సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం


సిరి ధాన్యాలు (Millets) ఎందుకు తినాలి?
ఇవి మన జీవితంలో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎలా నింపుతాయి?


ప్రఖ్యాత శాస్త్రవేత్త, ఆరోగ్య, ఆహార నిపుణులు డాక్టర్‍ ఖాదర్‍ అవిరామ కృషి ద్వారా, మన ముందు తరాలు ఆహారంగా తిన్న ఈ అద్భుత ఆహార ధాన్యాలు – ‘సిరి ధాన్యాలు’ తిరిగి వెలుగులోకి వచ్చాయి. ఈనాటి ఆధునిక రోగాల నివారణ, నిర్మూలనలో కూడా ఈ ‘సిరిధాన్యాలు’ ఎలా కీలక పాత్ర వహిస్తాయో డాక్టర్‍ ఖాదర్‍ ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఇది మనకూ, మన ముందు తరాల వారికీ, మన భూములకూ, మన వాతావరణానికి, మన ఆరోగ్యాలకూ ఒక వరం. ప్రపంచానికే మార్గదర్శక అద్భుత ఆహారంగా తిరిగి పరిచయం అవుతున్నాయి ఈ సిరి ధాన్యాలు.


సిరి ధాన్యాలు ఎందుకు తినాలి – అన్న విషయాన్ని శాస్త్రీయంగా, క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ నాటి వరి గోధుమలలో ఎన్నో మార్పులు జరిగాయి. తరతరాల సంకరం తర్వాత వరి, గోధుమ పంటల్లో పీచు పదార్థం అంటే ఫైబర్‍ కూడా తక్కువయి పోయింది. ఎరువులూ, పురుగు మందులూ లేని వరి అన్నం, గోధుమలూ కరువయ్యాయి. వాటికి తోడు విష పూరితమైన కలుపు మందుల వాడకం కూడా పెరిగి పోయింది.


మన ఆహారంలో ఉన్న సహజ పీచు పదార్థమే (DIETARY ఫైబర్‍) మన ఆహారం నుండి రక్తంలోకి గ్లూకోజ్‍ విడుదల జరిగే పక్రియను నియంత్రిస్తుంది. ఒకే సారిగా అధిక మొత్తంలో గ్లూకోజ్‍ను విడుదల చేయాలా, లేదా చిన్న మొత్తాలలో కొద్దిగంటల పాటు విడుదల చేయాలా అనేది ఆహారపు ధాన్యంలో ఇమిడి ఉన్న పీచు పదార్థమే నిర్ణయిస్తుంది.


ప్రస్తుతం వరి, గోధుమ ఆహార పదార్థాలలో పీచు పదార్థం. 0.25 శాతం – 05%కి తగ్గిపోయింది. అందుకే ఇవి తిన్న 15 నుండి 35 నిమిషాలలో గ్లూకోజ్‍గా (చక్కెరగా – అంటే జీర్ణమైన ఆహారానికి చివరి స్థితిగా) మారిపోయి, 100 గ్రాముల ఆహారం తింటే 70 గ్రాముల గ్లూకోజ్‍ (చక్కెర)గా ‘ఒక్కసారిగా’ రక్తంలోకి వచ్చి చేరుతోంది. ఇలా రోజుకి మూడు, నాలుగు సార్లు జరిగితే? వీటికి తోడుగా స్వీట్లు తింటే..? బిస్కెట్‍లో, బర్గర్‍, పిజ్జాలో, మైదాతో చేసిన నాను రొట్టెలో కూడా తోడైతే? అధిక మొత్తాలలో గ్లూకోజు ఒకేసారిగా రక్తంలోకి చేరుకొని చేటు చేస్తుంది. కొవ్వు పెంచుతుంది. చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళని కష్టపెడ్తుంది. అనేక రోగాలకూ దారి తీస్తుంది.


మైదాతో చేసిన పదార్థాలు మరీ ఘోరంగా 10 నిమిషాలలో గ్లూకోజ్‍గా మారి రక్తంలో కలుస్తాయి. మైదా తయారీలో వాడే రసాయనాలు కూడా మన క్లోమ గ్రంధికి ఎంతో హానికరం.


సాధారణంగా మన దేహంలోని రక్తం (మొత్తం 4 నుండి 5 లీటర్లే)లో ఉండే గ్లూకోజ్‍ 6 నుండి 7 గ్రాములే. ఆహారం తిన్న తరువాత అది జీర్ణమై, చివరిగా గ్లూకోజ్‍గా మారి, రక్తంలోకి గ్లూకోజ్‍ రావటం దేహమంతా సరఫరా అవటం మామూలే. కానీ ఒక్కసారిగా 10నిమిషాల్లో లేదా 30-40 నిమిషాలలో అధిక మొత్తంలో రావటం ఎవరి ఆరోగ్యానికీ మంచిది కాదు. పెద్దలకూ, మధుమేహం ఉన్న వారికీ, ఇతర రోగగ్రస్తులకూ (మలబద్దకం, ఫిట్స్ మొలలు, మూలశంక, ట్రైగ్లిసరైడ్స్, అధిక రక్తపీడనం అంటే బీపీ, మూత్రపిండాల రోగులు, హృద్రోగులు వగైరా అందరికీ) మరింత చేటు. అందుకే పీచు తక్కువగా ఉన్న లేదా పీచు అసలు లేని మైదా వంటి వాటిని దూరం పెట్టాలి. సిరి ధాన్యాలు అలవాటు చేసుకోవాలి. ఇవి 5 నుండి 7 గంటల పాటు కొద్ది కొద్దిగా చిన్న మొత్తాలలో గ్లూకోస్‍ రక్తంలోకి వదులుతుంటాయి.
కొర్ర బియ్యం, అరిక బియ్యం, ఊద బియ్యం, సామె బియ్యం, అండు కొర్ర బియ్యం 8 నుండి 12 శాతం పీచు పదార్థం (ఫైబర్‍) కలిగినవి. పూర్తిగా సేంద్రియమైనవి. ఈ ఐదూ ‘పంచ రత్న సిరి ధాన్యాలుగా’ ‘పాలిష్‍ చేయబడనివి’ మరింత శ్రేష్ఠమైనవి.


వీటితో అన్నం వండుకోవచ్చు, రొట్టెలు చేసుకోవచ్చు, ఉప్మా, పొంగల్‍, ఇడ్లీ, దోస, బిరియాని, బిసిబేళ్లబాత్‍ కూడా చేసుకోవచ్చు.


సిరిధాన్యాల విశిష్టత:
సిరిధాన్యాల గొప్పదనం అధికంగా ఫైబర్‍ కలిగి ఉండటం మాత్రమే అని అనుకోవద్దు. అసలు అధికం అనే మాట ఇక్కడ సరైనది కాదు. సమతుల్యంగా, ఆహారంలోనే ఇమిడి ఉన్న సహజమైన M ఫైబర్‍ కలిగి ఉండటం వాటి ప్రత్యేకత. మూడు పూటలా తిన్నప్పుడు, ఆ రోజుకు మనిషికి అవసరమైన 25-30 గ్రాముల ఫైబర్‍ (ప్రతీ మానవుడికి రోజుకు 38 గ్రాముల ఫైబర్‍ కావాలి) ఈ ధాన్యాల నుండే లభిస్తుంది. తక్కిన 10 గ్రాములూ కూరగాయల నుండి, ఆకుల కూరల నుండి పొందవచ్చు.
ఒక్కొక్క సిరిధాన్యమూ కొన్ని రకాల దేహపు అవసరాలనూ, ప్రత్యేకమైన రోగనిర్మూలన శక్తినీ కలిగి ఉన్నాయి.
వరి, గోధుమలలో పీచు పదార్థం / ఫైబర్‍ 0.2 నుండి 1.2 వరకూ ఉన్నప్పటికీ, అది ధాన్యపు పై పొరలలోనే ఉండబట్టి పాలిష్‍ చేస్తే పోతోంది. కానీ సిరిధాన్యాలతో పీచుపదార్థం లేదా ఫైబర్‍ ధాన్యపు కేంద్రం నుండి బయటి వరకూ, పిండిపదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల మనకు ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తి దోహదం చేస్తాయి. ఇది తెలుసుకుంటే మన ఆరోగ్యాలను కాపాడుకోవటంలో సులువు మనకు తెలిసినట్లే.

ఉదాహరణకి కొర్ర బియ్యం – సమతుల్యమైన ఆహారం. 8శాతం ఫైబర్‍తో పాటు, 12శాతం ప్రోటీను కూడా కలిగి ఉంది. గర్భిణీ స్త్రీలకూ సరైన ఆహారంగా సూచించవచ్చు. కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్ధకాన్ని కూడా పోగొట్టే సరైన ధాన్యమిది. పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినపుడు మూర్చలు వస్తాయి. అవి శాశ్వతంగా నిలుస్తూ ఉంటాయి కొన్నేళ్లు. వాటిని పోగొట్టగలిగే లక్షణం, నరాల సంబంధమైన weakness, convulsionsలకు సరైన ఆహారం కొర్రబియ్యం. కొన్ని రకాల చర్మ రోగాలను పారదోలేందుకు, నోటి క్యాన్సర్‍, ఊపిరి తిత్తుల క్యాన్సర్‍, ఉదర క్యాన్సర్‍ పార్కిన్సన్‍, రోగం, ఆస్త్మను (అరికెలతో పాటుగా) నివారించడంలో కూడా కొర్రబియ్యం దోహదపడుతుంది.


మీకు తెలుసా పాశ్చాత్య దేశాల్లో, వారి ఆహారంలో ఫైబర్‍ లేదని గ్రహించి, 2-3 ఫైబర్‍ టాబ్లెట్‍లను నీటిలో వేసుకుని సేవిస్తూ ఉంటారు. అది శాస్త్రీయమైనది కాదు, సహజంగా ఆహారంలోనే ఫైబర్‍ ఇమిడి ఉండటం మాత్రమే రక్తంలో గ్లూకోజు విడుదలని సమర్ధవంతంగా నియంత్రించగలదు. ఇలాగే అరికలు బియ్యం – రక్త శుద్ధికీ, ఎముకల మజ్జ మరింత సమర్థవంతంగా పనిచేసేలా చూసేందుకూ, ఆస్తమా వ్యాధి, మూత్ర పిండ, ప్రోస్ట్పేటు, రక్త క్యాన్సర్‍, ప్రేగుల, థైరాయిడ్‍, గొంతు, క్లోమ గ్రంధుల, కాలేయపు క్యాన్సర్లు తగ్గించుకోవడానికి, అధికంగా చక్కర వ్యాధి కలిగి కాలికి దెబ్బ తాకి, గాంగ్రీను వైపు వెళ్లిన వారికి కూడా అరికలు ఎంతో మేలు చేస్తాయి. డెంగ్యూ జ్వరం, టైఫాయిడ్‍ జ్వరం, వైరస్‍ జ్వరం వగైరాల తర్వాత నీరసించిన వారి రక్త శుద్ధి చేసి చైతన్య వంతుల్ని చేస్తాయి అరికలు.
సామె బియ్యం మగ, ఆడ వారి పునరుత్పత్తి మండలంలోని వ్యాధులు బాగు చేస్తాయి. ఆడవారిలో PCOd తగ్గించుకోవచ్చు. మగ వారిలో వీర్యకణాల సంఖ్యా పెరుగుతుంది. ఇవి కాక మానవుడి లింపు మండలపు శుద్ధికి, మెదడు, గొంతు, రక్త క్యాన్సర్‍, థైరాయిడ్‍, క్లోమ గ్రంధుల క్యాన్సర్లకూ కూడా సామెలు ఎంతో పనికి వస్తాయి.


ఊద బియ్యం థైరాయిడ్‍, క్లోమ గ్రంధులకు మంచివి. చక్కెర వ్యాధిని పారదోలుతాయి. కాలేయం మూత్రాశయం, గాల్‍ బ్లాండరు శుద్ధికి కూడా ఇవి పని చేస్తాయి. కామెర్లను తగ్గించడానికి, వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. కాలేయపు, గర్భాశయపు క్యాన్సర్‍లను తగ్గించుకోవడానికి కూడా పనిచేస్తాయి.
అండు కొర్ర బియ్యం – జీర్ణ మండలంలోని కష్టాలను తీసివేస్తాయి. మొలలూ, భగన్దరం, మూల శంక, Fissures అల్సర్లు, మెదడు, రక్త, స్తనాల, ఎముకల, ఉదర, ప్రేగుల, చర్మ సంబంధమైన క్యాన్సర్లు మొదలైన కష్టాలను పోగొట్టడంలో తమ పాత్రను అద్భుతంగా పోషిస్తాయి.


మధుమేహానికి బానిసలు కానక్కర లేదు : ఆరోగ్యాన్ని కాపాడుకోండి!

నేడు భారతదేశంలో 7 నుండి 10 కోట్ల ప్రజలకు Diabetes-2 సోకింది. (కొందరు నిపుణులు దీనికి రెండింతల సంఖ్యను చెప్తారు. ఫ్రీ Diabeteని కూడా చేర్చి) వీరంతా నెల నెల మందులకు ఎంత ఖర్చు పెడుతున్నారో ఊహించండి. కాల క్రమేణా మందులు దాటి ఇన్సులిన్‍ ఇంజక్షన్ల వైపు, ఇంకా అది దాటి కిడ్నీ సంబంధ సర్జరీలకు లక్షల రూపాయల ఖర్చు చేయాల్సి వస్తుంది. (తరువాయి వచ్చే సంచికలో)

-ప్రఖ్యాత స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య, ఆహార నిపుణులు
డా।। ఖాదర్‍ వలి రచించిన
‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం’ నుంచి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *