ఏ1 మరియు ఏ2 పాలు మానవాళి ఆరోగ్యంపై ప్రభావము

పాలు సంపూర్ణ ఆహారం. ప్రకృతి మనకందించిన వరప్రసాదం. పాలు మరియు పాల పదార్థములను తగిన మోతాదుల్లో స్వీకరించడం వలన ఎముకలు మరియు పళ్ళు దృఢంగా అవుతాయి. ప్రతిదినము పాలు సేవించడం వలన గుండె సంబంధిత జబ్బులు, ఊబకాయం, కేన్సరు, టైప్‍-2 మధుమేహం వంటి జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చును. పాలు 86% నీరు, 4.6% లాక్టోస్‍ షుగరు, 3.7% ట్రైగిసరైడ్లు, 2.8% ప్రోటీన్లు, 0.54% ఖనిజాలు మరియు 3.36% ఇతరత్ర ఘన పదార్థాలను కలిగి ఉండును. పాలలోని ప్రోటీన్లలో, 36% ఆల్ఫా-కేసిన్లు, 27% బీటా- కేసిన్లు, 9% కె-కేసిన్లు తతిమ 27% పెప్టైడ్లు మరియు అమైనో ఆమ్లముల రూపములో ఉండును. ఈ మధ్య కాలంలో పాలలోని బీటా-కేసిన్లు చాలా ప్రాముఖ్యత సంతరించు కున్నాయి. బీటా కేసిన్ల యొక్క జన్యువులు మరియు మానవాళి ఆరోగ్యంపై వాటి ప్రభావంపై జరుగుతున్న పరిశోధనలే దీనికి కారణం.

ఎ1 మరియు ఎ2 పాల వివాదము
ఎ2 బీటా-కేసిన్‍ (బీటా-కేసిన్లు) కలిగిన పాలను ఆవుల నుంచి వేల సంవత్సరముల ముందు నుండే ఉత్పత్తి చేస్తున్నాయి. కాని కొన్ని వేల సంవత్సరముల కింద, జీవపరిణామ క్రమంలో యూరప్‍ ఖండంలోని కొన్ని పశు జాతులలో ఒక ఎ2 జన్యువు ఎ1 జన్యువుగా జన్యు పరివర్తన (మ్యుటేషన్‍) చెంది తరతరాలకు సంక్రమించి వృద్ధి చెందింది. ఈ జన్యపరివర్తన (మ్యుటేషన్‍) వలన యూరప్‍ ఖండంలోని కొన్ని పశు జాతులు ఎ1 బీటా కేసీన్లు కలిగిన పాలను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. ఎ1 జన్యువులు కలిగిన పాలను ఎ1 పాలు మరియు ఎ2 జన్యువులు కలిగిన పాలను ఎ2 పాలు అని పిలుస్తారు. ఎ1 తరహా ప్రోటీను పాలు ఎక్కువగా హోల్ట్సిన్‍ ప్రీసియన్‍, జర్సీ వంటి యూరోపియన్‍ పశు జాతుల నుండి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఆసియా పశు జాతుల నుండి ఎ2 తరహా పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.

ఎ1 జన్యువు రిసెసివ్‍ కాబట్టి హానికరమని, వ్యాధికారణమని అభిప్రాయము ఉంది. న్యూజిలాండ్‍ దేశంలో 2007లో ప్రచురితమైన కెయిన్‍ వుడ్‍ ఫోర్డ్ పుస్తకం ‘డెవిల్‍ ఇన్‍ మిల్క్’లో పాలలోని ఎ1 జెనెటిక్‍ మ్యుటేషన్‍ మనుషుల్లోని గుండె వ్యాధి, టైప్‍-1 మధుమేహం, ఆటిజం, స్కిజోఫ్రీనియా, ఇతర నరాల సమస్యలకు గల సంబంధం గురించి చర్చించారు. అయితే ఇంకా ఇది శాస్త్రీయతతో రుజువు కాలేదు. ఎ2 పాల వలన ఎ1 కన్నా లాభం ఉందని ఏకాభిప్రాయం లేదు.

ప్రోటీన్లు అమైనో ఆమ్లాల బందాలతో ఏర్పడి ఉంటాయి. ఆవులలోని బీటా కేసిన్‍ ప్రోటీన్లలో 209 అమైనో ఆమ్లాలుండను. ఎ1 మరియు ఎ2 పాల మధ్య తేడా ఒక అమైనో ఆమ్లములో మాత్రమే ఉంది. ఎ2లో 67వ అమైనో ఆమ్లము ప్రటీన్‍ కాగా, ఎ1 బీటా -కేసిన్‍లో ఇది హిస్టిడీన్‍తో ప్రతిక్షేపింపబడును. ఈ మార్పు జీర్ణకోశ ఎంజైముల జలవిశ్లేషణ చర్యకు ఎ1 బీటా కేసిన్‍ యొక్క గ్రహసచీలతను పెంచును. ఈ రసాయనిక చర్య వలన ఎ1 బీటా కేసిన్‍ వీగి పోయి ఏడు అమైనో ఆమ్లాలు కలిగిన బీటాకేసోమార్ఫిన్‍-7 (బీసీఎం) అను పెస్టైడ్‍ ఉత్పన్నం అగును. మనం ఎ1 బీటా-కేసిన్‍ జీర్ణించుకునేటప్పుడు ఉత్పత్తి అయే ఈ చిన్న పెప్టైడ్‍ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందిన అభిప్రాయం. కేసోమార్ఫిన్లు మత్తు కలిగించు లక్షణాలను కలిగి ఉంటాయి. అవి కొందరిలో పూర్తిగా జీర్ణింపబడవు. దీని వలన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని కొందరి వాదన.

ఎ1 పాలు గుండె వ్యాధి, టైప్‍-1 మధుమేహం కలుగ చేస్తుందా?
మొదటగా మనము ఈ జబ్బులకు ఎ1 పాలు ‘కారణమా’ లేక ఈ జబ్బులు వచ్చే ‘ప్రమాదాన్ని పెంచుతుందా’ అని తర్కిస్తే, ప్రచురితమైన సర్వేలు మరియు గణాంక సమాచారం ఎ1 పాలు ఈ వ్యాధులు సంక్రమించే ప్రమాదాన్ని పెంచుతుంది అని చూపు తున్నప్పటికీ, ఈ సర్వేలు మరియు శాస్త్రీయ నివేదికలపై చాలా విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి కారణం ఎ2 పాలను ఉత్పత్తి మరియు మార్కెటింగ్‍ చేసే సంస్థలు ఈ సర్వేలకు నిధులు సమకూర్చడం కూడా ఒక కారణంగా చెప్పకోవచ్చు. కొందరు వీటిపై ‘ప్రయోజన వివాదాన్ని’ ఎత్తిచూపుతూ, లాభాలు గడించడానికే ఇలాంటి అవాస్తవనీయ ప్రచారం చేస్తున్నారని వాదిస్తున్నారు. అయితే ఇది నిజమే అని తేలితే చాలా దేశాలలోని పశు మందులలో మార్పులురావల్సి వస్తుందని, దేశ ఆర్థిక స్థితిపైకూడా ఇది ప్రభావం చూపొచ్చునని కావాలనే కొందరు ఈ సర్వేలను విమర్శిస్తున్నారనే అభిప్రాయం కూడాఉంది.

ఒకవైపు కొందరు శాస్త్రీయ పరిశోధకులు బీటాకే సోమార్ఫిన్‍-7 (బీసీఎం)ను వోపియాయిడ్‍, నార్కోటిక్‍ మరియు ఆక్సిడెంటుగా వర్ణిస్తూ, దీనివలన ఆరోగ్య సమస్యలు తలత్తే అవకాశము ఉందని చెప్తున్నారు. మరోవైపు ఇతర శాస్త్రీయ సమూహము దీనితో ఏకీభవించడం లేదు. బీటాకేసోమార్ఫిన్‍-7 (బీసీఎం)గుండె, మెదడు లేదా ఇతర అవయవంపైన జైవిక ప్రభావము కలుగచేయాలంటే, అది చిన్న ప్రేగుల గుండా యధాతంగా రక్త ప్రసరణ వ్యవస్థలోకి శోశించబడి, ఆపైన ఇతరత్ర అవయవాలపైన ప్రభావము చూపాలి. బీటాకేసోమార్ఫిన్‍-7 పై విధముగానే మానవ శరీరంలో చర్య జరుగుతున్నది అని చెప్పడానికి శాస్త్రీయ పరమైన ఆధారాలులేవు. సాధారణంగా ట్రైపెప్టైడ్‍ కన్నా పెద్ద పెప్టైడ్లు ఎంజైమాటిక్‍ చర్య ద్వారా విచ్చిన్నం కాబడి శోశించబడతాయి. కావున బీటాకేసోమార్ఫిన్‍-7 కూడా విచ్చిన్నం అయి తన స్వభావాన్ని కోల్పోతుంది అని వీరి అభిప్రాయం. అంతే కాకుండా ప్రయోగశాలలో జరిపిన పరిశోధనలను, సరియైన ఆధారాలు లేకుండా యథాతథంగా మానవ శరీరానికి అనునయించలేము అని వారి ఉద్దేశము.

వాదోపవాదాలు పక్కనపెడితే నేటికి ఎ1 పాల వలన గుండె వ్యాధి, టైప్‍-1 మధుమేహం, ఆటిజం, స్కిజోఫ్రీనియా ఇతర నరాల సమస్యలు తలెత్తున్నాయి అని భావించడానికి శాస్త్రీయపరమైన ఆధారాలు లేవు మరియు ఎ2 పాలు తాగడం వలన ఈ వ్యాధుల బారిన పడకుండా ఉంటానడానికి రుజువు లేదు. ఈ సమస్యను అర్థం చేసుకోడానికి ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది.

మన దేశంలో పరిస్థితి :
నేషనల్‍ బ్యూరో ఆఫ్‍ యానిమల్‍ జెనెటిక్‍ రిసోర్సెస్‍ (ఎన్‍బిఎజిఆర్‍), నేషనల్‍ డైరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‍ (ఎన్‍డిఆర్‍ఐ) వంటి ప్రఖ్యాత పరిశోధన సంస్థలు 2009 నుండే ఏ1, ఏ2 పాల విషయమై సర్వేలు జరుపుతున్నవి. వారి నివేదిక ప్రకారం మన దేశంలోని పశువులలో ఎ2 జన్యుప్రికేన్సి 98% మరియు గేదెలలో అత్యధికంగా ఎ2 రకములే కలవు. సంకర జాతి పశువులలో కూడా ఎక్కువ శాతం ఎ2 జన్యువలునే కలిగి ఉన్నవి. ఎన్‍డిఆర్‍ఐ, ఎన్‍బిఎజీఆర్‍ మరియు పంజాబ్‍ విశ్వవిద్యాలయం సంయుక్తంగా చేపట్టిన సంకర జాతి పశువుల పాలు – ఆరోగ్య భద్రత అను అధ్యయనాన్ని, ఏప్రిల్‍ 2015లో ఇండియన్‍ కౌన్సిల్‍ ఆఫ్‍ అగ్రికల్చర్‍ రీసెర్చ్ (ఐసీఎఆర్‍) ఆమోదించింది.

ప్రస్తుత పరిస్థితులలో భారతీయ శాస్త్రవేత్తలు ఈ ఎ1 లేదా ఎ2 వివాసము పైన క్రమానుగతముగా అప్రమత్తముగా ఉండటమే మేలు. కొంతకాలం నుండి పరిశోధకులు ఏవి మంచి పాలు అని పరిశోధనలు జరుపుచున్నారు. కాని దీని పై శాస్త్రీయ సమూహంలో ఏకాభిప్రాయము లేనందు వలన ఇంకా జంతువులు మరియు మనుషులపై పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉన్నది.మన దేశంలో ఈ సమస్య పెద్దగా లేదు. ఎందుకంటే దేశీయ ఆవుల్లో, గేదెల్లో, మేకల్లో ఎ2 జన్యువులే ఉంటాయి. అంతేకాకుండా మన దేశీ జాతి పశువులు మంచి రోగ నిరోధక శక్తి, వేడి సహనం లక్షణాలు కలిగి ఉండును. మన దేశి ఆవులలో ఉత్పాదకత పెంచే విధముగా బ్రీడింగ్‍ కార్యక్రమాలు చేపట్టాలి. రైతులచే శాస్త్రీయ పద్దతులలో బ్రీడింగ్‍ని ప్రోత్సహించాలి. ఏది ఏమైనా ఎ1 బీటా కేసిన్‍ హానికారకమని, ఎ2 బీటా కేసిన్‍ లాభకరమని ఆఖరిమాటగా ఇంకా చెప్పబడలేదు మరియు శాస్త్రీయంగా రుజువు కాలేదు కావున అప్పటి వరకు వేచి చూడడమే మేలు.


-డా. కె.ప్రణయ్‍ కుమార్‍
(పశు శరీర ధర్మ శాస్త్ర విభాము) ఐవిఆర్‍ఐ,
బరేలి, ఉత్తరప్రదేశ్‍
-డా. సి. వినయ శ్రీ, సహాయ ఆచార్యులు
(పశు శరీర ధర్మ శాస్త్ర విభాగము) పశువైద్య కళాశాల.
శ్రీ పి.వి. నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయము, రాజేంద్రనగర్‍, హైదరాబాద్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *