పూర్వపు ఆంధప్రదేశ్‍లో నాలుగు చోట్ల గిరిజన సంగ్రహాలయాలున్నాయి. అవి:
1.నెహ్రూ శతజయంతి గిరిజన సంగ్రహాలయం, హైదరాబాద్.
2.చెంచులక్ష్మి గిరిజన సంగ్రహాలయం, మన్ననూర్, మహబూబ్ నగర్ జిల్లా.
3.చెంచులక్ష్మి గిరిజన సంగ్రహాలయం, శ్రీశైలం.
4.అరకు గిరిజన సంగ్రహాలయం, అరకులోయ, విశాఖపట్నం జిల్లా.
వీటన్నింటినీ పూర్వపు ఆంధప్రదేశ్ ప్రభుత్వంవారి గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తూండేది. వీటిల్లో ఆ రాష్ట్రంలోని 35 రకాల తెగల జీవన విధానం, సంస్కృతులకు సంబంధించిన వస్తువులను భద్రపరిచి పర్యాటకులకు, పరిశోధకులకు, విద్యార్థులకు, సందర్శకులకు ప్రదర్శనకై అందుబాటులో ఉంచారు. ఇవి కాక శ్రీ రవీంద్రశర్మ అనే ఔత్సాహికులు వ్యక్తిగతంగా ఒక గ్రామీణ గిరిజన వస్తు సంగ్రహాలయాన్ని ఆదిలాబాద్‍లో ఏర్పరచి నిర్వహిస్తున్నారు. వీటన్నింటిలో ప్రధానమైన నెహ్రూ శతజయంతి గిరిజన సంగ్రహాలయం గురించి తెలుసుకుందాం.
నెహ్రూ శతజయంతి గిరిజన సంగ్రహాలయం
క్రీ.శ.1962-63లో ఏర్పాటైన ‘గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ’లో భాగంగా గిరిజన సంగ్రహాలయాన్ని ఏర్పరచారు. అప్పటినుండి గిరిజన వస్తు సామాగ్రిని సేకరిస్తూ వస్తున్నారు. 1989లో జరిగిన జవహర్‍లాల్ నెహ్రూ శతజయంతిని పురస్కరించుకుని ఈ సంగ్రహాలయానికి ‘నెహ్రూ శతజయంతి గిరిజన సంగ్రహాలయం’ అని నామకరణం చేసి, భారత ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో మూడు అంతస్థుల భవనాన్ని 2003లో నిర్మించారు. రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాల నుంచి గిరిజన జీవనం, కళలకు సంబంధించిన అనేక వస్తువులను భారీగా సేకరించి, వాటిని వివిధ విభాగాలలో (గ్యాలరీలలో) అమర్చి ప్రదర్శనకు అందుబాటులో ఉంచారు. ఈ సంగ్రహాలయంలో కింది విభాగాలున్నాయి.
- చెంచు / ఫోటోగ్రఫీ విభాగం.
- గిరిజన గుడిసెల విభాగం.
- గిరిజన జీవన / సాంస్కృతిక వస్తు విభాగం.
- దృశ్య శ్రవణ విభాగం.
- ప్రాంగణ ప్రదర్శన విభాగం.
- గిరిజన కళా ప్రాంగణ విభాగం.
చెంచు గ్యాలరీలో చెంచు గిరిజన ప్రజలు కర్రతో అగ్ని పుట్టించుకునే విధం, గుడిసెలో వంట చేసుకోవడం, వస్తువులు అమర్చుకునే విధానం, వేటాడే విధానం, భూమిలో నుంచి గడ్డలు తవ్వుకునే విధానం, వారి బాణాలు, తేనె సేకరణ పనిముట్లు, తేనె సేకరణ విధానాలను డయోరమాలు (సూక్ష్మ ప్రతిరూపాలు), షోకేసుల్లో (గాజు గూళ్ళల్లో) ప్రదర్శించారు.
ఫోటోగ్రఫీ గ్యాలరీలో పూర్వపు ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 35 రకాల గిరిజన తెగల ప్రజల రూపు రేఖలు, వస్త్రాభరణాలు, నృత్యాలు, దేవతలు, పనులు, ఇళ్లు, పంటలు (పోడు వ్యవసాయం), ఆధునిక సాగు విషయమై ప్రభుత్వం గిరిజనులకు అందజేస్తున్న సహాయ సహకారాలు, గిరిజన వార సంతలు (షాండీలు), గిరిజన సాంప్రదాయక వైద్య విధానం, ప్రభుత్వ వైద్య విధానం, ప్రభుత్వ విద్యా సౌకర్యాలు, ప్రభుత్వ గిడ్డంగులు, పాపికొండలు పర్యాటకం నిర్వహించుకునేందుకు ప్రభుత్వం గిరిజన నిరుద్యోగులకు అందజేసిన పడవలు, తదితర విషయాల నిజమైన ఫోటోలు ప్రదర్శనకు పెట్టారు.
సంగ్రహాలయం మొదటి అంతస్థులో నిజమైన గిరిజన గుడిసెలను ప్రదర్శన నిమిత్తం నిర్మించారు. అలాంటివి ఇందులో సవర గుడిసె, చెంచు గుడిసె, బంజారా గుడిసె, కోయ గుడిసె, పోర్జ గుడిసె, బగత గుడిసె, ఎరుకల గుడిసె, యానాదుల గుడిసెలు వరుసగా కన్పిస్తాయి. ఆయా గుడిసెల్లో గిరిజనుల జీవన విధానం ప్రస్ఫుటంగా కన్పించే విధంగా అవసరమైన చోటల్లా గిరిజనుల విగ్రహాలు రకరకాల పనుల్లో నిమగ్నమైనట్లుగా శిల్పించారు. సవర గుడిసెల్లో సవరలు సాంప్రదాయకంగా పూజించే ‘ఇదిసింగ్’ (గోడ పెయింటింగ్) కన్పిస్తుంది. ఈ గుడిసెలను చూస్తే చాలు ఆయా గిరిజనుల జీవన విధానం, సంస్కృతులు ఎలా ఉంటాయో తెలుస్తాయి.
సాంస్కృతిక గ్యాలరీలో గిరిజనుల సంగీత పరికరాలు, చేపలు, పక్షులు, ఎలుకలు, కుందేళ్ళ వంటి చిన్న జంతువులను వలలు వేసి పట్టుకునే పరికరాలు, వేట పనిముట్లు, పోడు/వ్యవసాయ పనిముట్లు, ఇంటి పనిముట్లు, నృత్య వేషధారణ వస్తువులు, ముఖ తొడుగులు, బుట్టబొమ్మలు, లంబాడీ, కొలామీల సాంప్రదాయక ఆభరణాలు, షాండీ, గిరిజన పంచాయతీ విధానం, భీమాయక్, గుస్సాడ దేవత ఆలయాలు, సవరలు, గోండుల సమాధులు, ఇనుము, లక్క, కాల్చిన మట్టి (టెర్రకొట్ట), ఇత్తడి బొమ్మలు, నవరత్నాలను శుద్ధి చేసే పరికరాలు మొదలైనవి ప్రదర్శనలో ఉన్నాయి.
దృశ్య శ్రవణ విభాగంలో లఘు (చిత్ర) ప్రదర్శనశాల (మినీ ఆడిటోరియం), టచ్ స్క్రీన్ కంప్యూటర్ ఉన్నాయి. మినీ ఆడిటోరియంలో విద్యార్థులకు, అధికారులకు, శిక్షణలో ఉన్న ఐ.ఏ.ఎస్. (ఉన్నత) అధికారులకు ముందస్తు అనుమతితో 25-30 నిమిషాల నిడివి గల లఘు చిత్రాలను ప్రదర్శిస్తారు. ఇవి ఆయా గిరిజనుల జీవనశైలి, సాంస్కృతిక విశేషాల మీద చిత్రించినవి. దేశంలో 18 రాష్ట్రాల్లో ఉన్న గిరిజన సంగ్రహాలయాల్లో ప్రదర్శనకు ఉంచిన వస్తు విశేషాలను టచ్ స్క్రీన్ కంప్యూటర్‍లో ఎవరికి వారు చూసుకునే వెసులుబాటు కల్పించారు.
సంగ్రహాలయంలో ప్రవేశించగానే సందర్శకులను గోండు గిరిజనుల ఎద్దుల బండి స్వాగతిస్తుంది. ఆ తరువాత కనిపించే ‘మేరియ బలి’ దృశ్య రూపం ఆసక్తిని రేపేట్టుగా ఉంది. ఉత్తరాంధ్రలో నివసించే ఖోందులు రెండు శతాబ్దాల క్రితం రెండు సంవత్సరాలలోపు వయసుండే ఒక మాల బాలున్ని కొని 18 సంవత్సరాలు ఊరిలో పెంచి, తరువాత సంతానం, పాడి పంటల అభివృద్ధి కోసమని ఆ బాలున్ని బలిచ్చేవారట. ఆ సంస్కృతిని బ్రిటిష్‍వారే బహిష్కరించారు. సంగ్రహాలయం మూడవ అంతస్థులో ‘సమాచార గ్యాలరీ’ ఉంది. ఇందులో జిజ్ఞాసువులు, పరిశోధకులకు అవసరమైన రాష్ట్ర గిరిజనుల జనాభా, వారి వృత్తులు, ప్రాంతాలు తదితర అధికారిక అంకెల సమాచారం లభిస్తుంది. సంగ్రహాలయం మొదటి, రెండవ అంతస్థుల స్తంభాల నలుమూలలను వెదురు బద్దలతో అలంకరించి వాటి మధ్య గిరిజన జీవన సంస్కృతులకు సంబంధించిన ఫోటోలను, వేట విధానాలకు సంబంధించిన పెయింటింగ్‍లను ప్రదర్శనకు పెట్టారు. ఈ స్తంభాల మధ్యగల నాలుగేసి దూలాల స్థానంలో ఉత్తరాంధ్ర సవరలు తదితర గిరిజనులు పెళ్ళిళ్ళు, పండుగల్లో ఉపయోగించే ముఖతొడుగులను (మాస్క్లు) అలంకరించారు. రెండవ అంతస్థు మెట్లు ఎక్కగానే నాయకపోడు గిరిజనుల మాస్క్లు కన్పిస్తాయి.
సంగ్రహాలయం భవనం ముఖ ప్రాంగణం సవరల సాంప్రదాయక పెయింటింగ్‍లో కనిపించే వివిధ చిత్రాలతో అలంకరించబడింది. ప్రాంగణం కుడివైపు గోండుల గుస్సాడి నృత్యం, ఎడమవైపు కోయల కొమ్ము నృత్యం శిల్పాలు ప్రదర్శనకుంచారు. ముఖ ప్రాంగణం ముందున్న ఖాళీ స్థలంలో సమ్మక్క-సారలమ్మల గద్దెలు, మైసమ్మ, నిశాని దేవతలు, ఆకిపేన్, పెర్సాపేన్, పెదదేవుడు తదితర దేవతల నిజ ఆలయాల విగ్రహాల ప్రతిరూపాలను ప్రతిష్టించారు. కళా ప్రాంగణంలో 6 గిరిజన గుడిసెలు, కార్యక్రమాలు నిర్వహించుకునే షామియానా గద్దె, ఊయల, ముఖ్యమైన గిరిజనుల పరిచయ బోర్డులు తదితర ఏర్పాట్లున్నాయి.
ద్యావనపల్లి సత్యనారాయణ, 94909 57078
(‘తెలంగాణ కొత్త విహార స్థలాలు’ పుస్తకం నుంచి)
ప్రతులకు: తెలంగాణ రిసోర్స్ సెంటర్, చంద్రం 490, వీధి నెం.12, హిమయత్‍నగర్, హైదరాబాద్-29. తెలంగాణ. వెల: రూ.100