భానుడి గుట్టు… భారత్‍ గుప్పిట్లో…!! ఏ ఆదిత్య – ఎల్‍1

ఆ చల్లని సముద్ర గర్భం
దాచిన బడబానల మెంతో?
ఆ నల్లని ఆకాశంలో

కానరాని భానువులెందరో? అంటూ సుదూర విశ్వాంతరాళంలో మనకు తెలియని రహస్యాలెన్నో ఉన్నాయని తన గేయం ద్వారా విలక్షణ శైలిలో వ్యక్తీకరించారు మహాకవి దాశరథి కృష్ణమాచార్య. ఆ రహస్యాలను ఛేదించేందుకేనా అన్నట్లుగా గతంలో మంగళ్‍యాన్‍ పేరుతో అంగారక గ్రహంపైకి, తాజాగా చంద్రయాన్‍-3 పేరుతో చంద్రుడి ఉపరితలంపై రోవర్‍ను సాఫ్ట్ ల్యాండింగ్‍ చేయించడం ద్వారా రెండు గ్రహాంతర ప్రయోగాలను నిర్వహించి సరికొత్త ఉత్సాహంతో ఉన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), ఇప్పుడు భూమిపై నున్న సకల ప్రాణికోటి మనుగడకు ఆధారభూతమైన సూర్యుడి యొక్క రహస్యాలను ఒడిసి పట్టేందుకు గానూ, గత సెప్టెంబర్‍ 2న పీఎస్‍ఎల్‍వీసీ – 57 రాకెట్‍ ద్వారా ఆదిత్య ఎల్‍-1 పేరుతో ఒక అంతరిక్ష వేదశాల (స్పేస్‍ అబ్జర్వేటరీ)ను ప్రయోగించింది. సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఇస్రో పంపించిన మొట్టమొదటి స్పేస్‍ అబ్జర్వేటరీ ఇదే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆదిత్య ఎల్‍-1 మరియు దాని వల్ల మానవాళికి చేకూరే ప్రయోజనాల గురించి మనమూ తెలుసుకుందాం…!!


సూర్యుడి పైన పరిశోధనలు ఎందుకు?

విశ్వం కోటానుకోట్ల నక్షత్రాల సమాహారం. ఈ నక్షత్రాలు నిరంతరం శక్తిని విడుదల చేస్తూ ఉంటాయి. విశ్వం పుట్టుక, భవిష్యత్తుల గురించి తెలుసుకోవడానికి నక్షత్రాలే ప్రధాన ఆధారం. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడిని పరిశోధిస్తే, విశ్వం గురించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. సౌర కుటుంబంలో శక్తికి మూలస్థానం సూర్యుడే. 450 కోట్ల సం।।రాల వయసున్న సూర్యుడు భూమికి దాదాపుగా 15కోట్ల కి.మీ. దూరంలో ఉన్నాడు. సూర్యుడిలో నిరంతర కేంద్రక సంలీన చర్యల ద్వారా హైడ్రోజన్‍ హీలియంగా మారుతుంది. ఇలా మారే క్రమంలో అత్యధిక స్థాయిలో శక్తి విడుదల అవుతుంది.


సూర్యుడి కేంద్రాన్ని కోర్‍ అంటారు. అక్కడ ఉష్ణోగ్రత 1 కోటి 50 లక్షల సెల్సియస్‍ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. కేంద్రం నుంచి ఉపరితలానికి వచ్చే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. సూర్యుడి ఉపరితలాన్ని క్రోమోస్పియర్‍ (వర్ణమండలం) అంటారు. ఇక్కడ సుమారు ఆరువేల డిగ్రీ సెల్సియస్‍ ఉష్ణోగ్రత ఉండగా, సూర్యుడి నుండి వేల కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉండే సూర్యుడి యొక్క వెలుపలి వలయాన్ని కొరోనగా వ్యవహరిస్తారు. అయితే ఇక్కడ, సూర్యుడి ఉపరితలం కన్నా అధికంగా 10 లక్షల డిగ్రీ సెల్సియస్‍ ఉష్ణోగ్రత ఉంటుంది. అలా ఎందుకుందో శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.
సూర్యుడి ఉపరితలం నుండి నిత్యం అన్ని దిశల్లో పెద్ద ఎత్తున సౌర పవనాలు విడుదల అవుతాయి. కొన్నిసార్లు సూర్యుడిపై కొన్ని ప్రదేశాల్లో తీవ్రస్థాయిలో జరిగే కేంద్రక సంలీన చర్యల వల్ల ఒక్కసారిగా పేలుళ్ళు జరిగి సౌర తుఫానులు పుడతాయి.
ఇలాంటి పరిణామాల్లో ప్రధానమైనది కొరోనల్‍ మాస్‍ ఎజెక్షన్‍ (సీఎంఈ) దీన్ని సౌర కంపంగా కూడా పేర్కొంటారు. దీని వల్ల కోట్ల టన్నుల మేర సౌర పదార్థాలు సెకనుకు 3 వేల కి.మీ.ల వేగంతో దూసుకొస్తుంటాయి. వీటిలో కొన్ని భూమి దిశగా రావొచ్చు.


భారీ నష్టాలు..!

సీఎంఈ లోని ఆవేశిత రేణువుల తాకిడివల్ల ఉపగ్రహాల్లోని ఎలక్ట్రానిక్‍ పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల కమ్యూనికేషన్‍, జీపీఎస్‍ తదితర అంతరిక్ష ఆధారిత సేవలకు అవరోధం ఏర్పడుతుంది. ఇంటర్నేషనల్‍ స్పేస్‍స్టేషన్‍లోని వ్యోమగాములకూ ఇవి హానికరం.
ఉత్తర దక్షిణ ధ్రువాలు కలిగిన ఒక అయస్కాంతంలా భూమి పనిచేస్తుంది. భూమిని చేరుకోగానే సీఎంఈ రేణువులు, భూఅయస్కాంత క్షేత్ర రేఖల గుండా పయనిస్తాయి. ఈ క్రమంలో భూఅయస్కాంతక్షేత్రాన్ని ప్రభావితం చేస్తాయి. దీనివల్ల హైవోల్టేజీ ట్రాన్స్ ఫార్మర్లపై ప్రభావం పడుతుంది. 1989లో సూర్యుడి నుండి భారీగా ఆవేశిత రేణువులు దూసుకొచ్చాయి. ఫలితంగా కెనడాలోని క్యూబెక్‍లో 72 గం।।ల పాటు విద్యుత్‍ సరఫరా నిలిచిపోయింది. 2017లో జ్యూరిచ్‍ విమానాశ్రయంలో కూడా దాదాపు 15గం।।లు ఇబ్బందులు ఎదురయ్యాయి. అందువల్ల సూర్యుడిని నిరంతరం పర్యవేక్షించేందుకుగానూ, ఒక పరిశీలనా కేంద్రం అవసరం. ఇందులో భాగంగానే ఇస్రో ఆదిత్యఎల్‍-1ను ప్రయోగించింది. ఇప్పటి వరకు సౌర పరిశోధనకు నాసా, ఈసా (యూరోపియన్‍ స్పేస్‍ ఏజెన్సీ) లతో పాటు అమెరికా, యూకేల సహాయంతో జపాన్‍ సౌర పరిశోధన ఉపగ్రహం ‘‘హినోదె’’ను 2006లో ప్రయోగించింది. అయితే వాటిన్నిటికన్నా ఆదిత్య ఎల్‍-1 రెండు విషయాల్లో ప్రత్యేకమైనది. వాటిలో మొదటిది, ఆదిత్య ఎల్‍-1 ద్వారా సౌర కొరోనాను దాదాపుగా అది ఎక్కడి నుండి ప్రారంభమవుతుందో అక్కడి నుండే సునిశితంగా పరిశీలించవచ్చు. రెండవది సీఎంఈలకు కారణమయ్యే సౌర వాతావరణంలో అయస్కాంత క్షేత్ర మార్పులను కూడా పరిశీలించే అవకాశం ఉంది.


ఆదిత్య ఎల్‍-1 అనే పేరు ఎందుకు పెట్టారు…!!

సౌర పరిశోధనకు ఉపగ్రహాన్ని పంపిన నాల్గవదేశంగా ఇండియా రికార్డు సృష్టించింది. గతంలో సౌర ఉపరితలం కన్నా, సౌర కరోనాలో అధిక ఉష్ణోగ్రతలు ఎందుకున్నాయో నిగ్గుతేల్చేందుకు 2018, ఆగస్ట్ 12న నాసా పార్కర్‍ సోలార్‍ ప్రోబ్‍ను ప్రయోగించగా 2021, ఏప్రిల్‍లో కరోనాను స్పృశించిన తొలి వ్యోమనౌకగా అది రికార్డు సృష్టించింది. తదుపరి యూరోపియన్‍ స్పేస్‍ ఏజెన్సీ, జపాన్‍లు కూడా సౌర శోధనకు ఉపగ్రహాలను ప్రయోగించాయి. ఆ వరుసలో ఇప్పుడు ఆదిత్య ఎల్‍-1 కూడా చేరింది. సూర్యుడిపైన పరిశోధనలు చేసేందుకు నిర్దేశించింది. కాబట్టి దీనికి ఆదిత్య అని (సూర్యుడిని ఆదిత్యుడు అని కూడా అంటారు) సూర్యుడికి, భూమికి మధ్యలో నున్న లెగ్రాంజ్‍ పాయింట్‍ 1 దగ్గర దీనిని ప్రవేశపెడుతున్నారు కాబట్టి, దీనికి మొత్తంగా ఆదిత్య ఎల్‍-1 అనే పేరు పెట్టారు.


లెగ్రాంజ్‍ పాయింట్‍ అంటే ఏమిటి ..!!
అంతరిక్షంలో సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్లు ఇలాంటి ఏవైనా రెండు ఖగోళ పదార్థాల మధ్య ఏదైనా వస్తువును ఉంచితే, దాని మీద ఏ ఖగోళం గురుత్వాకర్షణ ఎక్కువగా పనిచేస్తే ఆ వస్తువు దాని వైపుగా వెళ్తుంది.
కానీ ఆ రెండు ఖగోళ పదార్థాల మధ్య, రెండింటి గురుత్వాకర్షణ శూన్యంగా ఉండే ప్రదేశాలు ఐదు ఉంటాయి. వాటినే లెగ్రాంజ్‍ పాయింట్లు అంటారు. ఇలా భూమికి, సూర్యుడికి మధ్య 5 లెగ్రాంజ్‍ పాయింట్లు ఉంటాయి.
సూర్యుడిని, భూమిని కలుపుతూ ఒక రేఖ గీస్తే, అందులో భూమికి, సూర్యుడికి మధ్యన పదో వంతు దూరంలో భూమి వైపుగా లెగ్రాంజ్‍ పాయింట్‍-1 (ఎల్‍-1) ఉంటుంది. భూమికి వెనుక వైపు అంతే దూరంలో ఎల్‍-2 ఉంటుంది. అదే విధంగా సూర్యుడికి అవతలి వైపు ఎల్‍-3 ఉంటుంది. భూమి, సూర్యుడుల మధ్య బయటివైపుగా ఒక సమబాహు త్రిభుజం గీస్తే, అందులో రెండు శీర్షాలలో మరో రెండు లెగ్రాంజ్‍ పాయింట్లు ఉంటాయి. వాటినే ఎల్‍-4, ఎల్‍-5 అంటారు. ఫ్రెంచ్‍ ఇటాళియన్‍ ఖగోళ శాస్త్రవేత్త జోసెఫ్‍ లూయిస్‍ లెగ్రాంజ్‍ పేరు మీద వాటికి ఆ పేర్లు పెట్టారు. ఈ 5 లెగ్రాంజ్‍ పాయింట్లలో భూమికి, సూర్యుడికి మధ్యన ఉన్న లెగ్రాంజ్‍ పాయింట్‍-1 దగ్గరుండే శూన్య కక్ష్యలోకి ఆదిత్య ఎల్‍-1ని ప్రయోగించారు.


లెగ్రాంజ్‍ పాయింట్‍-1 దగ్గరే ఎందుకు…
లెగ్రాంజ్‍ పాయింట్‍-1 దగ్గర భూమి, సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ బలాలు సమానంగా ఉంటాయి. ఎల్‍-1 భూమితో పాటు, సూర్యుడి చుట్టూ ఆవరించి ఉంటుంది. కాబట్టి సౌర పరిశీలనకు ఎల్‍-1 ఎంతగానో తోడ్పడుతుంది. భూమి మీద లాగా అక్కడ వాతావరణం, గాలి ప్రవాహాల ప్రభావాలు ఉండవు. అందువల్ల మరింత నిశితంగా, స్పష్టంగా సూర్యుడిని వీక్షించడం సాధ్యమౌతుంది. అందుకే ఆదిత్య ఎల్‍-1ను ఈ పాయింట్‍ దగ్గరికే ప్రయోగించారు.
ఆదిత్య ఎల్‍-1 విశేషాలు:
గత సెప్టెంబర్‍ 2న అత్యంత ఆధునాతనమైన పీఎస్‍ఎల్‍వీ -57 ఎక్స్ఎల్‍ వేరియంట్‍ రాకెట్‍ ద్వారా నింగిలోకి ప్రయోగించిన ఆదిత్య ఎల్‍-1 స్పేస్‍ అబ్జర్వేటరీ 125రోజుల పాటు అంతరిక్షంలో ప్రయాణించి, భూమికి 15 లక్షల కి.మీ. దూరంలో ఉన్న లెగ్రాంజ్‍ పాయింట్‍-1 దగ్గరికి చేరుకొని సూర్యుడిని నిరంతరం పరిశీలిస్తూ సౌర రహస్యాలను మనకు తెలియజేస్తుంది. ఇందులో మొత్తం 7 సాంకేతిక పరికరాలుంటాయి. వీటిని రిమోట్‍ సెన్సింగ్‍, ఇన్‍-సిటు రకాలుగా వర్గీకరించుకోవచ్చు. రిమోట్‍ సెన్సింగ్‍ పరికరాలు సూర్యుడి దృశ్యాలను, స్పెక్ట్రమ్‍ను చిత్రీకరిస్తాయి. ఇక ఇన్‍-సిటు పరికరాలేమో ఎల్‍-1 గుండా అయస్కాంత క్షేత్రాలు, సౌర వాయురేణువుల చర్యలను నేరుగా పసిగడతాయి. ఈపరికరాలను ఇస్రో, ఐఐఏ బెంగళూరు, ఏయూసీఏఏ పూణే, పీఆర్‍ఎల్‍ అహ్మదాబాద్‍ రూపొందించాయి.
పరికరాల ప్రత్యేకత:
విజిబుల్‍ ఎమిషన్‍ లైన్‍ కొరోనొగ్రఫీ (వీఈఎల్‍సీ): దీని బరువు 190 కిలోలు. ఇది దృశ్యాలను చిత్రీకరించడంతో పాటు స్పెక్ట్రమ్‍ను రూపొందిస్తుంది. సూర్యుడి వెలుగుని అడ్డుకొని, చుట్టూ ఉండే కొరోనా దృశ్యాలను స్పష్టంగా చూపిస్తుంది. సూర్యుడి నుండి వెలువడే అయస్కాంత క్షేత్రం పుట్టుకను అన్వేషించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. ఇది రోజుకు 1440 ఫొటోలను పంపిస్తుంది. అంటే నిమిషానికి ఒక ఫొటో అన్నమాట. ఇది ఆదిత్య ఎల్‍-1లో సాంకేతికంగా అత్యంత సంక్లిష్టమైన సాధనం.
సోలార్‍ఆల్ట్రావయొలెట్‍ ఇమేజింగ్‍ టెలిస్కోప్‍ (సూట్‍): విద్యుత్‍ అయస్కాంత స్పెక్ట్రమ్‍కు చెందిన అతినీలలోహిత ప్రాంతంలో దృశ్యాలను సేకరిస్తుంది. ఉపరితలం నుండి ఆయా ఎత్తుల్లో సూర్యుడు ఎలా ఉంటాడనేది వివిధ కోణాల్లో చిత్రీకరిస్తుంది.
సోలార్‍ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్‍ (సోలెక్స్) హై ఎనర్జీ ఎల్‍-1 ఆర్బిటింగ్‍ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్‍ (హీలియోస్‍): ఇవి సాఫ్ట్, హార్డ్ ఎక్స్రే పరికరాలు, సౌర జ్వాలల కీలక సమాచారాన్ని అందిస్తాయి.
ఆదిత్య సోలార్‍ విండ్‍ పార్టికల్‍ ఎక్స్ పెరిమెంట్‍ (ఆస్‍పెక్స్), ప్లాస్మా అనలైజర్‍ ప్యాకేజ్‍ ఫర్‍ ఆదిత్య (పాపా): ఇవి ఇన్‍-సిటు పరికరాలు, ఎల్‍-1 కేంద్రం వద్ద సౌర గాలుల రేణువుల తీరుతెన్నులు, మిశ్రమాల మీద అధ్యయనం చేస్తాయి. అడ్వాన్స్ ట్రై- మాక్జియల్‍ హై రిజల్యూషన్‍ డిజిటల్‍ మాగ్నెటో మీటర్స్: ఇవి కూడా ఇన్‍ సిటు పరికరాలే. ఎల్‍-1 కేంద్రం వద్ద అంతర గ్రహ ప్రాంతంలో అయస్కాంత క్షేత్ర అధ్యయనం చేస్తాయి.


ఆదిత్య ఎల్‍-1 లక్ష్యాలు:
సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడిగా భావించడం భారతీయ సంస్కృతి. ప్రపంచ వ్యాప్తంగా శతాబ్దాల క్రితమే సూర్యారాధన ప్రారంభమైంది. అలాంటి సూర్యుడి పైకి ప్రయోగించిన ఆదిత్య ఎల్‍-1 ద్వారా ఇస్రో క్రింది లక్ష్యాలను సాధించదలుచుకుంది.
మన సౌర వ్యవస్థను అర్థం చేసుకోవడం: సూర్యుడు మన సౌర కుటుంబానికి కేంద్రం, సూర్యుడి లక్షణాలు అన్ని ఇతర ఖగోళ వస్తువుల ప్రవర్తనను విపరీతంగా ప్రభావితం చేస్తాయి. ఆదిత్య ఎల్‍-1 ద్వారా సూర్యుడిని నిశితంగా అధ్యయనం చేయడం వల్ల, సూర్యుని యొక్క పరిసరాలు మరియు వాటి యొక్క గతిశీలతల (డైనమిక్స్) మన అవగాహన మరింత మెరుగౌతుంది.
అంతరిక్ష వాతావరణ అంచనా: సూర్యునిలో నిత్యం సంభవించే సౌరగాలులు, సౌర తుఫానులు మరియు కరోనల్‍ మాస్‍ ఎజెక్షన్ల వంటి దృగ్విషయాలను ఆదిత్య ఎల్‍-1 ద్వారా నిరంతర పరిశీలనచేయడం ద్వారా శాటిలైట్‍ కమ్యూనికేషన్‍, నావిగేషన్‍ వ్యవస్థలు మరియు పవర్‍ గ్రిడ్‍లకు కలిగే అంతరాయాలను అంచనా వేయవచ్చు మరియు తగ్గించవచ్చు.
సౌర భౌతికశాస్త్రంలో మరింత పురోగతి: ఆదిత్య ఎల్‍-1 ద్వారా సూర్యుని సంక్లిష్ట ప్రవర్తనను అన్వేషించడం, దాని అయస్కాంత క్షేత్రాలు, ఉష్ణమాపక యంత్రాంగాలు మరియు ప్లాస్మా గతిశీలతలపై సునిశిత అధ్యయనం చేయడం ద్వారా ప్రాధమిక భౌతిక శాస్త్రం (ఫండమెంటల్‍ ఫిజిక్స్) మరియు ఖగోళ భౌతిక శాస్త్రం (అస్ట్రో ఫిజిక్స్) సరికొత్త రీతిలో పురోగమించే అవకాశం
ఉంది.
ఇంధన పరిశోధనలో మెరుగైన అభివృద్ధి: కేంద్రక సంలీన చర్యల ద్వారా నిరంతరం శక్తిని వెలువరించే సూర్యుడిని ఒక సహజ రియాక్టర్‍గా భావించవచ్చు. ఆదిత్య ఎల్‍-1 ద్వారా సూర్యుడి కేంద్రమైన కోర్‍లో జరిగే అణువుల, ప్రతిచర్యలపై పరిశోధనలు జరిపి భూమి పైన కూడా కేంద్రక సంలీన (న్యూక్లియర్‍ ప్యూజన్‍) చర్యల ద్వారా ఎలాంటి ప్రమాదాలకు తావులేని స్వచ్ఛమైన, సుస్థిరమైన ఇంధనాన్ని తయారు చేయడంలో మన అవగాహన మరింత మెరుగౌతుంది.


ఉపగ్రహాల ప్రయోగాలు, నిర్వహణలో మరింత అవగాహన: సౌరగాలులు, సౌర తుఫానులు, సౌర కంపాలు అంతరిక్షంలోని ఉపగ్రహాలు మరియు వ్యోమ నౌకల పనితీరును నిరోధిస్తాయి. ఆదిత్య ఎల్‍-1 ద్వారా సూర్యుడిలో జరిగే ఇలాంటి అంతర్గత చర్యలపై మరింత అవగాహన పెంచుకొని సోలార్‍ రేడియేషన్‍ను తట్టుకునే విధంగా శాటిలైట్‍ డిజైన్‍లో మార్పులు చేయడంతో పాటు, వాటి నిర్వహణనూ మెరుగుపరచవచ్చు.


విద్యారంగానికి ప్రోత్సాహం: ఆదిత్య ఎల్‍-1 ద్వారా అంతరిక్షరంగంలో మనదేశం సాధించనున్న అభివృద్ధి భవిష్యత్‍లో ఎంతోమంది యువ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు మరియు పరిశోధకులకు స్ఫూర్తినిచ్చి విద్యారంగంలో స్పేస్‍ సైన్స్ దశదిశలా విస్తరిస్తుందన్నది విశ్లేషకుల అంచనా!


సాంకేతిక రంగంలో దిగ్గజంగా మారనున్న భారత్‍: ఆదిత్య ఎల్‍-1 ద్వారా మనం సేకరించిన విలువైన సాంకేతిక సమాచారం టెక్నాలజీ, మెటీరియల్‍ సైన్స్ మరియు ఇతర రంగాలలో ఎన్నో విలువైన, వినూత్న ఆవిష్కరణలకు దోహదం చేసే అవకాశం ఉంది. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక రంగంలో భారత్‍ ఒక దిగ్గజంగా రూపాంతరం చెందే అవకాశం ఉంది.
సూర్యుడి ఉపరితలం (క్రోమోస్పియర్‍)లో ఆరువేల డిగ్రీ సెల్సియస్‍ ఉష్ణోగ్రత ఉండగా, క్రోమోస్పియర్‍కు వేల కిలోమీటర్ల దూరంలో, వెలుపల ఉన్న కొరోనాలో మాత్రం 10 లక్షల డిగ్రీ సెల్సియస్‍ ఉష్ణోగ్రత ఉంటుంది. వేడిని కల్గించే ఒక వస్తువు నుండి దూరం జరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గాలి. కొరోనాలో అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. ఉష్ణానికి కారణమైన సూర్యుడిని మించి అక్కడ వేడి ఉంటోంది. ఇందుకు కారణాలు అంతుచిక్కకుండా ఉన్నాయి. ఆదిత్య ఎల్‍-1 ద్వారా ఆ చిక్కుముడి కూడా వీడే అవకాశం ఉంది.


చివరగా: అంతరిక్ష రహస్యాలను శోధించాలన్న మానవ జిజ్ఞాసకు అగ్నిగోళంలా జ్వలించే సూర్యుడే కారణ మనడంలో అతిశయోక్తి లేదు. భూమిపై జీవరాశుల మనుగడకు కారణమైన భానుడే అతినీలలోహిత ధార్మికతనూ ప్రసరిస్తున్నాడు. ఈ వైవిధ్యమే ఇస్రో ఆదిత్య ఎల్‍-1 ప్రయోగానికి నాంది పలికిందని చెప్పవచ్చు. సూర్యుడి అంతర్భా గాలను సునిశితంగా అధ్యయనం చేయడం ద్వారా, భూగోళం చరిత్రలో అంతర్భాగమైన మంచుయుగాలు ఏర్పడడంలో సూర్యుడి పాత్ర వెలుగులోకి రావడంతో పాటు, అంతుచిక్కని రహస్యాలెన్నిటినో తనలో ఇముడ్చుకొన్న మన పాలపుంతతో పాటు, విశ్వ ఆవిర్భావం యొక్క గుట్టుమట్లు కూడా వీడే అవకాశం ఉంది. కొరోనా వేడికి కారణాలను అన్వేషించడంలో నాసా ప్రయోగించిన పార్కర్‍ సోలార్‍ ప్రోబ్‍, మన కన్నా ముందంజలో ఉంది. అదిప్పుడు భూమి నుండి 5.44 కోట్ల కి.మీ. దూరంలో పరిభ్రమిస్తోంది. దానికి మరో నాలుగు నెలల్లో ఆదిత్య ఎల్‍-1 కూడా తోడవుతోంది. కొరోనా రహస్యాలను ఛేదించడంలో పార్కర్‍, ఆదిత్యలలో ఏది ముందంజ వేస్తుందోనన్న అంశం అమిత
ఉత్కంఠను కలిగిస్తోంది. ఏదేమైనా సూర్యుడి అన్వేషణలో ఆదిత్య ఎల్‍-1 వేసే ప్రతి అడుగు సఫలీకృతం కావాలని, భారతీయ శాస్త్ర, సాంకేతిక ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో ధగద్ధగాయ మానంగా వెలుగొందాలని ఆశిద్దాం.


-పుట్టా పెద్ద ఓబులేసు
స్కూల్‍ అసిస్టెంట్‍, జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల
రావులకొలను, సింహాద్రిపురం, కడప
ఎ : 9550290047

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *