పాల్కురికి పేర్కొన్న పర్యాటక స్థలాలు

(గత సంచిక తరువాయి)

7. చతుర్ముఖ బసవేశ్వరం
ఉమామహేశ్వరం పర్వంతం పైన తూర్పు దిక్కున ఐదు క్రోసుల దూరంలో ఉన్న రమ్యమైన మునిపురికి పశ్చిమాన చాల అందమైన బిలము, చతుర్ముఖ బసవేశ్వరం ఉన్నాయంటూ పర్వత ప్రకరణంలో పాల్కురికి సోమనాథుడు చతుర్ముఖ బసవేశ్వరం మీద చిన్న పురాణ కథను కూడా చెప్పాడు.
సృష్టి ప్రారంభంలో శివుని ఆజ్ఞ మేరకు వృషాధిపుడు ఇక్కడ వేయి బాణాల ప్రమాణంలో (2000 అడుగుల పొడవు, వెడల్పులతో) వృషభ పురమును కట్టించి, నాలుగు గోముఖాలతో కూడిన వృషభేశ్వర లింగాన్ని ప్రతిష్టించి, తద్వారా సృష్టించిన పశురాశి కన్యాసిద్ధనాథుని భవనాం తరమున ఉన్న బిలం నుండి బయటికి రాగా, వాటిలోని బంగారు రంగుగల ఆవులను ముని కన్యకలు తీసుకొనిపోగా మిగిలిన వాటితో ఇక్కడ పశూత్పత్తి జరిగిందని, ఇక్కడి చతుర్ముఖ లింగానికి దక్షిణాన మందాకిని నది ప్రవహిస్తుందని, దాని తీరంలో ఇంద్రేశ్వరుడు పూజింపబడుతాడని చతుర్ముఖ బసవేశ్వర కథనంలో వర్ణించబడింది.


పై కథనాన్ని పుక్కిటి పురాణం అని కొట్టి పారేయడానికి వీలు లేదు. అందులో చారిత్రక సత్యాలు చాలా ఉన్నాయి. వృషభపురం అని పాల్కురికి సోమన పేర్కొన్న స్థలంలో కొన్ని దశాబ్దాల కిందటి వరకు ‘ఆవులపెంట’ ఉండేదట. అక్కడ అమరాబాదు జాతికి చెందిన పశువుల ఉత్పత్తి జరిగేదని 1923లో అక్కడి తహశీల్దార్‍ సయ్యద్‍ గౌస్‍ తన ఉర్దూ పుస్తకం ‘బాలా-ఎ-కోహ్‍ అమ్రాబాద్‍’లో పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని మరో ఇరవయేళ్ళ తరువాత ఈ ప్రాంతాన్ని పరిశోధించిన ఆస్ట్రియా దేశపు మానవ శాస్త్రవేత్త హైమండార్ఫ్ కూడా ధృవీకరించారు. సోమన కాలం (క్రీ.శ.1280) నాటికే ప్రాచీన తమమైన పశూత్పత్తి పద్ధతి ఆయన తరువాత 700 సంవత్సరాల వరకూ కొనసాగినట్లూ పై ఆధారాలు తెలియజేస్తున్నాయి.


ఈ వృషభపురము లేదా ఆవులపెంట మునిపురికి పశ్చిమాన ఉందన్నాడు పాల్కురికి. శాసనాల్లో పేర్కొనబడిన మునులూరు (నేటి మున్ననూరు) కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఈ వృషభపురానికి తూర్పుననే ఈనాటి మల్లప్పగుట్ట దగ్గర ఉండేదట. అక్కడి గ్రామం కాలిపోవడంతో అక్కడి నుండి ప్రజలు పశ్చిమం వైపు… అంటే వృషభపురం (ఆవులపెంట) వైపు వచ్చి స్థిరపడ్డారు. ఇప్పుడు ఈ స్థలంలో మున్ననూరు తండా ఉంది.
ఈ తండాకు చెందిన వడ్త్యావత్‍ వశ్యానాయక్‍ (52 సంవత్సరములు) ఇల్లు కట్టుకోవడానికై పునాదిని తవ్వుతుండగా ఒక అడుగు లోతున 19.07.2005 నాడు చతుర్ముఖ బసవేశ్వర లింగం బయటపడింది. రెండున్నర అడుగుల పొడవు వెడల్పులతో ఉన్న నునుపైన నల్లని అందమైన పానవట్టం పైన అడుగు ఎత్తు శివలింగం, దానికి నాలుగు వైపులా గోముఖాలు (బసవన్నలు) శిల్పించి ఉన్నాయి. దేశంలోనే చాలా అరుదైన శివలింగ మిది. పాల్కురికి వర్ణించిన చతుర్ముఖ బసవేశ్వర లింగమిదే. దీని చుట్టుపక్కల ఇళ్ళ పునాదుల్లో ఆలయ శిలలు ఎన్నో ఉన్నాయని ఆ తండా పెద్దలెవర్ని అడిగినా చెప్తారు.
ఉమామహేశ్వరంలోని ఏకాదశ (11) తీర్థాల్లో (వాగు వంకలు, గుండాలు) ఉన్న లింగాలను దర్శించి వందనార్చనలు చేసినా ఫలితముండదు – ముందు ఈ చతుర్ముఖ బసవేశ్వరున్ని పూజించక పోతే – అని పాల్కురికి ఈ ఆలయానికి ఉన్న అత్యంత ప్రాధాన్యతను గూర్చి నొక్కి వక్కాణించాడు.
‘ఆ చతుర్ముఖ వృషభాంక లింగంబు
భజియింప నభిమత ఫలములు పొందు
నిజ భక్తి ముక్తులు నెక్కొనజెందు
నట్టి శ్రీ బసవేశ్వరాలయంబంతి
కట్టెదురను గాంచి ఘనుడు దోనమయ్య’  శ్రీశైలం వైపు వెళ్ళసాగాడని పాల్కురికి చెప్పాడు. చివరి పాదంలో ఉన్న ‘కట్టెదుర’ అనే పదంను తరువాతి కాలపు వాగ్గేయకారులు అన్నమాచార్య మొదలుకొని దాదాపు అందరూ కాపీ చేశారు. చతుర్ముఖ బసవేశ్వరం సోమనాథునికి ఎంత ఇష్టమంటే అతని కొడుకుకు ఆ పేరే పెట్టాడు. మరో కొడుకుకి బసవ పురాణం అనే పేరు పెట్టాడని నిడదవోలు వెంకటరావుగారు ‘బసవపురాణం’ పీఠికలో రాశారు, 1952లో.


8. కన్యాసిద్ధనాథుని బిలం, భవనం

వృషాధిపుడు సృష్టించిన పశురాశి కన్యాసిద్ధనాథుని బిలం నుంచే బయటకు వచ్చాయని, వాటిలో బంగారు వన్నెగల గోవులను ముని కన్యకలు కొనిపోయారని, వారు, మునులు కన్నాసిద్ధనాథున్ని పూజించేవారని, ఆ ప్రాంతంలో కన్యాబిలం, కన్యాసిద్ధ నాథుని భవనం ఉన్నాయని పైన పేర్కొనడంమైంది. మన్ననూరులోని మల్లప్పగుట్ట దగ్గర రెండు దశాబ్దాల క్రితం వరకు కన్యకల బిలం అనే ప్రదేశం ఉండేది. అది ఒక గుహ ప్రవేశ మార్గం. ఆ గుహ ఎంత దూరం పోతుందో ఎవరికీ తెలియదు. తెలుసుకోవడానికి సుమారు మూడు దశాబ్దాల క్రితం ఆవులు మేపే ఒక రెడ్డి కుల వ్యక్తి ఆ గుహలోకి వెళ్ళాడట. కొద్ది దూరం వెళ్ళాక అతనికి ఒక సిద్ధుడు కనిపించి ‘ఇక మీదట ఈ గుహలోకి రావద్దు. వస్తే వెనక్కి పోలేవు. ఇదుగో నీకొక మందు గుళిక (సిద్ధసాధ్యమైనది) ఇస్తున్నాను. దీన్ని ఎప్పుడూ నీ దగ్గరే ఉంచుకో. నీకు ఏ (ఆరోగ్య) సమస్య వచ్చినా ఈ గుళికలోని గోరెడంత మందును నోట్లో వేసుకో, సమస్య తీరిపోతుంది’ అని చెప్పి మందు గుళిక ఇచ్చాడట. సదరు రెడ్డి ఇటీవలే మరణించేంత వరకు ఏ సమస్యా లేకుండా జీవించాడని మన్ననూరు మాజీ సర్పంచ్‍ మాచయ్య చెప్పాడు.
కన్యకల బిలం ప్రవేశ ద్వారం ఇటీవల కూరుకుపోయి అందులో నీరు నిండడంతో దాన్నిప్పుడు అక్కడి తండా వాసులు కానుగుల బావి అంటున్నారు. ఇక కన్యాసిద్ధనాథుని భవనం లేదా ప్రాసాదం మన్ననూరు తండాలో ఉన్న వేణుగోపాల ఆలయం ముందరున్న ప్రాసాదం అయ్యుంటుంది. ఆ ప్రాసాదం గోడలు, కొన్ని బురుజులు, ఒక బురుజు మీద ఒక ఇల్లు మాత్రం ఇప్పుడు కన్పిస్తున్నాయి.


9. మందాకిని నది

చతుర్ముఖ బసవేశ్వర లింగానికి దక్షిణాన మందాకిని నది పారుతున్నట్లు, దాని తీరంలో ఇంద్రేశ్వరుడున్నట్లు పర్వత ప్రకరణంలో ఉంది. నిజంగానే బసవేశ్వర లింగమున్న మన్ననూరుకు దక్షిణంగా కొల్లంపెంట, కొమ్మన్‍పెంట ప్రాంతంలోని లోయలో ‘మందవాగు’ పారుతున్నది. దాని ఒడ్డున ఒక అద్భుతమైన శివలింగముంది. ఇదే పాల్కురికి పేర్కొన్న ఇంద్రేశుడు. దీన్ని బ్రాహ్మణులు పూజించేవారట. ఈ శివలింగం పైనే (చుట్టూ) రెండు కాలాలకు చెందిన శాసనాలున్నాయి. మందవాగు పరిసరాల్లోని సుమారు వంద ఎకరాల్లో నవీన శిలాయుగపు (5 వేల సంవత్సరాల క్రితపు) మానవ సంస్కృతి వర్ధిల్లిందని అక్కడ లభించిన చారిత్రక రాతి పనిముట్ల ఆధారంగా తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీశైలం కేంద్రం వారు, అవిభక్త ఆంధప్రదేశ్‍ రాష్ట్ర పురాతత్వ శాఖ వారు రిపోర్టులు ప్రచురించారు.


10. గోమాతృ పంచకం / నాగపంచి / మాతంగేశ్వరం
పర్వత ప్రకరణంలో ఈ మూడు క్షేత్రాలు వివిధ సందర్భాల్లో పేర్కొనబడినా మూడూ ఒకటేనని క్షుణ్ణంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. ఈ మూడూ పశువులను, శిశువులను ఇచ్చే దేవతా క్షేత్రాలుగా కీర్తించ బడ్డాయి. ఉమామహేశ్వరం దగ్గరి గంగకు తూర్పున నాగపంచి ఉందని పేర్కొనడంతో ఈ క్షేత్రాన్ని గుర్తించడం సులువైంది. ఈ క్షేత్రాన్నిప్పుడు ‘మమ్మాయిబోళ్ళు’ అని రంగాపురం స్థానికులు పిలుస్తున్నారు. మాతంగినే సామాన్యులు మమ్మాయి అని, శిష్టులు మహామాయి అని అంటారు. పశ్చిమాభిముఖంగా ఉన్న ప్రధానాలయానికి ఎదురుగా పంచ ఆలయాలు, వాటిల్లోని కొన్నింటిలో నాగ ప్రతిమలు (నాగపంచి) ఉన్నాయి. ఇది చాలా ప్రాచీన ఆలయం. కనీసం రెండుసార్లు పునరుద్ధరించ బడింది. ఇప్పుడు శిథిలావస్థలో ఉంది.


పైన పేర్కొన్న నాలుగు క్షేత్రాలు వాటి కథనాలు, వాటి చుట్టు పక్కల లభిస్తున్న చారిత్రకాధారాల మేరకు అవి చాలా ప్రాచీనమైనవని తెలుస్తుంది. మానవ నాగరికతకు తొలి బీజాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మందవాగు చుట్టుపక్కల వేల ఏళ్ళ క్రితపు మానవ జీవన పనిముట్లు లభించాయని పేర్కొనటం జరిగింది. చతుర్ముఖ బసవేశ్వరం వెనుక కూడా అలాంటి రాతి పనిముట్లే లభించాయి. వాటిని మూడు దశాబ్దాల క్రితం గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణా సంస్థకు సంబంధించిన అధికారి డా।। కంచర్ల మోహనరావు గారు సేకరించి హైదరాబాదులోని నెహ్రూ శత జయంతి గిరిజన మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. మన్ననూరు శివారులోని నల్లమల గుట్టల ప్రారంభంలో కనిపించే రాతి కోటను కూడా వేల ఏళ్ళ కిందట ప్రాచీన మానవులే తమను తాము జంతువుల బారినుండి రక్షించుకోవడానికి కట్టుకుని ఉంటారు అని ప్రముఖ చరిత్రకారులు డా।।పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రిగారు అభిప్రాయపడ్డారు. మన్ననూరు తండాకు తూర్పున ఉన్న చేలల్లో కూడా రెండు వేల ఏళ్ళనాటి ఇనుపయుగ నాగరికత అవశేషాలున్నాయి. వీటన్నింటినిబట్టి చతుర్ముఖ బసవేశ్వరం (ఈనాటి మన్ననూరు తండా) ప్రాంతంలో మొదట పశుపాలకులు నాగరికతను ప్రారంభించి క్రమంగా ఇనుప లోహ యుగం నుండి వ్యవసాయ నాగరికులుగా రూపాంతరం చెందారని చెప్పవచ్చు. ఇది పాల్కురికి సోమన నాటికే ప్రాచీన చరిత్ర. కాబట్టి ఆయన ఈ చారిత్రక నేపథ్యాన్ని చతుర్ముఖ బసవేశ్వర కథనంలో కొద్దిగా వివరించి చెప్పాడు. ఆయన చారిత్రక దృష్టి అమోఘం.


11. గుప్త మహేశ్వరం
పర్వత ప్రకరణంలో దోనమయ్యకు సర్వజ్ఞ మల్లికార్జున దేవుడు వృద్ధ తపస్వి రూపంలో కనిపించి ఉమామహేశ్వరానికి ‘తూర్పున చూడు సంస్తుత్యమై గుప్త
మాహేశ్వరంబొప్పు మహిత తల్లింగ మాహాత్మ్యమది యవాఙ్మనసాత్మకమ్ము’ అంటూ గుప్త మహేశ్వరాన్ని చూపించి, సదా స్తుతించబడే ఆ ఆలయంలో మహి మాన్వితమైన శివలింగం ఉన్నదని, దాని మహత్యాన్ని ఊహించలేము, చెప్పలేము అని వివరించాడు.


దురదృష్టవశాత్తు ఆ శివలింగం ఇప్పుడు లేదు. దుండగుల చేతుల్లో ధ్వంసమైన గుప్త మహేశ్వర శిథిలాలయం మాత్రం ఉమా మహేశ్వరానికి తూర్పున ఫారెస్ట్లైన్‍ దగ్గర పారే గుప్త మహేశ్వర వాగు కుడి తీరాన ఉంది. అర్థ మంటపం, అంతరాళం, గర్భ గృహాలతో శిలా నిర్మితమైన ఈ ఆలయం తన అత్యంత ప్రాచీన వైభవాన్ని చాటు తున్నది. అంతరాళం ద్వారం పై కడపకు లక్ష్మీదేవి విగ్రహముంది.


ఈ ఆలయం ఎదురుగా పడమరన యాభై అడుగుల దూరంలో అత్యంత అరుదైన నంది విగ్రహముంది. ఒక అడుగు ఎత్తు, రెండు అడుగుల పొడవున్న ఆ నంది విగ్రహాన్ని మెత్తటి రాయి నుండి గాని, సున్నపు గారతో గాని శిల్పించారని అర్థమవుతుంది. ఇలాంటి నంది విగ్రహం ఒకటి గుంటూరు జిల్లా అమరావతిలోని అమరేశ్వరా లయంలో ఉంది. అది క్రీ.శ.2-4 శతాబ్దాల నాటిదని పురావస్తు నిపుణులు ఐ.కె.శర్మగారు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో గుప్త మహేశ్వరంలోని నంది కూడా కనీసం 1600 సంవత్సరాల కిందటిదని నిర్ధారించవచ్చు. పూర్వం ఈ నంది ఆలయ అంతరాళంలో ఉండి ఉంటుంది. గుప్త మహేశ్వరంలో వందేశ్ళ క్రితం వరకు కూడా ప్రతి శివరాత్రికి జ్యోతిని వెలిగించేవారట.
గుప్త మహేశ్వరాలయాన్ని చంద్రగుప్తుని కూతురు చంద్రవతి కట్టించిందని శ్రీ ఆదిరాజు వీరభద్రరావు గారన్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన పాటలీపుత్రం రాజు చంద్రగుప్తుడు క్రీ.శ.4వ శతాబ్దాంతంలో పాలన సాగించాడు. కాని ఈ చంద్రవతి ఆయన కూతురు కాదు. ఈమె స్థానిక సోమవంశపు రాజైన చంద్రగుప్తుని కూతురని స్థానిక చరిత్రకారులు శ్రీ కపిలవాయి లింగమూర్తిగారు భావించారు. వీరు కూడ క్రీ.పూ.300 ప్రాంతంలో భారతదేశపు రాజు మౌర్య చంద్రగుప్తుడు కూడా సింహాసనాన్ని వారసులకు అప్పజెప్పి తను దక్షిణాదికి వెళ్ళి శ్రావణబెళగొళలో చివరి జీవితం గడిపాడు. 12వ శతాబ్దపు కన్నడ ‘జైనామృతం’ అనే గ్రంథంలో శ్రీశైల ప్రాంతం మొదట జైనులదే అని తెలుపడంతో జైనాన్ని పాటించిన మౌర్య చంద్రగుప్తుడు శ్రీశైల ప్రాంతం గుండా ప్రయాణించాడేమో! ఏది ఏమైనా చంద్రగుప్త పట్టణం మాత్రం శిథిలమై ఇప్పటికీ కన్పిస్తుంది – శ్రీశైలానికి ఎదురుగా, కృష్ణానది ఎడమ గట్టునున్న అడవుల్లో.


12. చరుకేశ్వరం
ఉమామహేశ్వరం – మన్ననూరు ప్రాంతాన్ని కాకతీయుల సామంతులైన చెరకు రాజులు పాలించారు. వీరు మన్ననూరులో తమ పేరున కట్టించిందే చరుకేశ్వరాలయం. ఇది 12వ శతాబ్దానికి ఇటు-అటుగా కట్టించింది. దాని శిథిలాలు, కోనేరు, కోట గోడలు, బురుజులు ఇప్పుడు మన్ననూరులోని వేణుగోపా లాలయం ముందు కన్పిస్తున్నాయి. చరుకేశ్వర ఆలయాన్ని కాకతీయుల తర్వాత తురుష్కుల సైన్యం చేయగా మరో శతాబ్దం తరువాత నంది మల్లారెడ్డి అనే స్థానిక పాలకుడు ఇప్పుడున్న వేణుగోపాల ఆలయాన్ని కట్టించాడు.


13. సంధ్యా సమాధి
పర్వత ప్రకరణంలో సంధ్యా సమాధి ఒక తీర్థంగా పేర్కొన బడింది. అంటే అక్కడ ఒక నీటి వనరు, ఒక ప్రముఖుని సమాధి ఉండాలి. ఇలాంటి స్థలం ఉమా మహేశ్వర సమీప గ్రామమైన రంగా పూర్‍ శివారులో ఉన్న చంద్రబండకు తూర్పున ఉంది. నలువైపులా మెట్లతో ఉన్న అందమైన కోనేరులో ఇప్పటికీ నిండా నీళ్ళున్నాయి. దానికి వాయువ్యంలో ఒక ప్రముఖుని సమాధి, దానిపైన శాసనం ఉన్నాయి.


14. దేవహ్రదేశ్వరం / రామేశ్వరం

పాల్కురికి పేర్కొన్న మరో తీర్థం దేవహ్రదేశ్వరం. చంద్రబండనే స్థానికులు దేవరబండ అని కూడా పిలుస్తారు. ఇదొక విశాలమైన బండ. దానికి తూర్పున రెండు గుహలున్నాయి. ఆ గుహలను గర్భగుడులుగా చేసి వాటి ముందు మంటపాలు నిర్మించి ఆలయాలుగా తీర్చిదిద్దారు. ఈ ఆలయాల సమీపంలో రెండు మూడు నీటి గుండాలు కూడా ఉన్నాయి. ఇక్కడి ప్రధాన దైవం రామలింగేశ్వరుడు కాబట్టి పాల్కురికి పేర్కొన్న మరో తీర్థం రామేశ్వరం కూడా ఈ దేవరబండనే. క్రీ.శ.5వ శతాబ్దంలో రామలింగేశ్వర ఆలయాలను కట్టడం ప్రారంభించింది ఈ ప్రాంతం నుంచే ఎదిగిన విష్ణుకుండి రాజులు. స్థానిక కథనాలను బట్టి ఇక్కడ నడిచిన శిల్పశాల నుండే చుట్టుపక్కల ఆలయాల నిర్మాణం జరిగిందని చెప్పవచ్చు. ఇక్కడ ఇప్పటికీ శ్రీరామ నవమికి ఉత్సవాలు జరుగుతున్నాయి.


15. కాలహ్రదేశ్వరం
ఉమామహేశ్వర క్షేత్ర పరిధిలో గల ఏకాదశ భవ్య తీర్థములలో ఐదవ తీర్థంగా ‘కాలహ్రదేశ్వరంబు’ పేర్కొనబడింది. దీన్నిప్పుడు కాలాపానీ అని పిలుస్తున్నారు. ఇది మన్ననూరు చౌరస్తా నుండి శ్రీశైలం వైపు ప్రయాణిస్తున్నప్పుడు కుడివైపున ఒకరి ఇంటి ఆవరణలో బావి రూపంలో ఉంది. పూర్వం ఇదొక గుండం అయ్యుంటుంది. నైజాం ప్రభుత్వ కాలంలో నేరస్థులను, స్వాతంత్య్రోద్యమ నాయకులను మన్ననూరులోని జైలులో బంధించి మరణశిక్ష వేయాలనుకున్నప్పుడు అలాంటి నేరస్థులకు ఈ కాలాపానీ తాగించేవారట. ఈ విషయాన్ని ఇక్కడ 1940లలో జైలు శిక్షననుభవించిన ఆర్య సమాజ ఉద్యమకర్త పండిత్‍ నరేంద్రజీ కూడా తన స్వీయ జీవిత చరిత్రలో ప్రస్తావించారు. శివుని కంఠంలో హాలహలం ఉంటుంది కాబట్టి ఈ కాలాపానీ అలాంటి విషపు నీరైనా పవిత్రంగా భావించబడి ఉంటుంది.


16. వేద పర్వతం / అశ్వమేధ శిలోచ్చయం

ఉమామహేశ్వరంలో తీర్థముల తర్వాత పవిత్ర సందర్శనా స్థలాలుగా పర్వతాలు పేర్కొనబడ్డాయి.
‘వేద పర్వతమును శ్వేతాద్రి నీల
మేదినీధర మశ్వమేధ శిలోచ్చ
యంబును లింగ శృంగంబు కన్యా న
గంబు నుమాగిరి కనక నగంబు
గుండశిఖరి………………..’
ఈ ప్రాంతంలో పుట్టి ఐదవ శతాబ్దంలో నర్మదా నది నుండి కృష్ణా నది మధ్యన గల దేశాన్ని పాలించిన విష్ణుకుండి రాజులు వేదాలను, వేద పండితులను ఆదరించారు. వేద సహితమైన అశ్వమేధాది ఎన్నో యజ్ఞాలను చేశారని వారి శాసనాలు ఘోషిస్తున్నాయి. మన్ననూరు శివారులో ఉన్న ప్రతాపరుద్ర కోట మీద ఆ రాజులు యజ్ఞాలు చేయడానికై స్నానం చేసే అవబృధ స్నానవాటిక ఇప్పటికీ కనిపిస్తూ ఉంది. కాబట్టి పర్వత ప్రకరణంలో పేర్కొన్న అశ్వమేధ శిలోచ్చయము లేదా వేద పర్వతం ఇదే.


17. శేతాద్రి

అశ్వమేధ పర్వతానికి ఎదురుగా పడమటి దిక్కున ఉన్న ‘కుప్పగుట్ట’ (లింగ శృంగం?) తూర్పువైపు తెల్లని పరుపు బండలు విశాలంగా ఉండటం వల్ల (చూడడానికి తెల్లగా కన్పిస్తుండడం వల్ల) దీన్ని తెల్లకొండ అని, సంస్కృతీకరించి శ్వేతాద్రి అని పిలుస్తుండి ఉంటారు. రెండు వేల ఏళ్ళ కిందటి సాతవాహన రాజుల శాసనాల్లో కూడా శ్రీశైలాన్ని సూచించే ‘సిరితాన’, ఈ శ్వేతగిరిని సూచించే ‘సేదగిరి’ వారి రాజ్యంలో ఉన్న స్థలాలుగా పేర్కొనబడ్డాయి. ఈ శ్వేతాద్రి శృంగం (కొన) మీద కుతుబ్షాహీల కాలపు ఫిరంగి ఉందట.


18. గుండ శిఖరి
మన్ననూరి నుంచి శ్రీశైలం వైపు ప్రయాణం చేస్తుండగా సుమారు పది కిలోమీటర్ల దూరంలో పులిమడత అనే ప్రదేశం రోడ్డుకు కుడివైపున వస్తుంది. అక్కడి నుండి సుమారు అర కిలోమీటరు దూరంలో ‘లొద్ది’ అనే గుండం, కిలోమీటరు దూరంలో ‘గుండం’ అనే ప్రదేశం వస్తాయి. వీటిల్లో మొదటిదేమో ఒక శిఖర పర్వతం కింద, రెండవదేమో దాని మీద ఉన్నాయి కాబట్టి పాల్కురికి పేర్కొన్న గుండశిఖరి ఇదే. ఇక్కడి రెండు గుండాల పేర్లు పాల్కురికి పేర్కొన్న రామగుండం, భీమగుండం. ఇలా సమన్వయం చేయకుండా కపిలవాయి లింగమూర్తిగారు, శ్రీశైల దేవస్థానం అధికారి అనిల్‍కుమార్‍ గారు లొద్ది గుండాన్ని గుప్త మల్లికార్జునం అంటూ రాశారు. లొద్దిలో ప్రతి సంవత్సరం ఏకాదశి పండుగకి స్థానిక చెంచు గిరిజనుల ఆధ్వర్యంలో జాతర జరుగుతుంది.


19. కిన్నెరేశ్వరం
పర్వత ప్రకరణంలో పేర్కొనకున్నా కిన్నెర బ్రహ్మయ్య కథను సోమన తన ‘బసవ పురాణం’లో విపులంగా వర్ణించాడు. వీరశైవ శాఖ సృష్టికర్త బసవేశ్వరుడు చాళుక్య రాజధాని కళ్యాణి (కర్ణాటక) విడిచి వెళ్ళిపోవటానికి కారణమైన రాజు కాలచురి బిజ్జలున్ని బసవేశ్వరుని అనుయాయులు జగదేవుడు, మల్లయలతో కలిసి కిన్నెర బ్రహ్మయ చంపాడు. అందుకు వీరశైవంలో ఆయనకు చాలా పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఆయన పేరు మీద ఆలయాలు కూడా వెలిశాయి. అలా వెలిసిన ఒక శివాలయమే కిన్నెరేశ్వరం. ఇది మన్ననూరిలో ఉన్న మల్లప్పగుట్ట కింద ఉంది. ఇది చాలా అందమైన ఆలయం. ఉత్తరాభిముఖంగా ఉంది. దాని వెనుక చెరువుంది. ఇందులోని శివలింగాన్ని స్థానికులు కిన్నెరయ్య అని పిలిచేవారు. ఇటీవల ఆలయం బాగా శిథిలం కాగా శివలింగాన్ని మాత్రం మహబూబ్‍నగర్‍ జిల్లాలోని పిల్లలమర్రి మ్యూజియానికి తరలించారని స్థానికుడు ఒకాయన చెప్పాడు.


రాష్ట్రంలో అందమైనవి, ఆహ్లాదకరమైనవి, పవిత్రమైనవి నల్లమల అడవులు. వాటిల్లోనూ పవిత్రమైన స్థలాలను పాల్కురికి సోమనాథుడు దర్శించి వాటి మహత్యాన్ని మొదటిసారిగా వర్ణించాడు కాబట్టి, ఆ స్థలాలు ఇప్పటికీ అదే అందంతో అలరారుతున్నాయి కాబట్టి, ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరించుతున్నది పర్యాటక రంగం కాబట్టి నల్లమలల్లో ‘పాల్కురికి సోమన పర్యాటక ప్రాజెక్టు’ను ఏర్పాటు చేస్తే ప్రజలకు కొత్త పర్యాటక స్థలాలు – ఆహ్లాదకరమైనవి, పవిత్రమైనవి – అందుబాటులోకి వచ్చి ఆనందిస్తారు. తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఈ కల సాకారం కావడానికి కృషి చేయాలని ఆకాంక్షిద్దాం.

– ద్యావనపల్లి సత్యనారాయణ,
ఎ : 94909 57078
(‘తెలంగాణ కొత్త విహార స్థలాలు’ పుస్తకం నుంచి)
ప్రతులకు: తెలంగాణ రిసోర్స్ సెంటర్‍,
చంద్రం 490, వీధి నెం.12,
హిమయత్‍నగర్‍, హైదరాబాద్‍-29.
తెలంగాణ. వెల: రూ.100

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *