పిచ్చయ్య గారి బస్సు

దాదాపు అర్థ శతాబ్దం కింద ఒకే ఒక్క ఎర్ర ప్రైవేటు బస్సు సర్వీసు సూర్యాపేటలో పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్‍ నుండి మా ఊరు మీదుగా హుజూర్‍నగర్‍కు తిరిగి అదే బస్సు సూర్యాపేటకు నడిచేది. దానిని ‘‘పిచ్చయ్య బస్సు’’ అని ప్రసిద్ధి. అది సూర్యాపేటలో స్టేజీ మీదకు రావటం ఆలస్యం ప్రయాణీకులు ఒకరినొకరు తోసుకుంటూ మూటా ముల్లెతో ఎక్కేవారు. కొందరు కిటికీల నుండి చేతి రుమాలు లేదా నెత్తికి కట్టుకునే రుమాలు వేసి సీటు ఆపుకునే వారు. మరి కొంత మంది చిన్న పిల్లల్ని అద్దాలు లేని కిటికీల నుండి బస్సు లోపలికి తోసి సీటు రిజర్వ్ చేసుకునే వారు. బస్సు డ్రైవరు, కండక్టరు బస్సు దిగి ఆ ప్రక్కనే ఉండే ఛాయాదేవి టీ కొట్టుకి వెళ్లి చెరో సింగిల్‍ టీ తాగి ఆ తర్వాత చార్మినార్‍ సిగరెట్‍ కాల్చటం ఆనవాయితీ. బస్సు ఆపిన దగ్గరి నుండి కదిలే దాకా మధ్య మధ్యలో బజ్జీలమ్మే శీను, బిస్కట్లమ్మే గిరి, గోలీ సోడా అమ్మే జానీ ఎక్కడం దిగడం షరా మామూలే. ఎండాకాలంలో సాదా సోడా, లెమన్‍ సోడాకి విపరీతమైన గిరాకీ ఉండేది. గోలీ సోడా కొడితే కీచుమని పెద్ద శబ్దం చేస్తే బాగా గ్యాసు ఉన్నట్టు తాగే వాడికి తృప్తి . అప్పుడప్పుడు కళ్ళు లేని నారాయణ కర్ర సహాయంతో బస్సు ఎక్కి ‘‘నడి రేయి ఏ జాములో’’ పాట లేదా ‘‘శేష శైలా వాసా శ్రీ వేంకటేశ’’ అని పాడుతూ ‘‘కళ్ళు లేని కబోది నయ్యా’’ అంటూ బిక్ష అడుక్కునే వాడు. స్వరం వినసొంపుగానే ఉండేది. జాలిపడ్డ ప్రయాణీకులు అతని చేతి లోని డబ్బాలో తోచినంత దానం చేసేవారు.

టికెట్టు తీసుకున్న ప్రయాణీకులంతా కూర్చున్నారని నిర్ధారించు కున్నాక ఆయిలు మరకల బట్టలతో ఉండే పన్నెండేళ్ళ అంజి రయ్‍ రయ్‍ అనగానే భారీ కాయాన్ని మోయలేక ఆపసోపాలు పడుతూ డ్రైవరు పిచ్చయ్య బస్సు ఎక్కి స్టార్ట్ చేసి మూడు నాలుగు సార్లు ఎక్సలేటర్‍ శబ్దం పెంచి హారన్ను రెండు సార్లు మోగించి ముందుకు ఉరికించేవాడు. గ్రహచారం బాగా లేక మధ్యలో టైరు పంక్చర్‍ అయితే గమ్యస్థానం ఏ టైముకు చేరుతామో తెలియని రోజులు. బస్సు ఇంజను ఆపితే, కొన్ని సార్లు మళ్లీ స్టార్ట్ అయ్యేది అనుమానమే.

మగ ప్రయాణీకులు బస్సు దిగి తలో చెయ్యి వేసి తొయ్యా ల్సిందే. వర్షం కురిసిందంటే ఆ ఒక్క బస్సు రాక కూడా అనుమానమే. అన్నీ మట్టి రోడ్లే కావడం వలన వర్షాకాలంలో రోడ్లు బురదతో నిండేవి. ఎప్పుడైనా బస్సు బురదలో దిగబడిందంటే బురదలో రాళ్లు, ఇటుకలు వేసి బైటికి తీయడానికి ప్రయాణీకులంతా నానా యాతన పడాల్సి వచ్చేది. ప్రయాణీకుల కాళ్లు బురదతో, చేతులు మట్టితో నిండి పోయేది. కొన్ని సార్లు డ్రైవరు, కండక్టరుతో స్కూలు విద్యార్థులు గొడవ పడేవారు. అది మనసులో ఉంచుకొని మరుసటి రోజు విద్యార్థులు బస్సు పోకుండా రోడ్డుకు అడ్డంగా రాళ్లను, చెట్ల కొమ్మలను వేయడం, డ్రైవరు, కండక్టరు, క్లీనరు ప్రయాణీకుల సహాయంతో వాటిని తొలగించి ప్రయాణాన్ని కొనసాగించడం జరిగేది.

సూర్యాపేట నుండి హుజూర్‍ నగర్‍ కేవలం 48 కిలోమీటర్ల దూరం మాత్రమే. అయినా ఆ బస్సు యాత్ర మూడు గంటల పైనే పట్టేది. కిక్కిరిసిన ప్రయాణీకులతో చంటి పిల్లల ఏడ్పులతో బస్సు గందరగోళంగా ఉండేది. కొంత మంది వదిలే కార్బన్‍ డై ఆక్సైడ్‍ కంపు బస్సంతా నిండేది. స్త్రీలు చీర కొంగు ముక్కుకు అడ్డం పెట్టుకుంటే మగవారు రుమాలుతో ముక్కు మూసుకునే వారు. బస్తా మూటలు, బట్టల మూటలు, ఎండు మిరపకాయల మూటలు, మంచినూనె కొబ్బరినూనె సీసాలు, వ్యవసాయ పనిముట్లు, జీతగాండ్లకు ఇచ్చే ముల్లుకర్రలు, చండ్రాకోలలు, పైర్లకు వేసే క్రిమి సంహారక మందులు మొదలైన వాటితో నిండిపోయేది. నిరక్ష్యరాశులైన ప్రయాణీకులు కొంత మంది చొక్కా లేకుండా కండువా లేదా గొంగడి లేదా దుప్పటి కప్పుకుని ప్రయాణించే వారు. ఆ రోజుల్లో మహిళలు ఎక్కువగా ఏడు గజాల చీరతో గోచీ కట్టే అలవాటు ఉండేది. పొగ తాగడం నేరం అని బస్సులో రాసిన విజ్ఞప్తిని పాటించేవారు శూన్యం. కొంత మంది మగవారు చుట్ట, బీడీ, సిగరెట్టు కాల్చటం, ఆడవారు గొడవ చేయటం సర్వ సాధారణం. పొగ తాగిన తరువాత కొంత మంది కాండ్రించి కిటికీ నుండి బయటికి ఉమ్మేయడం, గాలికి తుంపర్లు ప్రయాణీకుల ముఖాల మీద పడటం, వాళ్ళు కయ్‍ మని అరవటం పరిపాటి. మరి కొంత మంది ఎవరూ గమనించటం లేదనుకొని బస్సులోనే ఉమ్మేసి కాలితో తుడువటం మామూలే.

ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు బస్సు ప్రయాణం ఉచితం కాబట్టి కొంత మంది ప్రయాణీకులకు , కండక్టరుకు పిల్లల వయస్సు విషయంలో వాగ్వివాదం జరుగుతుండేది. కండక్టరు ఆర్డరు వేస్తే పది పన్నెండు సంవత్సరాల పిల్లలను కూడా వారి వారి కుటుంబ సభ్యులు మీద కూర్చో బెట్టుకోవాల్సిందే. ఆడవారి మధ్య తగవులాట విచిత్రంగా సాగేది. ‘‘కాలు తొక్కుతున్నవు కండ్లు కనబడ్త లేవా’’ అని ఒకరు, ‘‘ నీ పిల్లగాన్ని మీద కూసోపెట్టుకో రాదమ్మా’’ అని ఇంకొకరు, ‘‘కూసింత జరిగి జాగ ఇయ్యొచ్చుగా’’ అని ఒకామె అంటే ‘‘జాగ ఏడ ఉందమ్మా’’ అని మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునేది. కిక్కిరిసిన జనంతో ఎండా కాలంలో ఐతే నెత్తి నుండి చెమట కారేది. కిటికీలకు గ్లాసు అద్దాలు లేనందున వానాకాలంలో వర్షపు జల్లులతో ప్రయాణీకులు తడిసి పోయేవారు. తరచుగా ఆ బస్సులో ప్రయాణించే ఆసాములు, దొరలు పండుగల ఇనాము కింద కందులు, పెసలు, చింతపండు, మామిడి కాయలు, పల్లీలు డ్రైవరు, కండక్టరుకు ఇచ్చేవారు. ఎందుకంటే వారికి ముందు సీట్ల కేటాయింపు ప్రాధాన్యత ఉండేది.

అంతేగాక ఊర్లలో వారు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు వారి ఇంటి ముందు బస్సు ఆపటం ఆనవాయితీ. ఆ బస్సు ప్రయాణం తిట్ల దండకాలు, శాపనార్థాలు , కష్టాలు, సుఖాలతో ఒక యాత్ర లాగా జరిగేది. కొందరు నరక యాత్ర అంటే మరి కొందరేమో ఆ బస్సే లేక పోతే గమ్యం చేరేందుకు వేరే గత్యంతరం లేదు కదా అనే వారు. ఏది ఏమైనా బస్సు పోతుంటే రోడ్డుకు రెండు వైపులా పచ్చటి పైర్లు, మోట బావులు, పొలాలు దున్నే రైతులు, సాయంత్రం ఇండ్లకు చేరే పశువుల మందలు ఆహ్లాదం కలిగించేది. ఆ బస్సు ప్రయాణం పాత తరం వారు ఇప్పటికీ మరచిపోలేరు.

తడకమళ్ళ మురళీధర్‍ , 9848545970

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *