అన్నదాతకు అందలం


మట్టిని నమ్మిన రైతుకు.. ప్రజలను నమ్మిన రాజకీయ పార్టీకి ఓటమి లేదు :

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‍రెడ్డి


నాటి సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం కుదేలు అయింది, వివక్షకి గురైంది. నీళ్లు ఉన్నా కూడా మనకు ఇవ్వలేదు. చెరువులు బావులపై ఆధార పడాల్సిన పరిస్థితి ఉండేది. సాగునీరు కోసం కృష్ణ గోదావరిలపై ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టలేదు, నాటి సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‍ దృష్టి పెట్టారు. రైతుబంధు ఆత్మభిమానాన్ని పెంచే పథకం. వ్యవసాయ అభివృద్ధి కోసం కేసీఆర్‍ గట్టి పునాది వేశారు అని తెలిపారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‍రెడ్డి.


దేశంలో రైతువేదికలు నిర్మించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ప్రతి చోటా ప్రభుత్వ కార్యాలయాలు ఎన్నో ఉండొచ్చు, కానీ కేవలం రైతులను దృష్టిలో పెట్టుకుని వారికోసమే రైతువేదికలను సృష్టించింది కేసీఆర్‍ మాత్రమే. 60 శాతం మంది ఆధారపడ్డ వ్యవసాయరంగం బాగుంటే సమాజం అంతా బాగుంటుంది. మట్టిని నమ్మిన రైతుకు.. ప్రజలను నమ్మిన రాజకీయ పార్టీకి ఓటమిలేదు. ఆరున్నరేళ్లలో కేసీఆర్‍ నాయకత్వంలో తెలంగాణలో జరిగిన అభివృద్దిని మించి దేశంలోని 27 రాష్ట్రాలలో ఎక్కడా జరగలేదు.


దేశంలోనే నంబర్‍ వన్‍గా తెలంగాణ..
సాగులో తెలంగాణ దేశంలోనే నంబర్‍ వన్‍గా నిలిచింది. వానాకాలంలో 39 శాతం అత్యధికంగా సాగుచేశారు. సాగునీటి రాకతో వ్యవసాయ రంగంలో మోటార్ల వినియోగం పెరగడంతో కరెంట్‍ వినియోగం కూడా భారీగా పెరిగింది. రైతు ఉత్పత్తి సంఘాల (ఎఫ్‍పీవో)ను ఏర్పాటు చేయనున్నాం.


అన్నదాతకు అందలం
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అగ్రస్థానం కల్పించింది. బడ్జెట్‍ కేటాయింపుల్లో వ్యవసాయం, అనుబంధ శాఖలకు పెద్దపీట వేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 25,811.78 కోట్లు కేటాయించింది. గతం కంటే ఈసారి బడ్జెట్‍లో వ్యవసాయ, అను బంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యం కల్పించడం విశేషం. అందులో ప్రగతి పద్దు రూ. 23,405.57 కోట్లు కాగా మిగిలిన రూ. 2,406.21 కోట్లు నిర్వహణ పద్దు.

  • రైతు రుణమాఫీకి రూ. 6,225 కోట్లు
  • రైతు బీమాకు రూ. 1,141 కోట్లు
  • మార్కెట్‍ ఇంటర్వెన్షన్‍ ఫండ్‍కు రూ. 1,000 కోట్లు
  • పశుసంవర్ధకశాఖకు రూ. 1,586 కోట్లు
  • సహకార, మార్కెటింగ్‍కు రూ. 108 కోట్లు
  • రైతుబంధుకు రూ. 14 వేల కోట్లు.. గతంకంటే రూ. 2 వేల కోట్లు అదనం


మొత్తం వ్యవసాయ అనుబంధ శాఖల బడ్జెట్‍లో ప్రగతి పద్దు కింద వ్యవసాయ రంగానికి రూ.23,221.15 కోట్లు కేటాయించగా సహకార, మార్కెటింగ్‍ శాఖలకు రూ.7.42 కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ.177 కోట్లు కేటాయించింది.


వ్యవసాయ రంగానికి కేటాయించిన ప్రగతి పద్దు బడ్జెట్‍లో రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీలకు అగ్రస్థానం కల్పిం చారు. రైతు బంధు పథకం అమలు కోసం రూ.14వేల కోట్లు కేటాయించారు. 2018-19 బడ్జెట్‍లో రూ.12వేల కోట్లు కేటాయించగా దానికి అదనంగా రూ.2వేల కోట్లు కేటాయించడం గమనార్హం. కొత్త పాస్‍పుస్తకాలు మంజూరు కావడం వల్ల రైతు బంధు లబ్ధిదారుల సంఖ్య వచ్చే ఏడాది పెరగనుండటంతో పెరిగే లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా బడ్జెట్‍లో రూ.2 వేల కోట్లు అదనంగా పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. అంతేగాకుండా సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావడం, పంటల సాగు విస్తీర్ణం పెరగడం వల్ల కూడా ఈ నిర్ణయం తీసుకుంది.


రైతుబంధుకు గత బడ్జెట్‍లో కేటాయించిన సొమ్ముకు 1.20 కోట్ల ఎకరాలను పరిగణనలోకి తీసుకోగా ఈసారి కొత్త పాస్‍పుస్తకాల సంఖ్య పెరగడం, ప్రాజెక్టులు, జలాశయాల ద్వారా మొత్తంగా 20 లక్షల ఎకరాల ఆయకట్టు అదనంగా పెరిగిందన్న అంచనాతో 1.40 కోట్ల ఎకరాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం కేటాయింపులు చేసింది. రైతుబంధు ద్వారా 2018-19 ఖరీఫ్‍లో రూ. 5,235 కోట్లు, రబీలో రూ. 5,244 కోట్లు పంపిణీ చేయగా 2019-20లో ఎకరానికి రూ. 10 వేల చొప్పున రూ. 12 వేల కోట్లను బడ్జెట్‍లో కేటాయించింది.


రైతు రుణమాఫీకి రూ. 6,225 కోట్లు…
గత ఎన్నికల సందర్భంగా టీఆర్‍ఎస్‍ ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటించింది. అయితే గతంలో చేసిన రుణమాఫీకి, ఇప్పుడు రుణమాఫీకి కాస్త తేడా ఉంది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో రూ. లక్షలోపు ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని టీఆర్‍ఎస్‍ ప్రకటించి అందుకు అనుగుణంగా రూ.16,124 కోట్లను నాలుగు విడతల్లో మాఫీ చేసింది. ఈసారి బడ్జెట్‍లో రూ. 6,225 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో రూ.25 వేలలోపు రుణాలున్న రైతులు 5,83,916 మంది ఉండగా వారందరి రుణాలను నూరు శాతం ఒకే దఫాలో మాఫీ చేయాలని ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది.


మార్కెట్‍ ఇంటర్వెన్షన్‍ ఫండ్‍కు రూ. 1,000 కోట్లు
ఈ బడ్జెట్లో మార్కెట్‍ ఇంటర్వెన్షన్‍ ఫండ్‍ కోసం ఏకంగా రూ. వెయ్యి కోట్లు కేటాయించడం విశేషం. కేంద్ర ప్రభుత్వం ప్రతిసారీ మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన పంటల విష యంలో పరిమితి విధిస్తుండటంతో రైతులు దళారులను ఆశ్రయించే పరిస్థితి తలెత్తుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వరి, పత్తి, మొక్కజొన్న, కందులు తదితర పంటల కొనుగోలుకు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు సరైన ధర వచ్చేలా చేయాలనేది సర్కారు ఉద్దేశం. ఈ ఏడాది పండిన కందులలో కొద్ది శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. కంది రైతులను ఆదుకునే లక్ష్యంతో ఎంత ఖర్చయినా సరే మొత్తం కందులను కొనుగోలు చేయాలని బడ్జెట్‍లో స్పష్టం చేసింది. అలాగే ఈ ఏడాది రూ.600 కోట్లతో మైక్రో ఇరిగేషన్‍ కార్యక్రమాలను అమలు చేయాలని నిర్ణయించింది.


రైతు బీమాకు రూ.1,141 కోట్లు..

రైతు బీమాకు ప్రస్తుత బడ్జెట్‍లో రూ.1,141 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో ఏ రైతు, ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబానికి వెంటనే రూ. 5 లక్షలు అందించడమే దీని ఉద్దేశం. 18 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న ప్రతి రైతుకూ బీమా సదుపాయం కల్పిస్తారు. ప్రతి రైతు పేరిట రూ. 2,271.50 ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే ఎల్‍ఐసీ సంస్థకు క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. రైతు చనిపోయిన 10 రోజుల్లోపే వారి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షలు బీమా పరిహారం చెల్లిస్తుంది.


ఒక్కో రైతు వేదికకు రూ. 12 లక్షలు

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 5 వేల ఎకరాల క్లస్టర్‍కు ఒకటి చొప్పున రైతు వేదికలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో రైతు వేదికను రూ. 12 లక్షలతో నిర్మించాలని బడ్జెట్‍లో ప్రభుత్వం ప్రతిపాదించింది. అందుకోసం మొత్తం రైతు వేదికల నిర్మాణానికి ఈ బడ్జెట్‍లో రూ. 350 కోట్లు కేటాయించింది. పాడి రైతులకు అందించే ప్రోత్సాహకం కోసం ఈసారి బడ్జెట్‍లో రూ. 100 కోట్లు, పశుపోషణ, మత్స్యశాఖకు రూ. 1,586.38 కోట్లు కేటాయించారు.
రైతులకు విత్తన సరఫరా కోసం రూ. 55.51 కోట్లు కేటాయించారు. ప్రొఫెసర్‍ జయశంకర్‍ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి గత బడ్జెట్‍లో రూ. 20 కోట్లు కేటాయించగా ఇప్పుడు రూ. 25 కోట్లు కేటాయించారు. విత్తనాల సబ్సిడీకి రూ. 142 కోట్ల మేర కేటాయింపులు చేశారు.


మన వ్యవసాయ కేటాయింపులు జాతీయసగటు కంటే ఎక్కువ

వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం గత ఐదేళ్లలో మొత్తం బడ్జెట్‍ కేటాయింపుల్లో పది శాతాన్ని దీనికే కేటాయించటం గొప్ప పరిణామమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‍రెడ్డి వెల్లడించారు. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. జాతీయ స్థాయిలో వ్యవసాయానికి కేటాయించిన మొత్తం బడ్జెట్‍ పద్దులో కేవలం 6.5% మాత్రమేనన్నారు. ‘రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కేటాయింపులు గొప్పగా ఉన్నాయి. నాడు బోరుబావి వేసి బాగుపడినవాడు లేడు, నేడు చెరువుల కింద సాగు చేసి చెడిపోయిన వాడు లేడు. అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో కూడా సాగుకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన దాఖలాలు కనిపించవు.


రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది
రైతులు రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ వ్యవసాయం చేయాలి. రసాయనిక ఎరువులు వాడడం వల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటు ప్రజలు అనారోగ్యం బారిన పడుతారు. ఈ క్రమంలోనే రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి. రైతులు పండించిన పంటను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.


శంషాబాద్‍ విమానాశ్రయం నుండి కూరగాయల ఎగుమతి

తెలంగాణ రాష్ట్రంలో పండించిన పండ్లు, కూరగాయలను శంషాబాద్‍ విమానాశ్రయం నుండి ఎగుమతి చేయనున్నట్టు మంత్రి నిరంజన్‍ రెడ్డి తెలిపారు. ఉద్యానపంటల అధ్యయనంలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో పర్యటించిన మంత్రి బెంగుళూరు లాల్‍బాగ్‍లోని హాప్‍కామ్స్, మదర్‍ డైయిరీ, సఫల్‍ యూనిట్లు, తిరుమ్‍హెట్టి హల్లి ఆనందరెడ్డి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి విమానాశ్రయం ద్వారా కూరగాయల ఎగుమతికోసం జీఎంఆర్‍ సంస్థతో సమావేశం నిర్వహించాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. హైదరాబాద్‍ నలువైపులా మార్కెట్లు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శంషాబాద్‍, వంటిమామిడి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో రైతు సహకార సంస్థల ద్వారా మార్కెట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
దళారీ వ్యవస్థ పోయి రైతులకు, వినియోగదారులకు నేరుగా సంబంధాలు ఏర్పడాలన్నారు. అప్పుడే రైతుల శ్రమకు తగిన గిట్టుబాటు ధరలతో పాటు, వినియోగదారులకు సరసమైన ధరలకు నాణ్యమైన పండ్లు, కూరగాయాలు లభిస్తాయన్నారు. కర్నూలు-హైదరాబాద్‍ జాతీయ రహదారి వెంట అగ్రి ఫుడ్‍ ప్రాసెసింగ్‍ ఎగుమతి యూనిట్లను ఏర్పాటు చేయాలని, అందుకోసం ప్రభుత్వ సహకారం అందిస్తామని ప్రకటించారు. బీచుపల్లిలో వేరుశనగ నూనె ఉత్పత్తి కేంద్రం, అశ్వారావుపేటలో ముడి ఆయిల్‍పాం ఉత్పత్తికి ఆదేశాలిచ్చా మన్నారు. రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి కేంద్రాల విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్‍ ఎంతో ముందు చూపుతో ఉన్నట్టు తెలిపారు.


తేమ శాతం పెంచి పత్తిపంట కొనండి
నాణ్యమైన పత్తి ఉత్పత్తికి తెలంగాణ ప్రసిద్ధి చెందిందని మంత్రి అన్నారు. పత్తి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్‍ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్‍లో పత్తి పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‍రావు సిద్ధంగా ఉన్నారన్నారు. దీనికి కాటన్‍ కార్పోరేషన్‍ ఆఫ్‍ ఇండియా (సిసిఐ) సహకరించాలని ముంబయ్‍లోని సిసిఐ కార్యాలయంలో సంస్థ ఛైర్మన్‍ ప్రదీప్‍కుమార్‍ అగర్వాల్‍తో భేటి సందర్భంగా ప్రస్తుతం పత్తి కొనుగోలులో 12శాతం ఉన్న తేమ నిబంధనను సవరించాలని కోరారు. అలాగే 2019-2020 సంవత్సరానికి 49.56 లక్షల పత్తిబేళ్లను సిసిఐ నిల్వచేయగా అందులో 9.28లక్షల బేళ్లను మాత్రమే తరలించిందన్నారు. పాత నిల్వలను వెంటనే తరలించి కొత్తగా కొనుగోలు చేసిన పత్తినిల్వకు సహకరించాలని మంత్రి కోరారు.


నాబార్డ్ చైర్మన్‍తో భేటీ

వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‍రెడ్డి నాబార్డ్ ఛైర్మన్‍ డా.గోవిందరాజులు చింతలతో (జిఆర్‍ చింతల)తో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై ఆయనతో చర్చించారు.


పత్తి కొనుగోళ్లపై జిల్లాకో కాల్‍ సెంటర్‍

పత్తి కొనుగోళ్లపై జిల్లాకో కాల్‍ సెంటర్‍ ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‍రెడ్డి ఆదేశించారు. అకాల వర్షాల కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ పత్తి తడిచే పరిస్థితి రాకూడదన్నారు. ఈ నేపథ్యంలో రైతులను నుంచి సాధ్యమైనంత త్వరగా పత్తిని కొనుగోలు చేయాల్సిన అవసర ముందన్నారు. ఇందుకు జిల్లాకో కాల్‍ సెంటర్‍ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కొనుగోలు కేంద్రానికి వచ్చిన పత్తి ఎట్టి పరిస్థితులలో అకాలవర్షాల మూలంగా తడవకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. 300 జిన్నింగ్‍ మిల్లులు, 9 మార్కెట్‍ యార్డ్లలో కొనుగోలు కేంద్రాలకు ఏర్పాటుకు సిసిఐ సిద్ధంగా ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద వెబ్‍ కెమెరాలు, ఫింగర్‍ ప్రింట్‍ స్కానర్లు, తేమయంత్రాలు, ఎలక్ట్రానిక్‍ కాంటాలు, ఆపరేటర్లను సిద్ధంగా ఉంచినట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకు తూనికలు, కొలతల శాఖతో అన్ని అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు.
గ్రామాలవారీగా పత్తిని కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు గాను వ్యవసాయ శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారం ఎఇఒలు, ఎఒలు, ఇతర అధికారులు సమన్వయంతో టోకెన్లను జారీచేసి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు రోజుల తరబడి వేచిచూడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.


అన్ని పంటలకు మద్దతు ఇవ్వాలె

కేంద్రం అన్ని రకాల ఆహార పంటలకు మద్ధతు ధర అందించాలని నిరంజన్‍ రెడ్డి కోరారు. జాతీయ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‍ తోమర్‍ ముఖ్య అతిథిగా వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‍) ప్రాంతీయ కమిటీ సమావేశం జరిగింది. ఆన్‍లైన్‍ ద్వారా తెలంగాణ నుంచి మంత్రి నిరంజన్‍ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పంటల సాగు విస్తీర్ణం ఎలా పెరిగిందో వివరించారు. తెలంగాణలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశామన్నారు. సిఎం కెసిఆర్‍ వ్యవసాయ అనుకూల నిర్ణయాలు, విధానాలతో ముందుకు వెళ్తున్నామని నియంత్రిత సాగును ప్రోత్సాహిస్తున్నామని స్పష్టం చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్‍ ఉన్న పంటల సాగుకు ప్రాధాన్యం ఇస్తున్న దృష్టా ప్రొఫెసర్‍ జయశంకర్‍ వ్యవసాయ వర్సిటీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.


రాష్ట్రంలో 53 లక్షల ఎకరాల్లో వరి, 60 లక్షల ఎకరాల్లో పత్తి, 11 లక్షల ఎకరాల్లో కందితో పాటు ఆముదాలు, జొన్నలు, సోయాబీన్‍, వేరుశనగ పంటలు సాగైనట్లు చెప్పారు. ఆయిల్‍పామ్‍ సాగును ప్రోత్సాహిస్తున్నట్లు వివరించారు. రైతులకు కష్టానికి తగిన ఫలితం, మద్ధతు ధర లభించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. మొత్తం కోటి 45 లక్షల ఎకరాల్లో ఈ వానాకాలం పంటల సాగైనట్లు పేర్కొన్నారు. రానున్న యాసంగిలోనూ గతం కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని తెలిపారు. అవాల పంటపై అఖిల పరిశోధన సమన్వయ కేంద్రం జగిత్యాలలో ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. అంతర్జాతీయ నాణ్యత కలిగిన అప్లాటాక్సిన్‍ రహిత వేరుశనగ పండే వనపర్తి జిల్లాలో వేరుశనగ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు కేంద్రం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.


పత్తిలో అత్యధిక సాంద్రతతో కూడిన విధానంలో పంట పండించేందుకు అఖిల భారత పరిశోధన సమన్వయ కేంద్రం వరంగల్‍లో ఏర్పాటు చేయాలని, సాగునీటి వసతితో రెండు పత్తి పంటలు పండించేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలన్నారు. అదే సమయంలో తెలంగాణలో పెరిగిన సాగునీటి వసతుల దృష్టా నీటి యాజమాన్యంపై పరిశోధన చేయడానికి హైదరాబాద్‍ రాజేంద్ర నగర్‍లో అఖిల భారత సమన్వయ కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.


యాసంగికి 11 లక్షల మెట్రిక్‍ టన్నుల యూరియా

యాసంగికి 11 లక్షల మెట్రిక్‍ టన్నుల యూరియా కావాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. గత యాసంగి సాగు లెక్కల ప్రకారం 8 లక్షల మెట్రిక్‍ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించింది. తెలంగాణలో పెరిగిన సాగునీటి వసతులు, ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా గత యాసంగి కంటే ఈసారి 30 శాతం సాగు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ తెలిపింది. అదనంగా అవసరాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసే విజ్ఞప్తికి కేంద్రం సహకరించాలని మంత్రి నిరంజన్‍ రెడ్డి కోరారు. తప్పకుండా సహకరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు.


మన ఉత్పాదనలు చైనా, అమెరికాలను అధిగమించాలి

మన ఉత్పాదనలు చైనా, అమెరికాలను అధిగమించాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‍ రెడ్డి అన్నారు. సిఎం కెసిఆర్‍ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టి రైతులకు అండగా నిలిచారన్నారు. రైతును రాజు చేయడమే సిఎం కెసిఆర్‍ లక్ష్యమని చెప్పారు. త్వరలోనే ఫుడ్‍ ప్రాసెసింగ్‍ యూనిట్లు భారీ ఎత్తున వస్తాయని, దీనికి సంబంధించిన విధాన నిర్ణయాన్ని సిఎం కెసిఆర్‍ త్వరలో ప్రకటిస్తారని మంత్రి పేర్కొన్నారు.


రైతాంగానికి కల్వకుర్తి జీవాధారం..
రైతాంగానికి కల్వకుర్తి జీవాధారం – మిగిలిపోయిన భూసేకరణ పనులు త్వరగా చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‍ రెడ్డి తెలిపారు. ఏదుల రిజర్వాయర్‍ను వినియోగంలోకి తీసుకొస్తే కల్వకుర్తి ఎత్తిపోతల మీద భారం తగ్గుతుందన్నారు. వేసిన ప్రతి పంట చేతికొచ్చేవరకు సాగునీరు అందిస్తామని, మూడువేల క్యూసెక్కుల నీళ్లు ప్రస్తుతం కాలువల నుండి వస్తున్నాయని తెలిపారు. మరో వెయ్యి క్యూసెక్కుల నీళ్లు తీసుకునేందుకు ఏం చేయాలో అధికారులు ప్రణాళిక సిద్దం చేయనున్నట్లు వెల్లడించారు. వట్టెం నుండి నీళ్లు తీసుకుంటేనే కల్వకుర్తి ఆయకట్టుకు న్యాయం జరుగుతుందని, – కర్నెతండా, మార్కండేయ లిఫ్ట్ పనులు వెంటనే చేప్టనున్నట్లు పేర్కొన్నారు.


మత్స్యకారుల సంక్షేమాభివృద్ధే.. ప్రభుత్వ లక్ష్యం
వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు 290 చెరువుల్లో కోటి 41 లక్షల చేపపిల్లలు విడుదల చేసినట్లు మంత్రి అన్నారు. మత్స్యకార్మికుల సంక్షేమం కోసం చేపపిల్లలతో పాటు, వేటకు వెళ్లేందుకు వలలు, చేపలు విక్రయించేందుకు ద్విచక్రవాహనాలు, వలలు, మార్కెట్‍ యార్డుల ఏర్పాటు, చేపల విక్రయ కేంద్రాల ఏర్పాటు రవాణా సదుపాయాలు ప్రభుత్వం సమకూర్చిందన్నారు.


తెలంగాణ స్ఫూర్తితో యుపిలో విత్తన పార్క్
విత్తన రంగంలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించిందని ఇదే ఆదర్శంగా తీసుకొని ఉత్తరప్రదేశ్‍లో కూడా విత్తన పార్క్ ఏర్పాటు కోసం ప్రణాళికలు రూపొందిస్తామని ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సూర్యప్రతాప్‍ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న విత్తన పార్క్ అధ్యయనం చేసేందుకు రాష్ట్ర పర్యటనకు వచ్చిన
ఉత్తరప్రదేశ్‍ వ్యవసాయశాఖ మంత్రి ఆధ్వర్యంలోని బృందం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‍ రెడ్డితో సమావేశ మయ్యారు. నిరంజన్‍రెడ్డి అధ్యక్షతన విత్తన ధృవీకరణ సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో వ్యవసాయ, విత్తనరంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి, విత్తన పురోగతి ప్రణాళికలు, దాని ఉపయోగాల గురించి వివరించారు.
విత్తన పార్క్ అభివృద్ధికి విత్తన కంపెనీలు, ప్రాసెసింగ్‍ యూనిట్లు, గోదాములు, ఆధునాతన శీతల గిడ్డంగులు, ల్యాబ్‍లు, 150 ఎకరాలలో ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. త్వరలోనే అన్ని రాష్ట్రాల విత్తన కార్పొరేషన్‍ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నిరంజన్‍రెడ్డి తెలిపారు.


విత్తనోత్పత్తిలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానం..
ప్రపంచంలోని అన్ని ప్రాంతాల వారు తెలంగాణ రాష్ట్ర విత్తనాన్ని వాడే విధంగా రాష్ట్రంలో విత్తనాభివృద్ధిని చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్షమని నిరంజన్‍రెడ్డి అన్నారు. నాణ్యమైన విత్తన ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటి స్థానం, ప్రపంచంలో రెండవ స్థానంలో ఉందని మంత్రి అన్నారు. గ్రామాల్లో విత్తనాలు
ఉత్పత్తి చేసే రైతుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు గాను పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపడుతామని మంత్రి వెల్లడించారు.


పౌల్ట్రీ రైతుల సమస్యలు పరిష్కరిస్తాం:
తెలంగాణ పౌల్ట్రీ రైతులు సచివాలయంలో మంత్రిని కలిసి సమస్యలపై వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారిని ఉద్ధేశించి ఆయన మాట్లాడుతూ రోజుకు 3 కోట్లు గుడ్లు ఉత్పత్తి చేస్తూ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ పౌల్ట్రీ రైతులు ఇబ్బందులు పడకుండా చూసుకుంటా మన్నారు.
తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న గుడ్లలో 70 శాతం ఇక్కడే వినియోగిస్తున్నారని, 30 శాతం ఎగుమతి అవుతున్నాయని, గుడ్డుధర నిర్ణయం రైతులకు సంబంధం లేకపోవడంతో వారు నష్టాల పాలవుతున్నారని, రైతుల కోరిక మేరకు ఎగ్‍ బోర్డు ఏర్పాటు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని నిరంజన్‍ రెడ్డి పేర్కొన్నారు.


నడిగడ్డ ధాన్యాగారం అడ్డా
నడిగడ్డ ప్రాంతంలో గద్వాల, అలంపూర్‍ నియోజకవర్గాలు వ్యవసాయపరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని ఇంకా అభివృద్ధి చెందడానికి తన వంతు సహాయ సహాకారాలు అందిస్తానని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‍ రెడ్డి తెలిపారు. రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‍ రావు అనేక పథకాలు అమలు చేశారని ముఖ్యంగా సాగునీరు అందించేందుకు తుమ్మిళ్ల పథకంను రూ. 783 కోట్ల నిధులతో చేపట్టడం జరిగిందన్నారు. ఈ పథకం వల్ల 3 రిజర్వాయర్లు నింపి దాదాపు 80 వేల ఎకరాలు సాగునీరు అందించేందుకు యుద్ద ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇంతే కాక గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా దాదాపు 50వేల ఎకరాలకు సాగునీరు అందుతాయని దీంతో గట్టులో శాశ్వతంగా కరువు పారద్రోలి వలసలను నివారించవచ్చని సూచించారు. భూమిని బట్టి పంటలు పండే విధంగా రైతుకు లాభసాటిగా చేసేందుకు వ్యవసాయశాఖ కృషి చేస్తుందని తెలిపారు.


రైతులు నిర్వహించుకోవడానికే రైతు వేదికులు
రైతు వేదికలు రైతులకు శిక్షణా వేదికలుగా ఉపయోగ పడతాయి. దీంతో తమ ఉత్పత్తులను క్షేత్రస్థాయిలో మార్కెట్‍ చేయడానికి మార్గనిర్దేశం చేస్తారని మంత్రి చెప్పారు.
రైతులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి మరియు వారి పంటలకు పారితోషికం ధరలను నిర్ధారించడానికి నియంత్రిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేస్తోంది.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‍ రావు వ్యవసాయ ఉత్పత్తుల కోసం అంతర్జాతీయ మార్కెట్లపై అధ్యయనం చేపట్టారని, అందువల్ల డిమాండ్‍ ఉన్న పంటలను పండించాలని, మా ప్రయత్నాలన్ని వ్యవసాయాన్ని రైతులకు లాభదాయకమైన వృత్తిగా మార్చడమేనని. దాదాపు 2.5 కోట్ల మంది రైతు కుటుంబాలతో, లాభదాయకమైన పంట వల్ల సంపన్న రాష్ట్రం అవుతుందన్నారు. మిగులు నీటిపారుదల వనరులతో రాష్ట్రం భారతదేశ రైస్‍ బౌల్‍గా మారిందని, మిగులు పంటలను ఉత్పత్తి చేస్తోందన్నారు.


