ప్రతి సంవత్సరం పర్యావరణ ప్రేమికులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు జూన్ 5న పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక అంశంపై దృష్టి పెడుతున్నట్లే ఈ సంవత్సరం థీమ్ ‘ఓన్లీ వన్ ఎర్త్’. ఈ సమస్త విశ్వంలో ప్రాణకోటికి జీవించగల అవకాశం ఉన్నది ఈ ఒకే ఒక్క భూమిపై మాత్రమే. ఈ భూమిపై గల ప్రకృతి వనరులను పరిరక్షించుకుంటూ మానవాళి సహజీవనం చేయాల్సి వుంటుంది. నిజానికి ఏం జరుగుతోంది?
ప్రకృతి వనరుల సంరక్షణ కంటే వినియోగం పేరుతో వనరుల దోపిడీకే ప్రభుత్వాలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం కోసం, మైనింగ్, ఇతర పరిశ్రమల అవసరాలకోసం, గృహ నిర్మాణాల కోసం యథేశ్చగా అడవులు నరుకుతున్నాం. ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తూ గుట్టలను, భూగర్బంలోని ఖనిజ సంపదను అందినంత తోడేస్తున్నాం. నదులను, జలవనరులను నాశనం చేస్తున్నాం. అధికోత్పత్తి పేరుతో యాభై ఏళ్ళుగా భూమిని రసాయనిక ఎరువులు, పురుగు మందులతో విషతుల్యం చేశాం. భూగర్భజలాల సంరక్షణ, పెంపు వంటి ఎంతో ముఖ్యమైన పనిని గాలికొదిలేసి పాతాళంలోని నీటిని సైతం తక్షణ అవసరాలకు తోడేస్తున్నాం. ఆ నీటిలోని ఫ్లోరైడ్, ఇతర రసాయనాలతో, కాలుష్య కారకాలతో రోగాలు తెచ్చుకుంటున్నాం. ధర్మల్ పవర్ కోసం లక్షలాది టన్నుల బొగ్గు నిల్వలను వెలికితీసి బూడిద చేస్తున్నాం, వాతావరణాన్ని, భూమిని మరింత వేడెక్కిస్తున్నాం, జీవావరణను ధ్వంసం చేస్తున్నాం. సంపద సృష్టి పేరుతో సమస్త ప్రకృతి వనరులను సర్వనాశనం చేస్తున్నాం. భావితరాలు మనల్ని క్షమించలేనంతగా దిగజారుతున్నాం. ప్రకృతిలో పంచభూతాల్లో నీరు, నదులు ముఖ్యమైన భాగం. గత కొన్నేళ్ళుగా నదులు, జలవనరుల రంగంలో కృషి చేస్తున్నందున నా అవగాహనను పంచుకునే ప్రయత్నం చేస్తాను.
మానస సరోవరం వంటి ఎంతో పవిత్రమైన, స్వచ్ఛమైన ప్రకృతి నుండి జనించిన సింధూ, బ్రహ్మపుత్ర నదులు, హిమాలయాల్లోని గోముఖి పర్వతాల్లో మొదలయ్యే భాగీరథి, మరోనది అలకానందల సంగమంతో దేవప్రయాగ వద్ద ప్రారంభమయ్యే పవిత్ర గంగానది, పశ్చిమ, తూర్పు కనుమల్లో జనించిన అనేక నదులు, ఉపనదులు ఈ దేశ ప్రజల నాగరికతకు, సంస్కృతికి మూలం. మన పూర్వీకుల చరిత్ర ఆనవాళ్ళను ఈ నదుల తీరాల్లోనే వెదుక్కుంటున్నాం. నదిని కన్నతల్లిలా, దేవతలా భావించిన పూర్వీకుల వారసులం మనం. పుట్టుక నుంచి చావుదాకా విడదీయరాని అనుబంధమే మనిషికి నదికి మధ్యగల సంబంధం. సంచార జీవితాలకు స్థిరత్వాన్ని నేర్పింది నది. వేటాడే మనస్తత్వాలకు వ్యవసాయం వైపు మరిల్చింది నది. ఉత్పత్తి జ్ఞానాన్నిచ్చి మనిషిని ఉన్నత శిఖరాలకు చేర్చింది నది. విజ్ఞాన నిలయమైన మఠాలకు, ఆరామాలకు బౌద్ధవిశ్వ విద్యాలయాలకు నాటి చిరునామా నది. తపస్సంపన్నులైన మహారుషులకు, యోగులకు ఒడి ఈ నది. మరణానంతరం అస్థికలను, బూడిదను తనలో నిమజ్జనం చేసుకొని వారి వారసులకు గొప్ప ఉపశమనాన్నిచ్చేది నది. పన్నెండేళ్ళకోసారైనా పుష్కరాల పేరుతో మహాపండితులను ఒక్క దగ్గర చేర్చి సమాజహితం కోరే చర్చోపచర్చలకు వేదిక నది. పర్యావరణకు, జీవావరణకు పునాది నది. మానవాళి భవిష్యత్తుకు భద్రతనిచ్చేది నది.
వేదాల్లో, పురాణాల్లో, శిలాశాసనాల్లో, నదుల ప్రాముఖ్యత, పరిరక్షణ గురించి మన పూర్వీకులు శతాబ్దాలుగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ‘‘నది నీటిలో మలినాలను వదలుతూ స్నానమాచరించడం, నీటిలో దుర్వాసనను వదలడం ప్రక్కన ఉన్న వ్యక్తిని పదునైన ఆయుధంతో హింసించిన దానితో సమానమ’’ని వేదాలు నదుల పవిత్రతపై వ్యాఖ్యానించిన ఘన చరిత్ర మనది. అంత పవిత్రంగా చూసుకోవాల్సిన నదులను కాళ్ళు తడుపుకోవడానికి కూడా వీల్లేని స్థాయిలో భయంకరమైన కాలుష్యంతో నింపినాం. ఏ ప్రాణీ నదుల నీటిలో జీవించజాలని స్థితిని తీసుకొస్తున్నాం.
దేశంలోని నదులు ఎదుర్కొంటున్న సమస్యలు
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రవహిస్తున్న నదులు – ఉపనదులు మానవ శరీరంలోని రక్తనాళాల్లాగే దేశమంతా విస్తరించి నలుమూలలకు ప్రవహిస్తున్నాయి. రక్తనాళాలు కుంచించిఉకు పోతే రక్తపోటు వచ్చినట్లే నదులు ఆక్రమణలతో ఇరుకై పోతే వరద జనావాసాలపైకి ముంచెత్తుతుంది. రక్తనాళాల్లో చెడురక్తం ప్రవహిస్తే వరీరాంగాలు పాడైనట్లే నదిలో కాలుష్యపు నీరు ప్రవహిస్తే పర్యావరణ సమస్యలు తలెత్తి ప్రకృతి ధ్వంసమై ఆ నీటిలోని చేపలు, ప్రాణులు మరణిస్తాయి. జీవావరణ (Biodiversity)కి ముప్పు ఏర్పడుతుంది.
గంగానది నుండి కావేరీనది దాకా నదులన్నీ కాలుష్యమయమై పోయాయి. నగరాలలో ప్రవహించే ఉపనదులు, వాగులన్నీ డ్రైనేజీ నాలాలుగా మారిపోయి వాటి ఉనికినే పోగొట్టుకుంటున్నాయి. ఫలితంగా వర్షాకాలంలో ప్రతి నగరాన్ని, పట్టణాలను వరదలు ముంచెత్తి ప్రజలను భీతావహులను చేస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని ఉపనదులు, వాగులు అంతరించిపోతున్నాయి లేదా పునరుద్ధరించజాలని స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ దుస్థితికి కారణం స్వాతంత్య్రానంతర పాలకులకు నదుల పరిరక్షణ పట్టకపోవడమే, పట్టణాభివృద్ధి పట్ల విజన్ లేకపోవడమే.
నదుల్లోకి కాలుష్యం పలు విధాలుగా చేరుతున్నది. పెద్దనగరాల్లో వేల సంఖ్యలో వెలసిన పరిశ్రమల వ్యర్థజలాలు సమీపంలోని నదిలోకే మళ్ళిస్తారు. ఆవరణలోనే ఎఫ్లుయెంట్/సీవేజ్ ట్రీట్‍మెంట్‍ప్లాంటులను ఏర్పాటు చేసుకొని వ్యర్థ జలాలను, రసాయనాలను ట్రీట్ చేయాలనే నిబంధనలు ఉన్నా వాటిని పనిచేయించడం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి పారిశ్రామిక వేత్తలు వ్యర్థ జలాలను, రసాయనాలను వదిలించుకోడానికి భూగర్భాన్ని లేదా వాగులు, నదులను ఎంచుకుంటున్నారు. కొన్నేళ్ళ క్రితం ఎల్.బి.నగర్‍లో వున్న సిరీస్ కంపెనీ నేరుగా భూగర్భంలోకి బోర్లువేసి కాలుష్యాన్ని, రసాయనాలను పంపడం వల్ల నలభై ఏళ్లయినా నేటికీ చైతన్యపురి, ఎల్.బి.నగర్ ప్రాతాల్లోని బోర్లలో ముదురు ఆకుపచ్చరంగు రసాయన జలాలే కనిపిస్తున్నాయి. ఏ పనికి గూఆ ఈ నీటిని వినియోగించలేము. నార్కెట్‍పల్లి (నల్లగొండ)లోని మరొక కంపెనీ ఆవరణలో నుండి ఒక వాగు ప్రవహిస్తుంది. కొన్నేళ్ళ క్రితం ఆ కంపెనీ యజమానులు తమ ఆవరణలోని వాగులనే బోర్లు వేసి కాలుష్య జలాలను భూగర్భంలోని పొరల్లోకి పంపించారు. ఫలితంగా ఆ ప్రాంతంలోని భూగర్భ జలాలన్నీ కలుషితమై పోయాయి.
హైదరాబాద్‍కు పశ్చిమాన వున్న పటాన్ చెరువులోని పరిశ్రమల వ్యర్థ, రసాయనిక జలాలను నేరుగా నక్కవాగులోకి వదలడం వలన మంజీరా సంగమం దాకా నక్కవాగు కలుషితమై పరిసర గ్రామాల ప్రజల, పశువుల ఆరోగ్యాలపై తీవ్రమైన దుష్పప్రభావాలను కలిగించిన సంగతి తెలిసిందే.
ఏళ్ళు గడిచినా పరిస్థితిలో మార్పేమీ లేదు. ఈ కంపెనీలపై కేసులు తప్ప! ఇప్పుడు కూడా పరిశ్రమల వ్యర్థ, కాలుష్య జలాలు హైదరాబాద్ పొలిమేరల్లోని చెరవుల్లోకి, వాగుల్లోకి, హుస్సేన్ సాగర్‍లోకి, నేరుగా మూసీ నదిలోకి ప్రవహిస్తూనే వున్నాయి. పరిశ్రమల ఆవరణల్లో భూగర్భంలోకి వదలడం లేదని గ్యారంటీ ఏమీ లేదు. కొన్ని పరిశ్రమలు వ్యర్థ జలాలను ట్యాంకుల్లో నింపుకుని నగరానికి తూర్పున వున్న మూసీ నదిలోకి నేరుగా విడుస్తున్నారు. జంటనగరాల్లోని డ్రైనేజీ ప్రవహిస్తున్నాది నేరుగా మూసీనదిలోకే కదా! మూసీనదిలోకి వదిలే వ్యర్థ జలాల్లో కనీసం మూడింట రెండు వంతులు శుద్ధి చేసే సౌకర్యం లేనందున నేరుగా విడిచి పెడుతున్నారు. ఘట్కేసర్ సమీపంలోని గ్రామాల నుండి మూసీ ప్రాజెక్టు వరకు నదికి ఇరువైపులా విస్తరించి వున్న పలు గ్రామాల ప్రజలు కాలుష్యంతో ఎన్నో బాధలు పడుతున్నారు. కాలుష్య జలాలతోనే పంటలు పండిస్తూ రోగాల పాలవుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మూసీ ప్రక్షాళన కోసం కేసీఆర్ ప్రభుత్వం దీర్ఘకాలిక, భారీ వ్యయమయ్యే ప్రణాళికను సిద్ధం చేసింది. మూసీ క్యాచ్‍మెంట్‍లోని కుత్బుల్లాపూర్, కూకట్‍పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లోని చెరువుల వద్ద ఎస్.టీ.పీ.లను నిర్మిస్తున్నది. వీటికోసం రూ.3600 కోట్లు వ్యయం చేస్తున్నది. హుస్సేన్‍సాగర్‍లోకి రసాయన జలాలను తెచ్చే సనత్‍నగర్ నాలాను నేరుగా మూసీలోకి దారిమల్లించినా, సాగర్ జలాల శుద్ధి కోసం వందల కోట్లు ఖర్చవుతున్నా లక్ష్యసాధనకు మరెంత కాలం పడుతుందో అంచనాకు అందడం లేదు. కానీ ఒక ప్రయత్నం మాత్రం ప్రభుత్వం నుండి మొదలై మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‍మెంట్ కార్పొరేషన్ కూడా నగరం మధ్యలోని మూసీ నదిలోని డంపింగ్స్ను, ఆక్రమణలను తొలగిస్తూ నది పరిరక్షణకు, నదిలో భవిష్యత్తులో రిక్రియేషన్ సౌకర్యాల అభివృద్ధికోసం సిద్ధమవుతున్నది. మూసీనదికి పూర్వవైభవం తేవడానికి ప్రభుత్వ ప్రయత్నాలు సఫలీకృతం కావాలని కోరుకుందాం.
గంగానది ప్రక్షాళన
హిమాలయాల్లో జనించే స్వచ్ఛమైన నదులు ఉపనదుల్లో దాదాపు 30 శాతం జీవాన్ని కోల్పోయి మృత నదులుగా (Biologicallydead) మారిపోయినవి. కాలుష్యం పెరగడమే దీనికి కారణం. హిమాలయ నదుల్లో తలసరి మంచినీటి లభ్యత 1951లో 5177 క్యూబిక్ మీటర్లుండగా 2000 సంవత్సరం నాటికి 1342 క్యూ.మీ. తగ్గిపోయింది. ప్రస్తుతం ఇంకా తగ్గి వుంటుందనడం నిస్సందేహం.
2525 కి.మీ. పొడవైన గంగానది ఉత్తర భారతదేశానికి లైఫ్‍లైన్ వంటిది. హిందువుల ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక. విదేశాల్లో వుండే భారతీయులు ఎంతో గర్వంగా ‘‘మేరా దేశ్ మే గంగా బహత్‍హై’’ అని చెప్పుకుంటారు. అంతగొప్పదైన, స్వచ్ఛమైన, పవిత్రమైన నది కాలుష్య నదిగా మారడం వలన త్రాగునీటి సంబంధిత వ్యాధులతో లక్షలాది మంది చిన్నారులు, పెద్దలు ప్రతి ఏటా మరణిస్తున్నారు. దేశంలోని 40 శాతం (11 రాష్ట్రాలు) జనాభా గంగానది పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్నారు. భారీ పరిమాణంలో నీటిని సముద్రంలోకి తరలించే ప్రపంచ పెద్దనదుల్లో 5వ స్థానం గంగానదిది (19000 క్యూ.మీ/సెకండ్) నాల్గవ స్థానంలో కూడా మన దేశంలోని బ్రహ్మపుత్రానదిదే (20,000 క్యూ.మీ./ సెకండ్).
గంగానదిలోకి అత్యంత ఎక్కువ ప్రవాహాన్ని జోడించేది యమునానది (58.5 శాతం).
అలహాబాద్ త్రివేణిసంగం వద్ద యమునానది గంగానదిలో కలుస్తుంది. లక్షలకు మించిన జనాభావున్న వందకు పైగా నగరాలు, 50వేల నుంచి లక్షలోపు జనాభాగల 97 నగరాలు, 48 పట్టణాలు నుండి పారిశ్రామిక రసాయన వ్యర్థ జలాలు, గృహ సంబంధిత వ్యర్థ జలాలు గంగానది కాలుష్యానికి కారణమవుతున్నవి. గంగానది సముద్రంలో కలిసే ప్రాంతంలోని సుమారు 500 గ్రామాల్లో (పశ్చిమ బెంగాల్) క్యాన్సర్ వ్యాధితో ఇంటికొక్కరు లేదా ఇద్దరు మరణిస్తున్నారు.
దేశం గర్వించదగ్గ గొప్ప పర్యావరణ శాస్త్రవేత్త, ప్రొ. గురుదాస్ అగర్వాల్ ఏ జి.డి. అగర్వాల్ ఏ సంత్ స్వామీసానంద్ తన 86వ ఏట గంగానది ప్రక్షాళన కోసం 111 రోజులు హరిద్వార్‍లో ఆమరణ నిరాహారదీక్ష చేసి 11-10-2918న ప్రాణాలర్పించారు. భగీరథ నదిపై డ్యాంల నిర్మానాన్ని (2009లో) అడ్డుకుని 11 రోజులు నిరాహారదీక్ష చేసి సఫలీకృతులైనారు. ప్రొ.జి.డి. అగర్వాల్ 1979-80 మధ్యకాలంలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కు మెంబర్ సెక్రటరీగా పనిచేసారు. రాజేంద్రసింగ్ (Water man) స్థాపించిన తరుణ్ భారత్ సంఘ్‍కు ఉపాద్యక్షులుగా ఉన్నారు. ఆమరణ దీక్షను మాన్పించడానికి అప్పటి జలశక్తి, గంగా పునరుజ్జీవ శాఖామంత్రి నితిన్ గడ్కరీ చేసిన ప్రయత్నం విఫలమైంది. ‘‘ప్రభుత్వం గంగానది ప్రక్షాళన కోసం మాత్రమే దృష్టి పెట్టింది. నేను అవిరళ్, నిర్మల్ గంగ కోసం నిరాహారదీక్ష చేస్తున్నా’’నని ప్రొ.జి.డి. అగర్వాల్ ప్రకటించారు. గంగానది క్యాచ్‍మెంట్‍లో, ప్రధాననదిపై ఎలాంటి అడ్డుకట్టలు (డ్యాంలు, హైడల్ పవర్ ప్రాజెక్టులు) నిర్మించరాదని ఆయన సంకల్పం. ఒక గొప్ప పర్యావరణ ఇంజనీర్‍ను దేశం కోల్పోయింది.
గంగానది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం 2015లో ‘నమామి గంగా’ ప్రాజెక్టును ప్రారంభించింది. రూ. 30,578 కోట్ల వ్యయంతో 365 ప్రాజెక్టులను (గంగానది కాలుష్య నివారణ కోసం ఎస్.టి.పి.ల నిర్మాణం, నది తీరంలో మొక్కల పెంపకం, ఘాట్లు, స్నాన వాటికలు, గ్రామీణ పారిశుద్ధ్యం, క్రిమెటోరియం (అంత్యక్రియల కోసం)ల నిర్మాణం తదితరమైనవి) ప్రారంభించారు. వీటిని 9 రాష్ట్రాల్లో (గంగా బేసిన్) నిర్మిస్తున్నారు. వీటిలో 160 సీవరేజ్ ప్రాజెక్టులు (4930 ఎంఎల్‍డీ), 5137 కి.మీ. నది ఉపనదులలో కాలుష్య నివారణ చర్యలు రూ.24,633 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. 2021 నాటికి ఆరేళ్ళలో కేవలం 964 ఎంఎల్‍డీలను శుద్ధిచేసే ఎస్.టి.పి.లను మాత్రమే నిర్మించారు. తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి శ్రీ అశోక్ కుమార్ నమామి గంగా బాధ్యతలను చేపట్టి గత 4 నెలల్లో మరో 945 ఎంఎల్‍డీల శుద్ధికోసం ఎస్‍టీపీలను నిర్మించడం ఆయన పట్టుదలకు, అంకిత భావానికి నిదర్శనం.
ఒక నది కాలుష్యమయమైతే దాని ప్రక్షాళన ఎంత కష్టమైనదో, వ్యయంతో కూడినదో తెలుపడానికే ఈ గంగానది ఉదాహరణ. మూసీ ప్రక్షాళన కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా భారీ వ్యయంతో కూడిన ప్రణాళికను అమలు చేస్తున్నది. దేశంలోని నదులన్నీ ప్రక్షాళన చేయడానికి లక్షల కోట్లు వ్యయమవుతాయి. కాలుష్యాన్ని రానిచ్చేదెందుకు? భారీ వ్యయంతో ప్రక్షాలనెందుకు?
దేశంలోని నదులు – ఉపనదులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలు:
1. అడవికి, ప్రైవేట్ భూములకు, గ్రామాలకు సరిహద్దులుంటాయి. కానీ నదుల సరిహద్దులను ప్రభుత్వాలు గుర్తించ నందున ఆక్రమణలకు గురవుతున్నాయి.
2. వాటర్ వేస్ అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాలు పర్యావరణకు జరుగుతున్న ముప్పును గుర్తించడం లేదు. ఉదా: గోవాలోని మాండవి నదిలో 45 కి.మీ. వాస్కోడిగామా పోర్ట్ నుండి వేదాంత పిగ్ ఐరన్ కంపెనీ వరకు పెద్దపెద్ద షిప్పుల్లో బొగ్గుపొడిని ఎలాంటి కప్పు లేకుండా తరలించడం వలన 90 శాతం చేపల లభ్యత, ఉత్పత్తి తగ్గిపోయింది. చాలా రకాల చేపల జాతులు అంతరించాయి. వేలాది ఫిషర్‍మెన్ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బొగ్గుపొడి నదివెంట ఉన్న జీడిమామిడి తోటల ఆకులపై పడడం వలన వాటి ఉత్పత్తి బాగా తగ్గింది.
3. నదికి ఇరువైపులా అడవులను నరకడం వల్ల భూమి కోతకు గురవుతూ నది హద్దులు విస్తరించి రైతుల పొలాల పరిమాణం తగ్గుతున్నది.
4. నదుల్లోకి వ్యవసాయ ఎరువులు, పురుగుమందుల కాలుష్యం కూడా వచ్చి చేరుతున్నది. ఈ నీరు త్రాగినవారికి క్యాన్సర్ వంటి జబ్బులు వస్తున్నాయి.
5. నది క్యాచ్‍మెంట్‍లోని చిన్న చిన్న వాగులు, కుంటలు, చెరువులు ఆక్రమణలకు గురవుతున్నవి. ప్రభుత్వాలు వీటి పరిరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. చట్టాలను అమలు జరపడం లేదు.
6. నదుల్లో, ఉపనదుల్లో, వాగుల్లో ఇసుకను యదేశ్చగా, నియమాలకు విరుద్ధంగా తీస్తుండడంతో భూగర్భజలాలు అడుగంటుతున్నవి. వరుస కరువులు వస్తే ఆదుకునేది ఈ భూగర్భ జలాలే. ఇవి చాలా దిగువకు పడిపోవడం వలన ఫ్లోరైడ్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి తెలంగాణ ఒక మోడల్‍ని దేశానికందించింది. గతంలో నల్గొండ ఫ్లోరైడ్ బాధితుల గోస తెలిసిందే. కృష్ణా జలాలను ఇంటింటికీ (మిషన్ భగీరథ ద్వారా) అందించడం వల్ల ఈ సంవత్సరం ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా జాతీయ అవార్డును తెలంగాణ సొంతం చేసుకుంది.
అన్ని రాష్ట్రాల్లో కూడా ఫ్లోరైడ్ నివారణ కోసం భూగర్భ జలాల స్థానంలో నదుల నీటిని అందిస్తే ఫ్లోరైడ్, ఇతర కాలుష్య కారకాల నుండి ప్రజలను కాపాడగలం.
7. నదులపై పెద్ద డ్యాంల స్థానంలో బ్యారేజీలను నిర్మించి ఏడాది పొడుగునా ‘ఎన్విరాన్‍మెంటల్ ఫ్లో’ ఉండేలా నదిలో నీరు ప్రవహించేలా చూడాలి. నదిలో ఇరు ప్రక్కలా ఉండే బయోడైవర్సిటీని పరిరక్షించడానికి నదిపై ఆధారపడ్డ వృత్తులు కొనసాగించడానికి ఈ నిరంతర ప్రవాహాలు దోహదపడతాయి.
8. రివర్ ఫ్రంట్ డెవలప్‍మెంట్ పేరుతో నదిలో ఎలాంటి నిర్మాణాలు, వాకింగ్/సైక్లింగ్ ట్రాక్‍లు నిర్మించడం, కాంక్రీట్ జంగిల్‍గా మార్చడం నదికి హానికరం. మూసీ నదిలో ఏకంగా బస్టాండ్, మెట్రో రైల్ స్టేషన్లు నిర్మించడం జరిగింది. భవిష్యత్తులో మూసీ ఉప్పొంగి హిమాయత్‍సాగర్, గండిపేటల గేట్లు పూర్తిస్థాయిలో తెరవాల్సి వస్తే మూసీ ఇరుప్రక్కల గల వాడలు, ఇండ్లు జలమయం కాక తప్పదు.
9. నదుల క్యాచ్‍మెంట్లలో ఎలాంటి రసాయ, కాలుష్య కారక పరిశ్రమలను అనుమతించరాదు. ఇప్పటికే ఉన్న వాటిని గుర్తించి దూర ప్రాంతాలకు తరలించి ఇ.టి.పి., ఎస్.టీ.పీ.లను నిర్మించుకొని పనిచేయించేలా చర్యలు తీసుకోవాలి. కాలుష్యాన్ని భూగర్భంలోకి విడిచే కంపెనీలను గుర్తించి వాటి లైసెన్సులను, అనుమతులను రద్దు చేయాలి. నది క్యాచ్‍మెంట్లలో రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించేలా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించేలా రైతులను చైతన్యపరచాలి.
10. నదులపట్ల, నీటి వినియోగం పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంచడం కోసం అన్ని విద్యాసంస్థల్లో ‘వాటర్ లిటరసీ సెంటర్ల’ను ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థల, ఎన్.ఎస్.ఎస్. సహకారంతో ఏర్పాటు చేయాలి. విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో ‘జలసంరక్షణ’ పాఠాలు (సిలబస్‍లో) చేర్చాలి. కళాశాలల్లో డిప్లొమా కోర్సులు, సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించాలి.
వాటర్‍మాన్ ఆఫ్ ఇండియా డా।। రాజేంద్రసింగ్ ఆధ్వర్యంలో అన్ని నదులపై, ఉపనదులపై, వాగులపై పౌర కమిటీలు, సంఘాలు ఏర్పాటవుతున్నాయి. ఫెడరల్ స్వభావం గల ఈ సంఘాల్లో స్వచ్ఛంద సంస్థలు, సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, జలసంరక్షణ కోసం పనిచేస్తున్నవారు చేరి పనిచేయాలి. ప్రజల్లో అవగాహన పెంచాలి. ప్రభుత్వాలు నదుల, జలాశయాల పరిరక్షణలో ఘోరంగా విఫలమైనప్పుడు భవిష్యత్ తరాల కోసం ప్రజలే స్వచ్ఛందంగా వీటి పరిరక్షణకు ముందుకు రావాలి.
వీచే గాలి, మోసే భూమి,పారే నది పవిత్రంగా, స్వచ్ఛతతో ఉన్నప్పుడే పర్యావరణ, మన శరీరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
- వి. ప్రకాశ్, ఛైర్మన్
తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ
ఎ : 95539 55304