నేర నిరూపణ జరిగే వరకు అమాయకుడే!

మీడియా విచారణ మొదలైన తరువాత నేరారోపణ రాగానే నేరస్తులన్న ముద్ర పడిపోతుంది. విచారణ పూర్తి కాకముందే శిక్షలు పడిపోతున్నాయి. మన న్యాయశాస్త్రంలోని మౌళిక సూత్రానికి భంగం కలిగేలా వుంటున్నాయి. మన నేర న్యాయ సూత్రాల ప్రకారం నేర నిరూపణ జరిగే వరకు ముద్దాయిని అమాయకుడిగా పరిగణించాల్సి వుంటుంది. క్రిమినల్‍ ‘లా’ నిష్పాక్షికంగా వుండాలంటే ఇది మౌళికమైన సూత్రం. దీని న్యాయబద్దత మనదేశంలోని సాంఘిక – న్యాయ పరిస్థితుల ప్రకారం చూసినప్పుడు దీనికి న్యాయబద్దత వుందని అన్పిస్తుంది. ‘రాజ్యం’కి వున్న అధికారం, వనరులు ముద్దాయికి వుండే అవకాశం లేదు. మల్లయుద్దంలో ఇద్దరు సమవుజ్జీవులు వుంటేనే అది చూడటానికి బాగుంటుంది. అలా లేనప్పుడు అది మల్లయుద్దంలాగా వుండదు. అణిచివేతగా వుంటుంది. ఇదే సూత్రము మన క్రిమినల్‍ కేసులకి వర్తిస్తుంది. ‘రాజ్యం’ అనేది బలమైన శక్తి. ఇంతబలమైన శక్తితో పోరాడాలంటే ముద్దాయికి కొన్ని రక్షణలు అవసరం. అందుకే ‘ముద్దాయిపై నేర నిరూపణ’ జరిగే వరకు అమాయకుడిగా పరిగణించాలన్న సూత్రాలని మన కోర్టులు ఆమోదిస్తున్నాయి. ఇదొక్కటే కాదు నేర నిరూపణ భారం, అనుమానానికి అతీతంగా అన్న సూత్రాలని కూడా ఏర్పరిచారు. ఈ సూత్రాలు లేనప్పుడు మన దేశంలోని చాలా మంది వ్యక్తులు అశక్తులవుతారు.


‘నేర నిరూపణ జరిగే వరకు ముద్దాయిని అమాయకుడిగా’ పరిగణించాలన్న సూత్రానికి వ్యతిరేకమైనవే ‘ద్రోహి అన్న భావన’. తాను అమాయకుడినన్న విషయాన్ని ముద్దాయే రుజువు చేసుకోవాలని అనడం, మన దేశంలో నెలకొని వున్న పరిస్థితుల దృష్ట్యా ఈ పరిస్థితి ఆవశ్యనీయం కాదు. అది విపరీత పరిణామాలకి దారి తీస్తుంది. అది న్యాయబద్దం కూడా కాదు. కానీ కొన్ని ప్రత్యేక చట్టాల్లో కొన్ని నేరాలకి సంబంధించి అలాంటి నిబంధనలు వస్తున్నాయి. అది అభిలషనీయం కాదు. అయితే నిజమనే భావనకి వ్యతిరేకంగా ముద్దాయి రుజువు చేసే విషయంలో వెసులుబాటుని కోర్టులు కల్పించాయి. ముద్దాయిపై నేరనిరూపణ జరగాలంటే అది అనుమానానికి అతీతంగా వుండాలి. కానీ ముద్దాయి ‘నేరం చేశాడన్న నిజమనే భావనకి’ వ్యతిరేకంగా రుజువు చేసేటప్పుడు అది అనుమానానికి అతీతంగా అవసరం లేదు. రుజువు చేసే విషయంలో ప్రభావితని బట్టి కోర్టులు నిర్ధారణకి రావల్సి వుంటుంది.


‘నేర నిరూపణ జరిగే వరకు అమాయకుడిగా పరిగణించాలన్న సూత్రం అతి మౌళికమైనది. ఇది అత్యంత ముఖ్యమైనదని భావించడానికి కారణం ఒక్క అమాయకుడికి శిక్ష పడకూడదని. ‘పది మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికీ శిక్ష పడకూడదు’ అన్నది బ్లాక్‍ స్టోన్‍ సిద్దాంతం. పదిమంది అమాయకులు బాధపడ్డా పర్వాలేదు ఒక్క దోషి తప్పించుకోకూడదు’ ఇది బిస్‍ మార్క్ సిద్దాంతం. కానీ ఈ సిద్దాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆమోదించలేదు. దీనికి కారణం బ్లాక్‍స్టోన్‍ సిద్దాంతంలో సహజ న్యాయ సూత్రాలు వున్నాయి. బిస్‍ మార్క్ సిద్దాంతంలో అవి కన్పించవు.


తనపై మోపబడ్డ ఆరోపణలకి వ్యతిరేకంగా ముద్దాయి తనను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని అవకాశాలు ప్రతి వ్యక్తికి వుండాలి. బ్లాక్‍స్టోన్‍ సిద్దాంతంలోని సారాంశం సహాయ న్యాయ సూత్రాలకి దగ్గర వుండటం. దాని వల్ల న్యాయం అందించే వ్యవస్థకి విశ్వసనీయత పెరుగుతుందని భావించడం. అందువల్ల వచ్చిందే ‘నేర నిరూపణ జరిగే వరకు అమాయకుడన్న భావన’. అందుకే సుప్రీంకోర్టు అధికరణ 22లో నిష్పాక్షిక విచారణ మిళితమై వుందని, అది ముద్దాయికి ఇవ్వకుండా చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అయితే న్యాయమూర్తుల విధుల గురించి చెప్పేటప్పుడు కొంత మార్పు సుప్రీంకోర్టు తీర్పుల్లో కన్పిస్తుంది. అమాయకుడికి శిక్ష పడకుండా చూడటం, అదేవిధంగా నేరం చేసిన ముద్దాయి శిక్ష నుంచి తప్పించుకోవడం రెండూ కూడా న్యాయమూర్తి నిర్వర్తించాల్సిన విధులని సుప్రీంకోర్టు ఒక తీర్పులో ప్రకటించింది. మొదటిది ఎంత ముఖ్యమో రెండవది అంతే ముఖ్యం అని కూడా సుప్రీంకోర్టు ఆ తీర్పులో చెప్పింది.


సుప్రీంకోర్టు ఈ విధంగా చెప్పినప్పటికీ అమాయకుడికి శిక్ష వేయమని చెప్పలేదు. అమాయకుడికి శిక్ష పడటం వల్ల అది తీవ్రమైన పరిణామాలకి దారి తీస్తుందని ప్రపంచ వ్యాప్తంగా నాగరిక సమాజం భావిస్తుందని బెంజిమన్‍ ఫ్రాంక్లిన్‍ ఒక ఉత్తరంలో పేర్కొన్నాడు. అందుకని ఒక అమాయకుడికి శిక్ష పడకూడదన్న ఉద్దేశ్యంతో నేరనిరూపణ అయ్యే వరకు అమాయకుడన్న భావనని ఆమోదించడం జరిగింది. నేరాన్ని నిరూపించడం ప్రాసిక్యూషన్‍పై వున్న బాధ్యత. ఈ భావన నేరం చేశాడన్న అనుమానం మొదలైనప్పటి నుంచి తీర్పు వచ్చే వరకు కొనసాగుతుంది. అనుమానం దశ నుంచి కోర్టు నేరం చేశాడని నిర్ధారించే వరకు ఈ భావన కొనసాగుతుంది.
క్రిమినల్‍ ప్రొసీజర్‍ కూడా ఈ భావన పునాది మీద తయారు చేయడం జరిగింది. ముద్దాయిపై నేరాభియోగం దాఖలైందంటే దాన్ని నిరూపణ చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‍పై వుంటుంది. దీని అర్థం ముద్దాయి నేరం చేశాడన్న అభిప్రాయం కలిగే విధంగా కేసుని రుజువు చేస్తే సరిపోదు. అది అనుమానానికి అతీతంగా రుజువు చేయాలి. అంటే నేరంలో ఆ అన్ని అంశాలని రుజువు చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‍పై వుంటుంది.


క్రిమినల్‍ ప్రొసీజర్‍ కోడ్‍లోని నిబంధనలు, అదేవిధంగా భారతీయ సాక్ష్యాధారాలు చట్టంలోని నిబంధనలు ముద్దాయికి అనుకూలంగా, బాధితులకి ప్రతికూలంగా వున్నాయనే అపప్రద, వాదన అప్పుడప్పుడూ విన్పిస్తుంది. కానీ అది సత్యం కాదు. రెండు పార్టీలకి సమతుల్యం వుండే విధంగా ఈ రెండు చట్టాలని తయారు చేయడం జరిగింది.


ప్రతి నేరం వెనక ఒక బాధితుడు వుంటాడు. ఆ బాధితులకి ఊరట కల్గించాల్సిన బాధ్యత కూడా నేర న్యాయ వ్యవస్థపై వుంది. అది బాధితుల హక్కు కూడా.
ముద్దాయికి చాలా హక్కులు వున్నాయి. అవి వరసగా చెప్పాలంటే, ‘నేర నిరూపణ జరిగే వరకు అమాయకుడన్న భావన’, నేర నిరూపణ భారం ప్రాసిక్యూషన్‍పై వుంటుంది. అది కూడా అనుమానానికి అతీతంగా రుజువు చేయాలి. నిజమనే భావన విషయంలో ముద్దాయి దానికి వ్యతిరేకంగా అనుమానానికి అతీతంగా రుజువు చేయాల్సిన అవసరం లేదు. ఆ విధంగా జరగడానికి అవకాశం లేదన్న భావన కోర్టుకి కలగచేస్తే చాలు. ఈ హక్కులే కాదు, ముద్దాయికి ఇంకా చాలా హక్కులు వున్నాయి. న్యాయవాదిని సంప్రదించే హక్కు, న్యాయసహాయం పొందే హక్కు, బెయిలు పొందే హక్కు, బహిరంగ విచారణ హక్కు, సాక్ష్యులని క్రాస్‍ ఎగ్జామింగ్‍ చేసే హక్కు, మౌనంగా వుండే హక్కు, శిక్ష గురించి వినే హక్కు ఇలా వున్నాయి.


ఇన్ని హక్కులూ వున్నంత మాత్రాన నేర న్యాయ వ్యవస్థ పూర్తిగా ముద్దాయి వైపే వుందని అనడానికి వీల్లేదు. ఎందుకంటే బలమైన శక్తి రాజ్యం. నేరమనేది రాజ్యానికి వ్యతిరేకంగా జరిగింది. రాజ్యాన్ని ఎదుర్కోవాలంటే ముద్దాయికి కొన్ని అయుధాలు వుండాలి. ఈ హక్కులన్నీ అలాంటి ఆయుధాలే. ఇవి లేకపోతే నేరారోపణ చేయబడిన వ్యక్తి జైల్లో వుండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని నేరారోపణ జరిగే వరకు ముద్దాయి అమాయకుడని భావించే సూత్రం అత్యంత అవసరం. ఈ విషయాన్ని మీడియా కూడా గుర్తిస్తే బావుంటుంది.


మంగారి రాజేందర్‍ (జింబో)
ఎ : 9440483001

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *