందరూ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 1994 సెప్టెంబర్ 16న జరిగిన మరో సమావేశంలో ఓజోన్ పొర క్షీణతను అరికట్టేందుకు, ప్రతి ఏటా అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవంగా జరపాలని నిర్ణయించారు.
ధ్రువప్రాంతాల్లో ఓజోన్ పొర పలచబడటం వల్ల సూర్యుని అతి నీలలోహిత కిరణాలు ఆ ప్రాంతానికి మరింత తీక్షణంగా తాకుతాయి. ఫలితంగా, అక్కడి మంచు శరవేగంగా కరిగిపోయి, సముద్రాల్లో నీటిమట్టం అమాంతం పెరిగి తీరాలు మునిగిపోతాయి. విపరీతమైన ఇంధన వినియోగం, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజరేటర్లలో వాడే వాయువులు విపరీత పరిమాణంలో వెలువడుతుండటం వల్ల ఓజోన్ పొరకు చిల్లుపడి, అది నానాటికీ విస్తరిస్తోంది. భూమ్మీద అక్కడక్కడా చెలరేగే కార్చిచ్చులు కూడా ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. ఇటీవల అమెజాన్ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు ఓజోన్ పొరను దారుణంగా దెబ్బతీయడమే కాకుండా, పర్యావరణ సమతుల్యతపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపగలదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇవీ అనర్థాలు
ఓజోన్ పొర దెబ్బతింటే భూమ్మీద అతి నీలలోహిత కిరణాల రేడియేషన్ ప్రభావం పెరుగుతుంది. దీనివల్ల మనుషులకు చర్మ క్యాన్సర్ సహా వివిధ క్యాన్సర్లు, క్యాటరాక్ట్ వంటి కంటిజబ్బులు పెరుగుతాయి. రోగనిరోధక శక్తి నశిస్తుంది. అకాల వార్ధక్యం ముంచుకొస్తుంది. వివిధ పంటలు దెబ్బతింటాయి. వృక్షజాతుల్లో కిరణజన్య సంయోగ క్రియకు విఘాతం ఏర్పడుతుంది. గోధుమలు, వరి, బార్లీ వంటి తిండిగింజల పంటలకు, కూరగాయల పంటలకు తీరని నష్టం కలుగుతుంది. ఫలితంగా ఆహార లభ్యతకు విఘాతం ఏర్పడుతుంది. అతి నీలలోహిత కిరణాల ప్రభావం వల్ల సముద్రాల్లో జలచరాలకు ప్రధాన ఆహారమైన సముద్రపు నాచు కూడా నశించి, జలచరాల మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. పెంపుడు జంతువులు క్యాన్సర్లకు గురవుతాయి. మొత్తంగా చూసుకుంటే ఆహారపు గొలుసు దెబ్బతింటుంది. అతి నీలలోహిత కిరణాల తీవ్రత ఎక్కువగా ఉంటే కలప, దుస్తులు, రబ్బరు వంటి పదార్థాలు త్వరగా నశిస్తాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల మనుషుల జీవితం దుర్భరంగా మారుతుంది.
రెండు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఓజోన్ పొర
ఓజోన్ పొర ఇప్పటికే రెండు ప్రాంతాల్లో బాగా దెబ్బతింది. ఆస్ట్రేలియా భూభాగానికి ఎగువన వాతావరణ పరిధిలో ఓజోన్ పొర మందం దాదాపు 5-9 శాతం మేరకు తగ్గింది. దీనివల్ల అక్కడ భూమ్మీదకు అతి నీలలోహిత కిరణాలు తగినంత వడబోత లేకుండానే, నేరుగా ప్రసరించే ప్రమాదం ఏర్పడింది. ఇక్కడ ఆరుబయట ఎక్కువసేపు గడిపేవారు అతి నీలలోహిత కిరణాల రేడియేషన్‌కు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఇక దక్షిణ ధ్రువ ప్రాంతమైన అంటార్కిటికా వద్ద కూడా ఓజోన్‌పొర తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా సెప్టెంబర్ – నవంబర్ నెలల మధ్య కాలంలో ఓజోన్ పొరకు రంధ్రం మరింతగా విస్తరిస్తోంది. దక్షిణార్ధగోళంలో అక్కడక్కడా సంభవించిన భారీస్థాయి అగ్నిపర్వతాల పేలుళ్లు కూడా ఈ ప్రాంతంలో ఓజోన్ పొరకు విఘాతం కలిగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మనుషుల వల్ల ఏర్పడుతున్న ముప్పు
క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్ వంటి ‘ఓడీఎస్’ రసాయనాల వినియోగం ఓజోన్ పొరకు మనుషుల వల్ల ఏర్పడుతున్న ముప్పు కిందకే వస్తాయి. ఇవి వర్షాలు కురిసినప్పుడు భూమ్మీదకు తిరిగి చేరుకునే పరిస్థితి ఉండదు. భూమ్మీద నుంచి పైకెగసిన ఈ రసాయనాలు స్ట్రాటోస్పియర్ వద్ద దీర్ఘకాలం అలాగే ఉంటాయి. ఓజోన్ పొరకు ఇవి కలిగించే అనర్థం అంతా ఇంతా కాదు. ఉదాహరణకు చెప్పు కోవాలంటే, ఒక క్లోరిన్ పరమాణువు ఏకంగా లక్ష ‘ఓజోన్’ అణువులను దెబ్బతీయగలదు. ఇక బ్రోమిన్ అయితే క్లోరిన్ కంటే 40 రెట్లు ఎక్కువగా హాని చెయ్యగలదు. ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న ‘ఓడీఎస్’ రసాయనాలలో క్లోరోఫ్లోరో కార్బన్స్ రసాయనాలదే సింహభాగం. ఓజోన్ను దెబ్బతీసే రసాయనాల్లో వీటి వాటా 80 శాతానికి పైగానే ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా 1995 సంవత్సరానికి ముందుగా తయారైన రిఫ్రిజిరేటర్లు, ఇళ్లల్లోను, వాహనాల్లోను ఉపయోగించే ఎయిర్ కండిషనర్ల లోను వీటి వాడుక విపరీతంగా ఉండేది. వీటితో పాటు ఆస్పత్రులలో ఉపయోగించే క్లీనింగ్ ఏజెంట్లు, స్టెరిలంట్స్, పరుపులు, కుషన్ల తయారీకి వాడే ఫోమ్, హోమ్ ఇన్సులేషన్ పదార్థాలను తయారు చేసే పరిశ్రమల్లోను క్లోరోఫ్లోరో కార్బన్స్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. క్లోరోఫ్లోరో కార్బన్స్ తెచ్చిపెడుతున్న ముప్పును గుర్తించిన తర్వాత వీటి స్థానంలో హైడ్రోఫ్లోరో కార్బన్లు వాడటం మొదలైంది. ఇవి క్లోర్లోఫ్లోరో కార్బన్స్‌తో పోల్చు కుంటే కొంత తక్కువ హానికరమైనవి. ఇవే కాకుండా, భారీ అగ్నిమాపక యంత్రాలలో వాడే హాలోన్స్, కార్బన్ టెట్రాక్లోరైడ్, కోల్డ్ క్లీనింగ్, వేపర్ డీగ్రీజింగ్, కెమికల్ ప్రాసెసింగ్, పరిశ్రమల్లో వాడే జిగురు వంటి పదార్థాల తయారీలో ఉపయోగించే మీథైల్ క్లోరోఫామ్ వంటివి కూడా ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి.
ఎలా నివారించగలం?
ఓజోన్ పొర మరింతగా దెబ్బతినకుండా చూడాలంటే అదంతా మనుషుల చేతుల్లోనే ఉంది. మనుషులు కాస్త మెలకువ తెచ్చుకుని, ఓజోన్ పొరను దెబ్బతీసే పదార్థాల వాడకాన్ని గణనీయంగా తగ్గించుకోవాలి. ఓజోన్ పొరను కాపాడుకోవడానికి మనుషులు ముఖ్యంగా తగ్గించుకోవాల్సినవేవంటే…
రసాయనిక ఎరువుల వాడకాన్ని, పురుగు మందుల వాడకాన్ని గణనీయంగా తగ్గించు కోవాలి. ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలి. రసాయన పురుగు మందులకు బదులు సేంద్రియ పురుగు మందులను వాడాలి. పెట్రోలియం ఉత్పత్తుల వాడుకను తగ్గించుకోవాలి. ప్రయాణాల కోసం ప్క్రెవేటు వాహనాలను విచ్చలవిడిగా వాడే బదులు వీలైనంతగా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలి. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలతో నడిచే వాహనాల నుంచి వెలువడే పొగ ఓజోన్ పొరను దెబ్బతీస్తుంది.
ఇళ్లల్లో, కార్యాలయాల్లో, పరిశ్రమల్లో రసాయనాలతో తయారైన క్లీనింగ్ ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించుకోవాలి. వీటిలో వినియోగించే రసాయనాలు ఓజోన్ పొరకు తీవ్రంగా దెబ్బతీస్తాయి. వీటి బదులు పర్యావరణానికి చేటు చెయ్యని క్లీనింగ్ ఉత్పత్తులను వాడుకోవాలి.
మాంట్రియల్ ఒడంబడిక తర్వాత దానిపై సంతకాలు చేసిన దేశాలు క్లోరోఫ్లోరో కార్బన్ రసాయనాల వాడుకను గణనీయంగా తగ్గించు కున్నాయి. అయితే, ఈ ఒడంబడికలో ఓజోన్ పొరకు ప్రమాదకరమైన నైట్రస్ ఆక్సైడ్‌ను చేర్చలేదు. నైట్రస్ ఆక్సైడ్ వాడుకను కూడా కట్టడి చేస్తేనే ఓజోన్ పొరను కాపాడుకోగలుగుతాం.
ఓజోన్ రక్షణ మన చేతుల్లోనే..
అపార్టుమెంట్లు, షాపింగ్ మాల్స్ నిర్మాణాల సమయంలోనే కనీసం 33 శాతం మొక్కలు, చెట్లు పెంచేందుకు స్థలం ఉండేలా నిబంధనలు తీసుకురావాలి. దీని కోసం బలమైన చట్టాలను రూపొందించాలి. మొక్కలు, చెట్లూ పెంచాలి. అడవుల నరికివేతను అడ్డుకోవాలి. మితిమీరిన ఇంధన వాడకాన్ని తగ్గించాలి. క్లోరో ఫ్లోరో కార్బన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. వీటికి ఎలాంటి మినహాయింపు ఇవ్వకూడదు. సోలార్ విద్యుత్ వాడకాన్ని పెంచి భూతాపాన్ని తగ్గించాలి. అప్పుడే ఓజోన్ పొర రక్షణకు వీలు కలుగుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతమున్న 24% గ్రీన్ కవర్‌ను 33%కు పెంచాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం హరితహారం ద్వారా దాదాపు పది కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో పచ్చదనాన్ని పెంచుతుంది. నగరంలో మొక్కల పెంపకం, సంరక్షణ, ఆరోగ్యకర వాతావరణం… ఈ మూడింటి ప్రాతిపదికన ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అర్బర్ డే ఫౌండేషన్ హైదరాబాద్ నగరాన్ని ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్-2020’గా ప్రకటించాయి. ప్రపంచ వ్యాప్తగా 63 దేశాల నుంచి 120 నగరాలను పరిగణనలోకి తీసుకోగా 51 నగరాలను ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా ప్రకటించింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, తదితర దేశాలకు చెందిన నగరాలు ఈ జాబితాలో ఉండగా, భారత్ నుంచి ఏకైక నగరం మన హైదరాబాద్ గుర్తింపు పొందింది.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ల కృషి ఫలితంగా హైదరాబాద్ నగరం చుట్టూ లంగ్స్ పార్క్‌లు, మియావాకి అడవులు, మేజర్ పార్కులు, థీమ్ పార్కులు, కాలనీ పార్కులు, సెంట్రల్ మీడియన్లు, ట్రాఫిక్ ఐలాండ్లు, పై ఓవర్లకు పర్టికల్ గార్డెన్స్, ట్రీ పార్కులు చేపట్టారు. అన్ని ప్లాంటేషన్స్, మొక్కలు సహా జియో ట్యాగ్ చేయబడ్డాయి. పచ్చదనం మరియు సుందరీకరణతో నగరానికి గ్రీన్ బఫర్ జోన్ సృష్టించడం జరిగింది.
- ఎసికె. శ్రీహరి,
ఎ : 9849930145