తెలంగాణ పథకాలపై కేంద్రం ప్రశంసలు..
తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకాన్ని, రైతు సమన్వయ సమితిల ఏర్పాటును అభినందించింది కేంద్రం… రాష్ట్రంలో రైతుబంధు సహా వ్యవసాయాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రశంసించింది. కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్‍ అగర్వాల్‍ దేశంలో వ్యవసాయ రంగంలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతు బంధు సమితిల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫార్మర్‍ నెట్‍ వర్క్ విస్తరిం చిందని వివరించారు. ఈ నెట్‍వర్క్ ద్వారా అగ్రికల్చర్‍ ఇన్‍ఫాస్ట్రక్చర్‍ ఫండ్‍ స్కీమ్‍ లాంటివి సమర్థ వంతంగా అమలు చేయడం సాధ్యమవుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ అధికారిక ప్రజంటేషన్‍లో ప్రస్తావించారు.


ఈపాస్‍ ద్వారా స్కూళ్లు, హాస్టళ్లకు బియ్యం..!
సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పౌరసరఫరాల్లో అవినీతి, అక్రమాలు అడ్డుకట్ట వేశామని మంత్రి నిరంజన్‍ రెడ్డి తెలిపారు. విత్తన సేకరణ, ప్రజాపంపిణీ విధానంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. పౌరసరఫరాల శాఖ చేపట్టిన సంస్కరణలను పరిశీలించేందుకు ఇతర రాష్ట్రాలతో పాటు 33 దేశాల ప్రతినిధులు వచ్చినట్టు తెలిపారు. సరకులను ఈ పాస్‍తో పాటు ఐరిస్‍ ద్వారా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయే నని ప్రకటించారు. అంగన్‍ వాడీలకు ఈ పాస్‍ ద్వారా బియ్యం పంపిణీ విజయవంతం కావడంతో పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు ఇదే విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నామని తెలిపారు.


‘రైతులను ఇబ్బంది పెట్టొద్దు..’
తడిసిన గింజలు కొనేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‍ రెడ్డి.. మార్కెట్‍కు వచ్చిన ప్రతీ గింజనూ కాపాడాలని సూచించిన ఆయన.. టార్పాలిన్లు విస్తృతంగా సరఫరా చేయాలన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని.. ధాన్యం కొనుగోలు అయ్యే వరకు ఉద్యోగులు విధిగా అందుబాటులో ఉండాలని.. విధుల్లో నిర్లక్ష్యం వహించి రైతులను ఇబ్బంది పెట్టొదని హెచ్చరించారు. రైతులు కొనుగోలు నిబంధనలకు అనుకూలంగా ధాన్యం తీసుకురావాలని సూచించారు. పౌర సరఫరాల అధికారులు వెంటనే ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పౌర సరఫరాల, రెవిన్యూ, మార్కెటింగ్‍ అధికారులు అందుబాటులో ఉండి రైతుల ధాన్యం కొనుగోలు అయ్యేందుకు కలిసి పని చేయాలన్నారు.


అగ్గిపెట్టెకు, బీడికట్టకు ధర ఉంది.. పంటకు ఉండొద్దా?
అగ్గిపెట్టెకు, బీడికట్టకు కూడా ప్రపంచంలో ధర ఉంటుంది. కానీ ఆరుగాలం కష్టపడ్డ రైతు పంటకు మాత్రం మార్కెట్‍లో ధర ఎందుకుండకూడదని మంత్రి నిరంజన్‍రెడ్డి ప్రశ్నించారు. తన పంటకు రైతు తాను ధర నిర్ణయించుకోవాలంటే రైతులు సంఘటితం కావాలి అన్నది కేసీఆర్‍ ఆలోచన అని నిరంజన్‍రెడ్డి స్పష్టం చేశారు. అందుకే రైతువేదికలను నిర్మించి రైతులను ఒకచోటికి తెస్తున్నారని వివరించారు. వ్యవసాయం బలోపేతం కోసం రైతుబంధు, రైతుభీమా, ఉచిత విద్యుత్తు ఇచ్చి, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నాం. ఏడాదికి రెండుసార్లు భూసారపరీక్షలు చేసి రికార్డులు రైతులకు అందజేస్తున్నాం. వ్యవసాయంలో మెళకువలు, పంటల విధానం, పంటల సాగుపై రైతువేదికల ద్వారా రైతులకు విజ్ఞానం అందిస్తామని చెప్పారు.
కరోనాతో ప్రపంచమే లాక్‍ డౌన్‍ అయింది. తెలంగాణకు రావాల్సిన రూ.50 వేల కోట్ల రాబడులు ఆగిపోయాయి. ఆదాయం లేకున్నా ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల జీతాలు ఆపి వానాకాలం, యాసంగిలో రూ.15 వేల కోట్లు రైతుబంధు కింద అందజేశామని మంత్రి నిరంజన్‍రెడ్డి చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్‍ సమ్మాన్‍ యోజన కింద కేంద్రం ఒక రైతుకు కేవలం రూ.6 వేలు అదీ మూడు విడతలలో ఇస్తుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఒక్క ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు అందిస్తున్నదని నిరంజన్‍రెడ్డి వివరించారు. వ్యవసాయరంగం బలపడాలి. దానిపై ఆధారపడ్డ ప్రజలు బాగుపడాలి అన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు.
రాబోయే రోజులలో రైతునే పెళ్లి చేసుకుంటానని చెప్పే రోజులు రావాలని మంత్రి నిరంజన్‍రెడ్డి ఆకాంక్షించారు. అన్నంపెట్టే రైతు శాసించే స్థితిలో ఉండాలి కానీ, యాచించే దుస్థితిలో ఉండొద్దనేదే ముఖ్యమంత్రి కేసీఆర్‍ ఆలోచన అని నిరంజన్‍రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోనూ వ్యవసాయ రంగంలో ఇన్ని పథకాలు లేవని మంత్రి తెలిపారు. కఠోరదీక్షతో కాళేశ్వరం నిర్మాణం పూర్తి చేసుకున్నామని చెప్పారు. కేసీఆర్‍ తప్ప రైతులకు ఇన్నేళ్లు ఏ ప్రభుత్వమూ మేలు చేయలేదు.


రైతుబంధు దేశానికే ఆదర్శం
రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు దేశానికే ఆదర్శమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‍రెడ్డి వ్యాఖ్యానించారు. పాస్‍పుస్తకం ఉన్న ప్రతి ఒక్కరికి రైతుబంధును సకాలంలో ఇస్తున్నామని ఆయన తెలిపారు. చాలా మంది సభ్యులు కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇవ్వాలని కోరుతున్నారని, కానీ అది సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు.
వ్యవసాయ భూమి ఎవరి పేరు ఉందో వారికే రైతుబంధును ఇస్తున్నామని వెల్లడించారు. అంతేగాక ఇనాం భూములకు రైతుబంధు వర్తించదని, ఒకవేళ ఇనాం భూములు ఉన్న వారు సంబంధిత ఆర్డీవోకు వినతి పత్రం ఇస్తే దాన్ని పరిశీలించి పట్టాలు ఇస్తారని, ఆ తర్వాత రైతుబంధు వస్తుందని మంత్రి ప్రకటించారు.


సేంద్రీయ రసాయనాలను వాడండి
ఉత్పత్తిని పెంచడానికి సేంద్రియ రసాయనాలను ఉపయోగించాల్సిన అవసరాన్ని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‍ నిరంజన్‍ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల సిరి సిటీ కంపోస్ట్ సేంద్రీయ రసాయనాలను మంత్రి మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా 600 వ్యవసాయ కేంద్రాల్లో సేంద్రియ రసాయనాలు లభిస్తాయని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి రైతులు సేంద్రీయ రసాయనాలను ఉపయోగిస్తున్నారన్నారు. ఎరువుల డిమాండ్‍ రాష్ట్రంలో 8.5 లక్షల మెట్రిక్‍ టన్నుల నుంచి 10.5 లక్షల మెట్రిక్‍ టన్నులకు పెరుగుతోందని చెప్పారు.
పంటలకు, మట్టికి హాని కలిగించే ఎరువులకు బదులుగా సేంద్రీయ రసాయనాలను వాడాలని మంత్రి రైతులను కోరారు. దీనికి సంబంధించి జిల్లాల్లో అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిరంజన్‍ రెడ్డి ఆదేశించారు. సేంద్రీయ ఎరువులు వాడే వ్యక్తుల జాబితాను తయారు చేసి వారిని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.


సాంకేతికతను అందిపుచ్చుకొందాం
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారాలకు డిమాండ్‍ పెరుగుతున్నదని, అదే సమయంలో సహజ వనరులైన నీరు, నేల తరిగిపోతున్నాయని మంత్రి విచారం వ్యక్తంచేశారు. హైదరాబాద్‍లో నిర్వహించిన డిజిటల్‍ అగ్రికల్చర్‍ ఇండియా సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. పట్టణీకరణ ప్రభావం తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆహారోత్పత్తి, వినియోగంపై ప్రభావం చూపనున్నదని పేర్కొన్నారు.
సీఎం చంద్రశేఖర్‍రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వ్యవవసాయ విధానాలు దేశంతోపాటు ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయని చెప్పారు. ఐక్యరాజ్యసమితి పిలుపుమేరకు 2030 నాటికి ఆహార కొరతలేని సుస్థిర అభివృద్ధి సాధించేందుకు వ్యవసాయరంగంలో సమూల మార్పులు జరగాల్సి ఉన్నదని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను వ్యవసాయ, ఆహారరంగాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతికత సాయంతో వ్యవసాయరంగంలో మరో విప్లవం సృష్టించాల్సిన ఆవశ్యకతను గుర్తించాలన్నారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‍లో నిర్వహించిన ఈ సదస్సు వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు తోడ్పడగలదని భావిస్తున్నట్టు చెప్పారు.


40 లక్షల మెట్రిక్‍ టన్నుల సామర్థ్యంతో అదనపు గోదాములు
గోదాముల నిర్మాణానికి అవసరమైన స్థలాలు చాలా చోట్ల గుర్తించడంతో భూముల సమస్య లేదని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పాటు కాకముందు కేవలం 4.17లక్షల మెట్రిక్‍ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు 176 మాత్రమే ఉండేవని, టీఆర్‍ఎస్‍ అధికారంలోకి వచ్చిన తర్వాత 17.20 లక్షల మెట్రిక్‍ టన్నుల సామర్థ్యం ఉన్న 452 గోదాములను నిర్మించినట్లు వివరించారు. దీంతోపాటు మరో 40 లక్షల మెట్రిక్‍ టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయని, ప్రతి ఒక కోల్డ్ స్టోరేజీ నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.


అన్నదాతలకు ఆన్‍లైన్‍ కన్సల్టేషన్‍
రైతులకు అండగా తెలంగాణ ఇన్ఫర్మేషన్‍ టెక్నాలజీ అసోసియేషన్‍ (టీటా) రూపొందించిన టీకన్సల్ట్ యాప్‍ అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‍ రెడ్డి అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మక్తల్‍లో టీకన్సల్ట్ ప్రారంభించామన్నారు. ఈ యాప్‍ ద్వారా పదివేల కన్సల్టేషన్లు చేయడాన్ని మంత్రి అభినందించారు.
ఈ యాప్‍నకు సంబంధించి తొలి వినియోగదారుడిగా మారి తెలంగాణ వ్యవసాయ వర్సిటీ మాజీ రిజిస్ట్రార్‍, రిటైర్డ్ ప్రొఫెసర్‍ జలపతిరావుతో టీకన్సల్ట్ ద్వారా సందేహాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు, అగ్రి సైంటిస్టులను అనుసంధానం చేయాలని సూచించారు. ఈ ఆన్లైన్‍ సేవలను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం టీటా గ్లోబల్‍ ప్రెసిడెంట్‍ సందీప్‍ మక్తాల మాట్లా డుతూ టీటా ద్వారా ఇప్పటివరకు విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలు అందించామని, దీనికి కొనసాగింపుగా వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తున్నామని పేర్కొన్నారు.


అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలి…
సంక్షోభం నుంచి వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించాలంటే రైతుబంధు అమలు ఉత్తమ మార్గమని నీతిఆయోగ్‍ సభ్యుడు ప్రొఫెసర్‍ రమేశ్‍చంద్‍ అన్నారు. పంటల బీమా విషయంలో కేంద్రం చొరవ చూపినందున రాష్ట్ర రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. కౌలు రైతులకు కూడా రైతుబంధులాంటిది వర్తింప చేయాలని కొందరు సభ్యులు చేసిన సూచనపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో కౌలు రైతు విధానం స్థిరంగా లేదని, తరచూ కౌలుదారులను మార్చటం వల్ల ఎప్పుడు ఎవరు కౌలు చేస్తారో తెలియని స్థితి ఉంటోంది. మాంద్యాలు వచ్చినప్పుడు తట్టుకునే శక్తి సహకార రంగాలకు ఉంటుంది. కేరళలో అన్ని సహకార సంఘాలకు కలిపి రూ.60 వేల కోట్ల నిధులున్నాయి. తెలంగాణలో అలాంటి పటిష్ట విధానాలను రూపొందించి అంతకు రెట్టింపు నిధులు సమకూరేలా చేసే అవకాశం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.


పర్యావరణంపై మంత్రి మాటల్లో..
కొన్నింటికి సృష్టిలో ప్రత్యామ్నయాలు వుండవు. మాతృమూర్తికి ప్రత్యామ్నాయం లేదు. మాతృదేశానికి ప్రత్యామ్నాయం లేదు. ఆహారానికి ప్రత్యామ్నాయం లేదు. పర్యావరణానికి ప్రత్యామ్నాయం లేదు. మానవ విజ్ఞానం, వికాసం మరెంతో దూరం ప్రయాణం చేసి, ఎంతో వికసించింది. మానవుడిని మించిన మేధస్సు సృష్టిలోని జీవులకు ఉంది. కానీ విచక్షణ ఉపయోగించే జ్ఞానవంతుడే మానవుడు. ఆ విచక్షణ పరిణామాన్ని దుర్వినియోగ పరచడానికి ఉపయోగి స్తున్నారు. కాబట్టి ఇవాళ వాతావరణ పరిస్థితి ఇలా వుంది.


మానవాళి పరిణామ క్రమంలో ఒక్కొక్క దశలో ఒక ఛాలెంజ్‍ వుంటది. 2015లో ప్రపంచ దేశాలన్నీ యుఎన్‍ఓ ఆధ్వర్యంలో సస్టేనబుల్‍ డెవలప్‍మెంట్‍ గోల్స్ అని (మానవాళి ఈ సదస్సు నుంచి నిర్దేశించుకోవాల్సిన లక్ష్యాలు ఏమిటి) భవిష్యత్తు జీవణానికి, మానవాళి కొనసాగింపుకు అని వారు కొన్ని తీర్మానాలు చేశారు. 17 గోల్స్ సెట్‍ చేసుకున్నారు. మానవాళి భిన్న దేశాల్లో ఉండే ప్రజలకు బాధ్యత వహించే ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలు చేయాలి. అలా 17 లక్ష్యాల కోసం 160 టాస్క్లు పెట్టుకున్నారు. ఆ 17 లక్ష్యాల్లో ముఖ్యమైనవి శుద్ధమైన మంచినీరు ప్రజలకు అందించడం. అజ్ఞానం లేని సమాజం నిర్మించాలి. అవిద్యలేని సమాజం నిర్మించాలి. పేదరికం లేని సమాజాలు ఉండాలి. యుద్ధాలను తగ్గించి రక్షణపై పెడుతున్న ఖర్చును తగ్గించాలి అని ఇలా అనేక అంశాలు వున్నాయి. ఇది 2015 సెప్టెంబర్‍లో జరిగిన సదస్సు. మానవాళికి ఒక్కొక్క దశలో ఒక ఛాలెంజ్‍ ఉంటది. ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నది ఎన్విరాల్‍మెంట్‍ కన్వర్జేషన్‍ అనేది మొదటి అంశం. చైనా బీజింగ్‍లో లక్షలాది మంది సైకిళ్ళ మీద ఉద్యోగాలకు వెళుతారనేది చాలా గొప్ప విషయం. నెదర్లాండ్స్లో ప్రధానమంత్రి సైకిల్‍ మీద వెళుతారు. హైదరాబాద్‍లో మనము వెళ్ళలేము. జర్మన్‍ లాంటి దేశాల్లో పర్యావరణం అనేది చాలా విశేషమైన అంశం. మనం కూడా వచ్చే జనరేషన్‍ కోసం మంచి పర్యావరణం అందించాలంటే ప్రభుత్వాలు, ప్రజా సంఘాలు, ప్రజలు అందరి కృషితో సాధ్యమవుతుంది.

కట్టా ప్రభాకర్‍
ఎ : 8106721111

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *