కొన్ని దశాబ్దాల క్రితం ఒక కాలముండేది. గతించిన సంవత్సరాల అందమైన కాలం అది. బంధాల కాలమది. సంబంధాల కాలమది. సంబంధాలన్నిటిని మూట కట్టి, భుజాన వేసుకొని, పాత సైకిల్ ఒకటి ఎక్కి, ఓ బక్క పలచని మనిషి వీధి వీధి తిరిగేవాడు. అతని కోసం ఊరు ఊరంతా ఎదురు చూసేది. అతను ప్రతీ గడప ఎక్కేవాడు. ప్రతీ తలుపు అతని రాక కోసం ఎదురు చూసేది. అతను తలుపు తట్టని ఇల్లు అతని కోసం రోజంతా ఎదురు చూసి, ధీనంగా, దిగులుగా కూర్చునేది. అతను రేపైనా రాకపోతాడా అని ఎదురు చూసేది. అతను పోస్ట్మేన్. మనకు తెలిసిన వ్యక్తి. మన అమ్మమ్మ, అమ్మల కాలానికి ప్రియమైన వ్యక్తి. అతను పిల్లలకు పోస్ట్మేన్ మామయ్య, పెద్దవాళ్ళకు అన్న, కొడుకు లాంటి వాడు. ఇప్పుడు అతని కోసం ఎవరూ ఎదురు చూడరు. ఎదురు చూసే ఆ తరం వెళ్ళిపోయింది. కాలం మారి పోయింది. ఇప్పుడు అదొక నాస్టాలజిక్ ఫీలింగ్ (Nostalgic Feeling). కావాలంటే చిన్న పిల్లలకు కథలుగా చెప్పుకోవచ్చు. పిల్లలు వింటే (వినరుగా పిల్లలు పాత విషయాలు).
ఈరోజు హైదరాబాద్‍లో వర్షం కురిసింది ఆగకుండా. నా నగరం తడిసి రెడ్‍జోన్ (Manson High Alert) అయ్యింది. నేనేమో బాల్కనీలో నిలబడి, ఆకాశానికేసి చూస్తూ అన్నాను, ‘ఇక్కడ కురవకు, కురిసింది చాలు, పల్లెలకు వెళ్ళు, ఎండిన పంట పొలాల కాడికి వెళ్ళు, బీటలు వారిన నేల మీద కురువు, మా నగరంలో ఎక్కువ వర్షం కురిస్తే పనులు ఆగిపోతాయి, ఇప్పటికే చాల సమయం వృధా అయింది. కోవిడ్-19 (కరోనా) వల్ల, నెలల తరబడి ఇంట్లో కూర్చున్నాం. మేం బయట తిరిగి పనులు చేసుకోవాలి కదా, ప్లీజ్ కురవకు, నెక్టస్ ఇయర్ కురవచ్చు కదా!’ వాన నా మాట వింటే ఎంత బాగుండేది. అస్సలు వినలేదు, అచ్చంగా నా పిల్లలులాగా, నా పిల్లల తండ్రిలాగా. కురుస్తూనే ఉంది. వాన ఎంత పాతది, అయినా కురిసిన ప్రతీసారి కొత్తగానే ఉంటుంది. నేనింక చేసేదేమీ లేక, లెమన్ టీ తాగుతూ దాచి పెట్టుకున్న పాత ఉత్తరాలు చదువుతూ వర్షంతో కలిసిపోయాను. నా చుట్టూ జ్ఞాపకాల వాన.
ఉత్తరాలు రాసుకునే కాలం కొన్ని జ్ఞాపకాల్ని మిగిల్చి, కొన్ని తరాలకు అందమైన అనుభవాల్ని ఇచ్చి వెళ్ళిపోయింది. క్రమంగా అదృశ్యమైంది. ఈ తరానికి టెక్నాలజీ తప్ప ఫీలింగ్స్ తెలియవు. అయ్యో పాపం అనిపిస్తుంది. ఎన్నెన్ని ఉత్తరాలు. పోస్ట్మేన్ వీధిలోకి అడుగు పెట్టగానే అతని సైకిల్ బెల్ మోగుతుంది. మేం తలుపు తెరిచి పెట్టేవాళ్ళం. బంధువులో, స్నేహితులో ఉత్తరం రాసారా, అది మన ఇంటికి వచ్చి చేరిందా. ఇక పండగే. ఎన్నెన్ని క్షేమ సమాచారాలు ఉండేవి. సినిమాల కథలు, వంటలు, ముగ్గులు, కొత్త చీరలు చెప్పలేను. జీవితంలో మళ్ళీ తిరిగి రాని కాలమది. ప్రేమలేఖల కాలం అది. ప్రేమలేఖలు రాసుకున్న కాలం, ప్రేమ లేఖలు అందుకున్న కాలం – ఇమెయిల్, స్మార్ట్ ఫోన్‍తో సరిసమానమౌతుందా? ఎప్పటికీ కాదు. పది పైసల పోస్ట్ కార్డ్, పావలా ఇన్‍ల్యాండ్ లెటర్ సామాన్యులకు అందుబాటులో ఉండేవి. నిలువెత్తు మనిషి వచ్చి, పలకరించి వెళ్ళినట్టు ఉండేది ఉత్తరం వస్తే. దాచుకొని చదువుకున్నవన్నీ ప్రేమలేఖలే.
చిన్న ఊరి నుండి వచ్చి నగరంలో ఉండడమంటే అమెరికాలో ఉన్నట్టు లెక్క ఉండేది మూడు దశాబ్దాల క్రితం. అమ్మ రాసేది – ‘‘జాగ్రత్త, మగవాళ్ళ ప్రపంచం ఇది.’’ నాన్న రాసేవారు. ‘‘మగవాళ్ళతో సమానంగా వాదించి నువ్వు పెద్ద లాయర్ అవ్వాలి’’. చెల్లెలు రాసేది ‘‘అక్కా ! హైదరాబాద్ నుండి రాళ్ళ గాజులు తీసుకురా, ముత్యాలు తీసుకురా, బంగారు చైనులో వేసుకుంటాను, స్టైల్‍గా ఉండే పూల రంగుల చిన్న గొడుగు తీసుకురా, హైదరాబాద్ నగరం నుండి తెచ్చావని నా ఫ్రెండ్స్కి తెలియాలి’’. మా ఊరి నుండి నగరానికి వచ్చిన నా ఉత్తరాలు ఇవి. ఇప్పుడు ఈ దృశ్యం కనుమరుగైంది. అప్పటి పోస్ట్మేన్ కుటుంబంలో ఓ మనిషి. అందరికి ఉత్తరాలు చదివిపెట్టే ఆత్మీయుడు. అందుకే అతని కోసం ప్రతి కన్ను ఎదురు చూసేది. ఇప్పుడు పుస్తకాలు వస్తాయి స్పీడ్ పోస్ట్లో. ఫెడ్ ఎక్స్లో విదేశీ మేగజైన్‍లు వస్తాయి. గూగుల్ మ్యాప్‍లో అడ్రస్ చూసుకుంటూ గేట్ దగ్గర పోస్ట్ బాక్స్లో వేసి వెళ్ళిపోతాడు ఓ అపరిచిత వ్యక్తి. ఉత్తరాలు మాత్రం రావు ఇక ఎప్పటికీ.
-మహెజబీన్