తీర్పుల్లో మొదటి ఉర్దూ కవిత


మొఘలుల కాలంలో కోర్టు భాష పర్షియన్‍. ఆ తరువాత ఉర్దూ కోర్టు భాషగా మారింది. ఆ తరువాత ఇంగ్లీషు ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఉర్దూ భాషలో ఎక్కువగా పర్షియన్‍ పదాలు వుంటాయి. కోర్టులో కూడా ఎక్కువ ఉర్దూ పదాలు కన్పిస్తాయి. స్వాతంత్య్రం వచ్చి కోర్టు భాష ఇంగ్లీషుగా మారిపోయిన తరుణంలో కూడా ఉర్దూ పదాలు ఇంకా కోర్టు నుంచి కనుమరుగు అవలేదు.
అదాలత్‍ (కోర్టు)లో కేసు వుంది అంటారు. హన్మకొండలో అదాలత్‍ అన్న పదం ఎక్కువగా వాడతారు. క్లర్కులు వుండే సెక్షన్ని దఫా అని, సివిల్‍ సూట్‍ని దివానీ అని, క్రిమినల్‍ కేసుని పౌజ్‍దారీ ఇంకా వాడుతున్న సందర్భం తెలంగాణ ప్రాంతంలో కన్పిస్తుంది. నేను న్యాయవాదిగా మారిన తరువాత ఈ పదాలతో పదబందాలతో పరిచయం ఏర్పడింది. ‘గవా’ (సాక్షి) వచ్చినాడా ఇల్జామ్‍ (ఆరోపణలు)లు ఏమిటీ అని మా సీనియర్‍ న్యాయవాదులు అడుగుతూ వుంటే శ్రద్ధగా వినేవాన్ని.
నేను కొంతకాలం మున్సిఫ్‍ మేజిస్ట్రేట్‍ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‍ చేశాను. అప్పుడు సీనియర్‍ మేజిస్ట్రేట్‍ వచ్చినాడా అని విచారణ చెయ్యకపోయే వారు. మున్సిఫ్‍ సాబ్‍ వచ్చినాడా అని కోర్టు అటెండర్లని విచారించేవారు. మున్సిఫ్‍ అంటే న్యాయమూర్తి, జడ్జి అని అర్థం. ముర్జిమ్‍పై వున్న ఇల్జామ్‍ ఏమిటీ అని న్యాయవాదులు కోర్టు కానిస్టేబుల్స్ని అడిగేవాళ్ళు. ముల్జిమ్‍ అంటే ముద్దాయని ఇల్జామ్‍ అంటే ఆరోపణ. కాలక్రమంలో కొన్ని పదాలు అంతరించి కొత్త పదాలు వచ్చి చేరిపోయాయి. అయితే ఇంకా కొన్ని పదాలు చెరగని ముద్ర వేసాయి. అవి తమ స్థానాన్ని పదిల పరుచుకున్నాయి. అవి గవా, పేషీ, వకాలత్‍ నామా, వకీలు లాంటివి ప్రధానమైనవి. పేషీ అంటే కేసు వాయిదా, కోర్టు ముందు హాజరు కావడానికి ఇచ్చిన తేది.


గవా అంటే సాక్షి, వకాలత్‍ నామా అంటే న్యాయవాది కోర్టు ముందు హాజరు కావడానికి పార్టీలు తమ అంగీకారాన్ని ఇచ్చిన పత్రం, వకీలు అంటే న్యాయవాది, అడ్వకేటు అని అర్థాలు. ఈ ముఖ్యమైన పదాలు చెదిరిపోలేదు. అవి కోర్టు భాషలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాయని చెప్పవచ్చు. ఇట్లా చాలా పదాలని చెప్పవచ్చు. అయితే కాలక్రమంలో కొన్ని అంతరించి పోయి కొత్త పదాలు వచ్చి చేరాయి. ఉర్దూ పదాలే కాదు ఉర్దూ కవిత్వం కూడా కోర్టులలో కన్పించేది. విన్పించేది. గమ్మత్తైన విషయం ఏమంటే కొన్ని సార్లు కవిత్వం సరదాగా కోర్టుల్లో విన్పించినా కొన్నిసార్లు వాటివల్ల ఫలితం కూడా కన్పించేది.


నాజ్మీ వజిరీ అప్పుడు ఓ న్యాయవాది. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది పని చేస్తున్నారు. ఆయన న్యాయవాదిగా వున్నప్పుడు ఓ సారి న్యాయమూర్తి టి.యస్‍ ఠాకూర్‍ బెంచి ముందు వాదనలని చేస్తున్నారు. ఆయన కేసుని న్యాయమూర్తి ఠాకూర్‍ ఆరుమాసాల తరువాత వాయిదా వేశారు. దగ్గరి తేదీ కావాలని, కేసులో అర్జెన్సీ వుందని నాజ్మీ వజిరీ కోర్టుని కోరినారు. కానీ కోర్టు ఆయన కోరికను మన్నించలేదు. బెంచి దిగిపోవడానికి న్యాయమూర్తి వెళ్తున్న దశలో వాజిరీ గాలీబ్‍ కవితలోని కొన్ని చరణాలను చదివాడు.
‘‘కౌన్‍ జీతా హై తేరీ జల్ఫ్ కే సర్‍ హోనే టక్‍’
దానర్థం : నా ప్రియురాలి కురులను పట్టుకోవడానికి
అప్పటి దాకా నేను జీవించి వుంటానో లేదో.
అది విన్న న్యాయమూర్తి తిరిగి కోర్టు సీట్‍లో కూర్చుని, ఆ కవితలోని మొదటి చరణం చదవమని కోరినాడు. అప్పుడు నాజ్మీ వజిరీ మొదటి చరణం చదివి వినిపించాడు.
‘ఆహ్‍ కొ చాహిమే ఇల్క్
ఉమర్‍ హానే టక్‍’
దానర్థం : ప్రేయసి కోర్కెను గమనించి, గుర్తించడానికి చాలా సమయం ప్రియునికి పడుతుంది. గాలీబ్‍ గీతాన్ని విని ఆస్వాదించిన న్యాయమూర్తి ఠాకూర్‍ కేసు తేదీని వచ్చే వారానికి మార్చినాడు. మనదేశంలో గతంలో సివిల్‍ కోర్టుని అదాలత్‍ దివానీ అనేవాళ్ళు. దివానీ అంటే మరో అర్థం కూడా వుంది. మతి స్థితిమితం లేని స్త్రీ అని. ఆక్బర్‍ అలహాబాదీ ఓ మంచి ఉర్దూకవి. అతను న్యాయమూర్తి కూడా. అతను ఓ సారి అలహాబాద్‍లోని ఓ సివిల్‍ కోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.


ఓసారి కోర్టులో ఓ న్యాయవాది ఇలా అన్నాడు. నేను ఈ కోర్టు నుంచి న్యాయాన్ని కోరుచున్నాను. న్యాయం తప్ప మరేమీ కోరడం లేదు.
అప్పుడు కవి అయిన న్యాయమూర్తి ఇలా కవిత్వ రూపంలో జవాబు ఇచ్చాడు.
‘ముజ్‍సే ఇన్సాఫ్‍ టలాబ్‍ బియాబనీ హై
జిస్‍ అదాలత్‍ కా మే హూన్‍, వో దివానీ హై’
దానర్థం : మీరు న్యాయాన్ని డిమాండ్‍ చేస్తున్నారు. అదీ నా నుంచి. నేను అధ్యక్షత వహిస్తున్న ఈ కోర్టు మతిస్థిమితం లేనిది. దివానీ అన్న పదానికి మరో అర్థం – మతిస్థిమితం లేని స్త్రీ అని.


న్యాయమూర్తి సరదాగా ఆ ఉర్దూ కవిత్వ చరణాలు చెప్పినప్పుడు గంభీరంగా వున్న కోర్టు వాతావరణం తేలికపడింది. న్యాయం కావాలని డిమాండ్‍ చేస్తున్న న్యాయవాది కూడా మెత్తబడి పోయాడు. కోర్టుల్లో వాతావరణాన్ని చల్లబరచడానికి కూడా కవిత్వం ఉపయోగ పడుతుందని ఈ సంఘటన రుజువు చేస్తుంది.
సుప్రీంకోర్టులో, ఉత్తర భారతదేశంలోని హైకోర్టులు ఉర్దూ కవితలని తమ కవిత్వంలో చాలా సార్లు ఉదహరించిన సందర్భాలు వున్నాయి.
అయితే మొదటిసారిగా ఉర్దూ కవిత్వాన్ని 1891 సంవత్సరంలో అలహాబాద్‍ హైకోర్టు తమ తీర్పులో ఉపయోగించింది. ఆ తరువాత చాలా కోర్టులు ఉర్దూ కవిత్వాన్ని ఇంగ్లీషు కవిత్వాన్ని ఉదహరించడం మొదలు పెట్టాయి. మన దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచే ఉర్దూ కవిత్వాన్ని వివిధ హైకోర్టులు తమ తీర్పుల్లో ఉదహరించడం ప్రారంభమైందని చెప్పవచ్చు.


క్వీన్‍ ఎంపరెస్‍ వర్సెస్‍ సోపీ మరియు ఇతరులు (1891) సుప్రీంకోర్టు కేసెస్‍ ఆన్‍ల్రెన్‍ అలహాబాద్‍ 1 : 1891 అలహాబాద్‍ ఐఎల్‍ఆర్‍ 171 కేసులో న్యాయమూర్తి జస్టిస్‍ మహమూద్‍ ఉపయోగించినారు. అమీర్‍ మినాయ అన్న ఉర్దూ కవి రాసిన కవితని అతను తన తీర్పులో ఉదహరించాడు.
‘కరీబ్‍ హై యారో రోజే – ఇ -మహసర్‍ చూపేగే
కుస్తాన్‍ కా ఖువాన్‍ క్యాన్‍కర్‍
జో చుప్‍ రహేగీ జబాన్‍-ఇ-ఖంజార్‍
తా హూ పుఖారేగా ఆస్తిన్‍ కా’
తన తీర్పులో దాని అనువాదాన్ని కూడా న్యాయమూర్తి రాశారు. అది ఇలా వుంటుంది.
‘‘ఓ మిత్రుడా! తీర్పు తేదీ దగ్గర కొచ్చింది. అలాంటప్పుడు ఇంకా దాచి వుంచడం (నిశ్శబ్దంగా వుండటం)
చనిపోయిన వ్యక్తి రక్తంకి కుదరకపోవచ్చు.
బాకు నిశ్శబ్దం వహించవచ్చు
దాని నాలుక ఏమీ మాట్లాడకపోవచ్చు
భుజం మీద రక్తం మాట్లాడుతుంది.’’


ఉర్దూ భాష, కోర్టు పరిభాషలో భాగమైంది. కొన్ని పదాలు అంతరించినా మరికొన్ని పదాలు ఇంకా జీవంగా దర్శనం ఇస్తున్నాయి. అవి దర్శనం ఇస్తూనే వుంటాయి.
హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల్లో ఉర్దూ కవిత్వ చరణాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఉర్దూతో పాటూ ఇంగ్లీషు కవిత్వ చరణాలు కూడా దర్శనం ఇస్తూనే వున్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల్లోనే కాదు, క్రింది కోర్టు తీర్పుల్లో కూడా కవిత్వ చరణాలు ఇటీవల కాలంలో దర్శనం ఇస్తున్నాయి.
ఇది మంచి పరిణామమే. అయితే ఆ సందర్భానికి అనుకూలంగా ఆ కవిత వుండాలి. కవి భావనని కోర్టు భాషలో (అంటే ఇంగ్లీషులో) ఆ న్యాయమూర్తే చెప్పితే ఆయన ఆ కవితని అర్థం చేసుకున్న తీరు మనకు అర్థమవుతుంది. చాలా మంది న్యాయమూర్తులు ఆ పనిని చేస్తున్నారు. చెయ్యని వాళ్ళు ఇక ముందు చేయాల్సిన అవసరం వుంది.


-మంగారి రాజేందర్‍ (జింబో)
ఎ : 9440483001

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *