రాతిచిత్రాలు – తెలంగాణ


కొత్తతెలంగాణ చరిత్రబృందం 6వ నెల వెబినార్‍లో డా. బండి మురళీధర్‍ రెడ్డి గారి ప్రసంగపాఠం


రాతిచిత్రాలు అంటే రాతిమీద వేసిన చిత్రాలు అని అందరికి తెలిసినదే. కాని, చాలామందికి తెలియని విషయం రాతిచిత్రాలు, వాటి ప్రాముఖ్యత. ఇది పురాతనకళ, మన వారసత్వ సంపద. దీనిని మనం రిపేర్‍ చేయలేం, మరల తిరిగి వేయలేం. ఇది Fragile. పురాతన కాలం నుంచి ఈ రాతిచిత్రాలువేసే సంప్రదాయం పరిణామం చెందుతూ వచ్చింది. ఈ కళ అమూల్యమైంది. గోల్కొండ డైమండుకు విలువకట్టవచ్చునేమో కాని, ఈ పురాతన కళకు విలువ కట్టలేం. దీనిని చాలా జాగ్రత్తగా చూడాలి. మానవుని జ్ఞానపరమైన వికాసానికి, కళ దానికి సంబంధించిన వస్తువులు తయారుచేయగల సామర్థ్యం ముఖ్యమైన లక్షణాలు, ఆధారాలు. ఎందుకంటే ఇవి కనపడుతున్న సమాచారం (communication). మానవుడి ఆలోచనాశక్తి అభివృద్ధి గురించి ఇవి మనకు తెలియచేస్తాయి.


ఈ ప్రాచీన రాతికళను ముఖ్యంగా రెండురకాలుగా వర్గీకరించారు.
1.Pictographs- వర్ణచిత్రాలు లేక రంగు బొమ్మలు
2.Petroglyphs- చెక్కుడు బొమ్మలు.


చెక్కుడుబొమ్మలను లోతుగా చెక్కిన రూపాలు(Engravings), తొక్కుడుబొమ్మలు(Bruisings), గుంటలు/బొద్దులు (peckings)గా విభజించారు. అయితే రంగునింపిన చెక్కుడు బొమ్మలు కూడా ఉన్నాయి. ఈ రెండురకాల చిత్రాలలో సాంకేతిక వ్యత్యాసం వుంది. ఒకటి రాతిమీద రంగులతో వేయటం, రెండవది రాతిమీద చెక్కటం.


భారతదేశంలో A.C.Carlleyle అనే అతను 1867-68లో ఉత్తరప్రదేశ్‍ లోని మీర్జాపూర్‍ జిల్లాలో సోహగిఘాట్‍ వద్ద మొదటిసారి రాతిచిత్రాలను కనుగొన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఈ రాతిచిత్రాలు వెలుగులోనికి వచ్చాయి. ఆ తరువాతనే ఉత్తరస్పెయిన్లోని అల్టమీర దగ్గర 1880లో రాతిచిత్రాలను గుర్తించటం జరిగింది. మన తెలంగాణలో రాతిచిత్రాలను మహబూబునగర్‍ జిల్లా సంగనోనిపల్లిలో 1934లో లియొనార్డ్ మున్‍, మహదేవన్‍ లు మొదటిసారి గుర్తించారు. ‘రాతికళ పితామహులు’గా పేర్కొనబడిన డా.విష్ణుశ్రీధర్‍ వాకంకర్‍ గారు భారతదేశంలోనే అతిపెద్ద రాతిచిత్రాల తావు బింబేట్కాను 1957సం. మధ్యప్రదేశ్‍ రాష్ట్రంలో కనుగొన్నారు. ఈప్రదేశాన్ని 2003లో యునెస్కో ‘ప్రపంచవారసత్వ’ ప్రదేశంగా గుర్తించింది. ఇక్కడ 500లకు పైగా రాతితావులలో చిత్రాలున్నాయి. బింబేట్కా వంటి రాతిచిత్రాలతావును కనుగొన్నందుకు డా.వాకంకర్‍ గారిని భారతప్రభుత్వం 1975లో పద్మశ్రీతో సత్కరించింది. బింబేట్కా గురించి తెలిసిన తరువాతనే ఆసక్తి పెరిగి శాస్త్రవేత్తలు, ఇతరులు భారతదేశంలో రాతిచిత్రాల మీద పరిశోధనలు, ఆలోచనలుచేయటం మొదలుపెట్టారు.


మనతెలంగాణాలో సంగనోనిపల్లిలో 1934లో రాతిచిత్రాలను గుర్తించినప్పటి నుంచి 2019లో కనుగొన్న ఇప్పటి ఒంటిగుండు రాతిచిత్రాలతావు వరకు ఈ 85 సంవత్సరాలలో 70 రాతిచిత్రాల తావులు గుర్తించ బడ్డాయి. ఇది చాలాతక్కువ. ఇక్కడ రాతిచిత్రాలమీద పనిచేసినవారు, చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. కాని, అందులో తీవ్రమైన కృషిచేసిన వారు తక్కు వని చెప్పవచ్చు. తెలంగాణాలోని ముఖ్య మైన రాతిచిత్రాల ప్రదేశాలలో పాండవుల గుట్ట, రామచంద్రాపురం (బైనేటిబండ), కోకాపేట, వీరన్నగుట్ట, పోతనపల్లి, హస్తలా పూర్‍,ముడుమాల, ఒంటిగుండు, రత్నా పూర్‍, ఎడితనూర్‍ మొదలైనవి ఉన్నాయి.


ఈ రాతిచిత్రాలు గుహలగోడల మీద, పడిగెరాళ్ళమీద, రాతితావులలోని గోడలమీద, రాతిగుండ్ల మీద అగుపి స్తున్నాయి. బల్లపరువురాళ్ళ మీద చెక్కుడుబొమ్మలు వుండటానికి అవకాశం ఉన్నది. బృహచ్ఛిలాయుగపు సమాధుల బండరాళ్ళమీద కూడా ఈ రాతిచిత్రాలు దొరుకుతున్నాయి. ఈ చిత్రాలు ఎరుపు (dark&light), తెలుపు రంగులలో ఎక్కువగా కనిపించాయి. నలుపురంగు చిత్రాలు అరుదైనవి. పసుపురంగులో చిత్రాలు మరీ అరుదుగా లభించాయి. ఎరుపురంగు చిత్రాలున్న తావుల పరిసరాలలో ఎరుపురంగురాయి దొరికే అవకాశం వుంది. రాతిచిత్రాల రంగులను ఎట్లా తయారుచేసారన్నది ఒక రహస్యం. అడివిలో దొరికే పువ్వులు, పండ్లు, గింజలు, రంగురాళ్ళు నూరి వాటికి తేనె, జిగురు, ఆకుపసరు, కొవ్వు కలిపి ఈ రంగులను తయారుచేసి వుండవచ్చు. తెలుపురంగు సున్నపురాతి పొడి, నలుపురంగు బొగ్గుపొడి కలిపి తయారుచేసి వుండవచ్చు. ఈ మధ్యనే ‘రామన్‍ స్పెక్ట్రాపరీక్ష’ (Raman Spectra Test) ద్వారా ఎరుపురంగు తయారీకి హేమటైట్‍ అనే పదార్థాన్ని వాడినట్లు శాస్త్రీయంగా గుర్తించడం జరిగింది. ఇంకా ఇతర పదార్థాల మిశ్రమం గురించి తెలుసుకునే ప్రయత్నం జరుగుతున్నది. ఈ ప్రయత్నాలు త్వరగా సఫలీకృతం కావాలని ఆశిద్దాం. ఈ రంగులను రాతిచిత్రాలలో దేనితో వేసారు? రాతికాన్వాస్‍ మీద సన్నని పుల్లలు, చెట్లవేర్లు, చిన్న కొమ్మల కొసలు నలుగగొట్టి బ్రష్లుగా వాడి వుండవచ్చు. పక్షులఈకలు కూడా ఉపయోగించి వుండవచ్చు.


ఈ రాతికళలో జంతువులవేట, సామూహికన•త్యాలు, గణిత రేఖాచిత్రాలు, ఆహారసేకరణ, పశుపోషణ, ఇతరాలు ఇతివృత్తాలుగా ఉంటాయి. ఇందులో అడివిజంతువుల చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే పెంపుడు జంతువుల చిత్రాలుకూడా కనిపిస్తాయి. జింకలు, దుప్పులు, ఎద్దులు, ఆవులు, ఏనుగులు, గుర్రాలు, పులులు, కోతులు, ముండ్లపందులు, అడివిపందులు, పాములు, ఉడుములు, తాబేళ్ళు, నెమళ్ళు, కుందేళ్ళు, చేపలు, వలలు, ఎముకలు, చేతిగుర్తులు, స్త్రీ,పురుషుల బొమ్మలు, ఆయుధాలు, తేనెతెట్టెలు, ఆంత్రోపోమార్ఫిక్‍ రూపాలు, శ్రీవత్స, స్వస్తిక్‍ చిహ్నాలు, ఇంకా ఎన్నోరకాల చిత్రాలు మనకు దొరికాయి.


ఈ రాతిచిత్రాలను పురామానవులు ఎందుకు వేసారు. వాటి ప్రయోజనమేమిటన్నది పెద్దప్రశ్న. సరైన జవాబు ఇప్పటికి దొరకనే లేదు. కర్మకాండలు, మతపర విశ్వాసాలు, వేట, మాజిక్‍ వంటివి ఏవైనా కావచ్చు. ఏదేమైనా మనకు ఈ రాతికళ ద్వారా పురామానవుల జీవనశైలి, ఆలోచనావిధానం, భావనలు, తాము చూచిన జంతువుల వివరాలు, తమ చుట్టూరా ఉన్న అనేకవిషయాలు అగుపిస్తుంటాయి. రాతిచిత్రాల కాలక్రమం, కాలనిర్ణయం చేయటం చాలా క్లిష్టమైన సమస్యలు. ఒకదానిపై మరొకటి, అతివ్యాప్తి (overlapping), చిత్రాల నమూనా, చిత్రాల శైలి, వాటి చిత్రణ, వాటి రంగుల సాంద్రత, సన్నని, లావైన గీతలు, పెద్ద, చిన్నసైజుల బొమ్మలు, స్కీమాటిక్‍ లేక అనుపాతరేఖలు కాలక్రమం, కాలనిర్ణయానికి పరిగణనలోనికి తీసుకోవలసి వుంటుంది. రాతిచిత్రాలు ఉన్న ప్రదేశాల దగ్గర దొరికిన రాతిపనిముట్లు కూడా సహాయపడుతాయి.


తెలంగాణలో ఎక్కువగా మధ్యరాతియుగం, కొత్తరాతి/తామ్రయుగం, పెదరాతియుగాలకు చెందిన చిత్రాలున్నాయి. రాతికళను నిష్క్రియాత్మకంగా వివరించాలి. ఉన్నదానిని వాస్తవికతకు దగ్గరగా సరిగా గుర్తించగలగాలి. తప్పుగా వివరించినపుడు చిత్రాల అర్థం మారిపోయే అవకాశం వుంది. ప్రతిచిత్రం దాని చిత్రీకరణశైలిని బట్టి గుర్తించడానికి వీలుగా వుంటుంది. ఈ విధంగా గుర్తించిన చిత్రాలను మనరాష్ట్రంలోనే కాకుండా ఇతరరాష్ట్రాల చిత్రాలశైలి, నమూనా, ఇతర విషయాలతో తులనాత్మక అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది.


ఈ రాతికళ గురించి చాలామందికి సరియైన అవగాహనలేక పాడుచేయటానికి ప్రయత్నిస్తుంటారు. స్పష్టత కోసం కావచ్చు, ఫోటోతీయటం కోసం కావచ్చు చాలామంది చిత్రాల మీద మొదట నీళ్ళు చల్లుతుంటారు. 2, 3 సార్లు కూడా నీళ్ళు చల్లటం జరుగు తున్నది. ఈ పనివల్ల రాతిచిత్రాలను ఒకరకంగా పాడుచేస్తున్నట్లే. నెమ్మదిగా మాయం అవడానికి కారణంఅవుతాయి. వాటి మీద పట్టిన దుమ్ము బట్టతోకాని, బ్రష్‍ తో కాని దులిపి ఫోటో తీసుకోవాలి. ఆ తరువాత ఆ ఫోటోలను డీ-స్ట్రెచ్‍ అనే సాఫ్టువేర్‍ ద్వారా కంప్యూటర్లో సవివరంగా చూడటానికి అవకాశమున్నది. రాతిచిత్రాల మీద పేర్లురాయడం, గుర్తులువేయడం సున్నంవేయటం, ఆ తావులలో వండటం, పొగపెట్టడం చేస్తుంటారు. ఇటువంటి పనులను నిలిపివేయాలి. మన రాతిచిత్రాలను కాపాడుకోవాల్సింది మనమే. వాటి ప్రాముఖ్యతను గురించి స్థానికప్రజలకు అవగాహన కలిగిస్తే వారు వాటిని పరిరక్షించే అవకాశం కలుగుతుంది. పాడయిపోతే ఈ రాతిచిత్రాలను మనం తిరిగి తెచ్చుకోలేం. ప్రతిరాతిచిత్రాలసైటును పూర్తిగా డాక్యుమెంటేషన్‍ చేసి, సంరక్షించవలసిన అవసరం ఉంది.


భారతదేశంలో ముఖ్యంగా 2 సంస్థలు రాతికళ గురించి విశేషంగా కృషి చేస్తున్నాయి.
1. Indira Gandhi National Centre for the Arts.. 1987లో న్యూఢిల్లీలో ప్రారంభించిన కేందప్రభుత్వసంస్థ.
2. Rock Art Society of India.. 1990లో ఆగ్రాలో ఏర్పాటుచేయబడ్డ ప్రైవేటుసంస్థ.


ఈ రెండుసంస్థలు కూడా రాష్ట్రాలవారీగా, తావులవారీగా రాతిచిత్రాలను డాక్యుమెంటేషన్‍ చేయడం, కొత్తతావులను వెలుగులోనికి తేవడం, రాతికళపై సభలు, సమావేశాలు జరిపించడం, పుస్తకాలు, పత్రికలు ప్రచురించడం వంటి పనులు చేస్తున్నాయి. రాష్ట్రాల పురావస్తుశాఖలు, విశ్వవిద్యాలయాలలోని ప్రాచీన చరిత్ర, పురావస్తుశాస్త్రం శాఖలు వారి పరిధులలో రాతికళ గురించి అధ్యయనం చేయడం జరుగుతున్నది. ప్రధానంగా రాతికళ గిరిజనులకళ. వారి పూర్వీకులు వారికి ఇచ్చినటువంటి వారసత్వ సంపద. ఇంకా తెలంగాణలో వెలుగులోనికి తీసుకురావలసిన రాతిచిత్రాల ప్రదేశాలు చాలానే వున్నాయి. ఈ తావులు మనందరివి, ఏ ఒక్కరివో కావు. ఎవరో ఒకరు లేదా కొంతమంది ద్వారా అవి వెలుగులోనికి వస్తాయి. అంతమాత్రంచేత అవి వారిసొత్తు కాదు. అవి జాతీయసంపద. అందరు చూడటానికి, అధ్యయనం చేయడానికి, రాయడానికి హక్కు వుంటుంది. పరిశోధన ఆధారితపత్రాలను ఈ రాతిచిత్రాల మీదగాని, రాతిచిత్రాల తావులమీదగాని విడిగా తయారుచేసి జర్నల్స్ లో ప్రచురింపజేయటం చాలా అవసరం. అప్పుడే వాటికి తగిన గుర్తింపు లభించే అవకాశం వుంటుంది.


తెలంగాణరాష్ట్రంలో కొన్ని ముఖ్యమైన రాతిచిత్రాలు:
రంగారెడ్డిజిల్లాలో కోకాపేట (హైద్రాబాద్‍) రాతిచిత్రాల తావులో ఎద్దుల రంగులబొమ్మలు, సిద్ధిపేటజిల్లాలోని వీరన్నపేటలో ఎద్దు చెక్కుడుబొమ్మలు (50 సెం.మీ.) చాలా అందమైనవి. సిద్దిపేటజిల్లా హస్తాల్పూరులో వున్న ఎక్స్ టైపు, 50 సెం.మీ. పొడవైన మానవుని చిత్రాలు ముఖ్యం. అదే సిద్ధిపేటజిల్లాలోని రత్నాపూర్‍, కాంచనపల్లిలో దొరికిన నెమళ్ళచిత్రాలు(59 నుంచి 64 సెం.మీ. పొడవు) చాలా అందంగా పద్దతిలో వుంటాయి. రత్నాపూర్‍లో రాతిచిత్రాల కాన్వాసులో ఒకేరాతిపై మూడునెమళ్ళు ఒకదాని కింద ఒకటి స్కీమాటిక్‍గా వుండటం దక్షిణభారతదేశంలో మరెక్కడా కనిపించలేదు. భద్రాచలం-కొత్తగూడెంజిల్లాలోని ఒంటిగుండులో కనిపించిన 40 సెం.మీ.ల ఆంత్రోపోమార్ఫిక్‍, ఉడుముల బొమ్మలు మరెక్కడా కనిపించవు. ఖమ్మంజిల్లా రామచంద్రాపురం(బైనేటిబండ) దగ్గర రంగునింపిన చెక్కుడుబొమ్మల వంటివి దక్షిణభారతంలో మరెక్కడ దొరకలేదు. ఒరిస్సా, మధ్యప్రదేశ్‍లో అటువంటి చిత్రాలు కొన్ని ప్రదేశాలలో మాత్రమే లభించాయి. సంగారెడ్డిజిల్లా ఎడితనూర్లో చెక్కిన 150ఞ180 సెం.మీ.ల కొలతలున్న ఎద్దుబొమ్మ చాలా అరుదైనది. పెద్దచిత్రంలో చిన్నసైజు మనుషులు, ఎద్దులబొమ్మలు చెక్కివుండడం విశేషం. జక్కన్నపేట (మెదక్‍ జిల్లా)లో ఎరుపుతో పసుపురంగు డిజైన్‍ రాతిచిత్రాలు లభించడం మొదటిసారి. పాండవులగుట్ట (జయశంకర్‍-భూపాలపల్లి జిల్లా) లో అపూర్వమైన రాతిచిత్రాలున్నాయి. ఇది రాతిచిత్రాల స్వర్గమని చెప్పవచ్చు. ఇక్కడ ఎగువపాతరాతియుగం నుంచి చారిత్రకకాలం దాక అందమైన రాతిచిత్రాలు ఉన్నాయి. మహబూబునగర్‍ జిల్లా పోతనపల్లిలో 134ఞ241 సెం.మీ.ల పరిమాణంలో 2 రాతిచిత్రాల కాంపొజిషన్ల రూపురేఖాచిత్రాలుగా అగుపిస్తాయి. అందులో ఏనుగు, ఉడుము ఒకదానిలో, ఏనుగుబొమ్మ మీద 3 జింకలు ఒకదాని మీద మరొకటి రెండోబొమ్మలో వున్నాయి. ఇవే కాకుండా తెలంగాణాలో ఇంకా చాలా ప్రదేశాలలో రాతి చిత్రాలున్నాయి. ఈ చిత్రాలను సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.

  • డా. బండి మురళీధర్‍ రెడ్డి,
    రాతిచిత్రాల నిపుణులు, నాణకవేత్త
    కొత్తతెలంగాణ చరిత్రబృందం గౌరవ సలహాదారులు
    ఎ : 7093378522
    (ఫోటోలు: శ్రీరామోజు హరగోపాల్‍

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *