ఉప్పు మర

అనగా అనగా ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఉండేవాడు. ఒకసారి అతనికి వారం రోజులపాటు తినడానికి బుక్కెడు బువ్వకూడా దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయాడు. పొరుగునే ఉన్న ఒక ధనవంతుడి ఇంటికి వెళ్ళి…
‘‘దొరా! కడుపు కాలుతోంది. తినడానికింత ఏదైనా పెట్టు’’ అన్నాడు. ఆ ధనవంతుడు విసుక్కుంటూ ఒక రొట్టెముక్క తెచ్చాడు. దానిని పేదవాడి మొహంమీదికి విసిరేస్తూ…
‘‘ఇది తీసుకొని నరకానికి తగలడు’’ అన్నాడు.

ఆ పేదవాడు రొట్టెముక్క తీసుకొని నరకానికి వెళ్ళిపోయాడు. నరకం వీధి తలుపు ముందు ఒక ముసలి యమదూత కూర్చొని ఉన్నాడు. పేదవాడి చేతిలోని రొట్టెను చూడగానే యమదూతకు నోరూరింది. ఆ రొట్టె తన కియ్యమని అడిగాడు. పాపం పేదవాడు మారుమాట్లాడకుండా ఇచ్చేశాడు. ఆ యమదూత పేదవాడికి ఒక మర (గిర్ని)ను ఇచ్చాడు.

‘‘ఇది మహిమగల మర. నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తుంది. మాట వరసకి నీకు అన్నం కావాలనుకో – మహిమగల మరా, నాకు అన్నం కావాలి.
నా ఒక్కడికి అన్నం ఇయ్యి. తరవాత ఇంక ఆపెయ్యి’’ అంటూ మెల్లగా గుసగుసలాడాలి. అయితే నీకు ఎంత కావాలో ఖచ్చితంగా చెప్పాలి. లేకపోతే చిక్కుల్లో పడతావు’’ అంటూ హెచ్చరించాడు యమదూత. కొద్దికాలంలోనే ఆ పేదవాడి ఇల్లు కలకలలాడసాగింది. అతని ఇంట్లో దేనికీ కొదువ ఉండేదికాదు. ఒకనాడు అతని దగ్గరికి పొరుగింటి ధనవంతుడు వచ్చాడు.

‘‘యాభై బంగారు నాణాలు ఇస్తాను. నీ మర నాకిచ్చెయ్‍’’ అన్నాడు. పేదవాడు మారుమాట లేకుండా ఇచ్చేశాడు. ఆ ధనవంతుడు మరను తీసుకొని పరుగులాంటి నడకతో ఇంటికి వచ్చాడు. అతనికి రొయ్య పులుసంటే ప్రాణం. మరను బల్లమీద పెట్టి – ‘‘రొయ్యల పులుసు ఇవ్వు’’ అంటూ గొంతు చించుకొని అరిచాడు.
మరలోంచి రొయ్యల పులుసు రాసాగింది. కొద్దిసేపట్లోనే అతని ఇల్లంతా రొయ్యల పులుసుతో నిండిపోయింది. ధనవంతుడు ‘ఆపు – ఆపు’ అని అరుస్తున్నా ఆ మర ఆపలేదు. ధనవంతుడు పులుసులో మునిగిపోసాగాడు. ఎలాగో లాగా ఈదుకుంటూ బయటపడ్డాడు. పేదవాడి దగ్గరకు పరిగెత్తుకెళ్ళి –
‘‘నీ మర నాకొద్దు. తీసేసుకో’’ అన్నాడు.
పేదవాడు మారు మాటాడకుండా తీసేసుకున్నాడు.
ఈ మర మహిమ గురించి ఊరూర పాకిపోయింది. ఒకసారి ఒక సముద్ర వ్యాపారి పేదవాడి దగ్గరకు వచ్చాడు. అతడు ఓడలలో దేశ దేశాలు తిరిగి ఉప్పు వ్యాపారం చేస్తాడు.
‘‘ఈ మర ఉప్పు అడిగితే ఇస్తుందా?’’ అని అడిగాడు.
‘‘ఎందుకివ్వదు. నిక్షేపంగా ఇస్తుంది’’ అన్నాడు పేదవాడు.
‘‘అయితే వెయ్యి బంగారు నాణాలు ఇస్తాను. ఈ మర నాకియ్యి’’ అన్నాడు.
పేదవాడు మారు మాటాడకుండా ఇచ్చేశాడు. ఆ వ్యాపారి మరను తీసుకొని తన నౌకలోకి వెళ్ళి పోయాడు. నౌకనిండా ఉప్పునింపుకుంటే బోలెడంత లాభం గడించవచ్చునని ఉబలాట పడ్డాడు. అతడు మరను చూసి –
‘‘ఉప్పు తయారు చెయ్యి’’ అని గావుకేక పెట్టాడు.
మర తిరగసాగింది. ఓడంతా ఉప్పుతో నిండి పోతోంది.
ఉప్పు బరువుకు ఓడ మెల్లగా మునిగిపోతోంది. వ్యాపారి ప్రాణభయంతో గజగజలాడి పోయాడు. ‘ఆపు ఆపు’ అని దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు. కానీ ఏం లాభం లేకపోయింది. చివరికి
ఉప్పు బరువుకు ఓడ మునిగిపోయి, సముద్రం అడుగుకు చేరిపోయింది. అక్కడ ఆ మర ఇంకా తిరుగుతూనే ఉంది. ఎందుకంటే ఎంత ఉప్పు కావాలో దానికి ఆ వ్యాపారి మెల్లిగా చెప్పలేదు కదా! అందుకే సముద్రం నీరు ఉప్పుగా ఉంటుంది.


ఇది కట్టుకథ మాత్రమే! నిజమని నమ్మకండి! సముద్రం నీరు ఉప్పుగా ఎందుకుంటుదో మీకు మీ మాస్టారు చెప్పే ఉంటారు. ఆయన చెప్పిందే నిజం


-ఎస్‍. శ్రీనివాసరావు
(ఒక జానపద కథ ఆధారంగా)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *