‘బెస్ట్ టూరిజం విలేజ్‍’ కాంటెస్ట్ పోటీలో భూదాన్‍ పోచంపల్లి

పోచంపల్లి.. మన దేశానికి స్వాతంత్య్రం అనంతరం భూములు దానాలు చేయడం వల్ల భూదాన్‍ పోచంపల్లిగా మారింది. స్వాతంత్య్రం రాకముందు అరబ్‍ దేశాలకు గాజులు పంపడంవల్ల ‘గాజుల పోచంపల్లి’గా పేరు వచ్చింది. పోచంపల్లి చీరలతో ప్రపంచం మొత్తం గుర్తింపు పొందింది. ఎక్కడెక్కడ నుంచో జనాలు ఇక్కడికి వచ్చి చీరలు కొంటారు. ఇప్పుడు యునైటెడ్‍ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్‍ (UWTA) కాంటెస్ట్కు నామినేట్‍ అయింది మన పోచంపల్లి.


రాష్ట్ర రాజధాని హైదరాబాద్‍కు సుమూరు 42 కిలోమీటర్ల దూరంలో ఉంది భూదాన్‍ పోచంపల్లి. హైదరాబాద్‍ – విజయవాడ హైవే నుంచి 11 కిలోమీటర్లు లోపలికి వెళ్లాలి. పోచంపల్లి లోకి వెళ్తుంటే చుట్టూ కొండలు, రోడ్డుకు అటూ ఇటూ పచ్చని చెట్లు మనకి స్వాగతం చెప్తాయి. ఆ తర్వాత ఊళ్లోకి వెళ్లగానే పోచంపల్లి, ఇక్కత్‍ చీరల షాపులు ఉంటాయి. చీరలు కొనేందుకు వచ్చిన జనాలతో భూదాన్‍ పోచంపల్లి ఎప్పుడూ సందడిగా ఉంటుంది. సిల్క్ సిటీగా పేరు పొందిన పోచంపల్లికి ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. ‘యునైటెడ్‍ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్‍’ (UWTA) నిర్వహించిన కాంటెస్ట్కి నామినేట్‍ అయ్యింది. మన దేశం నుంచి నామినేట్‍ అయిన మూడు ఊళ్లలో పోచంపల్లి ఒకటి కావడం విశేషం.


గాజుల పోచంపల్లి
పోచంపల్లిని గాజుల పోచంపల్లి అని కూడా పిలుస్తారు. స్వాతంత్య్రం రాకముందు పోచంపల్లిలో గాజులు, పూసలు, తేలియా రుమాలు తయారు చేసి వాటిని అరబ్‍ దేశాలకు ఎగుమతి చేసేవారు. నిజాం రాజుకు పంపేవారు. దాంతో అప్పట్లో అరబ్‍ దేశాలకు చెందిన వారు పోచంపల్లిని ‘గాజుల పోచంపల్లి’ అని పిలిచేవారు.


భూదాన్‍ పోచంపల్లి
గాజుల పోచంపల్లి స్వాతంత్య్రం తరువాత భూదాన్‍ పోచంపల్లిగా మారింది. స్వాతంత్య్రం వచ్చాక వినోబాభావే దేశ పర్యటన చేశారు. దాంట్లో భాగంగా ఆయన 1951, ఏప్రిల్‍ 18న పోచంపల్లికి వచ్చారు. గ్రామంలోని 75 శాతం మందికి భూమి లేదని తెలుసుకుని వారికి భూమిని ఇప్పించేందుకు భూస్వాములతో మాట్లాడారు. వెదిరె రాంచంద్రారెడ్డి తన 100 ఎకరాల భూమిని దానం చేశారు. ఆ తర్వాత దేశమంతా భూదానోద్యమం ప్రారంభ మైంది. భూమి లేని పేదలకు భూమి దక్కింది. అందుకే, ఇది భూదాన్‍ పోచంపల్లిగా మారింది.


‘బెస్ట్ టూరిజం విలేజ్‍’ కాంటెస్ట్
గ్రామీణ పర్యాటకాన్ని, అక్కడ నివసిస్తున్న ప్రజల జీవన శైలిని వినూత్న పద్ధతిలో ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో యూఎన్‍ డబ్ల్యూటివో సంస్థ బెస్ట్ టూరిజం విలేజ్‍ కాంటెస్ట్ను నిర్వహిస్తోంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సాహించడం, గ్రామీణ ప్రాంతాల్లో జనాభాను పెంచడం, మౌలిక వసతుల కల్పన ఈ పోటీ ప్రధాన ఉద్దేశం. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీలో భారత్‍ నుంచి మూడు గ్రామాలను ప్రతిపాదించారు. వాటిలో మేఘాలయ నుంచి విజిలింగ్‍ విలేజ్‍ కాంగ్‍ దాన్‍ ఒకటి కాగా.. రెండవది మధ్యప్రదేశ్‍లోని లద్‍ పురా ఖాస్‍ గ్రామం.. మూడో విలేజ్‍గా తెలంగాణ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‍ పోచంపల్లి గ్రామం. యూఎన్‍డబ్ల్యూటీవోలో159 దేశాలు ఉన్నాయి. ఒక్కో దేశం మూడు గ్రామాలను నామినేట్‍ చేయాల్సి ఉంది. అక్టోబర్‍లో జరిగే యూఎన్‍డబ్ల్యూటీవో సమావేశాల్లో బెస్ట్ గ్రామాలను ప్రకటిస్తారు.


విలేజ్‍ విశిష్టత
కేరళను తలపించే అందాలు.. పాత కాలం నాటి ఇండ్లు.. పచ్చని వాతావరణం.. పర్యాటకులను ఆకట్టుకునే అందాలు.. ఇవి ఎక్కడో కోనసీమ అందాలు కాదు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భూదాన్‍ పోచంపల్లి గ్రామం. ఈ ఊరు ఓ సరికొత్త ఘనత దక్కించుకోబోతుంది. దేశవ్యాప్తంగా మూడు గ్రామాలు ఈ ఘనత దక్కించుకునేందుకు పోటీలోకి దిగగా అందులో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‍ పోచంపల్లి గ్రామం ఒకటిగా నిలిచింది.


ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్‍ పోచంపల్లికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. దేశంలోనే తొలిసారి భూదానోద్యమం ప్రారంభం అయ్యింది ఈ గ్రామం నుంచే. అప్పటి నుంచి ఈ గ్రామం భూదాన్‍ పోచంపల్లిగా ప్రసిద్దికెక్కింది. అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరలు తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు ఇక్కడి నేతన్నలు. ఇక్కత్‍ వస్త్రాలకు ఈగ్రామం ప్రసిద్ధి చెందింది. ఇక్కడి చేనేత కార్మికుల ప్రతిభ వల్ల సిల్క్ సిటీ ఆఫ్‍ ఇండియాగా పేరు దక్కించుకుంది. ఎన్నో చారిత్రక, పర్యాటక, అంశాలు ఉన్న భూదాన్‍ పోచంపల్లి బెస్ట్ టూరిజం విలేజ్‍ కాంటెస్ట్లో విజేతగా నిలవాలని, మన రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావాలని పోచంపల్లి ప్రజలే కాక తెలంగాణ ప్రజలంతా కోరుకుంటున్నారు.

  • దక్కన్‍న్యూస్‍
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *