మంటో కోపం

ప్రముఖ కథారచయిత సాదల్‍ హసన్‍ మంటో కథలు ఆటవికతని, వ్యభిచారాన్ని శవాలతో సంపర్కాన్ని చేస్తున్న విషయాలని ప్రతిబింబించాయి.
దానివల్ల అతను ‘నీతిమంతులకి’ శత్రువయ్యాడు. కోర్టుల బారిన పడ్డాడు. అతని కథల్లో అశ్లీలం వుందని శిక్ష కూడా పడింది. తన విమర్శకులని మంటో చీల్చి చెండాడాడు. ఈ వ్యాసం అతని కోపానికి అసంతృప్తికి వ్యంగ్య సమాధానం.
‘‘ఈ కొత్త విషయం మీకు తెలుసా?’’
-కొరియా నుంచి వచ్చిన విషయమా?
‘‘కాదు. కాదు’’
-జునాఘడ్‍ బేగం గురించా?
‘‘కాదు..’’
-సెన్సేషనల్‍ హత్య జరిగిందా మళ్ళీ?
‘‘కాదు. సాదత్‍ హసన్‍ మంటో గురించి’’
-ఏమిటీ? అతను చనిపోయినాడా?
‘‘కాదు. పోలీసులు అతన్ని నిన్న అరెస్టు చేశారు’’
-‘‘అశ్లీల రాతల గురించా?’’
‘అవును. ఆయన ఇంటిని కూడా సోదా చేశారు’
-అక్కడేమైనా కొకోయన్‍ దొరికిందా? లేక ఏదైనా నిషిద్ధమైన వస్తువులు దొరికాయా?
‘ఏమీ లేదు. చట్టవ్యతిరేకమైనవి అక్కడేవీ లభించినట్లు వార్తా పత్రికలో రాయలేదు’.
-ఆ చెత్తనా కొడుకే ఓ చట్టవ్యతిరేకి అని నేనంటాను.

‘‘అవును’’
-అలాంటప్పుడు అతనిపై నేరారోపణలు ఎందుకు చేయరు?
‘‘ఆ విషయాలని మనం ప్రభుత్వానికి వదిలేద్దాం. ఎవరిని ఎలా ఇరికించాలో ప్రభుత్వానికి బాగా తెలుసు!’’
-అవును, అందులో ఎలాంటి అనుమానం లేదు.
‘‘మరి నువ్వు ఏమంటావ్‍. ఈ సారి మంటోని ఉరి తీస్తారని అనుకుంటాను.’’
-అలాగే జరుగుతుందని అనుకుంటాను. దాంతో వాడి పీడా విరగడవుతుంది.
‘‘అవును నువ్వన్నది నిజం. ‘చల్లబడిన మాంసం’ కథ గురించి హైకోర్టు ఏమి చెప్పింది. అతనే ఉరిపెట్టుకుంటాడని అనుకుంటాను’’.
-ఉరివేసుకోవడంలో అతను విఫలమైతే.
‘‘ఆత్మాహత్యానేరానికి అతని మీద కేసు పెడతారు. జైల్లో వేసేస్తారు.’’
-అందుకే అతను అలాంటి ప్రయత్నం చేయలేదని అనుకుంటాను. ఏమైనా అతనో అతివాది.
‘‘అంటే అతను తన అశ్లీల రచనలు కొనసాగిస్తాడా?’’
-అరే యార్‍! ఇది అతని మీద ఆయిదవ కేసు. అతను సరిగ్గా వుండాలని అనుకుంటే మొదటి కేసు తరువాత నుంచే జాగ్రత్తగా గౌరవ ప్రదంగా వుండేవాడు.
‘‘అవును. ఓ ప్రభుత్వ ఉద్యోగిగానో లేక నెయ్యిని అమ్ము కుంటూనో వుండేవాడు. లేక గులామ్‍ అహ్మద్‍ మాదిరిగా నపుంస కత్వం తగ్గించే మందులని అమ్మేవాడు.’’
-అవును. గౌరవప్రదంగా వుండటానికి అతనికి ఎన్నో దారులు వున్నాయి. దైవభక్తి లేని వ్యక్తి. అతను మళ్ళీ అశ్లీల రచనలు కొనసాగిస్తాడు గుర్తుపెట్టుకో!
‘‘చివరికి అతను ఏమవుతాడంటావ్‍?’’
-నేను చాలా చెడ్డగా ఊహిస్తున్నాను.
‘‘పంజాబ్‍లో అతనిపై ఆరుకేసులు వున్నాయి. కింద్‍లో నాలుగు, నార్త్ వెస్ట్ ప్రాంటీయర్‍లో మరో నాలుగు, పాకిస్తాన్‍లో మూడు కేసులు అతనిపై వున్నాయి. ఆ కేసుల వల్ల అతను పిచ్చివాడై పోతాడు’’.
-అతను ఇప్పటికే రెండుసార్లు పిచ్చివాడై పోయాడు ఆ మధ్య వార్తా పత్రికలో రాశారు కూడా.
‘‘అదే జరుగుతుంది. ఇప్పటిదాకా అయ్యింది రిహార్షల్‍. చివరికి పిచ్చాసుపత్రిలో చేరతాడు. దానికి ఇప్పటికే అలవాటైపోయినాడు’’
-అక్కడ అతనేం చేస్తాడు?
‘‘పిచ్చి వాళ్ళని మంచిగ చేసే ప్రయత్నం చేస్తాడేమో’’
-అది నేరమా?
‘‘ఏమో చెప్పలేను. న్యాయవాది మాత్రమే జవాబు చెప్పగలడు. పాకిస్తాన్‍ పీనల్‍ కోడ్‍ (Pakistan penal code)లో ఏదో సెక్షన్‍ వుండే వుంటుంది. పిచ్చివున్న వాళ్ళని మంచిగా చేయడం సెక్షన్‍ 292 ప్రకారం శిక్షార్హమైన నేరం’’.
-‘‘చల్లబడిన మాంసం (తండా ఘోష్‍) పై ఇచ్చిన తీర్పులో హైకోర్టు ఏమని అన్నదంటే రచయిత ఉద్దేశ్యంతో సంబంధంలేదు. అదే విధంగా అందులోని పాత్రతో కూడా సంబంధం లేదు. అతని రచనల్లో అశ్లీలం వుందా లేదానన్నదే ప్రధాన విషయం. ఇదే హైకోర్టు చెప్పింది.
‘‘సంక్షిప్తంగా నేను చెబుతున్నది ఇదే. పిచ్చివాళ్ళని మంచి
వాళ్ళుగా చేయడంలోని అతని ఉద్దేశంతో సంబంధం లేదు. అసహజ విషయమే ముఖ్యమైనది’’
-ఇవన్నీ చట్టానికి సంబంధించినవి. కోర్టు పరిశీలనలో వున్నవి. వీటి గురించి మనం దూరంగా వుండాలి.
‘‘అవును. బాగా గుర్తుచేశారు. ఈ విషయాలని ప్రైవేట్‍గా మాట్లాడటం, చర్చించడం కూడా నేరమే!’’
-మంటో పిచ్చివాడైతే, అతని భార్యా పిల్లల సంగతి ఏమిటీ చెప్పు?
‘‘నరకానికి పోనివ్వు వాళ్ళని. చట్టానికి ఏం సంబంధం వాళ్ళతో’’
-అవును. వాళ్ళకి సహాయం చేయడం కోసం ప్రభుత్వం ఓ అడుగు వేస్తుందని అంటావా?
‘‘ప్రభుత్వం ఏమైనా చేయాలి. ఆ విషయాన్ని పరిశీలిస్తున్నామని వార్తా పత్రికలకి తెలియ చేయాలి’’.
-అప్పటికి అన్ని విషయాలు స్థిరమైపోతాయి. చాలా గొప్ప ఆలోచన.
‘‘అవును. ఇదే ప్రతిసారీ జరుగుతుంది’’
-మంటో అతని కుటుంబం నరకానికి పోనివ్వు. హైకోర్టు రూలింగ్‍ వల్ల ఉర్దూ సాహిత్యానికి ఏమైనా జరుగుతుందంటావా?
‘‘ఉర్దూ సాహిత్యం కూడా నరకానికి పోనియి.’’
-అలా అనకు. సాహిత్యం సంస్కృతులు దేశానికి ఆస్తులని నేను విన్నాను.
‘‘డబ్బునే నేను ఆస్తి అనుకుంటాను. భౌతికంగా గానీ బ్యాంకులో గానీ వుండాలి’’.
-తెలివైన మాట. అదే ఒకవేళ నిజమైతే మోమిన్‍, మీర్‍ హసన్‍, సాధీ హఫీజ్‍ లాంటి వాళ్ళ మీద వున్న 292 కేసులు తుడుచుకొని పోయినట్టేనా?
‘‘అంతేనని అనుకుంటాను. లేకపోతే చట్టం ఎందుకు?’’
-కవులూ రచయితలు తమ స్పృహలోకి వచ్చి గౌరవప్రదమైన వృత్తులని చేపట్టాలి.


‘రాజకీయాల్లో చేరాలి’
-ముస్లింలీగ్‍ పార్టీలో చేరి కదా?
‘‘అవును. వేరే పార్టీలో చేరితే మళ్ళీ అశ్లీలాన్ని ప్రచారం చేస్తారు’’.
-అవును. నిజంగా
‘‘వాళ్ళు చాలా గౌరవప్రదమైన పనులు చేయవచ్చు. పోస్ట్ ఆఫీసుల దగ్గర కూర్చొని తమ టాలెంట్‍ని ఉపయోగించి అవసరమైన వ్యక్తులకి ఉత్తరాలు రాసిపెట్టవచ్చు. అదే విధంగా ప్రకటనలని కూడా రాయవచ్చు.’’
-ఖాళీగా భూములు చాలా వున్నాయి. వాటిని దున్నవచ్చు.
‘‘రావి నది ప్రక్కన భూములని కొంతమది వ్యక్తులకి ప్రభుత్వం ఇస్తుందని విన్నాను. కవులని రచయితలని కూడా అందులో చేర్చాలి.’’
-చాలా మంచి ఆలోచన
‘‘ఏం జరుగుతుందని అనుకుంటున్నావు’’
-ఏం జరుగుతుంది. అక్కడున్న మట్టితో గోడలు కడుతారు.
‘‘చాలా గొప్పగా వుంటుంది. తన చుట్టూ వున్న సామాగ్రితో మంటో ఆనందపడతాడు’’.
-వాడు వేశ్యల దగ్గర పడుకోకుండా వాళ్ళ గురించి రాస్తాడు మనకు కథలని అందిస్తాడు.
‘‘నిజమే! భూమిని అతను ఏం చేస్తాడు. మనమందరం త్రుచ్చులుగా చూసే వ్యక్తులని గొప్పవాళ్లుగా చేస్తాడు’’.
-అతని సోదరి ఇస్మత్‍ చుగ్తామ్‍ అంటుంది. అందరినీ దూరంగా నెట్టే వ్యక్తులను చూసి అతను ఆనందపడతాడు. ఎలాంటి మరకలేని తెల్లటి దుస్తుల్లో వున్న వ్యక్తి మీద బురదని అంటించి, న్యూసెన్స్ చేస్తాడు.
‘‘ప్రతీ ఉదయం ఇలాంటి పనే చేస్తాడని అతని సోదరుడు ముంతాజ్‍ హుస్సేన్‍ అంటాడు’’
-అది చాలా అశ్లీల
‘‘తెల్లడి దుస్తుల్లో వున్న వాళ్ళ మీద పేడవేయడం గురించి ఏమంటావ్‍’’
-అది అశ్లీలమే.
‘‘ఇదంతా అతనికి ఎక్కడ నుంచి వస్తుంది?’’
-తెలియదు. అతను ఎక్కడో దొరక బుచ్చుకుంటాడు.
‘‘మనకి ఆ చెత్తని ఇవ్వమని ఆ దేవున్ని పార్థిస్తాం. అది మంటోకి కూడా మంచిది’’
వాళ్ళ ప్రార్థన:
భగవంతుడా! సాదత్‍ హసన్‍ మంటోని ఈ ప్రపంచం నుంచి తీసుకొని వెళ్ళు. అతని వల్ల ఈ ప్రపంచానికి ఏ ఉపయోగమూ లేదు. వెలుతురిని చూసి అతను కళ్ళు మూసుకుంటాడు. చీకటి మూలల్లోకి వెళతాడు.
భార్యల్లో మంచిని చూడడు. వేశ్యల సాంగత్యం కోరతాడు. చెత్తతో స్నానం చేస్తాడు. గుడ్లుగూబలా అరుస్తాడు. అతన్ని ఈ ప్రపంచం నుంచి తీసుకొని వెళ్ళు.
ఓ భగవంతుడా!
నువ్వు జాగ్రత్తగా వుండాలి. అతన్ని ఎప్పుడూ కనిపెట్టుకొని వుండు. అతను చాలా తెలివిగలవాడు. నీకు అన్నీ తెలుసు. అయినా మేం నీకు గుర్తుచేస్తున్నాం.
అతన్ని మా ప్రపంచం నుంచి తొలగించమని అడుగుతున్నాం. ఒకవేళ అతను వుంటే మా మాదిరిగా వుండాలి. మేం ప్రపంచం రోతని దాచిపెట్టి పవిత్రంగా వున్నట్టు ప్రమాణం చేస్తాం.


-మంగారి రాజేందర్‍ (జింబో)
ఎ : 9440483001

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *