(ఆంగ్ల మూలం డా. వై. నాయుడమ్మ : తెలుగు సేత – డా. నాగసూరి వేణుగోపాల్)
(గత సంచిక తరువాయి)
కుహనా శాస్త్ర విజ్ఞానం
మరో విపత్కర పరిస్థితి ఏమంటే – సైన్స్ అని ముద్ర వేసుకోవడానికి కుహనా (Pseudo) సైన్స్ ప్రయత్నం చేస్తోంది. ‘‘ఇన్ ది నేమ్ ఆఫ్ సైన్స్’’ అనే పుస్తకంలో మార్టిన్ గార్డినర్ (Martin Gardener) కుహనా సైన్స్ కోసం ఎంతో మేథాశక్తి నాశన మవుతోందని ఇది శాస్త్రవేత్తలను, సైన్స్‌ను పెడత్రోవ పట్టిస్తుందని అభిప్రాయపడతారు.
శాస్త్రజ్ఞుకు మూఢనమ్మకాలు లేవనుకోవడం మరో పెద్ద మూఢనమ్మకం! శాస్త్రజ్ఞుడిని సులువుగా మోసం చేయవచ్చని గార్డినర్ అంటాడు. అత్యంత ప్రతిభావంతులు మాత్రమే బూటకం ఆట కట్టిస్తారని చాలామంది అనుకుంటారు. కాని అది నిజం కాదు. మేజిక్ మర్మం తెలియని వాడిని మోసం చేయటం ఎంతో తేలిక!
మనదేశంలో కుహనా విజ్ఞాన శాస్త్రాలూ, కుహనా శాస్త్రవేత్తలూ, చాలామంది వున్నారు. ఈ దేశంలో ఎన్ని నమ్మకాలు వున్నాయో అని ఎవరైనా ప్రయత్నించి, తేలిస్తే, అది ఘనకార్యమే! మంత్రగాళ్ళు, దైవాంశ సంభూతులు, యోగులు, జ్యోతిష్యులు మొదలైన వారు వారపత్రికలో ఆక్రమించే స్థలాన్ని బట్టి వారిని నమ్మేవారు ఇంకెంతమంది వున్నారో విశదమవుతుంది.
భారతదేశం ఇలా వుండటానికి కారణం లేకపోలేదు. చాలామంది శాస్త్రవేత్తలు ఉభయచరాలు (Amphibians) – ప్రయోగశాలో శాస్త్రవేత్త, ఇంట్లో మూఢవిశ్వాసి! డాక్టర్లు రుద్రాక్షలు ధరిస్తారు. శాస్త్రవేత్తలు దేవుడిముందు కొబ్బరికాయ కొట్టి తమ మనోసిద్ధి నెరవేరాలంటారు. ఆచార భూయిష్టమైన, మూఢనమ్మకాలు నియమైన ఈ సమాజంలో సైన్స్ మొగ్గదశ దాటని పువ్వు! ఇక ప్రగతి ఎప్పుడు వెలుగు చూస్తుంది? ఈ మూఢనమ్మకాలనూ, వాటి విషఫలానూ విజ్ఞాన శాస్త్రమూ, శాస్త్రీయ దృక్పథమూ ఎలా ఎదుర్కొంటాయన్నది మరో ప్రశ్న. మూఢనమ్మకాలు వుండిపోతాయా?
మూఢనమ్మకాలతో వచ్చిన తలనొప్పి ఏమంటే – వాటిని నమ్మడం చాలా తేలిక. అయితే రూపుమాపడం ఎంతో కష్టం.
ఈ మూఢనమ్మకాలవల్ల ఏమైనా ఉపయోగముందా? ఏదో పరలోకంలో పుణ్యగతి వస్తుందన్న ఆధారంలేని నమ్మకం తప్ప, ఏమైనా ప్రయోజనం వుందా?
జననం, మరణం, భయం, సందేహం వగైరాలు లేకపోతే మూఢనమ్మకాల అవసరం వుందా? సరే, మనిషికి మూఢనమ్మకం వుండనీ! అయితే అప్పుడు మనిషి తన పరిస్థితిని శాసించగలడా?
మూఢనమ్మకాలను కొందరు పూర్తిగా విశ్వసిస్తారు. మరికొందరు పూర్తిగా వ్యతిరేకిస్తారు. అయితే చాలామంది ఈ రెండు దృక్పథాలకు మధ్యస్థంగా వుంటారు. కొందరు మహానుభావులు బయట విమర్శిస్తూ, ఇంట్లో తు.చ.తప్పక పాటిస్తారు. పెద్దలకు గౌరవం ఇవ్వడానికి కొందరు మూఢనమ్మకాలను విశ్వసిస్తారు. మరికొందరు మూఢనమ్మకాలను పాటించడం ఎందుకంటే – ఈ భూమండలం మీద ప్రతి పాపానికీ తప్పించుకునే మార్గం ఏదో ఒకటి వుంది. లేదంటే లేదు. ఏద్కెనా వుంటే కనుక్కోలేదంటే మరచిపో – అనే దృష్టి కారణం కావడం. ఇంకా కొందరు ‘‘ఎందుకు మూఢనమ్మకాలను సందేహించడం? వాటితోనే కలసి నడుద్దాం’’ అనే దృష్టితో మూఢ నమ్మకాలు పాటిస్తారు. గొర్రెదాటు మనస్తత్వం (గుంపు మనస్తత్వం) వల్ల కూడా మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారు.
సైన్స్ వ్యాప్తితో మూఢనమ్మకాలు తొలగిపోతాయని కొందరు విశ్వసిస్తారు. మరికొందరు మూఢనమ్మకాలను జీవనపద్ధతిగా పరిగణిస్తారు. వైద్యశాస్త్రం, విజ్ఞానశాస్త్రం కొత్త ఆవిష్కరణలు, కొత్త రోగాలు మూఢనమ్మకాలకు దారితీస్తాయని ఉదహరిస్తారు. కొత్త మందుతో కొత్త రోగాలను వైద్యులు అంతం చేయాలి. అలాగే విద్యావేత్తలు హానికరమైన మూఢనమ్మకాలను రూపుమాపాలి.
మనిషి – ఇంగితం, అసంగతా మిశ్రమం !
మనిషి హేతుబద్ధమూ, హేతురహితమూ! మనిషికి మెదడూ, శరీరమూ వున్నాయి. దానిని సృజనాత్మకంగా ఉపయో గించుకొనే వీలుంది. సైన్స్ అనేది ఒక పనిముట్టు. అది అసంగత ధోరణులను తగ్గించి, హేతుబద్ధమైన ఆలోచనలను పెంచాలి. ద్విగుణీకృతమైన ఫలితం రాబట్టాలి. దానితో జీవనం మరింత అర్థవంతం కావాలి. హేతురహితమైన పోకడల నుంచి మనిషిని విడుదల చేసి, వాటి ప్రమేయం తగ్గించి, ఉత్పత్తి రేటును పెంచాలి.
నైపుణ్యం, ఆలోచన, ప్రవర్తనను సైన్స్ ప్రభావితం చేయడం కాకుండా, సంప్రదాయం, మూఢనమ్మకాల వల్ల వాటికి ఎదురయ్యే ఘర్షణను తగ్గించాలి. ఈ మూఢనమ్మకాలూ, ఆచారాలూ, సంప్రదాయ పద్ధతులూ, వాటి ప్రభావమూ తగ్గాలంటే, జిజ్ఞాస, విమర్శనాత్మకంగా ప్రశ్నించగలగడం, శాస్త్రీయ దృక్పథం పెరగాలి. ఇంకా అవి మన జీవనంలో కలిసిపోవాలి.
రాగద్వేష రహితమైన నిర్ణయం చేయగల శక్తిని విద్య ఇవ్వగలగాలి. ఈ విశాల దృక్పథం గల విద్య మన జీవితాల్లో హేతుబద్ధతనూ, సదాశయాలను నిర్ణయిస్తాయి.
నేడు కళాశాలల్లో, ఉన్నత పాఠశాలల్లో తగిన ప్రయోగశాలు, పరికరాలు లేక శాస్త్రబోధన కేవలం మేజిక్కు అవుతోంది. సరైన ప్రయోగాలతో, వాటి ప్రదర్శనతో సైన్స్ సామాన్యుడి ముందు నిలవాలి. కేవం సరైన విద్యయే భవిష్యత్తరాలకు అర్థవంతమైన దారి చూపగలదు.
ఆధునిక విజ్ఞానశాస్త్రం ఎలా పరిఢవిల్లిందో కొంచెం పరిశీలిద్దాం. బ్రిటిషువారి పాలనలో వారి శాస్త్ర విజ్ఞానంలో భాగంగా పెరిగింది భారతదేశ విజ్ఞానశాస్త్రం. అందువల్ల పాశ్చాత్య దేశాలలో వలె – ఉనికిలో వున్న ధోరణులను, మేథో పోకడలను ప్రశ్నించగల స్ఫూర్తి విద్యకు ఏనాడూ లేదు. సూర్యకేంద్రక సిద్ధాంతం, పరిణామ సిద్ధాంతం నిలదొక్కుకోవడానికి బహిరంగంగా పోరాడవలసివచ్చింది. పాశ్చాత్య దేశాలో ఈ సుదీర్ఘ పోరాటంలో ప్రతిసారీ సైన్సే విజయం వరించడమే కాక – పద్ధతి, పరిశీలనలు మీద కొత్త అభిప్రాయాలు ఏర్పడ్డాయి. కొత్త విలువలు, ఊహలుగ వ్యవస్థ ఏర్పడటానికి దోహదకారులయ్యాయి.
మనదేశంలో సైన్స్ ఇటువంటి దశలు ఏవీ లేకుండా కేవలం పాఠశాలల్లో, కళాశాలల్లో బోధించే విషయంగా మిగిలిపోయింది. ప్రొఫెసర్ బెర్నాల్ అభిప్రాయం ప్రకారం – అన్ని ఇతర రంగాలలో లాగా శాస్త్రరంగంలో కూడా ప్రతి భారతీయుడు దీన్ని కూడా జాతీయ అవసరంగా తప్పనిసరిగా భావించాలి. అయితే ఇది అంత సులభంగా జరగదు. దీన్ని బ్రిటిష్ వారి నుంచి నేర్చుకోవాల్సి వుంది. అయితే బ్రిటిష్‌వారు దాన్ని ప్రోత్సహించవచ్చు లేదా అవమానించ వచ్చు. తెలివైన ఊహలకూ, ఆసక్తికరమైన ప్రయోగాలకూ భారతీయులు పేరెన్నిక గన్నారు. అంతేకాదు అవిశ్వసనీయమైన ప్రయోగాలకు కూడా భారతదేశం పేరుపొందింది. ఇంతేకాకుండా ఉభయచ రాలైన శాస్త్రవేత్తలు కూడా బాగా ఎక్కువయ్యారు.
స్వాతంత్య్రం రాగానే శాస్త్రజ్ఞులలో ప్రజలలో సమూలమైన మార్పు వస్తుందని ఆశించారు. ప్రభుత్వం రూపొందించే ప్రణాళికలూ, కార్యక్రమాలలో శాస్త్రీయ దృక్పథం అంతస్సూత్రంగా వుంటుందని కూడా ఆశించారు. అయితే స్వాతంత్య్రం వచ్చిన తరువాత శాస్త్రవేత్తల సంఖ్య ప్రయోగశాలల సంఖ్య వాటికయ్యే ఖర్చు పెరిగిందే కానీ శాస్త్రీయ దృక్పథం వ్యాప్తి చెందలేదు. శాస్త్రీయ ఉద్యమం రాలేదు. దీనికి కారణం పూర్తిగా తెలియదు. మతానికి సంబంధించిన మౌలిక విషయాలలో కాకుండా, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక విషయాలలో, వాటి దృక్పథాలలో మార్పు లేకపోవడమే. దీనికి ఉభయచరాల్కెన శాస్త్రవేత్తలు కూడా కారణం కావచ్చు. అయితే నేడు పరిస్థితి మారుతోంది.
నేడు మునుపటి కన్నా ఎక్కువగా శాస్త్రీయ దృష్టి, శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ స్ఫూర్తి, శాస్త్రీయ ఉద్యమాలు విస్తరిస్తున్నాయి. మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలపై నేడు బహిరంగ చర్చలు, సభలు జరుగుతున్నాయి. ప్రభుత్వం సైతం శాస్త్ర, సాంకేతిక విజ్ఞానంతో సాంఘిక వ్యవస్థను మార్చవచ్చునని ఆశిస్తోంది. ‘‘శాస్త్రీయ దృక్పథం కేవలం ప్రయోగశాలకే మిగిలిపోకుండా జీవన పద్ధతిగా విస్తరించాలి’’ అని శ్రీమతి ఇందిరాగాంధీ అభిప్రాయపడ్డారు.
మూఢనమ్మకాలు ఎదుర్కొనడానికి శాస్త్రీయ దృక్పథాన్ని సామాన్య ప్రజానీకంలో విస్తరింపజేయాలంటే మూడు మార్గాలున్నాయి.
మొదటిది – చిరుప్రాయంలోనే దిద్దడం. అంటే పాఠశాల స్థాయిలో విజ్ఞాన శాస్త్రాన్ని బోధించడం, రెండవది – గ్రామీణ ప్రజానీకానికి శాస్త్ర, సాంకేతిక ఫలితాన్ని దగ్గరగా తీసుకువెళ్ళి, వారి సమస్యను పరిష్కరించడం. ఇలా గ్రామీణుల ముంగిటకు తీసుకు వెళ్ళడం వల్ల మరో వుపయోగం వుంది. మూఢవిశ్వాసాల్ని, అంధవిశ్వాసాల్ని, అద్భుత శక్తుల్ని గురించి వ్యాపించి వున్న అసంగత భావాలను తొలగించి హేతువాద దృష్టి, శాస్త్రీయదృష్టి, స్ఫూర్తి మొదలైన వాటిని వ్యాపింపచేయడానికి వీలవుతుంది. మూడవది – శాస్త్రీయ దృష్టికి సంబంధించిన క్లాజును భారత రాజ్యాంగంలో చేర్చగలగడం. మన రాజ్యాంగం 51 (ఎ) (హెచ్) ప్రకారం శాస్త్రీయ దృష్టిని, మానవతావాదాన్ని, శాస్త్రీయ స్ఫూర్తిని, సంఘ సంస్కరణాభిలాషను పెంపొందించడం ప్రతి పౌరుడి కర్తవ్యం.
సామాజిక సంక్షేమం కోసం శాస్త్ర, సాంకేతిక రంగాల్ని ఉపయోగించడం అనేది ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం! ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, సాంఘిక సంస్కరణ మొదలైన వాటిలో పెక్కు మూఢనమ్మకాలు, అసంగత భయాలు పెనవేసుకుని వుంటాయి. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఒకే ఒక మార్గం సామాన్యుడిని శాస్త్రీయంగా ఆలోచింప చేయడం! ‘‘మన జీవితాల్ని చీకటిమయం చేస్తున్న అంధవిశ్వాసాల్ని తొలగించడానికీ, సాహసం చేయగల ఉత్తేజాన్ని యివ్వడానికీ, భవిష్యత్తును చూడగల, దిద్దగల మేధస్సును అందుకోవడానికీ మనకు శాస్త్రీయ అవగాహన చాలాచాలా అవసరం.’’
ఈ జాతీయ కర్తవ్యంలో భారత శాస్త్రవేత్తలకు తగిన పాత్ర వుంది. ఈ గురుతర బాధ్యతను నిర్వహించాల్సింది శాస్త్రవేత్తయే! అర్థంలేని భావనలు, మూఢనమ్మకాలు, అసంగత అభిప్రాయాలు తొలగాలి. శాస్త్రీయవిజ్ఞానం నాలుగు చెరగులా పరచుకోవాలి. ఈ మార్గం నడక మందకొడిగా వుండవచ్చు. అయితే మన సమాజాన్ని శాసించే విభిన్న ధోరణులనూ, వాటి గమనాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం శాస్త్రవేత్తలకు ఎంతైనా వుంది.
–నాగసూరి వేణుగోపాల్,
ఎ : 9440732392