పురానాపూల్‍ బ్రిడ్జ్

ముఖ్య విశేషాలు:

ఉనికి : పాత కార్వాన్‍
నిర్మాణకర్త : ఇబ్రహీం కుతుబ్‍ షా
ఆర్కిటెక్చర్‍పరంగా గ్రేడ్‍ : ।
నిర్మాణకాలం : 1578
పొడవు : 608 అడుగులు
వెడల్పు : 36 అడుగులు
నిర్మాణ వ్యవధి : 8 నెలలు
నిర్మాణ శైలి : కుతుబ్‍ షాహి

పాత – కొత్త నగరాలకు తొలి వారథి

హైదరాబాద్‍ నగరానికి పునాదిరాయి వేయడానికి 14 ఏళ్ళ ముందే ఈ వంతెనను నిర్మించారు. పాత గోల్కొండ – కార్వాన్‍ను కొత్త నగరంతో కలుపుతూ నిర్మించిన తొలి వంతెన ఇది. గోల్కొండ నుంచి ట్రంక్‍రోడ్‍ను కలపడం ద్వారా వ్యాపార వర్గాలకు రోడ్డు రవాణా సౌకర్యం కల్పించే ఉద్దేశంతో దీన్ని నిర్మించారు. వంతెన నిర్మాణానికి సంబంధించి ప్రజల్లో వినవచ్చే కథ మరోలా ఉంది. రాకుమారుడు మహ్మద్‍ కులీ, తన ప్రియురాలు భాగ్‍మతిని కలుసు కునేందుకు, మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలోనూ దాన్ని ఈదుతూ దాటిన విషయం తండ్రికి తెలియడంతో ఆయన ఈ వంతెన నిర్మాణానికి ఆదేశించినట్లు చెబుతారు. ప్రస్తుత షాలిబండ సమీపంలోని చిచాలం గ్రామంలో భాగ్‍మతి నివసించేదని చెబుతారు. భాగ్యనగర నిర్మాణానికి పూర్వమే రూపుదిద్దుకున్న ఈ వంతెనకు చారిత్రకంగా, నిర్మాణశైలి పరంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇప్పటికీ ఇది సంరక్షణకు వీలైన స్థితిలో ఉంది.


పురానాపూల్‍ బ్రిడ్జిని రాతితో నిర్మించారు. 22 ఆర్చీలు ఉన్నాయి. మూసీ నదికి 42 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. వరదలకు దెబ్బతినని రీతిలో దీన్ని కట్టారు. నగరం వైపు భారీ గేట్‍వే (ప్రవేశద్వారం) ఉంటుంది. మొదట్లో కుతుబ్‍ షాహీల కాలంలో దీన్ని ‘పూల్‍-ఎ-నరుస్‍’ (కాజ్‍ వే)గా వ్యవహరించేవారు. అసఫ్‍జాహీల కాలంలో చాదర్‍ఘాట్‍ బ్రిడ్జిని నిర్మించిన అనంతరం దీన్ని పురానాపూల్‍ లేదా ఓల్డ్ బ్రిడ్జిగా వ్యవహరించడం మొదలెట్టారు.

మూసీ వరదల అనంతరం రెండు సార్లు ఈ వంతెనకు భారీఎత్తున మరమ్మతులు చేశారు. మూడో నిజాం నవాబ్‍ సికందర్‍ జా బహద్దూర్‍ కాలం (1820)లో నాటి ప్రధానమంత్రి రాజా చందూలాల్‍ నేతృత్వంలో నాటి సంరక్షకుడు (కేర్‍టేకర్‍) పురాన్‍సింగ్‍ పర్యవేక్షణలో తొలిసారిగా దీనికి మరమ్మతులు చేశారు. ఇందుకు గుర్తుగా వంతెన ప్రాంతంలో పర్షియన్‍ భాషలో శిలాశాస నాల్లాంటివి చెక్కించారు.


1908లో వచ్చిన వరదల సందర్భంగా ఆరో నిజాం నవాబ్‍ మీర్‍ మహబూబ్‍ అలీ ఖాన్‍ పాలనాకాలంలో మరోసారి ఈ వంతెనకు పెద్ద ఎత్తున మరమ్మతులు చేశారు. దీని తర్వాత నిర్మించిన ఎన్నో వంతెనలు కాలగర్భంలో కలసి పోగా ఇది మాత్రం నేటికీ చెక్కు చెదరకుండా నిలవడం దీని కట్టడ నైపుణ్యానికి, శక్తిసామర్థ్యాలకు నిదర్శనం.
1676లో హైదరాబాద్‍ను సందర్శించిన ఫ్రెంచ్‍ యాత్రికుడు, చరిత్రకారుడు ట్రావెనీర్‍ ఈ ‘ప్రేమ వారథి’ సౌందర్యానికి ఎంతో ముగ్ధుడయ్యాడు. పారిస్‍లోని పాంట్‍ న్యూఫ్‍తో దీన్ని సరిపోల్చాడు. దాని నిర్మాణం కూడా దాదాపుగా పురానాపూల్‍ బ్రిడ్జి నిర్మించిన సమయంలోనే పూర్తికావడం విశేషం.

– సువేగా,
ఎ : 9030 6262 88
Email: desk.deccan@gmail.com

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *