రాజుల సొమ్ము రాళ్ల పాలు’’ అయితే కావొచ్చు గాక నష్టమేముంది? ఒక తాజ్‍మహల్, ఒక కోణార్క, ఒక హంపీ, ఒక రామప్ప మనకు దక్కింది కదా!
ఆ వరుసలోనే హైద్రాబాదీలకు దక్కింది ఫలక్‍నుమా ప్యాలెస్. చార్మినార్ నుండి చాంద్రాయణగుట్టకు సీదాగా ప్రయాణిస్తుంటే ఒక మలుపులో కుడి వైపు గుట్టమీద వెలసిన పాలరాతి వెన్నెల భవనమే ఫలక్‍నుమా.
ఉర్దూలో ఫలక్ అంటే ఆకాశం, నుమా అంటే ప్రతిబింబం. ఆ అందమైన భవనం గురించి అందంగా చెప్పాలంటే ‘‘ఆకాశ హర్శ్యం’’ అన్నమాట.
అందమైన, అపురూపమైన భవనాలు, ఉద్యానవనాలు, కోటల నిర్మాణంలో ‘‘షాజహాన్’’ కు ఎలా పిచ్చి ఉండేదో సరిగ్గా అలాంటి పిచ్చి ఆరవ నిజాం వద్ద దివాన్‍గ పనిచేసిన వికారుల్ ఉమ్రాకు కూడా ఉండేది. ఈయన పేరుతోనే ఈయన స్వంత జాగీరు ప్రాంతానికి ‘‘వికారాబాద్’’ అని పేరు వచ్చింది. హైద్రాబాద్ నగరంలో అనేక భవనాలు నిర్మించి వికారుల్ ఉమ్రా చివరికి ‘‘దివాలా’’ తీశాడు. అయితేనేం మనకు మాత్రం ఫలక్‍నుమా మిగిలింది.
ఫలక్‍నుమా నిర్మించకముందు ఆ గుట్ట పేరు ‘‘కొహెతూర్’’. దాని మీద ‘‘బీబీ కా చష్మా’’ ఉండేది. ప్రవక్త మహమ్మదు కూతురు పేర అది అక్కడ వెలిసింది. దానిని దర్శించి మొక్కుకున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మేవారు. ప్రతి ఏటా అక్కడ ఉర్సు జరిగేది. ఒకసారి వికారుల్ ఉమ్రా ఆ ఉత్సవానికి హాజరైనప్పుడు ఈగుట్టపై నుండి హైద్రాబాద్ నగర సౌందర్యాన్ని తిలకించి పులకించి అక్కడే ఒక హర్శ్యాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఫలక్‍నుమా సృష్టి అలా 1880లో ప్రారంభమైంది. ఆయన నిర్మించిన భవనాలలో ఇది శీర్ష మాణిక్యం. ఈ భవనం అంతర్జాతీయ అత్యున్నత ప్రమాణాలకు దీటుగా నిలబడింది. మొత్తం పాలరాతిని ఇటలీలోని టస్కనీ, మిలాన్ గనుల నుండి తెప్పించారు. నైపుణ్యం కలిగిన భవన నిర్మాణ కార్మికులను ఫ్లారెన్స్ నుండి రప్పించారు. మర్దానా (పురుషులు) జనానా (స్త్రీలు) లకు సంబంధించిన గదులన్నీ పాశ్చత్యశైలిలో నిర్మించారు. ఫర్నీచర్, అలంకరణ వస్తువులన్నీంటినీ యూరప్‍లోని దేశవిదేశాల నుండి దిగుమతి చేసుకున్నారు. కుర్చీలు, సోఫాల్లాంటి వన్నీ ఫ్రాన్స్ దేశం నుండి వచ్చిన వడ్రంగులు ఇక్కడే తయారు చేశారు. ఫ్రెంచి తరహా విశాలమైన దర్వాజాలు, కిటికీలను కూడా వారే నిర్మించారు. ఏ దిశలో ఏ కిటికి నుండి చూసినా నగర సౌందర్యం కళ్లకు విందులు చేసేది. భవనం వాస్తు శిల్పశైలిలో ఇంగ్లాండు, జర్మనీ, ఫ్రాన్స్ల నైపుణ్యాన్ని, నగిషీ పనితనాన్ని మేళవించి నూతన పద్దతులను ఆవిష్కరించారు. రోజ్ ఉడ్‍తో చేసిన డైనింగ్ టేబుళ్లు ఎంతో విశాలంగా, పొడవుగా ఉండేవి. ఒక మూలన కూచున్న వారికి మరో మూలన కూచ్చున్నవారు కనబడేవారు కాదు. పాత్రలు, గ్లాసులు, పళ్లాలు, చెమ్చాలన్నీ వెండి బంగారాలవే. సొగసైన మధ్యపాన చషకాలన్నీ బెల్జియం, చైనాల నుండి తెప్పించారు. ఫ్రెంచి, షాంపెయిన్, స్కాచ్ విస్కీలు తప్ప దేశవాళీ మద్యాలు మచ్చుకైనా కనబడేవి కాదు.
భవన నిర్మాణం పూర్తికాగానే సర్ వికారుల్ ఉమ్రా ఇచ్చిన ఆతిధ్యాలకు అంతే లేదు. ‘‘రాత్ కో ఖావో, పియో. దిన్ మే ఆరాం కరో’’ అన్నట్లు గానా బజానాలు, విందు భోజనాలు నిరంతరాయంగా కొనసాగాయి. ఈ భూమ్మీద వెలసిన ఇంధ్రభవనంలా ‘‘ఆకాశానికి అద్దంలా’’ కళకళా మెరిసిపోయింది. దేశవిదేశీయులు, మహారాజులు, ఉన్నతవంశాల వారు, అధికారగణం అందరూ అతిథ్యం పొందారు. అవన్నీ ‘‘యాద్‍గార్ మహెఫిల్’’లుగా నిలిచిపోయినాయి.
1895 వేసవికాలంలో ఆరవ నిజాం నవాబు మహబూబ్ అలీ పాషా బీబీకా చష్మా చూడటానికి వచ్చి తన కుటుంబ సపరివారంగా ‘‘జనానా’’తో సహ ఫలక్‍నుమా ప్యాలెస్‍లో విశ్రాంతి కోసం విడిది చేశారు. ఆ ఆకాశహర్శ్యం ఇచ్చిన ఆనందానికి తూలి, సోలిపోయి రోజుల్ని మరిచిపోయి ఒక నెలరోజులు అక్కడే గడిపాడు. వికారుల్
ఉమ్రా నవాబుకి అధికారిక హోదాలో దివాన్ మాత్రమే గాక స్వయంగా బావమరిది కూడా! నవాబు భార్య వికారుల్ ఉమ్రాకు స్వంత చెల్లెలు ఫలక్‍నుమా ప్యాలెస్‍లో నెలరోజుల్నుండి తన్మయత్వాన్ని అనుభవిస్తున్న నవాబును వికారుల్ ఉమ్రా ఒకరోజు కలుసుకుని, వంగి వంగి మూడుసార్లు సలాములు చేసి జహాఁపనా! ‘‘ఈ స్వర్గాన్ని తమరి కోసమే నిర్మించాను’’ అని సవినయంగా విన్నవించుకున్నాడు. ఆ మాట విన్న నవాబు చిర్నవ్వులు చిందించారు. ఇచ్చిన మాట వెనకకు తీసుకోక ఆ మధ్యాహ్నమే వికారుల్ ఉమ్రా కట్టుబట్టలతో కుటుంబసభ్యులతో తన అందమైన కల ‘‘ఫలక్‍నుమా ప్యాలెస్’’ ను వదిలి నగరానికి చేరుకున్నాడు. ఆ తర్వాత కొన్ని నెలలకు నవాబుకి, దివాన్‍కి మధ్యన ఒక అమ్మక ఒప్పందం జరిగింది. అతి తక్కువ ధరకు నవాబు దానిని ఖరీదు చేశారు. అంత పెద్ద ధనికుడైన నవాబు దాని విలువను ఒకేసారి కాకుండా నెలసరి వాయిదాల పద్ధతిలో చెల్లించాడు.

వికారుల్ ఉమ్రా అప్పటికే అప్పులలో తల నిండా మునిగి ఉన్నాడు. అప్పుచేసి పప్పుకూడు తిన్నట్లు అందరి దగ్గరా అప్పులు చేసి నగరంలో వికార్‍మంజిల్, స్పానిష్ మసీద్ లాంటి అందమైన భవనాలు నిర్మించటం దానధర్మాలు చేయటం వలన అతని సంవత్సర ఆదాయం పదకొండు లక్షలు కాగా చెల్లించవలసిన అప్పులు 18 లక్షలని అందరూ అతని వెనుక గుసగుసలాడుతూ నవ్వుకోసాగారు.
ఆ ‘‘షాజహాన్ ఆఫ్ హైద్రాబాద్’’ అనేకానేక అప్పుల బాధతో చిన్న వయస్సులో 48 సంవత్సరాలకే చనిపోయాడు. పున్నమి వెన్నెల రాత్రులందు అతని ఆత్మ ఫలక్‍నుమా ప్యాలెస్ దరిదాపులలో తిరుగుతుంటే తాము చూసినట్లుగా స్థానికులు కథలు కథలుగా చెప్పుకుంటారు. ఉత్తమోత్తమైన వస్తుసంపద, కనులు మిరుమిట్లు గొల్పే కళాఖండాలు నిజాం నవాబులు కొల్లగొట్టి తీసుకువచ్చినవే.
ఉదాహరణకు 1801-1802 మైసూరు యుద్ధాలలో టిప్పుసుల్తాన్‍కు వ్యతిరేకంగా రెండవ నిజాం బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చి ఆ యుద్ధంలో పాల్గొన్నాడు. టిప్పుసుల్తాన్ ఓడిపోగానే నిజాంసైన్యం శ్రీరంగపట్నాన్ని దోచుకుని వెండి బంగారాలను, వజ్రవైఢూర్యాలను, మణులు, రత్నాలు పొదిగిన ఖడ్గాలను హైద్రాబాద్‍కు తరలించారు.
హైదరాబాద్‍లో గాలిబ్ జంగ్ అనే జాగిర్దార్ ఉండేవాడు. నిజాం ఇతనికి గాలిబ్ ఉల్ ముల్క్ బిరుదును ప్రసాదించాడు. ఇతనికి జంటనగరాలలో ఉన్న జాగాలన్నీ కలిపితే ఏడువేల ఎకరాలు ఉండేవి. ఇతను నిజాంను ఆదర్శంగా తీసుకుని అనేక కళాఖండాలను సేకరించాడు. చాపల్యం మితిమీరి దివాన్ సర్ సాలార్‍జంగ్ నివాసం కన్నా గొప్పదైన భవనాన్ని నిర్మించేసరికి నిజాంకు కన్నుకుట్టి తన రాకపోకలకు అడ్డుగా ఉందని గృహప్రవేశం అయిన మరునాడే దానిని కూల్చివేశాడు. భీతి చెందిన గాలిబ్ జంగ్ నిజాంను సంతోషపెట్టటానికి 1898లో ముసల్లం జంగ్ పూల్‍ను నిర్మించాడు. (సిటీ కాలేజ్ దగ్గర) నిజాం ఆక్రమిస్తాడన్న భయంతో తన సంపదనంతా లండన్‍లోని బ్యాంకుకు రహస్యంగా తరలించాడు. ఇప్పటికీ అతని వారసులు ఆ సంపద కోసం కోర్టులలో కొట్లాడుతూనే ఉన్నారు. 1948లో పోలీసు యాక్షన్ జరిగాక కొత్త ప్రభుత్వం కొన్ని జాగలను వారసులకు అప్పగించారు. అందులో ఒక జాగీరే ‘‘భర్కత్‍పురా’’.
1948 పోలీస్ యాక్షన్ తర్వాత నిజాం వద్ద పనిచేసే సేవకులు, ఉద్యోగులు ‘‘గధే కో క్యా మాలుం జాఫ్రాన్ కా ఖుష్బూ’’ అన్నట్లు విలువైన వస్తు సంపదలను దొంగతనంగా మార్వాడీ వ్యాపారులకు చవకగా అమ్మేసారు. వారు వాటిని విదేశాలకు ఎగుమతి చేసి కోట్లు గడించారు. పాపపు సొమ్ము చివరికి పరుల పాలయ్యింది.
ఈ మధ్య ఫలక్‍నుమా ప్యాలెస్‍ను నిజాం వారసులు తాజ్‍గ్రూప్ ఆఫ్ హోటల్స్ వారికి లీజుకు ఇచ్చారు. ఇప్పుడది కోటీశ్వరులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఒకరోజు అందులో బస చేయాలంటే లక్షలు గుమ్మరించాలి. చైనా, యూరప్ దేశాలలో అనేక రాజభవనాలను ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రజల సందర్శనార్ధం మ్యూజియంలుగా మార్చారు. బీజింగ్‍లో ఫార్భిడన్ ప్యాలెస్, ఫ్రాన్స్లో వర్సైల్స్ ప్యాలెస్ ఒక ఉదాహరణ.
సందర్బానుసారంగా ఒక సంగతి. ఈ వ్యాసరచయిత చైనా సంచరిస్తూ 1758లో క్వింగ్ వంశపురాజు నిర్మించిన ఒక ప్యాలెస్‍ను దర్శించాడు. శ్రామికులు చెమట చుక్కలతో నిర్మించిన ఆ ప్యాలెస్ ఇపుడు ప్రజలు సందర్శించే ఒక మ్యూజియం. దాని ప్రవేశద్వారం వద్ద ఒక ప్రకటన ఇట్లా ఉంది.
‘‘చరిత్రలోకి తొంగిచూస్తే జయాపజయాలు కనబడతాయి. అయినా మనం కాలం చెప్పే కతలను అతిశ్రద్దగా వినాలి. ఈ చరిత్ర ఖజానాను మేం మీ కోసం, మీ పిల్లల కోసమే గాక వారి పిల్లల పిల్లల కోసం కూడా అందించటానికే ఈ మ్యూజియంను ఏర్పాటు చేశాం’’.
మరి మనం ఈ ఫలక్‍నుమా ప్యాలెస్‍ను మన పిల్లల పిల్లల కోసం ఒక మ్యూజియంగా మార్చి అపురూపమైన, అరుదైన కానుకగా వారికి అందించలేమా?
(షహర్ నామా (హైద్రాబాద్ వీధులు – గాథలు) పుస్తకం నుంచి)
-పరవస్తు లోకేశ్వర్, ఎ: 91606 80847