కళ్యాణచాళుక్య యువరాజు మూడోతైలపుని జడ్చర్ల జినశాసనం (క్రీ.శ.1127)
జడ్చర్ల. అదొక కూడలి. హైదరాబాదు, రాయచూరు, కర్నూలు, శ్రీశైలం, కొల్లాపూర్ ఇలా ఎన్నో ఊళ్లకు వెళ్లే మార్గాల కూడలి. అంతేకాదు. అటు శైవ, వైష్ణవ, జైన మతాల కూడలి కూడ ప్రక్కనే ఉన్న గంగాపురంలో మతాల మధ్య సామరస్యాన్ని నింపిన పంచాయతన దేవాలయం, జైనతీర్థంకరునికి ఆచ్ఛాదన కల్పించిన ఇటుకరాతి జైన దేవాలయం, తొలిమధ్య, చాళుక్య, రాష్ట్ర కూటకాలపు శైవ-వైష్ణవ -శాక్త స్థావరం మీనాంబరం, కందూరిచోళుల తొలి, మలి రాజధానులైన కోడూరు, కందూరులకు నడుమనున్న ప్రదేశం, గోనవంశీయుల రాజధాని వర్ధమానపురానికి చేరువలో నున్న పట్టణం జడ్చర్ల. జడ చెరువుల – నీళ్లు ఎప్పుడూ నిలకడగా ఉండే చెరువు గల ఊరు గాబట్టి ఆ వూరుకు ఆ పేరొచ్చింది. అక్కడ కూడా శైవ, వైష్ణవ, జైన ఆలయాలున్నాయి.
అలా విలసిల్లిన ధార్మిక కార్యకలాపాల జడ్చర్ల పంచాయితీ ఆఫీసులో ఒక శాసనం ఒక మూలన విసిరేసినట్టుగా ఉంది. జడ్చర్ల – బాదేపల్లి మధ్య ఒక కల్వర్డు నిర్మించటానికి తవ్వుతుండగా 1971లో బయల్పడిన ఈ శాసనాన్ని స్థానికులు పంచాయితీ ఆఫీసుకు చేర్చి చరిత్రకు చేయూత నిచ్చారు. ఆ శాసన ప్రాముఖ్యతను గుర్తించిన అప్పటి రాష్ట్ర పురావస్తుశాఖ 1973లో ఒకసారి (శాసన నకలు సంఖ్య 3), 1974లో మరోసారి (నకలు సంఖ్య 92) ముద్రలు ఒత్తించి, శాసన పాఠాన్ని చదివారు. మరిన్ని వివరాలకు, ఎపిగ్రాఫియా ఆంధ్రికా, వా.4, బి.యన్. శాస్త్రిగారి మహబూబ్‍నగర్ జిల్లా సర్వస్వంలో శాసనసంఖ్య 139, పే.1137-39; ఎన్నెస్ రామచంద్రమూర్తి (సం) ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఆంధప్రదేశ్, మహబూబ్‍నగర్ డిస్ట్రిక్టు, వా.1, పే.257-59; డా. జి. జవహర్లాల్, స్టడీస్ ఇన్ జైనిజం, యాజ్‍గ్లీన్డ్ ఫ్రం ఆర్కియోలజికల్ సోర్సెస్, జైన్ పౌండేషన్, రాజమండ్రి, 2006, పే.86-90 విరువంటి గోపాలకృష్ణ, కొలనుపాక దేవాలయాలు, ఆలేరు, 2006 లను సంప్రదించొచ్చు.
ఈ శాసన ప్రాశస్త్యం చాలా ఉంది. ఇది కన్నడ భాషలో, తెలుగు-కన్నడ లిపిలో ఉంది. రాజులు కన్నడిగులు కాబట్టి భాష కన్నడం. లిపి, కళ్యాణ చాళుక్య ఏలుబడిలో నున్న కన్నడ- తెలుగునాడుల్లో అమలులో నున్న కన్నడ- తెలుగులిపి. కళ్యాణ చాళుక్య చక్రవర్తి ‘భూలోకమల్ల’ బిరుదాంకితుడైన మూడో సోమేశ్వరుని కాలంలో, కందూరునాడు (జడ్చర్ల కందూరునాడులో భాగం)ను పాలిస్తున్న యువరాజు తైలపుడు విడుదల చేసిన శాసనం.
ఈ సందర్భంగా తెలంగాణలో జైనమతానికి లభించిన ఆదరణ, వ్యాప్తి గురించి చెప్పుకోవాలి. రాష్ట్ర కూటుల కాలంలో వేళ్లూనుకొన్న జైనం, కళ్యాణచాళుక్యుల కాలంలో విలసిల్లింది. వారి రెండో రాజధాని అయిన పొట్లకెరె (పటాన్‍చెరు- పట్టణ చెరువు) గొప్ప జైన కేంద్రం. అక్కడ 500ల జైనబసదులుండేవని అక్కడ దొరికిన తీర్థంకర శిల్పాలు, శాసనాల వల్ల చెప్పొచ్చు.
కళ్యాణచాళుక్య జగదేకమల్లుడు, త్రైలోక్యమల్లుల కాలంలో పటాన్‍చెరు, చిలుకూరులలో జైనాలయాలు, బసదులు ఒక వెలుగు వెలిగాయి. త్రిభువనమల్ల ఆరో విక్రమాదిత్యుని క్రీ.శ.1076-1126 కాలంలో రాజకుటుంబీకులే కాక, మంత్రులు, సామంతులు, ఉన్నతోద్యోగులు, సైనికులు కూడా జైనాన్ని స్వీకరించి, ఆదరించారు. బోధన్, కొలనుపాక, ఉజ్జిలి, పూడూరు, వర్ధమానపురం, బైరాన్‍పల్లి, గొబ్బూరు, హనుమకొండ, బానాజీపేట, తొగరకుంటలు జైన కేంద్రాలుగా జైనమత వ్యాప్తికి తోడ్పడినాయి.
భువనైకమల్ల సోమేశ్వరుని (క్రీ.శ.1068-75) కాలంలో సిరూరు, సైదాపురం శాసనాల్లో పేర్కొనబడిన ప్రాణాచార్య బిరుదాంకితుడైన అగ్గలయ్య ప్రముఖ జైనాచార్యుడే కాక అస్త్ర శస్త్ర విద్యలో నిపుణుడైన వైద్యుడు కూడ. ఇక భూలోకమల్ల మూడో సోమేశ్వరుడు (క్రీ.శ.1126-1138) సర్వజ్ఞచక్రవర్తి బిరుదును ధరించిన పండితుడు, కవి, మానసోల్లాసమనే అభిలషితార్థ చింతామణి గ్రంధాన్ని రాశాడు. ఇది విజ్ఞానం సర్వస్వం. ఇతడు, ఇతని కుమారుడైన మూడో తైలపుడు జైన మతానికి జైనాచార్యులకు చేయూత నిచ్చారు.
జిన ధర్మాన్ని ఆచరించి, వ్యాప్తికి జిన సంఘాలు ప్రధాన పాత్ర పోషించాయి. వీటిలో ముఖ్యమైనది మూల సంఘం. దీని స్థాపకుడు మహావీరుడు. మూల సంఘంలో జైనమునులు, ఉపాసకులు సభ్యులు. జైన సంఘంలో యతులు, అజ్జికలు లేక సాధ్వీమణులు, శ్రావకులు (అనుచర ఉపాసకులు), శ్రావికలు (ఉపాసికలు) అనే నాలుగు వర్గాలున్నాయి. మూల సంఘం, సేన, నంది, దేవ, సింహ అనే ఉప సంఘాలుండేవి. వాటి ఆచార్యుల పేర్ల చివర ఆయా పేర్లుండేవి. మళ్లీ ఈ జైన సంఘంలో గల అనేక విభాగాల్లో గణ, గచ్ఛ, అన్వయ, బలి అనేవి శాసనాల ద్వారా తెలిశాయి. గణాల్లో కవురూరు, కానూరు, బలాత్కార, కాలుమిళుప, దేశిగణాలు ముఖ్యమైనవి. వీటికి పెద్ద ఆచార్యుడు. ఆయన జ్ఞాన, దర్శన, చరిత్ర, తపో, వీర్య గుణ సంపన్నుడై ఉండాలని ఆచార్య బి.ఎస్.ఎల్ హనుమంతరావుగారు ఆంధ్రదేశం మతపరిణామాలు, (గుంటూరు, 2005, పే. 34) అన్న పుస్తకంలో పేర్కొన్నారు. గణంలో విభాగమే గచ్ఛ. సరస్వతీగచ్ఛ, నందిగచ్ఛ, పుస్తకగచ్ఛ, అడ్డకలిగచ్ఛ, మేషపాషాణ గచ్ఛలు, కళ్యాణ చాళుక్య కాలంలో ప్రచారంలో ఉన్నాయి. గణ లో మరో విభాగం బలి. బలితో పాటు ‘కులం’ (ఇప్పటి వృత్తికులాలు కాదు) ఉండేది. సల్లేఖనాది వ్రతాల నాచరించటానికి ఈ కులం అనుమతి తప్పనిసరి.
ఇంతకు ముందు పేర్కొన మూల సంఘం, దాని విభాగమైన మేషపాషాణ గచ్ఛకు ఆచార్యుడే ఈ జడ్చర్ల శాసనంలో పేర్కొన్న మేఘచంద్ర (భట్టారక) సిద్ధాంత దేవుడు.
శాసన పాఠం
- శ్రీమత్పరమ గంభీరస్య – దామో మలాతు నంజియా
- త్రైలోక్య నాధస్య సాసనం జిన సాసనం ।। స్వస్తి సమస్త భువనాశ్రయం శ్రీ
- ప్రిథ్వీ వల్లభ మహారాజాధిరాజం పరమేశ్వరం పరమ భట్టారకం సత్యాశ్రయ కుళతి
- ళకం చాళుక్యాభరణం శ్రీమత్సర్వ జ్ఞా చక్రవత్తి భూలోకమల్ల దేవర విజయరాజ్యముత్త
- రోత్తరాభివ్రిద్ధి ప్రవద్ధమాన మాచంద్రాక్క తార(ం) బరం కల్యాణ పురదనె వె వీడి మోళు
- సుఖ స(ం) ఖధా వినేదదిం రాజ్యంగె యుత్తమిరె ।। ఆవిభువిన రమ్మధాత్రి విశ్రుత కీ
- త్తివ నెగళ్ద యువరాజ శౌయ్య వష్టంబదె తైలపదేవ పాళి సిదన సేయ కంన్దూర నాడం।।
- శ్రీ జిన శాసన దోళ్నయ బీజస్య ద్వాదవాడలక్షం భవ్యాం భోజాత భా
- నుకల్ప రాజసిపడు మూల సంఘము వ్వీ వినుత ।। ఆణగళ్ద మూలసం
- ఘద కానూగ్గ ణ దల్లి మేషపాషాణ ఖిఖ్యన ప్రసిద్ధ గచ్ఛదో
- ళా నందిత సకల భవ్య రభిజిన సేవ్యవె ।। సుచరిత్ర పవిత్ర స్యా ప్రఛం
- ద్రింకా విద కీత్తి కాస్త వ్భవ్య ప్రచయ ప్రస్తుడవేన మేఘచంద్ర భట్టారక
- భ్రాతి శణ్న గట్టిర్ ।। క్షితిపాళ మౌళి మణిదీధి తియంణప్పట్ట తైలరాజేంద్ర
- పదావ్రిత రేని సినెగళ్ద వెళెయీ శ్నృత వాక్యగ్గ వఱెగళు పరాత్థీ చరిత్రర్ ।।
- స్వస్తి సమస్త భువన విఖ్యాత పంచశత వీరశాసన లబ్దానేక గుణగణాంళం కృ
- తసత్య శౌచాచార చారు చారిత్ర నయ వినయ వింజ్ఞాన వీర బళంజ ధమ్మ ప్రతి
- పాళన విశుద్ధ గుడ్డ ధ్వజ విరాజితానూన సాహా సాలి(ం) గిత వక్షస్థళభు
- భువన పరాక్రమోన్న తరుం వాసుదేవ ఖండళి మూళ భద్రావం శోద్భరు మహాచ్ఛ
- త్ర వినిగ్గ తరు, బెళాభరణ భూశితరుం భల్లుకి దండ హస్తరు శరణాగత వజ్ర
- పంజదరు మయ్యా వొళయియ్నూవ్వ స్వామిగళుం మూవత్తా ఱు బీయేంముమ్ము
- రిదండముం సమస్తు భయవానాదేసియు మశేష సమయంగళుం సెట్టిగళు
- నేలెడు మణకెఱెయ బమ్మిసెట్టి యెత్తి సిద శ్రీగ (ం)గా పురద చైత్యాలద పారిస్వనా
- తదెరంగ భోణనక్కం ఖ(ం)డస్ఫుటిత జీణ్నూ ద్ధారక్కం న దేవతాగి శకవష ్గం ్ళ2 నె
- యక్రోధన సంవత్సరద ఫాల్గుణ సుద్ధ పౌణ్న మాసి బ్రహస్పతి వార సోమ
- గ్రహణదందు యేము భద్ర సిద్ధా దేవరసి శిరిజకణవ్వెయ కాలంతో
- ళదు ధారా పూబ్బ క మాది కొట్టదత్తి యెతెనె ।। ఆడకెయ హసుభగెం లాదకె । క్కేతేయ
- జనళక ఆడెకె ్గ ం ఎతిన ఆడకెయ హెఱింగె ఆడకైం యిళసిన హెఱిగె సోలగె సివెయ వాసుంభగె
- హ ్గ కత్తెయ సివెయ బవళక్కె హగ ్గ ఎతివ సిరెయ మళ వెగెహిగ ్త సుంట్టిం యత వెజవళ
- క్కె ఫల ్గ కత్తె జళ్ళ సుంటి ఫల3 ఎత్తిన సుంట్టి హెఱిగె ఫల ్ళ ఎల్ల యక్కి యర వెజవళ కెలరావా
- ల ఎ వెయక్కి తయి జవళక్కెడి ఫల ్గ ఎత్తిన ఎవెయక్కి య హెఱింగె ఫల ్త హిప్పలియ
- హసుంభగె ఫల ్గ బబ్బరదకత్తెయు జవళక్కెఫల ్త ఎతిన బబ్బరద హెఱింగె ఫల ్ళ ఇంగినహ
- సుంభెగెలారవల ధూపదహ సుంభెగెఫల ్గ కత్తెయ ధూపద జవళకె ఫ ్త ధూహి అంగరంగ దీ
- యలు చైత్రదలు హగ ్గ పవిత్రదలు హగ ్గ మాడిసెట్టి యకెరియలు బసదిగెబిట్ట
- గొణ ్గ।। ఇంతి ధమ్మ కాదన సంస్త సుఖాస్పద మనెయ్డిసాస్వత మిప్పను ఇంతిద నూల వంట
- తోం సంస్తతి వరసెళెనెయ పరమహ రౌర వక్కె గళగళ నిళివరు ।। ప్రియ దీందీంతీద నెయ
- కావ పురుషంగకుంరు శ్రీయుమాదయలు కోవె దష్మాత్వెకంగెఫల
- హంతీత్థ ౦గెళొళు వారణాసి యో ళత్యుగ్రము నిద్రారం కవిలెయుం వేదాద్య వంకొం
- నఖ – యశః పోద్దు మేందు సాఱిదపురి శైలాక్షరం ధాత్రియోళ్ ।। స్వద్తం పరద
- త్తం వాయో హరేతి వసుంధరా శష్ఠి వరిష సహస్రాణి మిష్టాయాం జాయతే క్రిమి
- మంగళ మహా శ్రీశ్రీశ్రీ
జడ్జర్ల సమీపంలోని గంగాపురంలో, 23వ జైన తీర్థంకరుడైన పార్శ్వనాధునికి శక సంవత్సరం 1048, క్రోధన నామ సంవత్సరం, ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి, బుధవారం చందగ్రహణ సందర్భంగా (క్రీ.శ.1125, జనవరి, 21వ తేదీ) చైత్యాలయాన్ని నిర్మించినపుడు ఈ శాసనాన్ని వేయించి దీన్ని జినశాసనమని పేర్కొన్నాడు తైలపుడు.
త్రైలోక్యనాధుడైన జినున్ని స్తుతిస్తూ ప్రారంభమైన ఈ జినశాసనంలో, తైలపుడు, చైత్యాలయ నిర్మాణ సందర్భంగా, మూల సంఘం, కానూర్గణానికి చెందిన మేఘచంద్ర (సిద్ధాంతదేవ) భట్టారకుని కాళ్లు కడిగినట్లు, ఈ జైనాచార్యుడు, కానూర్గణంలోని మేషపాషాణగచ్ఛ అనే జినశాఖకు చెందినట్లుగా చెప్పబడింది. కానూర్గణ మేషపాషాణగచ్చ జినశాఖ గురించి మనకు తొలిసారిగా క్రీ.శ.1122 అంటే ఈ శాసనానికి మూడేళ్లముందు, మేడరాజు గోవిందాపురం శాసనంలో ప్రస్తావించ బడింది. ఆ శాసనంలో మేఘచంద్రదేవుడు, బాలచంద్రముని శిష్యుడనీ, మేఘచంద్రదేవుని శిష్యుడు పద్మనంది అని కూడా ఉంది. క్రీ.శ.1125 నాటి కొలనుపాక శాసనంలో మేఘచంద్ర సిద్ధాంతదేవునికి మాలధారి అనే మరో బిరుదున్నట్లు, అతనికి మాధవేందు (అగ్రశిష్య), మలందిసూరి, పద్మప్రభశ్రీముని అనే శిష్యులున్నట్లుగా చెప్పబడింది. మేఘచంద్ర సిద్ధాంతదేవుడు, గంగాపురం, కొలనుపాక, గోవిందాపురం లలో 23వ జైన తీర్థంకరుడైన పార్శ్వనాధ విగ్రహాన్ని ప్రతిష్టించటం విశేషం.
ఈ శాసనంలో ‘వీరబలంజ’ అనే వ్యాపారులకు చెందిన బమ్మిశెట్టి పార్శ్వనాధ చైత్యాలయాన్ని నిర్మించినాడనీ, అతడు, ప్రపంచ ఖ్యాతిగడించిన పంచశత వీరశాసన గుణాలంకృతుడనీ, బేళాభరణ భూషితుడు, భల్లుకి అనేదండాన్ని ధరించినవాడు, శరణాగతులకు వజ్ర పంజరంలాంటివాడు, అయ్యావళి-500 స్వామిగనూ, అశేష సమయాల (వర్తక సంఘాల) శెట్టిలను ఏలే మణకెఱెయకు చెందినవాడని ప్రశంసించబడినాడు. అతడూ ఇంకా, అన్ని వర్తక సంఘాలూ కలసి, పార్శ్వనాధ చైత్యాలయ అంగరంగ భోగాలకు, ఖండస్ఫుటిత జీర్ణోద్ధారణకు, అంగళ్లలో అమ్మే వివిధ సరుకులపై వచ్చే ఆదాయంలో నిర్దిష్ట భాగాలను సమర్పించాలని చెప్పబడింది.
శాసనంలో అడ్డ, సోలిగ, గిద్ద, పెఱిక లాంటి ఆనాటి తూనిక, కొలతల పదాలు చాలా ఉన్నాయి. శాసనంలో క్రీశ.12వ శతాబ్దినాటి గుండ్రటి అక్షరాలున్నాయి. రకారం, నకారంగా ఉచ్చరించబడింది. శాసనం ముందు, మధ్యలో జైనుతీర్థంకరుడు, జైనతీర్థంకరునిపైన మూడు గొడుగులు, అటూ ఇటూ చామరధారులు, పైన సూర్య, చంద్రులు, తీర్థంకరునికి కుడివైపున ఆవు బొమ్మలున్నాయి.
గంగాపురం సమీపంలోని గొల్లత్తగుడిగా పిలువబడుతున్న ఇటుకరాతి దేవాలయమే పార్శ్వనాథ చైత్యాలయమనీ, (తవ్వకాల్లో బయల్పడింది మహావీరుని విగ్రహంతో గల ఆలయం). ఇది క్రీ.శ.12వ శతాబ్దిలో నిర్మించబడిందని, గంగాపురం, యువరాజు తైలపదేవుని రాజధాని అని, ప్రసిద్ధ జైనాచార్యుడు, అది మేఘచంద్ర సిద్ధాంతదేవుని ఆధ్వర్యంలోని ఒక జైన బసది అనీ, అయ్యావళి-500, ముప్పై ఆరు బీడుల ముమ్మరిదండ, సమస్త ఉభయదేశ, అశేష వర్తక సంఘాల శెట్లకు స్థావరమని, తెలుపుతున్న ఈ శాసనం అలనాటి మేటి తెలంగాణ శాసనాల్లో ఒకటిగా పేర్కొనవచ్చు.
-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446