జానపద కళలే ఉద్యమ గొంతుక


స్వతంత్య్ర దేశంగా అవతరించకముందూ, తర్వాత కూడా భారతదేశంలో అనేక పోరాటాలు, యుద్ధాలు, ఉద్యమాలు నడిచాయి, నడుస్తున్నాయి. అన్ని ఉద్యమాలలో కళల పాత్రకు సంబంధించిన సమాచారం, చరిత్ర మనకు పూర్తిగా లభ్యం కావడం లేదు. కానీ ఉద్యమాన్ని జనబాహుళ్యంలోకి తీసుకుపోవడంలో, భావ వ్యాప్తిలో ఖచ్చితంగా కళల పాత్ర ఉండి తీరుతుంది. మిగతా ఉద్యమాలలో కళల పాత్ర ఎలా ఉన్నప్పటికీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బలిదానాలు, బల ప్రదర్శనలతో పాటుగా, కొంచెం ఎక్కువగానే కళల పాత్ర ప్రస్ఫుటంగా కనిపించింది. తెలంగాణ ఉద్యమం పొడవునా కళల భాగస్వామ్యం, క్రియాశీలత అద్వితీయం, అద్భుతం, అమోఘం అనడానికి నిదర్శనాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఆ కళల్లో కూడా జానపద కళలే జనాలను చైతన్య పరిచాయి. కదిలిం చాయి. ప్రభుత్వాలను వణికించాయి. జానపద కళారూపాలే సింహభాగమై ఆద్యంతం ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి ఫలితాన్ని సాధించిన సందర్భం విస్మరించలేని ఘనతగా ఎప్పటికీ సగర్వంగా నిలిచి ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, చివరకు ఢిల్లీలో ధర్నాలు చేసినా సరే కళారూపాల ప్రదర్శన లేకుండా ఏ కార్యక్రమం జరగలేదంటే అతిశయోక్తి కాదు.


తెలంగాణ జానపదానికి ఇంతటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ప్రధానంగా రెండు కారణాలు. తెలంగాణ జానపదం ప్రజల జీవితంతో ముడిపడి ఉంది. మరీ ముఖ్యంగా ఈ ప్రాంత కుల వ్యవస్థతో, కుల వృత్తులతో పెనవేసుకుపోయింది. జానపదానికి ప్రజల జీవికకు విడదీయలేని సంబంధం ఏర్పడింది. రెండో కారణం తెలంగాణ కళారూపాల్లో మొదటి నుంచి ఆత్మగా ప్రవహించిన ధిక్కార స్వరం. అసలు జానపదం అంటేనే నిరక్షరాస్యులు, అమాయకుల కళగా పరిగణించిబడింది. ఇది కేవలం అపోహ మాత్రమే కాదు, అవగాహనా రాహిత్యం కూడా. జానపద సామెతలు, పొడుపుకథలు, పాటల్లాంటి వాగ్రూప సాహిత్యాన్ని నిశితంగా పరిశీలిస్తే పుస్తక పఠనం ద్వారా అక్షరాస్యులు సముపార్జించుకున్న విజ్ఞానాన్ని మించిన జ్ఞానసంపద జానపద కళల్లో కనిపిస్తుంది. అందుకే జానపద కళలను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జానపద విజ్ఞానం అనే పేరుతో పిలుస్తున్నారు.


విశ్వవ్యాప్తంగా జానపద కళల ఉనికి కనిపిస్తున్నప్పటికీ, విస్తృతి మాత్రం భారతదేశంలోనే ఎక్కువ ఉన్నది. కారణం నిస్సందేహంగా ఇక్కడి కుల వ్యవస్థే. జానపద కళల ఆవిర్భావం నుంచి విస్తారం కావడం వరకు కుల వృత్తులు, కుల వ్యవస్థ వల్లనే.
తెలంగాణ జానపదకళల్లో, సాహిత్యంలో మొదటినుండీ ఆధిపత్యంపై ధిక్కారం స్పష్టంగా కనిపిస్తుంది. పాలకులు ప్రయోగించే అణచివేతను ప్రతిఘటిస్తూ ఇక్కడి కవులు సాహిత్యాన్ని సృష్టించారు. కళాకారులు కళారూపాలను పుట్టించారు. సామాన్యులను పట్టించుకోని దేవుడెందుకని ప్రశ్నించిన సందర్భాలు కూడా చరిత్రలో ఉన్నాయి. పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన, భక్త రామదాసు, సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి సోదరులు, కాళోజీ సోదరులు ఒకరి తర్వాత మరొకరు ఈ ధిక్కార వారసత్వాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఆ వారసత్వాన్నే పుణికి పుచ్చుకున్న తెలంగాణ ప్రాంత కవులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు అణచివేతకు, ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా తమ కలాలను, గళాలను సంధిస్తూనే వచ్చారు. తెలంగాణ సాధన కోసం జరిగిన తుది ఉద్యమం వరకు ప్రతి సందర్భంలోనూ తెలంగాణ గడ్డమీద పుట్టిన సాహితీమూర్తులు, కళాకారులు తమ ధర్మాన్ని నిర్వర్తించారు. ఆట పాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, భావజాల వ్యాప్తికి దోహదపడ్డారు.


కుల సంస్కృతి పరిధిలో సంప్రదాయ రూపాలుగా, సామాజిక పరిధిలో వినోదరూపాయలుగా, ప్రజాచైతన్య పరిధిలో అనువర్తితాలుగా వర్థిల్లిన చరిత్ర తెలంగాణ జానపద కళలకు ఉంది. జానపద కళలకు రాజకీయ డిమాండ్లను సాధించేటంతటి శక్తి సామర్థ్యాలున్నాయని నిరూపించిన సందర్భం కూడా తెలంగాణ ఉద్యమమే. భారత జాతీయోద్యమంలో కూడా తోలుబొమ్మలాటలు, బుర్రకథలు, వీధి నాటకాలు లాంటి కళారూపాలు ప్రజా చైతన్య సాధనాలుగా వినియోగించబడ్డాయి. అయితే అప్పుడు ఆ కళల పాత్రను తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమంలో భాగమైన ఇక్కడ కళారూపాలతో పోల్చలేం. తెలంగాణ ఉద్యమంలో కళాకారులే ఉద్యమ కారులై ముందు వరుసలో నిలబడ్డ అపూర్వ ఘట్టం ఆవిష్కృతమయింది. జానపద కళాకారులు ఉద్యమ కళాకారులయ్యారు.


నిజానికి జానపద కళల మనుగడకు, రాణింపుకు సందర్భమే ప్రధానం. సందర్భం లేనిదే కళారూపాల ప్రదర్శన అర్థరహితంగా, కళావిహీనంగానూ ఉంటుంది. సందర్భం కళారూపాలకు వేదిక కల్పిస్తాయి. కళారూపాలు ఆ సందర్భాన్ని రంజింప చేస్తాయి. ఈ పరస్పర అవినాభావ సంబంధమే జానపద కళల అస్తిత్వాన్ని కాపాడగల్గుతున్నాయి. ఇందుకు మన కళ్లముందు కదలాడిన సజీవ సాక్ష్యం తెలంగాణ ఉద్యమంలో జానపద కళలు పోషించిన పాత్ర. సందర్భానికి తగినట్టు నిర్ధిష్ట లక్ష్యంతో ప్రవర్తించే కళారూపాల విశేష లక్షణమే ప్రతి సందర్భంలోనూ జానపద కళలు వర్థిల్లడానికి కారణమైంది. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక ఘట్టాలుగా చెప్పబడే సకల జనుల సమ్మె, మిలియన్‍ మార్చ్, సడక్‍ బంద్‍, సాగరహారంతో పాటు ప్రతీ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో జానపద కళల ప్రదర్శనే ప్రధాన
ఉద్యమ రూపం. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబంగా ప్రదర్శించే కళలే ఉద్యమ ముఖచిత్రమైన అరుదైన ఘట్టం యావత్‍ దేశం ముందు కదలాడింది. జానపద కళలు శాస్త్రీయ సంగీతం మాదిరిగా కొన్ని నియమ నిబంధనల గిరి గీసుకుని అందులోనే పరిభ్రమించే కళ కాదు. అపరిమిత స్వేచ్ఛగా పరిఢవిల్లిన కళ. భావోద్వేగం వల్ల అప్రయత్నంగా సృష్టించబడ్డ కళ. ఒక మనసు నుంచి పుట్టిన భావం మరో మనసుకు నేరుగా చేరే అద్భుత సాధనం జానపద కళ. అందుకే అది చాలా వేగంగా, సూటిగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ఉద్యమ గొంతుక అయింది. రూపకాలు జానపద వాద్యాలు, నృత్యాలు, బోనాలు, బతుకమ్మలు తెలంగాణ సంస్కృతి ఉట్టి పడే విధంగా శోభాయమానంగా ప్రదర్శించబడ్డాయి.


తెలంగాణ ఉద్యమం పొడవునా జరిగిన ప్రతీ కార్యక్రమంలోనూ జానపద గేయాలు, కథాగానాలు, ప్రజా చైతన్య దిశగా ప్రయోగించబడ్డాయి. తెలంగాణ సాయుధ పోరాటంలోనూ, రజాకార్ల వ్యతిరేక పోరాటంలోనూ జానపదులు తమ పాట ద్వారా చైతన్యం రగిలించారు. 1956లో ఆంధప్రదేశ్‍ ఏర్పాటును ముందుగానే కవులు, రచయితలు వ్యతిరేకించారు. గొప్పగా బతికిన తెలంగాణ ఆంధ్రతో కలిస్తే నాశనమై పోతుందని భయపడ్డారు. తెలంగాణ గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ రచనలు చేశారు.


‘‘కదనాన శత్రువుల కుత్తుకలనవలీలనుత్తరించిన బలోన్మత్తు లేలిన భూమి, వీరులకు కాణాచిరా.. తెలంగాణ ధీరులకు మొగసాలరా’’
‘‘కలుపు మొక్కలు ఏరేస్తేనే చేనుకు బలం..రజాకార్లను తరిమేస్తేనే తెలంగాణకు వరం’’ అని నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా గళమెత్తాడు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కవి రావెళ్ల వెంకట రామారావు.


‘‘బండెనుక బండి కట్టీ.. పదహారు బండ్లు కట్టీ..’’ అనే పాటను బండి యాదగిరి మొదట ప్రతాపరెడ్డి అనే దొరకు వ్యతిరేకంగా రాశారు. ఆ తర్వాత అదే పాట జనసామాన్యంలో పడి నిజాం వ్యతిరేక ఉద్యమానికి ఓ పతాక గీతిక అయింది.


1968-69 ఉద్యమం సందర్భంగా అనేకమంది కవులు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టారు. ఆంధ్రపాలన అంతం కావాలని నినదించారు. ‘విప్లవశంఖం’ అనే పాటల సంకలనంలో తెలంగాణకు చెందిన అనేకమంది కవులు పాటలు రాసి ప్రజలను జాగృతం చేశారు.
‘‘నరరూప రాక్షసులు, నమ్మించి లేచారు మన తెలంగాణనే కబలించు చున్నారు’’ అని ఎస్వీ సత్యనారాయణ గళమెత్తారు.


1969 ఉద్యమ విద్యార్థి సంఘం కవులు అనుముల శ్రీహరి, మంచిక యశోద, భట్టు యశోదా దేవి తదితరులు తెలంగాణ ఉద్యమ గీతాలను, బతుకమ్మ పాటలను పాడేవారు.


1969 తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం కాస్త చల్లబడినట్టు అనిపించినా, అప్పుడే పుట్టిన నక్సల్బరీ ఉద్యమం విముక్తి పోరాటాలను ముందుకు తీసుకెళ్లింది. నిజాం రాజులకు, ఆ తర్వాత సమైక్య పాలకులకు వ్యతిరేకంగా అక్షరాలు పేర్చిన కలాలు నక్సల్బరీ ఉద్యమం సందర్భంగా భూస్వామ్య వ్యతిరేక గీతాలాలపించాయి. విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో వచ్చిన కవితలు, పాటలు, పద్యాలు జనాలను ఉర్రూతలూగించాయి. జననాట్యమండలి ఆధ్వర్యంలో ఆటపాటలు ప్రజలను ఆలోచింపజేసి, హక్కుల సాధనకు త్యాగాలకు సిద్ధం చేశాయి. కేవలం తెలంగాణ ప్రాంతానికి చెందినవారే కాకుండా, ఇతర ప్రాంతాలకు చెందిన కవులు, కళాకారులు కూడా నక్సల్బరీ ఉద్యమం సందర్భంగా తమ పాటల ద్వారా ఇక్కడి ప్రజల హ•దయాల్లో చోటు సంపాదించు కున్నారు.
‘‘ఎరుపంటే ఎవడికిరా భయం .. వారికంటె పసిపిల్లలు నయం’’ అని సుబ్బారావు పాణిగ్రాహి, ‘‘కొండలు పగలేసినం బంజర్లను దున్నినం’’ అనిచెరబండరాజు, చెల్లీ చెంద్రమ్మా అటూ శివసాగర్‍, ‘‘ఏం పిల్లడో వెళ్దామొస్తవా’’ అని వంగపండు ప్రసాదరావు విముక్తి, ఉద్యమ గీతాలు రాశారు. సమకాలీన అంశాలపై గద్దర్‍, గూడ అంజయ్య లాంటి వాళ్లు పాటలు రాయడమే కాకుండా జనరంజకంగా ప్రదర్శనలు కూడా ఇవ్వడం ప్రజలపై విపరీతమైన ప్రభావం చూపింది.
‘‘ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా’’ అనే గూడ అంజయ్య పాట, ‘‘భారతదేశం భాగ్యసీమరా’’ అనే గద్దర్‍ పాట, ‘‘ఎర్రజెండెర్ర జెండెన్నియ్యలో’’ అనే అల్లం వీరయ్య పాట దశాబ్దాల పాటు జనం పాటలుగా వర్ధిల్లాయి. 1969 ప్రత్యేక తెలంగాణ పోరాటం జరుగుతున్నపుడు ‘‘ఉద్యమం ఆగబోదు.. ఈ ఉద్యమం ఆగబోదు’’ అని ప్రజాకవి కాళోజీ నారాయణరావు జనధర్మలో కవితలు రాసేవారు. ‘‘నాగేటి సాల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ’’ అని నందిని సిధారెడ్డి తెలంగాణ జీవికను ఆవిష్కరించిండు.
ఆ తర్వాత వచ్చిన విప్లవ, సామాజిక ఉద్యమాల్లో కూడా పాట, కళారూపాలు ప్రధాన భూమిక పోషించాయి. ఇక మలిదశ తెలంగాణ ఉద్యమంలో అసలు కళారూపం లేని సందర్భమంటూ లేనేలేదు. తెలంగాణ ధూం ధాం పేరుతో కళాకారులు నిర్వహించిన జైత్రయాత్ర యావత్‍ తెలంగాణను కదిలించింది. అరుణోదయ సాంస్క•తిక సమాఖ్య, తెలంగాణ కళాసమితి, కళాకారుల శాంతియాత్ర, ప్రజానాట్య మండలి తదితర సంస్థలు సాంస్కృతికోద్యమాన్ని రాజకీయ ఉద్యమానికి సమాంతరంగా నడపగలిగారు.
‘‘నన్నూగన్న తల్లూలార తెలంగాణ బిడ్డలార’’ అంటూ సాగే గద్దర్‍ పాట తాను తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన సమయ సందర్భాన్ని విశదీకరించింది.
‘‘భాష ఒక్కటైతె నన్ను బాధా పెట్టాలనుందా
జాతి ఒక్కటైతె నన్ను గోతిల ఎయ్యాలనుందా’’ అంటూ గోరటి వెంకన్న తెలుగుభాష పేరిట ఒక్కటైన రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు పడుతున్న బాధలను వర్ణించారు. ‘‘అయ్యోనివా నువ్‍ అవ్వోనివా
తెలంగాణోనికీ తోటి పాలోనివా’’ అంటూ గూడ అంజయ్య హైదరాబాద్‍ హక్కుల గురించి అడిగిన ఆంధ్రోళ్లకు గట్టి సమాధానం ఇచ్చారు.
‘‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం’’ అంటూ అందెశ్రీ రాసి పాడిన పాట తెలంగాణ జాతి గీతమైంది. ‘‘ఆడుదాం డప్పుల్ల దరువెయ్యరపల్లె తెలంగాణ పాట పాడరా’’ అంటూ మిత్ర రాసిన పాటకు అరుణోదయ విమల చిందేసి పాడిన తీరు తెలంగాణ ప్రజలను మునివేళ్లపై నిలబెట్టింది.
రసమయి బాలకిషన్‍, నిస్సార్‍, తంగెళ్ల సుదర్శనం, ఎర్ర మల్లేశ్‍, సుందిళ్ల రాజన్న, వరవరరావు, కోదారి శ్రీనివాస్‍, యశ్‍ పాల్‍, గిద్దె రాం నర్సయ్య, సుద్దాల అశోక్‍ తేజ, అభినయ శ్రీనివాస్‍, తైదలబాబు, మిట్టపల్లి సురేందర్‍, దరువు ఎల్లన్న,
ప్రజల దైనందిక జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, ఆనందాలు, విషాదాల లాంటి అనుభవాలే జానపదాలకు కథా వస్తువు. ఆ కళారూపాలకు అప్పటి పరిస్థితులే నేపథ్యాన్ని అందిస్తాయి. పాత్రలు పుట్టుకొస్తాయి. కోపం, ఆగ్రహం, నిరసన, బాధ ఎవరి మీద తెలియచేయాలో పరిస్థితులే చెబుతాయి. ఆ కళారూపం లక్ష్యాన్ని నిర్దేశిస్తాయి. కూలీల పాటలు భూస్వాముల పెత్తనంపై ఎక్కుపెట్టాయి, విప్లవోద్యమ కళారూపాలు దొరల దోపిడీపై గొంతెత్తాయి. అలాగే తెలంగాణ ఉద్యమానికి అనుసంధానమైన పాటకు సీమాంధ్ర ఆధిపత్యం అనే అంశం వస్తుగా మారింది.
తెలంగాణ ఉద్యమంలో జానపదం అంటే మనకు కేవలం జానపద గేయాలు, స్టేజీలపై పాడిన ఉద్యమ పాటలు, కొన్ని కళా రూపాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ ఉద్యమ సందర్భంలో ప్రతీగ్రామంలో అనేక రకాల జానపద కళారూపాల ప్రదర్శన జరిగింది.


ఉద్యమంలో కళారూపాలు – జానపద కళలు

  1. జానపద గేయాలు
  2. జానపద నృత్యాలు
  3. జానపద నృత్య రూపకాలు
  4. చిందు యక్షగానం
  5. ఒగ్గుడోళ్ల ప్రదర్శన
  6. ఒగ్గుకథ
  7. బుర్రకథ
  8. బతుకమ్మ
  9. కోలాటం
  10. బోనాలు
  11. పీరీలు
  12. పేరిణి
  13. గుస్సాడి
  14. థింసా
  15. కొమ్ముకోయ
  16. లక్ష్మీదేవర
  17. వీధి నాటకం
  18. బుర్రకథలు
  19. పొర్లు దండాలు
  20. ఎడ్ల బండ్ల ప్రదర్శన
  21. జాజిరి ఆటలు
  22. గంగిరెడ్ల ఆటలు
  23. డప్పు ప్రదర్శన
  24. సాధనా శూరులు
  25. ధూమ్‍ ధామ్‍
  26. దుబ్బుల
  27. పంబ – ముదిరాజ్‍
  28. పంబ – బైండ్ల
  29. పటం కథలు
  30. లక్ష్మీ దేవర
  31. లంబాడ నృత్యం
  32. తుపాకి రాముడి కథలు
  33. పగటి వేశాలు
  34. శారదా కథలు
  35. చెక్క బొమ్మలాట
  36. కొమ్ము కోయ నృత్యం
  37. తోటి కిన్నెర కథలు
  • గటిక విజయ్‍ కుమార్‍, ఎ : 95539 55355

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *